కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు భూసంబంధ కుటుంబ సభ్యుల నుండి నేర్చుకోవడం

యేసు భూసంబంధ కుటుంబ సభ్యుల నుండి నేర్చుకోవడం

యేసు భూసంబంధ కుటుంబ సభ్యుల నుండి నేర్చుకోవడం

యేసు కుటుంబ సభ్యుల గురించి, భూమిపై ఆయన జీవితంలోని మొదటి 30 సంవత్సరాలు అంటే ఆయన బాప్తిస్మం తీసుకొనే వరకూ ఎవరితోనైతే జీవించాడో ఆ కుటుంబ సభ్యుల గురించి మీకేమి తెలుసు? సువార్త వృత్తాంతాలు మనకేమి చెబుతున్నాయి? ఆయన కుటుంబ సభ్యుల గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నల జవాబుల నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు.

యేసు సంపన్నుల కుటుంబంలో జన్మించాడా? యేసును పెంచిన తండ్రి యోసేపు వృత్తిపరంగా వడ్లవాడు. ఆ పనిలో శారీరకంగా కష్టించి పని చేసి, కలప కోసం తరచూ చెట్లను నరకవలసి వచ్చేది. యేసు జన్మించిన 40 రోజులకు ఆయన తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్రంలో నిర్దేశించబడినట్లు బలిని అర్పించారు. ధర్మశాస్త్రం కోరిన విధంగా వాళ్ళు ఒక గువ్వ లేదా ఒక పావురంతోపాటు ఒక పొట్టేలును అర్పించారా? లేదు. వాళ్ళకు అలాంటి బలులు అర్పించే స్తోమత లేనట్లు కనిపిస్తుంది. అయితే ధర్మశాస్త్రం పేదవారి కోసం మరో ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటుకు అనుగుణంగా యోసేపు మరియలు రెండు పక్షులను అంటే ‘గువ్వల జతనో లేదా రెండు పావురపు పిల్లలనో’ అర్పించారు. వాళ్ళు అలా తక్కువ ఖరీదుగల పక్షులను ఎంపిక చేసుకోవడం, వాళ్ళ కుటుంబం ఒక పేద కుటుంబం అని సూచిస్తోంది.​—⁠లూకా 2:22-24; లేవీయకాండము 12:6, 8.

యేసుక్రీస్తు అంటే మానవజాతినంతటిని పరిపాలించబోయే రాజు, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వచ్చే ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయనను పెంచిన తండ్రివలే ఆయన కూడా వడ్లవాడయ్యాడు. (మత్తయి 13:55; మార్కు 6:⁠3) యేసు పరలోకంలో శక్తిమంతుడైన ఆత్మ సంబంధ ప్రాణిగా “ధనవంతుడై యుండియు” మనకోసం “దరిద్రుడాయెను” అని బైబిలు చెబుతోంది. ఆయన ఒక మానవుడిగా తక్కువ స్థాయికి దిగివచ్చి సామాన్యుల కుటుంబంలో పెరిగాడు. (2 కొరింథీయులు 8:9; ఫిలిప్పీయులు 2:5-9; హెబ్రీయులు 2:⁠9) యేసు సంపన్నుల కుటుంబంలో జన్మించకపోవడం, కొంతమంది ఆయనతో చనువుగా ఉండేందుకు సహాయపడివుండవచ్చు. ఆయన హోదాను బట్టి లేదా స్థానాన్ని బట్టి వాళ్ళు ఆయనకు దూరంగా ఉండలేదు. వాళ్ళు ఆయన బోధలకు, ఆకర్షణీయమైన లక్షణాలకు, అద్భుతమైన క్రియలకు ఆయనను విలువైనవాడిగా ఎంచగలిగారు. (మత్తయి 7:28, 29; 9:19-33; 11:​28, 29) యేసు సామాన్యుల కుటుంబంలో జన్మించేందుకు అనుమతించడంలో యెహోవా దేవుని జ్ఞానాన్ని మనం చూడవచ్చు.

ఇప్పుడు మనం యేసు కుటుంబ సభ్యుల గురించి మరింతగా తెలుసుకొని, వాళ్ళ నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాము.

యోసేపు​—⁠నీతిమంతుడు

యోసేపు తనకు కాబోయే భార్య ‘తాము ఏకము కాకమునుపే’ గర్భవతి అయ్యిందని తెలుసుకున్నప్పుడు, ఆయన మరియపట్ల తనకున్న ప్రేమకూ, అనైతికత్వం అని భావించబడే ప్రవర్తనపట్ల తనకున్న హేయభావానికీ మధ్య సతమతమై ఎంతో కలతచెందివుంటాడు. ఆ పరిస్థితి అంతా, మరియకు కాబోయే భర్తగా తన హక్కును కాలరాసినట్లుగా కనిపించింది. ఆ కాలంలో, ప్రధానం చేయబడిన స్త్రీ ఆ వ్యక్తికి భార్యగా పరిగణించబడేది. ఎంతో ఆలోచించిన తర్వాత, మరియ ఒక వ్యభిచారిణిగా రాళ్ళతో కొట్టి చంపబడకుండా ఉండాలని ఆమెకు రహస్యంగా విడాకులు ఇవ్వాలని యోసేపు నిర్ణయించుకున్నాడు.​—⁠మత్తయి 1:18; ద్వితీయోపదేశకాండము 22:23, 24.

ఆ తర్వాత ఒక దేవదూత యోసేపుకు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పాడు: “నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.” ఆ దైవిక నిర్దేశాన్ని అందుకున్న తర్వాత యోసేపు దానికి అనుగుణంగా చర్య తీసుకొని మరియను ఇంటికి తీసుకువెళ్ళాడు.​—⁠మత్తయి 1:20-24.

నీతిమంతుడు, విశ్వసనీయుడు అయిన యోసేపు ఆ నిర్ణయం తీసుకొని, యెషయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన ఈ విషయాల నెరవేర్పులో భాగమయ్యాడు: “ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.” (యెషయా 7:​14) మరియ మొదటి కుమారుడు తన స్వంత కుమారుడు కాదని తెలిసినా, మెస్సీయను పెంచే తండ్రిగా తనకు ఇవ్వబడిన ఆధిక్యతను విలువైనదిగా ఎంచిన యోసేపు ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా ఎంచే వ్యక్తి అనడంలో సందేహం లేదు.

మరియ తన మొదటి కుమారునికి జన్మనిచ్చేంతవరకూ యోసేపు ఆమెతో లైంగిక సంపర్కం చేయలేదు. (మత్తయి 1:​25) కొత్తగా పెళ్ళైన ఆ దంపతులకు లైంగిక సంబంధాలు లేకుండా ఉండడం ఒక సవాలుగానే ఉండివుండవచ్చు కానీ వాళ్ళు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావివ్వదలచుకోలేదని స్పష్టమవుతోంది. ఆశానిగ్రహానికి ఎంత చక్కని ఉదాహరణో కదా! యోసేపు తన సహజ కోరికలకంటే ఆధ్యాత్మిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు.

యేసును పెంచే విషయంలో యోసేపుకు నాలుగుసార్లు దేవదూతల నిర్దేశం లభించింది. వాటిలో మూడుసార్లు, యేసును ఎక్కడ పెంచాలనే విషయానికి సంబంధించినవి. యేసు బ్రతికివుండాలంటే దేవదూతలు చెప్పిన విషయాలకు తక్షణమే విధేయత చూపించడం ఆవశ్యకం. అన్ని సందర్భాల్లోను యోసేపు వెంటనే చర్య తీసుకొన్నాడు, ఆయన యేసును మొదటిగా ఐగుప్తుకు, ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలుకు తీసుకువెళ్ళాడు. ఆ కారణంగా, హేరోదు మగ శిశువులను చంపించినప్పుడు యేసు కాపాడబడ్డాడు. అంతేకాక యోసేపు చూపించిన విధేయతవల్ల మెస్సీయాకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరాయి.​—⁠మత్తయి 2:13-23.

యేసు తన కాళ్ళపై తాను నిలబడడానికి వీలుగా యోసేపు ఆయనకు ఒక వృత్తి నేర్పించాడు. అందుకే యేసు “వడ్లవాని కుమారుడు” అనే కాకుండా “వడ్లవాడు” అని కూడా పిలువబడ్డాడు. (మత్తయి 13:55; మార్కు 6:⁠3) యేసు ‘సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడ్డాడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. అంటే కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడి పనిచేయడం కూడా దానిలో ఉండివుంటుంది.​—⁠హెబ్రీయులు 4:15.

చివరిగా క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో యోసేపు గురించి ప్రస్తావించబడిన ఆఖరి వృత్తాంతంలో కూడా యోసేపుకు సత్యారాధనపట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనాన్ని మనం చూస్తాము. పస్కా పండుగను ఆచరించడానికి యోసేపు తన కుటుంబాన్ని యెరూషలేముకు తీసుకొనివెళ్ళాడు. నిజానికి ఆ పండుగను ఆచరించడానికి కేవలం పురుషులు వెళ్తే చాలు కానీ యోసేపు “ఏటేట” తన కుటుంబాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అలా తీసుకువెళ్ళడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు, ఎందుకంటే నజరేతు నుండి యెరూషలేముకు వెళ్ళాలంటే దాదాపు 600 కిలోమీటర్లు నడవాలి. లేఖనాల్లో చెప్పబడిన సందర్భంలో యేసు ప్రయాణికుల గుంపు నుండి వేరైపోయాడు. ఆయన ఆలయంలో ధర్మశాస్త్ర బోధకులు చెప్పేది వింటూ వారిని ప్రశ్నలు అడుగుతూ కనిపించాడు. అప్పటికి యేసు వయసు కేవలం 12 ఏళ్ళే అయినప్పటికీ ఆయన దేవుని వాక్యానికి సంబంధించి గొప్ప వివేచనను జ్ఞానమును కనబరిచాడు. యేసు తల్లిదండ్రులు ఆయనకు చక్కగా బోధించి, ఆయనను ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తిగల అబ్బాయిగా పెంచారని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. (లూకా 2:​41-50) ఆ తర్వాత కొంతకాలానికి యోసేపు చనిపోయివుంటాడు ఎందుకంటే తర్వాతి లేఖన వృత్తాంతాల్లో ఆయన గురించి ప్రస్తావించబడలేదు.

అవును, యోసేపు తన కుటుంబపు ఆధ్యాత్మిక అవసరతలపట్ల, భౌతిక అవసరతలపట్ల ఎంతో శ్రద్ధ వహించిన నీతిమంతుడు. నేడు మన కోసం దేవుని చిత్తమేమిటో గ్రహించినప్పుడు మీరు యోసేపువలే మీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాలను ముందుంచుతారా? (1 తిమోతి 2:​4, 5) మీరు దేవుని వాక్యంలో వ్యక్తం చేయబడినట్లుగా దేవుడు చెప్పేవాటికి సుముఖంగా విధేయత చూపించి తద్వారా యోసేపులాంటి విధేయతను కనబరుస్తారా? మీ పిల్లలు ఇతరులతో ఆధ్యాత్మికంగా అర్థవంతమైన చర్చలు జరపగలిగేలా మీరు వాళ్ళకు బోధిస్తారా?

మరియ​—⁠దేవుని నిస్వార్థ సేవకురాలు

యేసు తల్లియైన మరియ, దేవుని ఉత్తమమైన సేవకురాలు. ఆమె తల్లి కాబోతుందని గబ్రియేలు దూత ప్రకటించినప్పుడు, ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఒక కన్య కాబట్టి “పురుషుని ఎరుగనిది.” ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుందని తెలుసుకొని, దేవదూత సందేశాన్ని వినయంగా స్వీకరించి ఇలా అన్నది: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” (లూకా 1:​30-38) తనకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక ఆధిక్యతను ఆమె ఎంత విలువైనదిగా ఎంచిందంటే, తాను తీసుకున్న నిర్ణయం వల్ల రాగల ఎటువంటి కష్టాలనైనా సహించడానికి ఆమె సుముఖత చూపించింది.

నిజమే, ఆ బాధ్యతను స్వీకరించడంవల్ల ఒక స్త్రీగా ఆమె జీవితమే పూర్తిగా మారిపోయింది. శుద్ధి కోసం ఆమె యెరూషలేముకు వెళ్ళినప్పుడు సుమెయోను అనే పేరుగల భక్తిపరుడైన ఒక వృద్ధుడు ఆమెకు ఇలా చెప్పాడు: “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును.” (లూకా 2:​25-35) యేసు అనేకులచే తిరస్కరించబడి, చివరకు హింసా కొయ్యపై మేకులతో కొట్టబడినప్పుడు మరియ ఎంత బాధ అనుభవిస్తుందో చెబుతూ ఆయన ఆ మాటలని ఉంటాడు.

యేసు పెరిగి పెద్దవాడవుతుండగా ఆయన జీవితంలో జరిగినవాటిని మరియ తన మనస్సులో ఉంచుకొని “తన హృదయములో తలపోసికొనుచు” ఉండేది. (లూకా 2:​19, 51) యోసేపువలే ఆమెకూడా ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా ఎంచే వ్యక్తి, ప్రవచనాలను నెరవేర్చిన విషయాలనూ సంఘటనలనూ ఆమె భద్రంగా మనస్సులో గుర్తుంచుకునేది. గబ్రియేలు దూత చెప్పిన మాటలు ఆమె మనస్సులో నాటుకుపోయివుంటాయి: “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:​32, 33) అవును మెస్సీయకు ఈ భూమిపై తల్లిగా ఉండే ఆధిక్యతను ఆమె గంభీరమైనదిగా ఎంచింది.

మరియ బంధువైన ఎలీసబెతు కూడా అద్భుత రీతిలో గర్భవతి అయ్యింది, ఆమెను కలిసినప్పుడు మరియ ఆధ్యాత్మికత మళ్ళీ స్పష్టమయ్యింది. ఆమెను చూసినప్పుడు మరియ యెహోవాను స్తుతించి, దేవుని వాక్యంపట్ల తనకున్న ప్రేమను వెల్లడిచేసింది. ఆమె మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో నమోదుచేయబడిన హన్నా ప్రార్థనను సూచించడమే కాకుండా హీబ్రూ లేఖనాల్లోని ఇతర పుస్తకాల్లోని తలంపులను కూడా చేర్చి మాట్లాడింది. లేఖనాలకు సంబంధించి ఆమెకున్న ఆ జ్ఞానం, విశ్వసనీయురాలైన, దైవభయంగల తల్లి అయ్యే అర్హతలు ఆమెకున్నాయని చూపించింది. తన కుమారుణ్ణి ఆధ్యాత్మికంగా పెంచడంలో ఆమె యోసేపుకు సహకరించింది.​—⁠ఆదికాండము 30:13; 1 సమూయేలు 2:1-10; మలాకీ 3:12; లూకా 1:46-55.

తన కుమారుడు మెస్సీయ అని మరియ బలంగా విశ్వసించింది, యేసు మరణించిన తర్వాత కూడా ఆ విశ్వాసం తగ్గలేదు. ఆయన పునరుత్థానమైన తర్వాత, అపొస్తలులతోపాటు ప్రార్థన చేయడానికి సమకూడిన విశ్వసనీయులైన శిష్యులలో ఆమె కూడా ఉంది. (అపొస్తలుల కార్యములు 1:​13, 14) తన ప్రియ కుమారుడు హింసా కొయ్యపై మరణించడాన్ని చూసినప్పుడు ఆమె ఎంతో మానసిక వ్యధను అనుభవించవలసి వచ్చినప్పటికీ ఆమె తన విశ్వసనీయతను కాపాడుకుంది.

మరియ జీవితం గురించి తెలుసుకోవడం ద్వారా మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? దేవుని సేవ చేయడానికి మీరు త్యాగాలు చేయవలసి వచ్చినప్పటికీ ఆయనకు సేవ చేసే ఆధిక్యతను మీరు స్వీకరిస్తారా? నేడు ఆ ఆధిక్యతకున్న గంభీరత గురించి మీరు ఆలోచిస్తున్నారా? యేసు ప్రవచించిన విషయాలను మనస్సులో ఉంచుకొని నేడు జరుగుతున్న సంఘటనలతో వాటిని పోలుస్తూ ఆ విషయాలను మీరు ‘మీ హృదయంలో తలపోసుకుంటారా?’ (మత్తయి, 24 మరియు 25 అధ్యాయాలు; మార్కు, 13వ అధ్యాయం; లూకా, 21వ అధ్యాయం) దేవుని వాక్యాన్ని మీ సంభాషణలో తరచుగా ఉపయోగించడం ద్వారా లేఖనాలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో మీరు మరియను అనుకరిస్తారా? యేసు అనుచరులైనందుకు తీవ్రమైన మానసిక వ్యధ అనుభవించవలసి వచ్చినప్పటికీ మీరు యేసుపై విశ్వాసాన్ని కాపాడుకుంటారా?

యేసు సోదరులు​—⁠మారడం సాధ్యమే

యేసు మరణించేంత వరకూ యేసు సోదరులు ఆయనపై విశ్వాసముంచలేదని తెలుస్తోంది. బహుశా అందుకే, యేసు హింసా కొయ్యపై మరణించినప్పుడు వారు అక్కడ లేరు, యేసు తన తల్లి బాధ్యతను అపొస్తలుడైన యోహానుకు అప్పగించవలసి వచ్చింది. యేసు కుటుంబ సభ్యులు ఆయనను గౌరవించలేదు, ఒకసారైతే వాళ్ళు యేసుకు “మతి చలించియున్నది” అని కూడా అన్నారు. (మార్కు 3:​21) యేసుకు అవిశ్వాసులైన కుటుంబ సభ్యులు ఉండేవారు కాబట్టి, నేడు అవిశ్వాసులైన కుటుంబ సభ్యులుగలవారు, బంధువులు తమ విశ్వాసాన్ని బట్టి తమను ఎగతాళి చేసినప్పుడు తమకు ఎలా ఉంటుందో యేసు అర్థం చేసుకుంటాడని నిశ్చింతగా ఉండవచ్చు.

అయితే యేసు పునరుత్థానమైన తర్వాత ఆయన సోదరులు ఆయనపై విశ్వాసముంచడం ప్రారంభించారని స్పష్టమవుతోంది. సా.శ. 33 పెంతెకొస్తుకు ముందు యెరూషలేములో కలుసుకున్న గుంపులో వారు కూడా ఉన్నారు, అపొస్తలులతో కలిసి వారు తీవ్రంగా ప్రార్థించారు. (అపొస్తలుల కార్యములు 1:​14) తమ సోదరుడైన యేసు పునరుత్థానం, వాళ్ళ మనస్సు మారేందుకు కారణమయ్యింది, కాబట్టి వాళ్ళు ఆయన శిష్యులయ్యారు. మన విశ్వాసాన్ని పంచుకోని బంధువుల విషయంలో మనమెన్నడూ ఆశ వదులుకోకూడదు.

యేసు తన పునరుత్థానం తర్వాత తన సోదరుడైన యాకోబుకు కనిపించాడు, లేఖనాల ప్రకారం యాకోబు క్రైస్తవ సంఘంలో విశిష్టమైన పాత్ర పోషించాడు. తమ విశ్వాసాన్ని కాపాడుకొమ్మని ఉద్బోధిస్తూ ఆయన తన తోటి క్రైస్తవులకు దైవ ప్రేరేపిత లేఖ వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 15:6-29; 1 కొరింథీయులు 15:7; గలతీయులు 1:18, 19; 2:9; యాకోబు 1:⁠1) యేసుకు మరో సోదరుడైన యూదా, విశ్వాసం కోసం పోరాడమని తోటి విశ్వాసులను ప్రోత్సహిస్తూ ప్రేరేపిత లేఖ వ్రాశాడు. (యూదా 1) యాకోబు గానీ, యూదా గానీ తాము వ్రాసిన లేఖల్లో తోటి క్రైస్తవులను ఒప్పింపజేయడానికి యేసుతో తమకున్న సంబంధాన్ని ప్రస్తావించలేదనే విషయం గమనార్హమైనది. వినయానికి సంబంధించి మనం వాళ్ళనుండి ఎంత చక్కని పాఠం నేర్చుకోవచ్చో కదా!

యేసు కుటుంబ సభ్యుల నుండి మనం నేర్చుకోగల కొన్ని విషయాలేమిటి? మనం విశ్వాసానికి సంబంధించిన పాఠాలు నేర్చుకోవచ్చు అనడంలో సందేహం లేదు, వాటిని ఈ మార్గాల్లో ప్రదర్శించవచ్చు: (1) దేవుడు వ్యక్తంచేసినట్లుగా ఆయన చిత్తానికి నమ్మకంగా విధేయులై, అలా చేయడంలో వచ్చే కష్టాలన్నింటిని ఎదుర్కోండి. (2) ఆధ్యాత్మిక విలువలను మొదట ఉంచడానికి కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చినప్పటికీ వెనుకాడకండి. (3) లేఖనాలకు అనుగుణంగా మీ పిల్లలకు శిక్షణనివ్వండి. (4) మీ విశ్వాసాన్ని పంచుకోని కుటుంబ సభ్యులపై ఆశ వదులుకోకండి. (5) క్రైస్తవ సంఘంలో బాధ్యతగలవారితో మీకున్న సంబంధాల విషయమై గొప్పలు చెప్పుకోకండి. అవును, యేసు భూసంబంధ కుటుంబం గురించి నేర్చుకోవడం, మనం ఆయనకు సన్నిహితమయ్యేలా చేస్తుంది, యేసును పెంచి పెద్దచేయడానికి యెహోవా ఒక సాధారణమైన కుటుంబాన్ని ఎంపిక చేసుకోవడం మన కృతజ్ఞతను అధికం చేస్తుంది.

[4, 5వ పేజీలోని చిత్రాలు]

యోసేపు మరియను తన భార్యగా అంగీకరించి, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాల నెరవేర్పులో భాగమయ్యాడు

[6వ పేజీలోని చిత్రాలు]

యోసేపు మరియలు తమ పిల్లలకు ఆధ్యాత్మిక విలువలను, వృత్తి ప్రాధాన్యతను నేర్పించారు

[7వ పేజీలోని చిత్రాలు]

యేసు సోదరులు ఆధ్యాత్మిక కుటుంబంలో పెరిగినప్పటికీ, యేసు చనిపోయిన తర్వాత గానీ ఆయనపై విశ్వాసముంచలేదు

[8వ పేజీలోని చిత్రాలు]

యేసు సోదరులైన యాకోబు యూదాలు తోటి క్రైస్తవులను ప్రోత్సహించారు