యుద్ధానికి అంతం
యుద్ధానికి అంతం
‘మా వయస్సు 12 ఏండ్లే. మేము రాజకీయాలను, యుద్ధాన్ని ప్రభావితం చేయలేము, కానీ మేము జీవించాలని కోరుకుంటున్నాం! మేము శాంతి కోసం ఎదురుచూస్తున్నాం. దాన్ని చూడ్డానికి మేము బ్రతికి ఉంటామా?’—ఒక స్కూల్లోని అయిదవ తరగతి విద్యార్థులు.
‘అపహరించుకుపోతారనే భయంలేకుండా మేము స్కూలుకు వెళ్ళాలనీ, మా మిత్రులను, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకోవాలనీ కోరుకుంటున్నాము. ప్రభుత్వం పట్టించుకుంటుందనే నేను ఆశిస్తున్నాను. మాకు మంచి జీవితం కావాలి. మాకు శాంతి కావాలి.’—ఆల్‌హాజీ, 14 ఏండ్లు.
హృదయాన్ని కదిలించే ఈ మాటలు, అంతర్యుద్ధాల వల్ల అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న యువతరపు హృదయపూర్వక ఆకాంక్షను తెలియజేస్తున్నాయి. వారు కోరుకునేదల్లా సాధారణ జీవితమే. అయితే ఆకాంక్షలను నిజాలుగా మార్చడం అంత సులభం కాదు. యుద్ధంలేని లోకాన్ని మనం ఎప్పటికైనా చూస్తామా?
ఇటీవలి సంవత్సరాల్లో, కొన్ని అంతర్యుద్ధాలను పరిష్కరించడానికిగాను, వ్యతిరేకించుకునే ఇరు పక్షాల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా శాంతి ఒప్పందంపై సంతకం చేయించేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఒప్పందాలను అమల్లో ఉంచేందుకు కొన్ని దేశాలు శాంతి పరిరక్షక దళాలను పంపించాయి. అయితే పోరాడే ముఠాల మధ్య విద్వేషం, అపనమ్మకం నాటుకుపోయిన ఆ దేశాల్లో ఎలాంటి ఒప్పందమైనా విఫలమవుతోంది, అలాంటి సుదూర దేశాల్లో కాపుకాయడానికి కావలసినంత డబ్బు లేదా సుముఖత చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఉంది. కాల్పుల విరమణపై సంతకం చేసిన తర్వాత కేవలం కొన్ని వారాలు లేదా నెలలకే మళ్ళీ తరచూ పోరాట జ్వాలలు రగులుతూ ఉంటాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సూచిస్తున్న ప్రకారం, “పోరాడుతున్నవారిలో యుద్ధ పిపాస, యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నంతవరకు శాంతిని సాధించడం కష్టం.”
అదే సమయంలో, భూవ్యాప్తంగా అనేక ప్రాంతాలను పట్టి పీడిస్తున్న ఈ అపరిష్కృత పోరాటాలు, క్రైస్తవులకు ఒక బైబిలు ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రకటన గ్రంథం చరిత్రలోని ఓ అపాయకరమైన కాలం గురించి చెబుతూ ఆ కాలంలో ఒక సూచనార్థక గుఱ్ఱపు రౌతు ‘భూలోకములో సమాధానము లేకుండ చేస్తాడు’ అని తెలియజేస్తోంది. (ప్రకటన 6:4) ముందుగానే ప్రవచించబడిన ఈ నిరంతర పోరాటం, బైబిల్లో ‘అంత్యదినాలు’ అని వర్ణించబడిన కాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాము అని సూచించే సంయుక్త సూచనలో ఒక భాగం. * (2 తిమోతి 3:1) అయితే ఈ అంత్యదినాలు శాంతికి ముందుంటాయని దేవుని వాక్యం మనకు హామీ ఇస్తోంది.
నిజమైన శాంతి కావాలంటే ఏదోక ప్రాంతంలో కాదుగానీ భూమి అంతటా యుద్ధం అంతమవ్వాలని కీర్తన 46:9లో బైబిలు వివరిస్తోంది. అంతేకాదు అదే కీర్తన, బైబిలు కాలాల ఆయుధాలైన విల్లు, బల్లెము, యుద్ధ రథాల నాశనాన్ని నిర్దిష్టంగా ప్రస్తావిస్తోంది. అదేవిధంగా మానవాళి ఎప్పటికైనా శాంతియుతంగా జీవించాలంటే నేడు శీఘ్రంగా ఉత్పత్తి చేయబడుతోన్న ఆయుధాలు కూడా నాశనం చేయబడాలి.
కానీ విషయమేమంటే, తుపాకీ గుళ్లు, రైఫిళ్లు కాదుగానీ యుద్ధానికి ఆజ్యంపోసేవి విద్వేషం, పేరాశలే. యుద్ధానికి పేరాశ లేదా అత్యాశే ప్రధాన కారణం, కాగా విద్వేషం తరచూ దౌర్జన్యానికి నడిపిస్తుంది. వినాశకరమైన ఈ భావాలను పెరికివెయ్యాలంటే, ప్రజలు తమ ఆలోచనా ధోరణిని యెషయా 2:4.
మార్చుకోవాలి. వారికి శాంతితో జీవించడం నేర్పించబడాలి. అందుకే, ప్రాచీనకాల యెషయా ప్రవక్త, ప్రజలు ‘యుద్ధముచేయ నేర్చుకొనుట మానివేసినప్పుడే’ యుద్ధాలు అంతమవుతాయి అని వాస్తవికంగా పేర్కొన్నాడు.—అయితే, మనం జీవిస్తున్న లోకం పెద్దలకు, పిన్నలకు శాంతి విలువను నేర్పించడం లేదు కానీ యుద్ధ ఘనతను నేర్పిస్తోంది. చివరకు పిల్లలకు కూడా చంపడానికి శిక్షణనివ్వడం శోచనీయం.
వారు చంపడం నేర్చుకున్నారు
ఆల్‌హాజీని 14 ఏండ్ల వయస్సులో సైన్యంలోంచి తీసేశారు. కేవలం పదేళ్ల వయస్సప్పుడే తిరుగుబాటు దళాలు అతణ్ణి పట్టుకుపోయి ఎకె-47 ఎస్సాల్ట్ రైఫిల్‌తో పోరాడేందుకు శిక్షణనిచ్చాయి. బలవంతపు సైనికునిగా మారిన తర్వాత, అతను ఆహారం కోసం దోపిడీలు చేస్తూ ఇండ్లు తగులబెడుతూ వచ్చాడు. అతడు ప్రజలను చంపాడు, కాళ్లూ చేతులూ నరికాడు. నేడు ఆల్‌హాజీకి యుద్ధాన్ని మరచిపోయి సాధారణ పౌర జీవితం గడపడం కష్టంగా ఉంది. అబ్రహాము అనే మరో బాల సైనికుడు కూడా చంపడం నేర్చుకుని, తన ఆయుధం అప్పగించడానికి ససేమిరా ఇష్టపడలేదు. అతడిలా అన్నాడు: “ఒకవేళ వారు నా తుపాకి వదిలేసి వెళ్లిపొమ్మంటే, నేనేమి చేయాలో, నేనెలా బ్రతకాలో నాకర్థం కావడం లేదు.”
మన భూగ్రహాన్ని పట్టి పీడిస్తున్న అంతంలేని అంతర్యుద్ధాల్లో 3,00,000 కంటే ఎక్కువమంది అమ్మాయిలు అబ్బాయిలు బాలసైనికులుగా ఇప్పటికీ పోరాడుతునే ఉన్నారు, మరణిస్తూనే ఉన్నారు. ఒక తిరుగుబాటు నాయకుడు బాల సైనికుల గురించి ఇలా చెప్పాడు: “వారు ఆజ్ఞలను పాటిస్తారు; భార్య దగ్గరకో, కుటుంబం దగ్గరకో తిరిగి వెళ్ళాలని వారు ఆలోచించరు; వారు భయపడరు.” అయితే ఈ పిల్లలు మంచి జీవితం కావాలని కోరుకుంటున్నారు, దానికి వారు అర్హులే.
అభివృద్ధి చెందిన దేశాల్లోనివారికి, ఒక బాల సైనికుడి భయానక స్థితి బహుశా ఊహించడం కష్టం కావచ్చు. అయితే పశ్చిమ దేశాల్లోని చాలామంది పిల్లలు కూడా తమ ఇండ్లలోనే యుద్ధమెలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఏ విధంగా?
ఉదాహరణకు ఆగ్నేయ స్పెయిన్‌కు చెందిన హోసే విషయమే తీసుకోండి. అతను టీనేజిలో ఉన్నప్పుడు మార్షల్‌యుద్ధ కళల సాధనలో ఆనందించాడు. అతని తండ్రి క్రిస్మస్ బహుమతిగా ఇచ్చిన సమురాయ్ కత్తి అతనికి ఎంతో విలువైనది. అతనికి వీడియో గేమ్స్, ప్రత్యేకంగా హింసాత్మక గేమ్స్ అంటే చాలా ఇష్టం. 2000, ఏప్రిల్ 1వ తేదీన అతను అచ్చం తన వీడియో గేమ్స్‌లోని హీరోలా చేయడానికి పూనుకున్నాడు. హింసాత్మక ఉన్మాదంలో, తండ్రి బహుమతిగా తనకిచ్చిన ఆ కత్తితోనే తండ్రిని, తల్లిని, చెల్లిని చంపేశాడు. “నేను ఈ లోకంలో ఒంటరిగా జీవించాలనుకున్నాను; తల్లిదండ్రులు నా కోసం వెదకడం నాకిష్టంలేదు” అని అతను పోలీసులకు వివరించాడు.
హింసాత్మక వినోద కార్యక్రమాల ప్రభావాలపై వ్యాఖ్యానిస్తూ గ్రంథకర్త, సైనికాధికారీ అయిన డేవ్ గ్రాస్‌మన్ ఇలా పేర్కొన్నాడు: “గాయపరచడం, బాధపెట్టడం వంటివి మనస్సుకు నొప్పికలిగించేవి కాదు కానీ వినోదాత్మకమైనవి అనే స్థితికి మనం చేరుకుంటున్నాం: విసర్జించడానికి బదులు అవి వికృతానందానికి మూలంగా తయారవుతున్నాయి. మనం చంపడం నేర్చుకుంటున్నాం, మనం దాన్ని ఇష్టపడడం నేర్చుకుంటున్నాం.”
ఆల్‌హాజీ, హోసెలు చంపడం నేర్చుకున్నారు. హంతకులు కావాలని వారు కోరుకోలేదు, కానీ వారికివ్వబడ్డ శిక్షణ వారి ఆలోచనను తప్పుదోవ పట్టించింది. అలాంటి శిక్షణ పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికి ఇవ్వబడినప్పటికీ అది వారిలో హింసాత్మక, యుద్ధోన్మాద బీజాలు నాటుతుంది.
యుద్ధానికి బదులు శాంతిని నేర్చుకోవడం
ప్రజలు చంపడం నేర్చుకుంటున్నంత వరకు శాశ్వత శాంతి ఎప్పటికీ నెలకొల్పబడదు. అనేక శతాబ్దాల క్రితం, యెషయా ప్రవక్త ఇలా వ్రాశాడు: ‘నీవు దేవుని ఆజ్ఞలను ఆలకించినయెడల నీ క్షేమము [“శాంతి,” NW] నదివలె ఉండును.’ (యెషయా 48:17, 18) ప్రజలు దేవుని వాక్యానికి సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించి, దేవుని నియమాలను ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, వారికి హింస, యుద్ధం వంటివి అసహ్యమైనవిగా మారతాయి. ఇప్పుడు సైతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడే ఆటలు హింసను ప్రోత్సహించేవిగా ఉండకుండా చూడవచ్చు. పెద్దలు కూడా విద్వేషం, దురాశలను అధిగమించడాన్ని నేర్చుకోవచ్చు. దేవుని వాక్యానికి వ్యక్తిత్వాలను మార్చే శక్తి ఉందని యెహోవాసాక్షులు ఎన్నో ఉదాహరణల ద్వారా అర్థంచేసుకున్నారు.—హెబ్రీయులు 4:12.
ఉదాహరణకు, ఓర్టెన్‌షియో విషయమే పరిశీలించండి. యుక్తవయస్సులో ఉన్నప్పుడు తన ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండానే ఆయన బలవంతంగా సైన్యంలో చేర్చబడ్డాడు. “మాలో చంపాలనే కోరిక కలిగించడానికీ, అలాగే ఎలాంటి భయం లేకుండా చంపడానికీ” మిలిటరీ
శిక్షణ రూపొందించబడిందని ఆయన వివరిస్తున్నాడు. ఆఫ్రికాలో దీర్ఘకాలం కొనసాగిన ఒక అంతర్యుద్ధంలో ఆయన పోరాడాడు. “ఆ యుద్ధం నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది, నేను చేసిన ప్రతీ ఒక్కటి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, నా చేత బలవంతంగా చేయించినదానికి నేనెంతో కుమిలిపోతున్నాను” అని ఆయన ఒప్పుకుంటున్నాడు.తోటి సైనికుడు ఒకాయన బైబిలు గురించి ఓర్టెన్‌షియోతో మాట్లాడినప్పుడు, అది ఆయన హృదయాన్ని స్పృశించింది. కీర్తన 46:9లో అన్ని రకాల యుద్ధాలను రూపుమాపుతానని దేవుడు చేసిన వాగ్దానం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆయన ఎంత ఎక్కువగా బైబిలు అధ్యయనం చేశాడో, ఆయనలో పోరాడాలనే కోరిక అంత తక్కువైంది. అనతికాలంలోనే ఆయనా, ఆయన సహవాసులు మరో ఇద్దరు సైన్యం నుండి బహిష్కరించబడ్డారు, వారు తమ జీవితాలను యెహోవా దేవునికి సమర్పించుకున్నారు. “నా శత్రువు పట్ల ప్రేమతో ఉండేందుకు బైబిలు సత్యం నాకు సహాయపడింది. యుద్ధంలో పోరాడడం ద్వారా నేను నిజానికి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నానని గ్రహించాను, ఎందుకంటే మన పొరుగువారిని చంపకూడదని దేవుడు చెబుతున్నాడు. ఈ ప్రేమను చూపడానికి నేను నా ఆలోచనా ధోరణిని మార్చుకొని ఇతరులను నా శత్రువులుగా చూడడం మానుకోవలసి వచ్చింది” అని ఓర్టెన్‌షియో వివరిస్తున్నాడు.
ఇలాంటి నిజ జీవిత అనుభవాలు, బైబిలు విద్య నిజంగానే శాంతికి తోడ్పడుతుందని స్పష్టీకరిస్తున్నాయి. ఇది ఆశ్చర్యమేమీ కాదు. దైవిక విద్యకు శాంతికి నేరుగా సంబంధం ఉందని యెషయా ప్రవక్త పేర్కొన్నాడు. ఆయనిలా ప్రవచించాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి [“శాంతి,” NW] కలుగును.” (ఇటాలిక్కులు మావి.) (యెషయా 54:13) అదే ప్రవక్త, అన్ని దేశాల ప్రజలు యెహోవా దేవుని మార్గాల గురించి తెలుసుకోవడానికి ఆయన స్వచ్ఛారాధన వైపుకు ప్రవాహములాగ వచ్చే ఒక కాలాన్ని ముందే చూశాడు. అప్పుడేమి జరుగుతుంది? “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (ఇటాలిక్కులు మావి.)—యెషయా 2:2-4.
ఆ ప్రవచనానికి అనుగుణంగా యెహోవాసాక్షులు, మానవ యుద్ధాలకు మూలకారణమైన విద్వేషాన్ని అధిగమించడంలో ఇప్పటికే లక్షలాది మందికి సహాయం చేసిన ప్రపంచవ్యాప్త విద్యాపనిలో నిమగ్నమైవున్నారు.
ప్రపంచ శాంతి ఖచ్చితంగా వస్తుంది
దేవుడు విద్యను అందించడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు ఒక ప్రభుత్వాన్ని లేక “రాజ్యమును” కూడా స్థాపించాడు. దేవుడు ఎంపిక చేసిన పరిపాలకుడైన యేసుక్రీస్తును బైబిలు “సమాధానకర్తయగు అధిపతి” అని వర్ణించడం గమనార్హం. “మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు . . . అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును” అని కూడా అది మనకు హామీ ఇస్తోంది.—యెషయా 9:6, 7.
క్రీస్తు పరిపాలన అన్నిరకాల యుద్ధాలను విజయవంతంగా నిర్మూలిస్తుందని మనకు ఎలాంటి హామీ ఉంది? యెషయా ప్రవక్త ఇంకా ఇలా చెబుతున్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” (యెషయా 9:7) దేవునికి శాశ్వతంగా శాంతి నెలకొల్పాలనే కోరికా, సామర్థ్యమూ ఉన్నాయి. ఈ వాగ్దానంపై యేసుకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన తన అనుచరులకు, దేవుని రాజ్యం రావడం కోసం భూమ్మీద దేవుని చిత్తం నెరవేరడం కోసం ప్రార్థించమని నేర్పించాడు. (మత్తయి 6:9, 10) చివరకు ఆ యథార్థ కోరికకు జవాబు దొరికినప్పుడు, యుద్ధం మరెన్నడూ ఈ భూమ్మీద హాని కలిగించదు.
[అధస్సూచి]
^ పేరా 6 మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే రుజువులు పరిశీలించేందుకు, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో 11వ అధ్యాయం చూడండి.
[7వ పేజీలోని చిత్రం]
బైబిలు విద్య శాంతికి తోడ్పడుతుంది