కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రజలు దయను ప్రేమించాలి

దేవుని ప్రజలు దయను ప్రేమించాలి

దేవుని ప్రజలు దయను ప్రేమించాలి

“న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”​మీకా 6:⁠8.

యెహోవా దయగల దేవుడు. * (రోమీయులు 2:4; 11:​22) ఆ వాస్తవంపట్ల ఆది దంపతులైన ఆదాము హవ్వలు ఎంతో కృతజ్ఞత చూపివుంటారు. ఏదెను వనంలో, మానవులపట్ల దేవుని దయకు సాక్ష్యమిచ్చే దృగ్గోచర సృష్టికార్యాలు వారి చుట్టూ ఉన్నాయి, వాటిని అనుభవించే సామర్థ్యం వారికుంది. అంతేకాకుండా దేవుడు అందరిపట్ల, చివరకు కృతఘ్నులపట్ల, దుష్టులపట్ల కూడా దయచూపిస్తున్నాడు.

2 మానవులు దేవుని స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి, దైవిక లక్షణాలు ప్రతిబింబించే సామర్థ్యం వారికుంది. (ఆదికాండము 1:​26) అందువల్ల మనం కూడా దయ చూపించాలని యెహోవా ఆశించడంలో ఆశ్చర్యం లేదు. మీకా 6:​8 చెబుతున్నట్లుగా దేవుని ప్రజలు ‘కనికరమును ప్రేమించాలి.’ అయితే కనికరము లేదా దయ అంటే ఏమిటి? ఇతర దైవిక లక్షణాలతో దీనికి ఎలాంటి సంబంధముంది? మానవులకు దయ చూపించే సామర్థ్యముంది కదా, మరి అలాంటప్పుడు లోకమెందుకు ఇంత క్రూరంగా, కఠినంగా ఉంది? ఇతరులతో వ్యవహరించేటప్పుడు క్రైస్తవులుగా మనమెందుకు దయ చూపడానికి కృషిచెయ్యాలి?

దయ అంటే ఏమిటి?

3 ఇతరుల సంక్షేమంపట్ల చురుకుగా ఆసక్తి కనపరచడం ద్వారా దయ ప్రదర్శించబడుతుంది. సహాయక క్రియల ద్వారా, దయగల మాటల ద్వారా అది చూపబడుతుంది. దయ చూపించడమంటే హాని చేయడానికి బదులు మేలు చేయడమనే దానర్థం. దయగల వ్యక్తి, స్నేహపూర్వకంగా, మృదుస్వభావిగా, సానుభూతి చూపేవ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా ఉంటాడు. అతనికి ఇతరులపట్ల ఉదార స్వభావం, ఆలోచనాపూర్వక దృక్పథం ఉంటాయి. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ప్రబోధించాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:​12) కాబట్టి, దయాగుణం నిజ క్రైస్తవుని అలంకారార్థ వస్త్రధారణలో భాగంగా ఉంది.

4 దయ చూపించడంలో యెహోవా దేవుడు చొరవ తీసుకున్నాడు. పౌలు చెప్పినట్లుగా, “మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు . . . తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుటద్వారాను మనలను రక్షించెను.” (తీతు 3:​4, 5) దేవుడు క్రీస్తు విమోచనా క్రయధన బలి విలువను అభిషిక్త క్రైస్తవుల పక్షాన అన్వయిస్తూ, యేసు రక్తంలో వారికి “స్నానము” చేయిస్తున్నాడు లేదా పరిశుభ్రపరుస్తున్నాడు. మరియు వారు పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడి, దేవుని ఆత్మ జనిత కుమారులుగా “నూతన సృష్టి” అవుతున్నారు. (2 కొరింథీయులు 5:​17) అంతేకాకుండా, “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొన్న” “గొప్పసమూహము”పట్ల కూడా దేవుని దయ, ప్రేమ విస్తరించబడుతున్నాయి.​—⁠ప్రకటన 7:9, 14; 1 యోహాను 2:1, 2.

5 దయ దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి ఫలంలో కూడా ఒక భాగం. పౌలు ఇలా చెప్పాడు: “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.” (గలతీయులు 5:​22, 23) కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఇతరులపట్ల దయ చూపించవద్దా?

నిజమైన దయ బలహీనత కాదు

6 కొంతమంది దయను బలహీనతగా దృష్టిస్తారు. ఒక వ్యక్తి తన బలమేమిటో ఇతరులు చూడగలిగేలా అప్పుడప్పుడు కఠినంగా, మొరటుగా ఉండాలని వారు భావిస్తారు. అయితే వాస్తవానికి, నిజమైన దయను చూపిస్తూ, అనుచిత దయను విసర్జించడానికే నిజమైన బలం కావాలి. నిజమైన దయ దేవుని ఆత్మ ఫలంలో ఒక భాగం కాబట్టి, అది చెడు ప్రవర్తనపట్ల బలహీనమైన, రాజీపడే ధోరణి కానేరదు. మరోవైపు, అనుచిత దయ ఒక బలహీనత, అది తప్పుడు ప్రవర్తనను చూసీ చూడనట్లు ఊరుకోవడానికి కారణమవుతుంది.

7 ఉదాహరణకు, ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడైన ఏలీ విషయమే తీసుకోండి. ఆయన ఆలయ గుడారంవద్ద యాజకులుగా సేవచేస్తున్న తన కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులను శిక్షించకుండా నిర్లక్ష్యం చేశాడు. వారు దేవుని ధర్మశాస్త్రం నియమించిన బలి వాటాతో తృప్తిపడక, బలి అర్పించే వ్యక్తి బలిపీఠంపై తన బలిపశువు కొవ్వును దహించకముందే ఆ వ్యక్తినుండి తమ పనివాడు పచ్చిమాంసమే వసూలు చేసేలా ఏర్పాటుచేశారు. అంతేకాదు, గుడారపు ద్వారం దగ్గరకు సేవచేయడానికి వచ్చే స్త్రీలతో ఏలీ కుమారులు వ్యభిచరించారు. ఆ పదవి నుండి వారిని తొలగించడానికి బదులు, ఏలీ వారిని కేవలం సున్నితంగా మందలించాడు. (1 సమూయేలు 2:​12-29) అందుకే “ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు” అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (1 సమూయేలు 3:⁠1) సంఘ ఆధ్యాత్మికతకు ప్రమాదం వాటిల్లజేయగల తప్పిదస్థులపట్ల అనుచిత దయచూపించడానికి లోనుకాకుండా క్రైస్తవ పెద్దలు జాగ్రత్తపడాలి. నిజమైన దయ దేవుని ప్రమాణాలను ఉల్లంఘించే హానికరమైన మాటలను, క్రియలను పట్టించుకోకుండా ఉండదు.

8 మన మాదిరికర్తయైన యేసుక్రీస్తు అనుచిత దయను ప్రదర్శించే తప్పు ఎన్నడూ చేయలేదు. ఆయన నిజమైన దయకు శ్రేష్ఠమైన మాదిరిగా ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన ‘జన సమూహములు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదిరియున్నారని చూచి వారిమీద కనికరపడ్డాడు.’ అందువల్ల యథార్థ హృదయులు తమ చంటి బిడ్డలను సహితం ఆయనవద్దకు తీసుకువస్తూ ఆయనను సమీపించడానికి వెనుకాడలేదు. ఆయన ‘ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదిస్తూ’ ప్రదర్శించిన దయాకనికరాల గురించి ఆలోచించండి. (మత్తయి 9:36; మార్కు 10:​13-16) యేసు దయామయునిగా ఉన్నప్పటికీ, తన పరలోకపు తండ్రి దృష్టిలో సరైనదాని విషయంలో స్థిరంగా ఉన్నాడు. యేసు కీడును ఎన్నడూ మన్నించలేదు; మతనాయకుల వేషధారణను బాహాటంగా ఖండించే దైవానుగ్రహ ధైర్యం ఆయనకుంది. మత్తయి 23:13-26లో వ్రాయబడినట్లుగా, “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా” అని ఆయన అనేకమార్లు అన్నాడు.

దయ మరియు ఇతర దైవిక లక్షణాలు

9 దయకు దేవుని ఆత్మ ఉత్పత్తిచేసే ఇతర లక్షణాలకు సంబంధముంది. ‘దీర్ఘశాంతానికీ, దయాళుత్వానికీ’ మధ్య అది పేర్కొనబడింది. నిజానికి, దయను అలవరచుకొనే వ్యక్తి దీర్ఘశాంతుడై ఉండడం ద్వారా ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తాడు. నిర్దయులపట్ల కూడా ఆయన సహనం చూపిస్తాడు. మంచితనానికి దయకు ఎలాంటి సంబంధం ఉందంటే, ఇతరులకు ప్రయోజనకరమైన సహాయక క్రియలు చేయడంలో తరచూ అది ప్రదర్శించబడుతూ ఉంటుంది. ‘దయాళుత్వానికి’ బైబిల్లో ఉపయోగించబడ్డ గ్రీకు పదాన్ని కొన్నిసార్లు “మంచితనము” అని కూడా అనువదించవచ్చు. తొలి క్రైస్తవుల్లో ఉన్న ఈ లక్షణం అన్యులను ఎంతగా ఆశ్చర్యపరచిందంటే, టెర్టూలియన్‌ మాటల్లో చెప్పాలంటే, ఆ అన్యులు యేసు అనుచరులను ‘దయాపరులని’ పిలిచారు.

10 దయకు, ప్రేమకు సంబంధముంది. యేసు తన అనుచరుల గురించి ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:​35) ఈ ప్రేమ గురించి పౌలు ఇలా చెప్పాడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును.” (1 కొరింథీయులు 13:⁠4) ఆదిమ లేఖనాల్లో తరచూ ఉపయోగించబడ్డ “ప్రేమపూర్వక దయ” అనే మాటలో దయ, ప్రేమకు ముడిపెట్టబడింది. ఈ విధమైన దయ విశ్వసనీయ ప్రేమ నుండి ఉద్భవిస్తుంది. “ప్రేమపూర్వక దయ” అని అనువదించబడిన హీబ్రూ నామవాచకంలో అనురాగం కంటే ఎక్కువే ఇమిడివుంది. అది, ఒక వ్యక్తి విషయంలో సంబంధిత సంకల్పం నెరవేరే పర్యంతం దానికి ప్రేమపూర్వకంగా అంటిపెట్టుకుని ఉండే దయ. యెహోవా ప్రేమపూర్వక దయ, లేదా విశ్వసనీయ ప్రేమ వివిధ రకాలుగా ప్రదర్శించబడుతుంది. ఉదాహరణకు, ఇది ఆయన విడుదల మరియు రక్షణ కార్యాల్లో కనబడుతుంది.​—⁠కీర్తన 6:4; 40:11; 143:12.

11 యెహోవా ప్రేమపూర్వక దయ ప్రజలను ఆయనవైపుకు ఆకర్షిస్తుంది. (యిర్మీయా 31:⁠3) నమ్మకస్థులైన దేవుని సేవకులకు విడుదల లేదా సహాయం అవసరమైనప్పుడు వారిపట్ల ఆయన ప్రేమపూర్వక దయ లేదా విశ్వసనీయ ప్రేమ తప్పకుండా ఉంటుంది. అది వారిని నిరాశపరచదు. అందువల్ల, వారు “నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది” అని చెప్పిన కీర్తనకర్తలానే విశ్వాసంతో ప్రార్థించవచ్చు. (కీర్తన 13:⁠5) దేవుని ప్రేమ విశ్వసనీయమైనది కాబట్టి, ఆయన సేవకులు ఆయనపై సంపూర్ణంగా నమ్మకముంచవచ్చు. వారికి ఈ హామీ ఉంది: “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.”​—⁠కీర్తన 94:14.

లోకమెందుకు ఇంత క్రూరంగా ఉంది?

12 దీనికి జవాబు ఏదెను వనంలో జరిగిన సంఘటనలో దొరుకుతుంది. మానవ చరిత్రారంభంలో, స్వార్ధపరునిగా, అహంకారిగా మారిన ఆత్మసంబంధ ప్రాణి ఒకడు, తాను ప్రపంచ నాయకుడయ్యేందుకు ఒక పథకం పన్నాడు. అతని పన్నాగం ఫలించడం మూలంగా, అతడు “లోకాధికారి” అయ్యాడు, అయితే నిజానికి అతడు ప్రజలను పీడించే అధికారి అయ్యాడు. (యోహాను 12:​31) అతడు అటు దేవునికి ఇటు మనిషికి ప్రధాన విరోధియైన అపవాదియగు సాతానుగా పేరుగాంచాడు. (యోహాను 8:44; ప్రకటన 12:⁠9) యెహోవా దయాపూర్వక పరిపాలనకు పోటీ పరిపాలన స్థాపించాలనే అతని స్వార్థ పన్నాగం హవ్వ సృష్టించబడ్డ వెంటనే బయటపడింది. ఆ విధంగా, ఆదాము దేవుని దయను పూర్తిగా తృణీకరిస్తూ, ఆయన పరిపాలనకు దూరంగా స్వేచ్ఛామార్గం ఎన్నుకోవడంతో చెడు పరిపాలన ఆరంభమైంది. (ఆదికాండము 3:​1-6) నిజానికి ఆదాము హవ్వలు తమకై తాముగా పరిపాలించుకోవడానికి బదులు, అపవాది స్వార్థ, అహంకార ప్రభావానికి లొంగిపోయి, అతని పాలిత ప్రజలుగా తయారయ్యారు.

13 దాని పర్యవసానాల్లో కొన్నింటిని పరిశీలించండి. ఆదాము హవ్వలు పరదైసుగావున్న భూభాగంనుండి వెళ్లగొట్టబడ్డారు. ఆరోగ్యదాయకమైన చెట్లు, ఫలాలు సులభంగా అందుబాటులో ఉండే చక్కని ఉద్యానవనంలో ఉండే వారి పరిస్థితి ఏదెను వనం వెలుపటి కష్టపరిస్థితులకు మారింది. దేవుడు ఆదాముకిలా చెప్పాడు: “నీవు నీ భార్యమాట విని—తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును.” నేల శపించబడడం అంటే దానినిప్పుడు సాగుచేయడం చాలా కష్టమని దాని భావం. ముండ్ల తుప్పలు, గచ్చపొదలతో శపించబడ్డ నేల ఆదాము సంతతిపై ఎంత ప్రభావం చూపిందంటే, నోవహు తండ్రియైన లెమెకు ‘భూమిని యెహోవా శపించినందువలన కలిగిన వారి చేతుల కష్టం’ గురించి మాట్లాడాడు.​—⁠ఆదికాండము 3:17-19; 5:29.

14 ఆదాము హవ్వలు ప్రశాంత జీవితానికి మారుగా కష్టాలపాలయ్యారు. దేవుడు హవ్వకిలా చెప్పాడు: “నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.” ఆ తర్వాత, ఆదాము హవ్వల ప్రథమ సంతానమైన కయీను తన సహోదరుడైన హేబెలును హత్యచేసి క్రూరంగా ప్రవర్తించాడు.​—⁠ఆదికాండము 3:16; 4:8.

15 “లోకమంతయు దుష్టుని యందున్నదని” అపొస్తలుడైన యోహాను ప్రకటించాడు. (1 యోహాను 5:​19) నేటి ప్రపంచం దాని పరిపాలకునిలానే, స్వార్థం, అహంకారం చేరివున్న దుష్ట లక్షణాలను కనబరుస్తోంది. అందువల్ల అది కఠినత్వంతో, క్రూరత్వంతో నిండి ఉందంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు! అయితే అది ఎప్పటికీ అలాగే ఉండదు. కఠినత్వం, క్రూరత్వాలకు బదులు తన రాజ్యంలో దయాకనికరాలు విలసిల్లేలా యెహోవా చర్య తీసుకుంటాడు.

దేవుని రాజ్యం క్రింద దయ విలసిల్లుతుంది

16 యెహోవా, ఆయన రాజ్యానికి నియమించబడిన రాజైన క్రీస్తు యేసు వారి ప్రజలు కనికరంగలవారిగా గుర్తించబడాలని కోరుతున్నారు. (మీకా 6:​8) తండ్రి తనకు అప్పగించిన పరిపాలన ఎలా దయతో గుర్తించబడినదిగా ఉంటుందో చూపే పూర్వఛాయను యేసుక్రీస్తు మనకిచ్చాడు. (హెబ్రీయులు 1:⁠3) ప్రజలపై మోయలేని భారం మోపిన అబద్ధ మతనాయకుల బండారం బయటపెట్టిన యేసు మాటల్లో దీనిని గమనించవచ్చు. ఆయనిలా అన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:​28-30) మతపరంగా లేదా ఇతరత్రావున్న భూపాలకుల్లో దాదాపు అందరూ, మోయలేని అనేక నియమాలతో, కృతజ్ఞతే ప్రదర్శించబడని పనుల భారంతో ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. కానీ యేసు తన అనుచరుల నుండి వారికి సంతృప్తినిచ్చే, వారికి సాధ్యమయ్యే వాటినే కోరుతున్నాడు. అది నిజంగా విశ్రాంతినిచ్చే సుళువైన కాడి! ఇతరులపట్ల దయ చూపించడంలో మనం ఆయనలా ఉండాలని పురికొల్పబడడం లేదా?​—⁠యోహాను 13:15.

17 యేసు తన అపొస్తలులతో గట్టిగా చెప్పిన మాటలు మానవ పరిపాలన నుండి దేవుని రాజ్యపాలన ఎంత విభిన్నంగా ఉంటుందో నొక్కిచెబుతున్నాయి. బైబిలు ఇలా చెబుతోంది: “తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో [శిష్యుల్లో] పుట్టగా ఆయన వారితో ఇట్లనెను—అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.”​—⁠లూకా 22:24-27.

18 మానవ పరిపాలకులు ప్రజలపై ‘ప్రభుత్వం’ చేయడం ద్వారా, గొప్ప బిరుదులు తాము ఎవరిపైనైతే పరిపాలన చేస్తున్నారో వారికంటే తమను ఉన్నతులను చేస్తాయన్నట్లుగా వాటిని పొందడానికి ప్రయత్నించడం ద్వారా, తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజమైన గొప్పతనం ఇతరులకు పరిచర్య చేయడం ద్వారా అంటే సేవచేయడానికి పట్టుదలతో కృషిచేయడం ద్వారా వస్తుందని యేసు చెప్పాడు. పరలోకంలో క్రీస్తుతో పరిపాలన చేసేవారందరు లేదా ఈ భూమ్మీద ఆయన ప్రతినిధులుగా సేవచేసేవారు వినయం, దయ చూపిన ఆయన మాదిరిని అనుసరించడానికి తప్పక కృషిచేయాలి.

19 యేసు ఇచ్చిన మరో ప్రేమపూర్వక ఉపదేశాన్ని మనం చూద్దాం. యెహోవా దయా విస్తారతను చూపిస్తూ యేసు ఇలా చెప్పాడు: “మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా మీకు మేలు చేయువారికే మేలుచేసినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఆలాగే చేతురు గదా. మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.” (ఇటాలిక్కులు మావి.)​—⁠లూకా 6:32-36.

20 దైవిక దయ నిస్వార్థమైనది. అది తిరిగి దేనినీ అడగదు, దేనినీ అపేక్షించదు. యెహోవా దయతో “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:43-45; అపొస్తలుల కార్యములు 14:​16, 17) మన పరలోకపు తండ్రిని అనుకరిస్తూ కృతజ్ఞత చూపని వారికి, మనకు విరోధంగా పనిచేసిన వారికి సైతం హాని చేయడానికి బదులు మేలు చేసేవారిగా ఉంటాం. దయను ప్రదర్శించడం ద్వారా, మానవ సంబంధాలన్నింటిలో దయ, ఇతర దైవిక లక్షణాలు వ్యాపించివుండే దేవుని రాజ్యం క్రింద జీవించే కోరిక మనకుందని యెహోవాకు, యేసుకు మనం చూపిస్తాం.

దయను ఎందుకు చూపించాలి?

21 నిజ క్రైస్తవుడు దయ చూపించడం చాలా ప్రాముఖ్యం. అది దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందనడానికి రుజువు. అంతేకాకుండా, మనం నిజమైన దయను కనబరచినప్పుడు, మనం యెహోవా దేవుణ్ణి, క్రీస్తు యేసును అనుకరిస్తాం. అంతేగాక దేవుని రాజ్య ప్రజలుగా ఉండేవారు దయ చూపించడం ఆవశ్యకం. కాబట్టి, మనం దయను ప్రేమిస్తూ, దానిని ప్రదర్శించడం నేర్చుకోవాలి.

22 మన దైనందిన జీవితంలో దయ చూపించగల ఆచరణాత్మక మార్గాలు కొన్ని ఏవి? ఆ అంశాన్ని తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 3 తెలుగు బైబిలులో, దయ అని అనువదించబడిన మూలభాషా పదం అనుగ్రహము, కనికరము, కృప, దయాళుత్వము అని కూడా అనువదించబడింది.

మీరెలా సమాధానమిస్తారు?

దయ అంటే ఏమిటి?

లోకమెందుకు కఠినంగా, క్రూరంగా ఉంది?

దేవుని పరిపాలన క్రింద దయ విలసిల్లుతుందని మనకెలా తెలుసు?

దేవుని రాజ్యం క్రింద జీవించాలని కోరుకునేవారు దయ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యెహోవా తన ప్రజలు దయ చూపించాలని ఆశిస్తాడంటే దానికి మనమెందుకు ఆశ్చర్యపడకూడదు? (బి) దయకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు మనం పరిశీలించదగినవిగా ఉన్నాయి?

3. దయను మీరెలా నిర్వచిస్తారు?

4. మానవజాతిపట్ల దయ చూపించడానికి యెహోవా ఎలా చొరవ తీసుకున్నాడు?

5. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఇతరులపట్ల ఎందుకు దయ చూపించాలి?

6. దయ ఎప్పుడు ఒక బలహీనతగా ఉంటుంది, దానికి కారణమేమిటి?

7. (ఎ) ఏలీ అలక్ష్యపరుడని ఎలా నిరూపించుకున్నాడు? (బి) పెద్దలు అనుచిత దయ చూపించకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?

8. నిజమైన దయను యేసు ఎలా ప్రదర్శించాడు?

9. దీర్ఘశాంతంతో, మంచితనంతో దయకు ఎలాంటి సంబంధముంది?

10. దయ మరియు ప్రేమ ఎలా ముడిపెట్టబడ్డాయి?

11. దేవుని ప్రేమపూర్వక దయ ఎలాంటి హామీ ఇస్తోంది?

12. ప్రజాపీడిత పరిపాలన ఎప్పుడు, ఎలా ఆరంభమైంది?

13-15. (ఎ) యెహోవా నీతియుక్తమైన పరిపాలనను తృణీకరించడంవల్ల కలిగిన కొన్ని పర్యవసానాలేమిటి? (బి) ఈ ప్రపంచమెందుకు కఠినంగా ఉంది?

16. దేవుడు క్రీస్తు యేసు మూలంగా చేసే పరిపాలన ఎందుకు దయచేత గుర్తించబడింది, ఇది మనపై ఎలాంటి బాధ్యతనుంచుతోంది?

17, 18. క్రీస్తుతో పరలోకంలో పరిపాలన చేసేవారు, ఈ భూమ్మీద ఆయన ప్రతినిధులుగా సేవచేసేవారు దయ చూపిస్తారని మనమెందుకు నమ్మవచ్చు?

19, 20. (ఎ) యెహోవా దయా విస్తారతను యేసు ఎలా తెలియజేశాడు? (బి) దయను ప్రదర్శించడంలో యెహోవాను మనమెలా అనుకరించవచ్చు?

21, 22. మనమెందుకు దయ చూపించాలి?

[13వ పేజీలోని చిత్రం]

మందతో వ్యవహరించేటప్పుడు క్రైస్తవ పెద్దలు దయ చూపించడానికి కృషిచేస్తారు

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా ప్రేమపూర్వక దయ కష్ట సమయాల్లో ఆయన సేవకులను నిరాశపరచదు

[16వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దయతో మానవులందరిపై సూర్యుని ఉదయింపజేసి, వర్షం కురిపిస్తున్నాడు