ఆధ్యాత్మికత మరియు మీ సంక్షేమం
ఆధ్యాత్మికత మరియు మీ సంక్షేమం
మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం బహుశా మీరు ఎక్కువ సమయం వెచ్చిస్తుండవచ్చు. మీరు ప్రతీరోజు నిద్రకు ఎనిమిది గంటలు, వండడానికి, తినడానికి మరికొన్ని గంటలు, నివసిస్తున్న ఇంటికి, తినే ఆహారానికి కావలసిన డబ్బు సంపాదించడానికి మరో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ గంటలు వెచ్చిస్తుండవచ్చు. మీకు నలతగా ఉన్నప్పుడు డాక్టరు దగ్గరకెళ్లడానికి లేదా సంప్రదాయ ఔషధం సిద్ధం చేసుకోవడానికి బహుశా సమయం, డబ్బు ఖర్చు చేస్తుండవచ్చు. మంచి ఆరోగ్యంతో ఉండేందుకు మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, స్నానం చేయడం, క్రమంగా వ్యాయామం చేయడం వంటివికూడా చేస్తుండవచ్చు.
అయితే మంచి ఆరోగ్యం కాపాడుకోవడంలో మీ శారీరక అవసరాలపట్ల శ్రద్ధ చూపడంకంటే ఇంకా ఎక్కువే ఇమిడివుంది. మీ సంక్షేమానికి సంబంధించి బలమైన పాత్ర పోషించేది మరొకటి ఉంది. మీ శారీరక ఆరోగ్యానికి మీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అంటే మీలో ఆధ్యాత్మికత ఉందా లేదా అనేదానికి సన్నిహిత సంబంధముందని వైద్య పరిశోధన చూపింది.
సూటిగావున్న సంబంధం
“ఈ అంశానికి సంబంధించిన మొదటి పరిశోధనా శీర్షికలు, పెరిగిన ఆధ్యాత్మికతకు మెరుగైన ఆరోగ్యానికి సూటిగా సంబంధం ఉందని కనుగొన్నాయి” అని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హెడ్లీ జి. పీచ్ చెబుతున్నారు. ఈ పరిశోధనా ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, ద మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎమ్.జె.ఏ) ఇలా చెబుతోంది: “మతాసక్తితో ఉండడానికి . . . తక్కువ రక్తపోటుకు, తక్కువ కొలెస్ట్రాల్‌కు . . .
పెద్దప్రేగు క్యాన్సరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడానికి సంబంధం ఉంది.”అదే విధంగా అమెరికాలో, బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యు.సి.) 2002లో 6,545 మందిపై జరిపిన అధ్యయనం “వారానికి ఒకసారి మతసంబంధ సేవలకు హాజరయ్యేవారు, అరుదుగా లేదా అసలే హాజరుకాని వారికంటే ఎక్కువకాలం జీవిస్తున్నట్లు” కనుగొంది. ఆ అధ్యయన ప్రముఖ గ్రంథకర్త మరియు యు.సి. బెర్కిలీ ప్రజారోగ్య పాఠశాల లెక్చరర్ అయిన డెగ్ ఓమెన్ ఇలా చెప్పాడు: “సామాజిక సంబంధాలు, పొగత్రాగడం, వ్యాయామంతో సహా ఆరోగ్యసంబంధ అలవాట్లవంటివి పరిశీలించిన తర్వాత కూడా మేము ఈ తేడా కనుగొన్నాము.”
జీవితం విషయంలో ఆధ్యాత్మిక దృక్కోణం ఉన్నవారు పొందే ఇతర ప్రయోజనాలను గుర్తిస్తూ, ఎమ్.జె.ఏ. ఇలా చెబుతోంది: “మతసంబంధమైన వారిలో వివాహ స్థిరత్వం అధికంగా ఉండడం, ఆల్కహాలు, చట్టవ్యతిరేక మాదక ద్రవ్యాలు తక్కువగా ఉపయోగించడం, ఆత్మహత్యలు తక్కువగా ఉండడం, ఆత్మహత్య చేసుకునే విషయంలో ప్రతికూల భావాలు ఎక్కువగా ఉండడం, చింత మరియు మానసిక కృంగుదల తక్కువగా ఉండడం, నిస్వార్థత ఎక్కువగా ఉన్నట్లు ఆస్ట్రేలియా అధ్యయనాలు కనుగొన్నాయి.” దానికి తోడు, (మునుపు ద బ్రిటిష్ మెడికల్ జర్నల్ అని పిలువబడిన) బి.ఎమ్.జె. ఇలా నివేదిస్తోంది: “ఆధ్యాత్మిక నమ్మకాల్లేని ప్రజలకంటే తమకు బలమైన ఆధ్యాత్మిక నమ్మకాలున్నాయని చెప్పుకునే ప్రజలు సన్నిహిత వ్యక్తి మరణం తర్వాత మరింత వేగంగా, సంపూర్ణంగా దుఃఖంనుండి తేరుకున్నట్లు కనిపిస్తోంది.”
స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటనే విషయంలో వివిధ రకాల తలంపులున్నాయి. ఏదేమైనా, మీ ఆధ్యాత్మిక స్థితి మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఈ రుజువు పొందిక కలిగివుంది. ఆయనిలా అన్నాడు: “తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) మీ ఆరోగ్యం, ఆనందం మీ ఆధ్యాత్మిక స్థితివల్ల ప్రభావితం చెందుతాయి కాబట్టి, ఇలా ప్రశ్నించుకోవడం సముచితం: ‘నమ్మదగిన ఆధ్యాత్మిక మార్గనిర్దేశం నాకెక్కడ లభిస్తుంది? ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడంలో ఏమి ఇమిడివుంది?’