కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

“తనంతటతానే జీవముగలవాడై యున్నా[డు]” అంటే అర్థమేమిటి?

యేసుక్రీస్తు “తనంతటతానే జీవముగలవాడై యున్నా[డు]” అని, ఆయన అనుచరులు ‘తమలో తాము జీవముగలవారు’ అని బైబిలు చెబుతోంది. (యోహాను 5:​26; 6:​53) కానీ ఈ రెండు లేఖనాల అర్థం ఒక్కటి కాదు.

“తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతటతానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను” అని యేసు అన్నాడు. గమనార్హమైన ఈ వ్యాఖ్యానం చేయడానికి ముందు యేసు ఇలా అన్నాడు: “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; . . . మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది; దానిని వినువారు జీవింతు[రు].” ఇక్కడ యేసు తన తండ్రి తనకనుగ్రహించిన అసాధారణమైన శక్తిని, అంటే మానవులకు దేవుని ఎదుట ఆమోదిత స్థానాన్ని ఇచ్చేందుకు తనకున్న సామర్థ్యాన్ని సూచిస్తున్నాడు. అంతేకాదు యేసు, మరణంలో నిద్రిస్తున్నవారిని లేపి వారికి జీవాన్నివ్వగలడు కూడా. యేసు “తనంతటతానే జీవముగలవాడై” ఉన్నాడంటే ఆయనకా శక్తులు అనుగ్రహించబడ్డాయని అర్థం. కాబట్టి తండ్రిలాగే కుమారుడు కూడా “స్వయంగా జీవంగలవా[డు].” (యోహాను 5:​24-26, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ఆయన అనుచరుల విషయమేమిటి?

దాదాపు ఒక సంవత్సరం తర్వాత, యేసు తన శ్రోతలతో ఇలా అన్నాడు: “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.” (యోహాను 6:​53, 54) ఇక్కడ యేసు, “మీలో మీరు జీవముగలవా[రిగా]” ఉండడం, “నిత్యజీవము” పొందడంతో సమానమని చెప్తున్నాడు. “మీలో మీరు జీవముగలవారు” వంటి వాక్యనిర్మాణమే గ్రీకు లేఖనాల్లో ఇతరచోట్ల కనబడుతుంది. అందుకు రెండు ఉదాహరణలు, “మీలో మీరు ఉప్పుసారము గలవారై” ఉండడం, “తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొంద[డం]” అనేవి. (మార్కు 9:​50; రోమీయులు 1:​27) ఈ సందర్భాల్లో ఆ మాటలు ఇతరులకు ఉప్పునిచ్చే శక్తిని గానీ ఎవరికైనా తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమునిచ్చే శక్తిని గానీ సూచించడం లేదు. బదులుగా అంతర్గత సంపూర్ణత్వాన్ని లేక నిండుదనాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి యెహాను 6:⁠53లో ఉపయోగించబడిన “మీలో మీరు జీవము గలవారు” అనే మాటలకు సంపూర్ణ జీవంలోకి ప్రవేశించడమనే అర్థముందని స్పష్టమవుతోంది.

యేసు తన అనుచరులు తమలో తాము జీవముగలవారిగా ఉండడం గురించి మాట్లాడుతూ తన శరీర రక్తముల గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత ప్రభువు రాత్రి భోజనము ఆరంభించినప్పుడు, యేసు మళ్ళీ తన శరీర రక్తముల గురించి మాట్లాడి, వాటి చిహ్నాలైన పులియని రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగుమని క్రొత్త నిబంధనలోకి తీసుకోబడే తన అనుచరులను నిర్దేశించాడు. అంటే కేవలం యెహోవా దేవునితో క్రొత్త నిబంధనలో ఉన్న అభిషిక్త క్రైస్తవులు మాత్రమే ఆ సంపూర్ణ జీవంలోకి ప్రవేశిస్తారని దానర్థమా? కాదు. ఈ రెండు సందర్భాల మధ్య సంవత్సరం తేడా ఉంది. యోహాను 6:​53, 54లో నమోదైన యేసు మాటలు విన్నవారికి, క్రీస్తు శరీరమును, రక్తమును సూచించే చిహ్నాలతో జరుపుకునే వార్షిక ఆచరణ గురించి తెలియదు.

యోహాను 6వ అధ్యాయం ప్రకారం, యేసు ఇలా అంటూ మొదట తన శరీరాన్ని మన్నాతో పోల్చాడు: “మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును.” యేసు శరీరముతో పాటు ఆయన రక్తము అక్షరార్థమైన మన్నా కంటే ఎంతో గొప్పవి. ఎలా? ఎలాగంటే, ఆయన తన శరీరాన్ని ‘లోకమునకు జీవముకొరకు’ ఇచ్చి, నిత్యజీవాన్ని సాధ్యంచేశాడు. * కాబట్టి యోహాను 6:53లోని “మీలో మీరు జీవముగలవారు” అనే మాటలపై చేయబడిన వ్యాఖ్యానం, పరలోకములోను భూలోకములోను నిత్యజీవాన్ని పొందేవారందరికీ వర్తిస్తుంది.​—⁠యోహాను 6:​47-53.

క్రీస్తు అనుచరులు తమలో జీవాన్ని ఎప్పుడు పొందుతారు లేక సంపూర్ణ జీవంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు? అభిషిక్త రాజ్య పాలకులైతే, అమర్త్య ఆత్మ జీవులుగా పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడినప్పుడు ప్రవేశిస్తారు. (1 కొరింథీయులు 15:​52, 53; 1 యోహాను 3:⁠2) ఇక యేసు “వేరే గొఱ్ఱెల” విషయానికి వస్తే, వారు ఆయన వెయ్యేండ్ల పరిపాలన తర్వాత సంపూర్ణ జీవంలోకి ప్రవేశిస్తారు. అప్పటికి వారు పరీక్షించబడి, విశ్వసనీయులుగా ఎంచబడి, భూపరదైసులో నిత్యజీవం అనుభవించేందుకు నీతిమంతులుగా ప్రకటించబడతారు.​—⁠యోహాను 10:​16; ప్రకటన 20:​5, 7-10.

[అధస్సూచి]

^ పేరా 7 అరణ్యంలో ఇశ్రాయేలీయులతో పాటు “అనేకులైన అన్యజనుల సమూహము” ప్రాణాలతో ఉండడానికి మన్నా అవసరమైంది. (నిర్గమకాండము 12:​37, 38; 16:​13-18) అదే విధంగా నిత్యం జీవించాలంటే క్రైస్తవులందరూ, వారు అభిషిక్తులైనా కాకపోయినా, బలిగా ఇవ్వబడిన యేసు శరీరానికి, రక్తానికి ఉన్న విమోచన శక్తిపై విశ్వాసముంచడం ద్వారా పరలోక మన్నా నుండి ప్రయోజనం పొందాలి.​—⁠కావలికోట, (ఆంగ్లం) ఫిబ్రవరి 1, 1988, 30-1 పేజీలు చూడండి.

[31వ పేజీలోని చిత్రాలు]

నిజ క్రైస్తవులందరూ ‘తమలో తాము జీవముగలవారై’ ఉండవచ్చు