పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఆదికాండము 3:22లో యెహోవా ‘మనలో ఒకడు’ అని అన్నప్పుడు ఎవరిని ఉద్దేశించి అలా అన్నాడు?
“మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను” అని అన్నప్పుడు యెహోవా దేవుడు తనను తన అద్వితీయ కుమారుణ్ణి ఉద్దేశించి అన్నట్లు స్పష్టమవుతోంది. (ఆదికాండము 3:22) ఎందుకో మనం పరిశీలిద్దాం.
మొదటి మానవ దంపతులపై శిక్ష ప్రకటించిన తర్వాత యెహోవా ఈ మాటలు పలికాడు. మానవ రాజు కేవలం తననే సూచించుకుంటూ “మాకిది నచ్చలేదు” అన్నట్టుగా, ‘మనలో ఒకనివంటివాడు’ అనే ఆ మాటను కొందరు బహువచనంలో చెప్పబడ్డ ఘనతగా అర్థంచేసుకున్నారు. అయితే, ఆదికాండము 1:26 మరియు 3:22కు సంబంధించి బైబిలు విద్వాంసుడైన డొనాల్డ్ ఇ. గాయెన్ ఇలా చెబుతున్నాడు: “రాజుల పరిభాషలో ‘మనం’ అనడానికీ లేదా దైవ స్వరూపంలోని అనేక దేవతలను సూచిస్తుందని పేర్కొనే అనేక వివరణలకూ పా[త] ని[బంధన]లో ఏ రుజువు లేదు. . . . ‘మనలో ఒకడు’ అని చెబుతున్న 3:22కు వీటిలో ఏ వివరణా సహేతుకంగా లేదు.”
స్వయంగా “మంచి చెడ్డలు” నిర్ణయించడానికి ముందుకొచ్చిన, మొదటి మానవులు కూడా అలా నిర్ణయించుకునేందుకు వారిని ప్రభావితం చేసిన అపవాదియగు సాతానును ఉద్దేశించి యెహోవా అలా అంటున్నాడా? అది సహేతుకం కాదు. ఇక్కడ యెహోవా ‘మనలో ఒకడు’ అనే మాట ఉపయోగించాడు. యెహోవా విశ్వసనీయ దేవదూతల సమూహంలో సాతాను ఇక ఎంతమాత్రం లేడు, కాబట్టి యెహోవా పక్షాన ఉన్నవారిలో అతనిని చేర్చిచెప్పడానికి అవకాశం లేదు.
దేవుడు విశ్వసనీయ దూతలను ఉద్దేశించి అంటున్నాడా? ఖచ్చితంగా అలాగని మనం చెప్పలేము. అయితే, ఆదికాండము 1:26 మరియు 3:22 వచనాల్లోని మాటల సారూప్యత మనకు ఆచూకీనిస్తుంది. ఆదికాండము 1:26లో ‘మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము’ అని యెహోవా చెప్పడం గురించి మనం చదువుతాం. ఆయన ఎవరినుద్దేశించి ఈ మాటలు మాట్లాడాడు? యేసనే పరిపూర్ణ మనిషిగా వచ్చిన ఆత్మసంబంధ ప్రాణిని సూచిస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: ‘ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, సర్వమును ఆయనద్వారా సృజింపబడెను.’ (కొలొస్సయులు 1:15, 16) అవును, ఆదికాండము 1:26లో, యెహోవా భూమ్యాకాశములను సృజించినప్పుడు “ప్రధానశిల్పి[గా]” తన ప్రక్కనేవున్న తన అద్వితీయకుమారునితో మాట్లాడుతున్నాడని చెప్పడమే సహేతుకం. (సామెతలు 8:22-31) ఆదికాండము 3:22లోని మాటల సారూప్యత యెహోవా మరలా తనకు అత్యంత సన్నిహితంగావున్న తన అద్వితీయ కుమారునితో మాట్లాడుతున్నాడని సూచిస్తోంది.
దేవుని అద్వితీయ కుమారునికి “మంచి చెడ్డల” జ్ఞానముందని స్పష్టమవుతోంది. యెహోవాతో ఆయనకున్న సుదీర్ఘ సన్నిహిత అనుభవం నుండి ఆయన నిశ్చయంగా తన తండ్రి ఆలోచనను, సూత్రాలను, కట్టడలను సంపూర్ణంగా నేర్చుకున్నాడు. తన కుమారునికి అవి తెలుసని వాటిపట్ల ఆయనకు విశ్వాసం ఉందనే ఒప్పుదలతో, యెహోవా ప్రతి సందర్భంలో తనను సూటిగా సంప్రదించకుండా ఆయా పనులు చేయడానికి ఆయనకు కొంతమేర స్వాతంత్ర్యం అనుగ్రహించివుంటాడు. కాబట్టి అంతమేరకు కుమారుడు మంచిచెడులను తెలుసుకొన సమర్థుడై వాటిని నిర్ణయించే అధికారంగల వాడయ్యాడు. అయితే సాతాను, ఆదాము, హవ్వల్లాగ ఆయన యెహోవా ప్రమాణాలకు విరుద్ధమైన ప్రమాణాలు నెలకొల్పలేదు.