కాంప్లుటెన్సియన్ బహుభాషా బైబిలు చరిత్రాత్మక అనువాదపు ఉపకరణం
కాంప్లుటెన్సియన్ బహుభాషా బైబిలు చరిత్రాత్మక అనువాదపు ఉపకరణం
సుమారు 1455 నాటికి, బైబిలును ప్రచురించడంలో విప్లవాత్మకమైన మార్పువచ్చింది. యోహానస్ గూటెన్‌బర్గ్ చరిత్రలో మొదటిసారిగా మూవబుల్ ముద్రణా యంత్రంపై బైబిలును ముద్రించాడు. దానితో పరిమిత చేతివ్రాత ప్రతులకే బైబిలును కట్టడిచేసిన బంధకాలు పటాపంచలయ్యాయి. ఎట్టకేలకు స్వల్ప ఖర్చుతోనే అధిక సంఖ్యలో బైబిళ్ళను ఉత్పత్తి చేయడం సాధ్యమయ్యింది. అనతికాలంలోనే బైబిలు ప్రపంచంలో అత్యంత విస్తృతంగా పంచిపెట్టబడే పుస్తకంగా మారింది.
గూటెన్‌బర్గ్ బైబిలు లాటిన్ భాషలో ఉండేది. అయితే యురోపియన్ విద్వాంసులు తమకు మౌలిక హీబ్రూ, గ్రీకు భాషల్లో విశ్వసనీయమైన బైబిలు మూలగ్రంథం అవసరమని త్వరలోనే గ్రహించారు. లాటిన్ వల్గేట్ మాత్రమే ఆమోదకరమైన బైబిలు అనువాదమని క్యాథలిక్ చర్చి పరిగణించింది, అయితే ఆ అనువాదంలో రెండు పెద్ద చిక్కులు ఉన్నాయి. 16వ శతాబ్దంలో చాలామంది లాటిన్ భాషను అర్థం చేసుకోలేకపోయేవారు. అంతేకాక వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాల కాలంలో, వల్గేట్ మూలగ్రంథపు నకలు ప్రతులు వ్రాసినవారు ఎన్నో తప్పులు చేశారు.
ఇటు అనువాదకులకు, అటు విద్వాంసులకు మౌలిక భాషలతోపాటు, మెరుగైన లాటిన్ అనువాదం కూడా ఉన్న బైబిలు అవసరమైంది. 1502లో స్పెయిన్ ఈసబెల్ల Iకి రాజకీయ, ఆధ్యాత్మిక సలహాదారుడైన కార్డినల్ హీమేనేత్ దే థీస్నీరోస్, కేవలం ఒకే ప్రచురణతో వారి అవసరాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ చరిత్రాత్మక అనువాద ఉపకరణమే కాంప్లుటెన్సియన్ బహుభాషా బైబిలుగా పేరుగాంచింది. ఒక పోలిగ్లాట్‌ను లేదా బహుభాషా బైబిలును అంటే హీబ్రూ, గ్రీకు, లాటిన్‌లతోపాటు కొన్ని భాగాలు అరామైక్‌లోవున్న ఉత్తమ మూల గ్రంథాన్ని తయారుచేయాలని థీస్నీరోస్ లక్ష్యించాడు. ముద్రణ రంగం ఇంకా శైశవదశలోనే ఉంది, కాబట్టి అలాంటి బైబిలు రూపొందడం ముద్రణ రంగంలో ఒక మైలురాయే అవుతుంది.
థీస్నీరోస్ తను చేపట్టిన బృహత్తర కార్యాన్ని స్పెయిన్‌లో ఎక్కువగా లభ్యమవుతున్న ప్రాచీన హీబ్రూ వ్రాతప్రతులను కొనుగోలు చేయడంతో ప్రారంభించాడు. ఆయన వివిధరకాల గ్రీకు, లాటిన్ వ్రాతప్రతులను కూడా సేకరించాడు. అవి బహుభాషా బైబిలుకు మూలాధారం అయ్యాయి. ఆ సంకలన పనిని థీస్నీరోస్ ఒక విద్వాంసుల బృందానికి అప్పగించాడు, ఆయన ఆ బృందాన్ని స్పెయిన్‌లో కొత్తగా స్థాపించబడిన యూనివర్సిటీ ఆఫ్ ఆల్కాలా దే ఏనారేస్ నుండి వ్యవస్థీకరించాడు. అలా ఒక బృందంగా కలిసి పనిచేయడానికి పిలువబడిన విద్వాంసుల్లో రాటర్‌డామ్‌కు చెందిన ఎరాస్మస్ ఒకరు, కానీ ఈ ప్రసిద్ధ బహుభాషా ప్రజ్ఞాశాలి ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడు.
ఆ బృహత్తరమైన సంకలన కార్యానికి ఆ విద్వాంసులకు పది సంవత్సరాలు పట్టగా, అసలు ముద్రణకు మరో నాలుగు సంవత్సరాలు పట్టింది. స్పానిష్ ముద్రణకర్తల దగ్గర హీబ్రూ, గ్రీకు, అరామైక్ అచ్చు అక్షరాలు అందుబాటులో లేకపోవడంవల్ల అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల థీస్నీరోస్ ఆ భాషల్లోని అచ్చు అక్షరాలను తయారు చేసేందుకు ముద్రణా నిపుణుడైన ఆర్నాల్డో గీయర్మో బ్రోకార్‌ను నియమించాడు. చివరకు ముద్రణకర్తలు 1514లో గ్రంథ ముద్రణను ఆరంభించారు. థీస్నీరోస్ మరణించడానికి కేవలం నాలుగు నెలల ముందు, అంటే 1517, జూలై 10 నాటికి ఆరు సంపుటాలు ముద్రించడం పూర్తయింది. సంపూర్ణ గ్రంథాలు దాదాపు ఆరు వందల ప్రతులు ప్రచురించబడ్డాయి, ఇది స్పానిష్ ఇన్‌క్విసిషన్ (క్రైస్తవ ధర్మ విచారణా సభ) ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే జరగడం విశేషం. *
ఆ గ్రంథపు కూర్పు
ఆ బహుభాషా గ్రంథపు ప్రతి పేజీలోను అమూల్యమైన సమాచారం ఇవ్వబడింది. హీబ్రూ లేఖనాలకు సంబంధించిన నాలుగు సంపుటాల్లో, ప్రతీ పేజీకి మధ్యలో వల్గేట్ మూలపాఠం కనబడుతుంది; కుడివైపు కాలమ్‌లో హీబ్రూ మూలపాఠం ఉంటుంది; ఎడమవైపు కాలమ్‌లో గ్రీకు మూలపాఠంతోపాటు పంక్తుల మధ్య లాటిన్ అనువాదం కూడా ఉంటుంది. పేజీ అంచుల్లో అనేక హీబ్రూ పదాలకు మూలాధారాలు కనబడతాయి. ఆ సంపాదకులు ప్రతి పేజీకి కింద బైబిలులోని మొదటి అయిదు పుస్తకాలకు సంబంధించిన, టార్గమ్ ఆఫ్ ఒంకెలోస్ (బైబిల్లోని మొదటి అయిదు పుస్తకాల అరామైక్ భావానువాదం)తోపాటు లాటిన్ అనువాదాన్ని కూడా చేర్చారు.
ఆ గ్రంథంలోని అయిదవ సంపుటిలో గ్రీకు లేఖనాలు రెండు కాలమ్స్‌లో ఉన్నాయి. మొదటి కాలమ్‌లో గ్రీకు మూలపాఠం, రెండవ కాలమ్‌లో వల్గేట్ నుండి తీసుకోబడిన దానికి సమానార్థక లాటిన్ మూలపాఠం ఉంది. ఆ రెండు భాషల మధ్యవున్న పోలిక, చిన్న అక్షరాల ద్వారా చూపించబడింది. అవి ఆ కాలమ్‌లలోని సమానార్థక పదాలను పాఠకులకు సూచిస్తాయి. ఆ గ్రంథంలోని గ్రీకు మూలపాఠం, చరిత్రలో మొట్టమొదట ముద్రించబడ్డ గ్రీకు లేఖనాల లేదా “కొత్త నిబంధన” సమగ్ర సేకరణ. ఆ తర్వాత కొద్దికాలానికే ఎరాస్మస్ అనువదించిన ప్రచురణ వాడుకలోకి వచ్చింది.
అయిదవ సంపుటిలోని మూలపాఠం విషయంలో ఆ విద్వాంసులు ఎంత శ్రద్ధ వహించారంటే, దాని అచ్చు చిత్తుప్రతిని సరిదిద్దినప్పుడు అందులో కేవలం 50 అచ్చు తప్పులు మాత్రమే కనబడ్డాయి. ఆ విద్వాంసులు అంత శ్రద్ధ చూపించారు కాబట్టే ఆధునిక విమర్శకులు దాన్ని ప్రఖ్యాత ఎరాస్మస్ గ్రీకు మూలపాఠం కంటే ఉత్తమమైనదానిగా నిర్ధారించారు. శోభితమైన ఆ గ్రీకు అచ్చక్షరాలు, పాత అన్షియల్ వ్రాతప్రతుల్లో ఉపయోగించబడిన అక్షరాలతో చక్కగా సరిపోయాయి. ద ప్రింటింగ్ ఆఫ్ గ్రీక్ ఇన్ ద ఫిఫ్టీన్త్ సెంచురీ అనే తన పుస్తకంలో ఆర్. ప్రాక్టర్ ఇలా పేర్కొన్నాడు: “నిస్సందేహంగా ఇంతవరకూ రూపొందించని అందమైన గ్రీకు అచ్చు అక్షరాలను మొట్టమొదట తయారుచేసిన ఘనత స్పెయిన్‌కే చెందుతుంది.”
ఆ గ్రంథంలోని ఆరవ సంపుటిలో హీబ్రూ, అరామైక్ భాషల నిఘంటువు, గ్రీకు, హీబ్రూ, అరామైక్‌ల పేర్లకు అర్థవివరణ, హీబ్రూ వ్యాకరణం, అందులోని నిఘంటువు కోసం లాటిన్‌లో అకారాది సూచిక వంటి పలు సహాయకాలు ఉన్నాయి. అందుకే కాంప్లుటెన్సియన్ బహుభాషా బైబిలు “ముద్రణ కళకు, లేఖనాలకు సంబంధించిన విజ్ఞానానికి జ్ఞాపకచిహ్నం” అని వర్ణించబడడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఆ గ్రంథం “అప్పటివరకు నిద్రణావస్థలో ఉన్న లేఖనాలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తిని జాగృతం చేయాలని” థీస్నీరోస్ ఉద్దేశించాడు, కానీ బైబిలును అందరికీ అందుబాటులో ఉంచాలన్న కోరిక ఆయనలో లేదు. “దేవుని వాక్యం సామాన్యులకు అందకుండా చాలా మర్మంగా ఉండాలని” ఆయన భావించాడు. “సిలువవేయబడిన తన కుమారుని తలకు పైభాగాన వ్రాయడానికి దేవుడు అనుమతించిన మూడు ప్రాచీన భాషలకే లేఖనాలు పరిమితం చేయబడాలని” కూడా ఆయన విశ్వసించాడు. * ఆ కారణంగానే కాంప్లుటెన్సియన్ బహుభాషా గ్రంథంలో ఎలాంటి స్పానిష్ అనువాదమూ చేర్చబడలేదు.
వల్గేట్ వెర్సస్ మౌలిక భాషలు
ఆ గ్రంథపు తీరే దానిని తయారుచేసిన విద్వాంసుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలను కలిగించింది. ప్రసిద్ధ స్పానిష్ విద్వాంసుడైన ఆంటోనియో దే నెబ్రీహాకు ఆ గ్రంథంలో కనిపించే వల్గేట్ మూలపాఠాన్ని సంస్కరించే బాధ్యత అప్పగించబడింది. * జెరోమ్ వల్గేట్ మాత్రమే అధికారిక గ్రంథమని క్యాథలిక్ చర్చి పరిగణించినప్పటికీ, నెబ్రీహా మౌలిక హీబ్రూ, అరామైక్, గ్రీకు మూలపాఠాలతో వల్గేట్‌ను పోల్చిచూడాల్సిన అవసరముందని గ్రహించాడు. ఉనికిలో ఉన్న వల్గేట్ ప్రతుల్లో చొరబడిన స్పష్టమైన పొరపాట్లను ఆయన సరిదిద్దాలనుకున్నాడు.
నెబ్రీహా, వల్గేట్‌కు మౌలిక భాషలకు మధ్యనున్న భేదాలను పరిష్కరించడానికి థీస్నీరోస్‌కు ఇలా విన్నవించాడు: “మన మతం యొక్క ఆరిపోయిన రెండు జ్యోతులను అంటే హీబ్రూ, గ్రీకు భాషల జ్యోతులను మరోసారి వెలిగించండి. ఈ లక్ష్యానికి అంకితమైనవారికి ప్రతిఫలం ముట్టజెప్పండి.” ఆయన ఈ క్రింది సలహా కూడా ఇచ్చాడు: “కొత్త నిబంధన యొక్క లాటిన్ వ్రాతప్రతుల్లో భేదం కనబడిన ప్రతీసారి, దానిని మనం గ్రీకు వ్రాతప్రతులతో పోల్చిచూడాలి. పాతనిబంధన యొక్క విభిన్న లాటిన్ వ్రాతప్రతుల మధ్య తేడా కనిపించినా లేక లాటిన్, గ్రీకు వ్రాతప్రతుల మధ్య తేడా కనిపించినా వాటి ఖచ్చితత్వం కోసం మనం అధికారిక హీబ్రూ మూలపాఠాన్ని తిరగెయ్యాలి.”
థీస్నీరోస్ ఎలా స్పందించాడు? ఆ బహుభాషా బైబిలు గ్రంథం కోసం వ్రాసిన ముందుమాటలో థీస్నీరోస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించాడు. “రోమన్‌కు లేదా లాటిన్ చర్చికి ప్రతీకగా యేసుకు ఇరువైపుల వ్రేలాడదీయబడ్డ దొంగల్లాగ, మహనీయుడైన జెరోమ్ లాటిన్ అనువాదాన్ని మేము సమాజమందిరానికి [హీబ్రూ మూలపాఠానికి], ప్రాచ్యదేశపు చర్చికి [గ్రీకు మూలపాఠానికి] మధ్య ఉంచాం.” ఆ విధంగా థీస్నీరోస్, లాటిన్ వల్గేట్‌ను మౌలిక భాషల మూలపాఠానికి అనుగుణంగా సరిదిద్దేందుకు నెబ్రీహాను అనుమతించలేదు. చివరకు నెబ్రీహా లోపసహితమైన ఆ సంస్కరణా గ్రంథానికి తన పేరును జోడించడానికి బదులు ఆ పనిని వదిలేయడానికే నిర్ణయించుకున్నాడు.
కోమా యోహానమ్
ఆల్కాలా దే ఏనారేస్ బహుభాషా గ్రంథం, బైబిలు మౌలిక భాషల్లో మెరుగైన మూలపాఠాన్ని రూపొందించడంలో అసాధారణ విజయంగా నిరూపించబడినప్పటికీ, ఆయా సందర్భాల్లో విజ్ఞానంపై సాంప్రదాయ నమ్మకాలదే పైచేయిగా ఉండేది. వల్గేట్ ఎంత ఉన్నతంగా పరిగణించబడిందంటే, కొన్ని సందర్భాల్లో సంపాదకులు “కొత్త నిబంధన” యొక్క గ్రీకు మూలపాఠానికి అనుగుణంగా లాటిన్ అనువాదాన్ని సరిదిద్దడానికి బదులు, లాటిన్‌కు అనుగుణంగా గ్రీకు మూలపాఠాన్నే సరిదిద్దడం తమ బాధ్యత అన్నట్టుగా తలంచారు. వీటిలో బూటకపు వచనంగా పేరుగాంచిన కోమా యోహానమ్ ఒక ఉదాహరణ. * తొలి గ్రీకు వ్రాతప్రతుల్లో దేనిలోనూ ఈ మాటలు లేవు, ఇవి యోహాను తన పత్రిక వ్రాసిన అనేక శతాబ్దాల తర్వాత చేర్చబడ్డాయని స్పష్టమవుతోంది. ఆ మాటలు అతి పురాతన వల్గేట్ లాటిన్ వ్రాతప్రతుల్లోనూ కనబడవు. ఆ కారణంగా ఎరాస్మస్ మధ్యలో ప్రవేశపెట్టిన ఈ మాటలను తన గ్రీకు “కొత్త నిబంధన”లో నుండి తొలగించాడు.
బహుభాషా బైబిలు సంపాదకులు, సాంప్రదాయక వల్గేట్‌లో శతాబ్దాలుగా ఒక భాగంగా ఉన్న ఆ వచనాన్ని మార్చడానికి ఇష్టపడలేదు. అందుకే వారు
బూటకపు మాటలను లాటిన్ మూలపాఠంలో అలాగే ఉంచి, బహుభాషా బైబిలు గ్రంథపు రెండు కాలమ్‌లలో సామరస్యాన్ని కాపాడేందుకు ఆ మాటలను గ్రీకులోకి అనువదించి దాన్ని గ్రీకు మూలపాఠంలో చేర్చడానికి తీర్మానించుకున్నారు.కొత్త బైబిలు అనువాదాలకు ఆధారం
కాంప్లుటెన్సియన్ బహుభాషా గ్రంథంలో, సెప్టాజింట్‌లోని గ్రీకు లేఖనాలన్నీ ఉన్న మొదటి ప్రచురణ ఉండడం వల్ల మాత్రమే అది విలువైనదిగా పరిగణించబడడం లేదు. కానీ ఎలాగైతే ఎరాస్మస్ యొక్క గ్రీకు “కొత్త నిబంధన,” గ్రీకు లేఖనాలకు (అనేక ఇతర భాషల్లోకి అనువదించడానికి) అంగీకృత మూలపాఠంగా ఆమోదించబడిందో, అదే విధంగా ఈ బహుభాషా గ్రంథంలోని హీబ్రూ మూలపాఠం హీబ్రూ, అరామైక్ లేఖనాలకు అధికారిక వచన గ్రంథంగా ఆమోదించబడింది. * విలియమ్ టిండేల్ బైబిలును ఇంగ్లీషులోకి అనువదించేందుకు, హీబ్రూ మూలపాఠానికి ఆధారంగా ఈ గ్రంథాన్నే ఉపయోగించాడు.
ఆ విధంగా కాంప్లుటెన్సియన్ బహుభాషా గ్రంథాన్ని రూపొందించిన బృందం చేసిన విజ్ఞానదాయకమైన కృషి, లేఖన విజ్ఞానాభివృద్ధికి విశేషమైన లాభాన్ని చేకూర్చింది. యూరప్ అంతటా బైబిలుపై ఆసక్తి పెరుగుతూ, ప్రజల సామాన్య భాషలోకి దానిని అనువదించాలని ప్రోత్సహించబడుతున్న సమయంలోనే ఆ గ్రంథం ప్రచురించబడింది. ఆ బహుభాషా గ్రంథం గ్రీకు, హీబ్రూ మూలపాఠాల స్వచ్ఛతకు, భద్రతకు తోడ్పడడానికి తీసుకున్న చర్యల్లో ఒకటిగా నిరూపించబడింది. ఇవన్నీ “యెహోవా వాక్కు నిర్మలము,” “దేవుని వాక్యము నిత్యము నిలుచును” అనే దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయి.—కీర్తన 18:30; యెషయా 40:8; 1 పేతురు 1:24, 25.
[అధస్సూచీలు]
^ పేరా 6 ఆరు వందల కాపీలు కాగితంతోను, ఆరు కాపీలు చర్మపత్రాలతోను చేయబడ్డాయి. 1984లో మరికొన్ని ప్రత్యుత్పాదక కాపీలు ముద్రించబడ్డాయి.
^ పేరా 12 హీబ్రూ, గ్రీకు, లాటిన్—యోహాను 19:20.
^ పేరా 14 స్పానిష్ మానవతావాదుల్లో (నిష్కపటమైన విద్వాంసుల్లో) నెబ్రీహా మొదటివాడిగా పరిగణించబడ్డాడు. 1492లో ఆయన మొట్టమొదటి గ్రామాటిక కాస్టెల్లానా (కాస్టిలియన్ భాషా వ్యాకరణం) ప్రచురించాడు. మూడు సంవత్సరాల తర్వాత, ఆయన తన శేష జీవితాన్ని పరిశుద్ధ లేఖనాల అధ్యయనానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.
^ పేరా 18 అదనంగా ప్రవేశపెట్టిన ఆ బూటకపు మాటలు కొన్ని బైబిలు అనువాదాల్లో 1 యోహాను 5:7వ వచనంలో కనబడతాయి, ఆ వచనం ఇలా ఉంది: “పరలోకంలో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు—తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు ఒకరైయున్నారు.”
^ పేరా 21 ఎరాస్మస్ చేసిన కృషి గురించిన వృత్తాంతం కోసం కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 15, 1982, 8-11 పేజీలు చూడండి.
[29వ పేజీలోని చిత్రం]
కార్డినల్ హీమేనేత్ దే థీస్నీరోస్
[చిత్రసౌజన్యం]
Biblioteca Histórica. Universidad Complutense de Madrid
[30వ పేజీలోని చిత్రం]
ఆంటోనియో దే నెబ్రీహా
[చిత్రసౌజన్యం]
Biblioteca Histórica. Universidad Complutense de Madrid
[28వ పేజీలోని చిత్రసౌజన్యం]
Biblioteca Histórica. Universidad Complutense de Madrid