కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమిపై దేవుని చిత్తం నెరవేరే సమయం

భూమిపై దేవుని చిత్తం నెరవేరే సమయం

భూమిపై దేవుని చిత్తం నెరవేరే సమయం

“నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించినప్పుడు ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన పరలోకంలో తండ్రితోపాటు జీవించాడు. (మత్తయి 6:9-10; యోహాను 1:17-18; 3:12-13; 8:​41-42) యేసు మానవుడిగా భూమిపైకి రాకముందు, అటు పరలోకంలో ఇటు భూలోకంలో ప్రతీదీ దేవుని చిత్తానికి అనుగుణంగా జరగడం కళ్లారా చూశాడు. అవి పరిపూర్ణమైన, సంతృప్తికరమైన, ఆనందకరమైన కాలాలుగా ఉండేవి.​—⁠సామెతలు 8:27-31.

దేవుని మొదటి సృష్టికార్యాల్లో ఆత్మ సంబంధ ప్రాణులు, అంటే ‘ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులైన దేవదూతలున్నారు.’ వారు ‘ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులుగా’ ఉండేవారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. (కీర్తన 103:​20, 21) వారందరికీ స్వేచ్ఛా చిత్తముండేదా? అవును ఉండేది, ఎందుకంటే ఈ భూమి సృష్టించబడినప్పుడు ఈ “దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు” చేశారు. (యోబు 38:⁠7) వారు చేసిన ఆ జయధ్వనులు దేవుడు సంకల్పించిన దానిపట్ల వారి వ్యక్తిగత సంతోషాన్ని ప్రతిబింబించాయి, వారు తమ స్వేచ్ఛా చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మలచుకున్నారు.

భూమిని సృష్టించిన తర్వాత, దేవుడు దానిని మానవ నివాస యోగ్యంగా సిద్ధంచేసి, ఆఖరున ఆయన మొదటి స్త్రీపురుషులను సృష్టించాడు. (ఆదికాండము, 1వ అధ్యాయం) ఇది కూడా జయధ్వనులు చేయదగ్గ కార్యమేనా? ప్రేరేపిత వృత్తాంతమిలా చెబుతోంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను,” అవును అది లోపరహితంగా, పరిపూర్ణంగా ఉంది.​—⁠ఆదికాండము 1:31.

మన మొదటి తల్లిదండ్రుల విషయమై, వారి సంతానం విషయమై దేవుని చిత్తమేమిటి? ఆదికాండము 1:⁠28 ప్రకారం ఇది కూడా చాలమంచిదిగ ఉంది. అదిలా చెబుతోంది: “దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా—మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” ఆ అద్భుతమైన ఆజ్ఞను నెరవేర్చడానికి, మన మొదటి తల్లిదండ్రులు అలా జీవిస్తూనే అంటే నిత్యం జీవిస్తూనే ఉండాలి, అలాగే వారి సంతానం కూడా. విషాదం, అన్యాయం, హృదయవేదన లేదా మరణం మచ్చుకైనా అక్కడ లేవు.

అది అటు పరలోకంలో ఇటు భూమిపై దేవుని చిత్తం నెరవేరుచున్న కాలం. ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించే వారందరూ అలా జీవించడంలో ఆనందించారు. అయితే ఎక్కడ తప్పు జరిగింది?

దేవుని చిత్తం విషయంలో ఊహించని సవాలు ఎదురైంది. అది పరిష్కరించలేని సవాలు కాదు. అయితే అది మానవాళిపట్ల దేవుని చిత్తం విషయంలో గందరగోళం సృష్టించే హృదయవేదనను, దుఃఖాన్ని కలిగించే సుదీర్ఘ కాలాన్ని ప్రవేశపెట్టింది. ఈ కష్టాలకు మనమందరం బలిపశువులమయ్యాం. ఆ సవాలేమిటి?

తిరుగుబాటు కాలంలో దేవుని చిత్తం

మానవాళికి సంబంధించి దేవుని చిత్తం విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఒక “దేవదూత” గమనించాడు, స్వార్ధపూరితంగా ప్రయోజనాలు పొందాలనేదే అతని ఉద్దేశం. ఆ ఆత్మసంబంధ ప్రాణి ఆ విషయాన్ని గురించి ఆలోచించేకొద్దీ, అది అతనికి మరింత ఆకర్షణీయంగా, సాధించగలిగేదిగా కనిపించింది. (యాకోబు 1:​14, 15) మొదటి మానవ దంపతులు దేవుని మాట వినే బదులు తనమాట వినగలిగేలా తాను చేయగలిగితే, దేవుడు ప్రత్యర్థ సర్వాధిపత్యాన్ని సహించక తప్పదని అతడు ఆలోచించి ఉండవచ్చు. దేవుడు మొదటి మానవులను సంహరిస్తే ఆయన సంకల్పం విఫలమైందనే భావమిస్తుంది. కాబట్టి, దేవుడు వారిని సంహరించడనే అతడు తలంచి ఉంటాడు. బదులుగా, యెహోవా దేవుడు తను సృష్టించిన మానవులు ఇప్పుడు లోబడుతున్న ఈ ఆత్మసంబంధ కుమారుని స్థానం అంగీకరిస్తూ తన సంకల్పంలో మార్పులు తీసుకురావాలి. ఆ తిరుగుబాటుదారుడు ఆ తర్వాత సాతాను అని పిలువబడడం సరైనదే, ఆ పేరుకు “ఎదిరించువాడు” అని అర్థం.​—⁠యోబు 1:6.

సాతాను తన కోరిక చొప్పున ప్రవర్తిస్తూ హవ్వను సమీపించాడు. దేవుని చిత్తాన్ని లక్ష్యపెట్టవద్దని, నైతికంగా మరింత స్వేచ్ఛ పొందమని బలవంతపెడుతూ అతడు, “మీరు చావనే చావరు. . . . మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె [దేవునివలె] ఉందురని” ఆమెకు చెప్పాడు. (ఆదికాండము 3:​1-5) ఆ స్త్రీకి అది మరింత స్వేచ్ఛనిచ్చేదిగా కనిపించింది కాబట్టి ఆమె సాతాను మాటలు వినడం ద్వారా మెరుగైన జీవిత విధానం స్వంతం చేసుకోవచ్చని నమ్మింది. తన మాట వినేలా ఆ తర్వాత ఆమె తన భర్తను ఒప్పించింది.​—⁠ఆదికాండము 3:6.

ఆ దంపతులపట్ల దేవుని చిత్తమది కాదు. అది వారి చిత్తమే అంటే వారు తమ ఇష్టానుసారం చేసుకున్నదే. అది విపత్కర పరిస్థితులు తీసుకొస్తుంది. అలాంటి విధానం వారి మరణానికి దారితీస్తుందని దేవుడు వారికి ముందే చెప్పాడు. (ఆదికాండము 3:⁠3) దేవుని నుండి వేరై స్వేచ్ఛగా ఉండి విజయం సాధించేలా వారు సృష్టించబడలేదు. (యిర్మీయా 10:​23) దానికితోడు వారు అసంపూర్ణులవుతారు, వారి అసంపూర్ణత, మరణం ఇక వారి సంతానానికి సంక్రమిస్తాయి. (రోమీయులు 5:​12) అయితే సాతాను ఈ ప్రభావాలను తొలగించలేకపోయాడు.

ఈ పరిణామాలు మానవాళిపట్ల, ఈ భూమిపట్ల దేవుని సంకల్పాన్ని లేదా చిత్తాన్ని శాశ్వతంగా మార్చివేశాయా? లేదు. (యెషయా 55:​9-11) కానీ పరిష్కరించబడవలసిన ఈ వివాదాంశాలను అవి లేవనెత్తాయి: సాతాను చెప్పినట్లు మానవులు ‘మంచిచెడ్డలను ఎరిగినవారై దేవునివలె’ ఉండగలరా? మరోవిధంగా చెప్పాలంటే, తగినంత సమయమిస్తే, జీవిత రంగాలన్నింటిలో మంచి చెడ్డలేమిటో, మేలు కీడులేమిటో స్వయంగా మనమే తీర్మానించుకోగలమా? దేవుడు సంపూర్ణ విధేయతకు అర్హుడా, ఆయన పరిపాలనా విధానమే శ్రేష్ఠమైనదా? ఆయన చిత్తానికి పూర్తిగా లోబడాలా? ఈ ప్రశ్నలకు మీ సమాధానమేమిటి?

బుద్ధిసూక్ష్మతగల సృష్టి ప్రాణులందరి ఎదుట ఈ వివాదాంశాలను పరిష్కరించే మార్గం ఒకటే ఉంది. అదేమిటంటే, స్వేచ్ఛ కావాలనుకున్న వారిని విజయం సాధించగలరేమో ప్రయత్నించడానికి అనుమతించడమే. వారిని సంహరించినంత మాత్రాన ఆ వివాదాంశాలు పరిష్కరించబడవు. తాము ఎంచుకున్న మార్గంలో నడిచేందుకు మానవాళిని తగిన కాలం వరకు అనుమతించడమే సమస్యలను పరిష్కరిస్తుంది. అప్పుడే దేవుని నుండి స్వేచ్ఛను కోరుకోవడంవల్ల కలిగే ఫలితాలు తేటతెల్లమవుతాయి. ఆ స్త్రీకి పిల్లలు పుడతారని దేవుడు చెప్పినప్పుడు తాను ఈ విధంగా వివాదం పరిష్కరిస్తానని ఆయన సూచించాడు. అలా మానవ కుటుంబం మొదలవుతుంది. దేవుడు తీసుకొన్న ఆ నిర్ణయం కారణంగానే మనం నేడు సజీవులుగా ఉన్నాం!​—⁠ఆదికాండము 3:16, 20.

అయితే మానవులు, తిరుగుబాటుదారుడైన ఆ ఆత్మసంబంధ కుమారుడు పూర్తిగా వారి ఇష్టానుసారం చేయడానికి దేవుడు అనుమతిస్తాడని దానర్థం కాదు. దేవుడు తన సర్వాధిపత్యాన్ని ఉపేక్షించలేదు, లేదా తన సంకల్పాన్ని త్యజించలేదు. (కీర్తన 83:​18) తిరుగుబాటుకు సూత్రధారి అయినవాడిని చివరకు నలగగొట్టి, చెడు ప్రభావాలన్నింటినీ నిర్మూలిస్తానని ప్రవచించడం ద్వారా ఆయన దీనిని స్పష్టం చేశాడు. (ఆదికాండము 3:​15) కాబట్టి మానవ కుటుంబానికి ప్రారంభం నుండే విడుదల వాగ్దానం చేయబడింది.

ఈ లోగా, మన మొదటి తల్లిదండ్రులు తమనుతాము, తమ భవిష్యత్‌ సంతానాన్ని దేవుని పరిపాలన నుండి దూరం చేసుకున్నారు. వారు తీసుకొన్న నిర్ణయంవల్ల కలిగే విషాదకర పరిణామాలన్నిటినీ దేవుడు అడ్డుకోవాలంటే, ప్రతీ సందర్భంలోను ఆయన వారిపై తన చిత్తాన్ని రుద్దాల్సివుంటుంది. అలా చేస్తే అది దేవుని నుండి వేరై స్వేచ్ఛగా జీవించే ప్రయత్నం చేయకుండా వాళ్ళను అడ్డుకున్నట్లే అవుతుంది.

అయితే ఆయా వ్యక్తులు దేవుని పరిపాలనను ఎంచుకోవచ్చు. అనుమతించబడిన ఈ మధ్యకాలంలో వారు ప్రజలపట్ల దేవుని చిత్తమేమిటో నేర్చుకొని సాధ్యమైనంత సన్నిహితంగా దానికి అనుగుణంగా జీవించవచ్చు. (కీర్తన 143:​10) అయితే, మానవులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలా లేదా అనే వివాదాంశం పరిష్కరించబడనంత కాలం వారు సమస్యలకు అతీతులు కారు.

మానవుల వ్యక్తిగత ఎంపికవల్ల కలిగే ప్రభావాలు ఆదిలోనే స్పష్టమయ్యాయి. మానవ కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టిన కయీను, “క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను” కాబట్టి అతను తన సహోదరుణ్ణి హతమార్చాడు. (1 యోహాను 3:​12) ఇది దేవుని చిత్తం కాదు, ఎందుకంటే దేవుడు కయీనును ముందే హెచ్చరించి, ఆ తర్వాత అతణ్ణి శిక్షించాడు. (ఆదికాండము 4:​3-12) కయీను సాతాను ప్రతిపాదించిన నైతిక స్వేచ్ఛను ఎంచుకొన్నాడు కాబట్టి అతను “దుష్టుని సంబంధి” అయ్యాడు. ఇతరులూ అలాగే చేశారు.

మానవ చరిత్రారంభంలో 1,500 సంవత్సరాల తర్వాత, “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” (ఆదికాండము 6:​11) భూమి నాశనం కాకుండా కాపాడడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవడం అవసరమైంది. భౌగోళిక జలప్రళయం తీసుకొచ్చి, ఒక నీతిమంతుని కుటుంబాన్ని అంటే నోవహును, ఆయన భార్యను, ఆయన కుమారులను, వారి భార్యలను సజీవంగా రక్షించడం ద్వారా దేవుడు చర్య తీసుకున్నాడు. (ఆదికాండము 7:⁠1) మనమందరం వారి సంతానమే.

అప్పటినుండి మానవ చరిత్రలో దేవుడు, తన చిత్తాన్ని తెలుసుకోవాలని యథార్థంగా కోరుకున్న వారికి మార్గనిర్దేశమిచ్చాడు. మార్గనిర్దేశం కోసం తనవైపు చూసే వారి కోసం తన సందేశాలను నమోదు చేయడానికి ఆయన విశ్వసనీయులైన పురుషులను ప్రేరేపించాడు. ఆ సందేశాలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి. (2 తిమోతి 3:​16) నమ్మకస్థులైన మానవులు తనతో సంబంధం కలిగి ఉండడానికి, తన స్నేహితులుగా ఉండడానికి ఆయన ప్రేమపూర్వకంగా అనుమతించాడు. (యెషయా 41:⁠8) దేవుని నుండి స్వేచ్ఛగావున్న ఈ వేలాది సంవత్సరాల్లో మానవాళి అనుభవించిన కష్టభరితమైన పరీక్షలను తాళుకోవడానికి అవసరమైన శక్తిని ఆయన వారికిచ్చాడు. (కీర్తన 46:1; ఫిలిప్పీయులు 4:​13) దీనంతటి విషయంలో మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలో గదా!

సంపూర్ణంగా ‘నీ చిత్తం నెరవేరును గాక’

మానవులపట్ల దేవుడు ఇప్పటివరకు చేసింది ఆయన సంపూర్ణ చిత్తం కాదు. క్రైస్తవ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:​13) ఈ సూచనార్థక భాష మానవాళిని పరిపాలించే ఒక కొత్త ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి లోబడే ఒక కొత్త మానవ సమాజాన్ని సూచిస్తోంది.

సవివరమైన భాషను ఉపయోగిస్తూ, దానియేలు ప్రవక్త ఇలా వ్రాశాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:​44) నేడున్న పనికిరాని వ్యవస్థయొక్క అంతం గురించి, దాని స్థానంలో స్థాపించబడే రాజ్యం లేదా దేవుని ప్రభుత్వం గురించి ఈ ప్రవచనం చెబుతోంది. అది ఖచ్చితంగా శుభవార్తే! నేటి లోకాన్ని దౌర్జన్యంతో నింపి, భూమిని మళ్ళీ నాశనం చేస్తామని బెదిరించే పోరాటాలు, స్వార్థం ఒకనాటికి గతించిపోతాయి.

ఇవి ఎప్పుడు జరుగుతాయి? యేసు శిష్యులు, ‘ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?’ అని అడిగారు. దానికి తానిచ్చిన జవాబులో భాగంగా యేసు వారికిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”​—⁠మత్తయి 24:3, 14.

ఈ ప్రకటనా పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందనేది జగమెరిగిన సత్యం. మీ ఇరుగు పొరుగున కూడా ఆ పని జరగడాన్ని బహుశా మీరు చూసేవుంటారు. దీస్‌ ఆల్సో బిలీవ్‌ అనే స్వీయ రచనలో ప్రొఫెసర్‌ ఛార్లెస్‌ ఎస్‌. బ్రాడెన్‌ ఇలా వ్రాశాడు: “యెహోవాసాక్షులు తమ సాక్ష్యంతో అక్షరార్థంగా ఈ భూమిని నింపేశారు. . . . రాజ్యసువార్తను వ్యాప్తి చేయడానికి యెహోవాసాక్షులు చూపినంత ఆసక్తిని, పట్టుదలను ప్రపంచంలోని మరే ఇతర మత గుంపూ కనబరచలేదు.” 230 కంటే ఎక్కువ దేశాల్లో దాదాపు 400 భాషల్లో సాక్షులు చురుకుగా ఈ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ ప్రవచనార్థక పని భౌగోళికంగా ఇంతలా క్రితమెన్నడూ నెరవేర్చబడలేదు. మానవ ప్రభుత్వాల స్థానంలో ఆ రాజ్యం స్థాపించబడే సమయమిప్పుడు ఆసన్నమైందనడానికివున్న అనేక రుజువుల్లో ఇది కూడా ఒకటి.

ప్రకటించబడుతుందని యేసు చెప్పిన ఆ రాజ్యమూ, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించమని ఆయన మనకు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని రాజ్యమూ ఒకటే. (మత్తయి 6:⁠9) అవును, మానవులపట్ల, ఈ భూమిపట్ల తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఉపయోగించే ఉపకరణమే ఆ రాజ్యం.

దీని భావమేమిటి? ప్రకటన 21:3, 4 వచనాలను జవాబు చెప్పనివ్వండి: “అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” అప్పుడు అటు పరలోకంలో ఇటు ఈ భూలోకంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరుతుంది. * దానిలో మీరూ ఉండాలని కోరుకోరా?

[అధస్సూచి]

^ పేరా 26 దేవుని రాజ్యం గురించి మీరింకా ఎక్కువ నేర్చుకోవాలని కోరుకుంటున్నట్లయితే, దయచేసి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా ఈ పత్రికలో 2వ పేజీలో ఇవ్వబడ్డ చిరునామాల్లో ఒక దానికి వ్రాయండి.

[5వ పేజీలోని చిత్రం]

దేవుని చిత్తం నుండి స్వేచ్ఛ విషాదాన్ని తెచ్చింది