కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీన క్రీడలు గెలుపుకున్న ప్రాముఖ్యత

ప్రాచీన క్రీడలు గెలుపుకున్న ప్రాముఖ్యత

ప్రాచీన క్రీడలు గెలుపుకున్న ప్రాముఖ్యత

“పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును.” “జట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.”​—⁠1 కొరింథీయులు 9:25; 2 తిమోతి 2:5.

అపొస్తలుడైన పౌలు ప్రస్తావించిన ఆటలు ప్రాచీన గ్రీకు నాగరికతలో ఒక ముఖ్యాంశంగా ఉండేవి. అలాంటి పోటీల గురించి, వాటిచుట్టూ అలుముకున్న వాతావరణం గురించి చరిత్ర మనకేమి చెబుతోంది?

ఇటీవలనే రోమ్‌లోని కొలొస్సియమ్‌లో, గ్రీసు దేశపు ఆటలకు సంబంధించి నైకీ​—⁠ఈల్‌ జోకో ఏ లా వీటోరియా (“నైకీ​—⁠ఆట మరియు గెలుపు”) అనే ప్రదర్శన నిర్వహించబడింది. * అక్కడ ప్రదర్శించబడినవి ఆ ప్రశ్నకు కొంతమేరకు జవాబిచ్చి క్రీడల విషయంలో క్రైస్తవ దృక్పథమేమిటో ఆలోచించే అవకాశమిచ్చాయి.

క్రీడల పురాతన చరిత్ర

క్రీడలకు గ్రీకు నాగరికతే మొదటిది కాదు. దాదాపు సా.శ.పూ. 8వ శతాబ్దంలోనే గ్రీకు కవి హోమర్‌, సైనిక సామర్థ్యానికీ క్రీడా పాటవానికీ అమిత విలువ ఇచ్చి, వీరోచిత ఆదర్శాలతో, పోటీ తత్వంతో ఉర్రూతలూగిన సమాజం గురించి వివరించాడు. గ్రీసుదేశపు పండుగలు మొదట్లో, వీరుల అంత్యక్రియలప్పుడు దేవతల గౌరవార్థం జరుపుకునే మత సంఘటనలతో ఆరంభమయ్యాయని ఆ ప్రదర్శన వివరించింది. ఉదాహరణకు, ఇప్పటికీ నిలిచివున్న గ్రీకు సాహిత్యాల్లో అతిపురాతన గ్రంథమైన హోమర్‌ వ్రాసిన ఇలియడ్‌, పాట్రోక్లోస్‌ అంత్యక్రియల ఆచారాలప్పుడు ప్రభువుల వంశానికి చెందిన యోధులు, ఆకిలిస్‌ సహచరులు తమ ఆయుధాలు పక్కనబెట్టి ముష్టి యుద్ధంలో, మల్ల యుద్ధంలో, డిస్క్‌ మరియు జావెలిన్‌ విసరడంలో, రథాల పరుగు పందేల్లో తమ ధైర్యసాహసాలు నిరూపించుకోవడానికి ఎలా పోటీపడ్డారో వర్ణిస్తోంది.

గ్రీసు దేశమంతటా అలాంటి పండుగలు జరిగేవి. “ఆ పండుగలు కల్పించిన ఆవశ్యకమైన అవకాశం మూలంగా గ్రీసు దేశస్థులు తమ దేవతలపట్ల గౌరవంతో, ఎడతెరిపిలేని తమ దౌర్జన్యపూరిత వివాదాలను ప్రక్కనబెట్టి, తమ విలక్షణమైన పోటీతత్వాన్ని శాంతిపూర్వకంగానే అయినా నిష్కపటంగా సాధించడానికి పాటుపడడం వైపుకు మళ్ళించడంలో సఫలులయ్యారు, అదే క్రీడల పోటీగా తయారయ్యింది” అని ఆ ప్రదర్శనకు సంబంధించిన ఒక పుస్తకం చెబుతోంది.

క్రీడల పోటీలద్వారా తమ దేవతలపట్ల భక్తి ప్రదర్శించడానికి అనేక నగరరాజ్యాలు ప్రజా ఆరాధనా కేంద్రాలవద్ద ఉమ్మడిగా సమకూడడం వాడుకగా తయారైంది. కొంతకాలానికి, అలాంటి నాలుగు పండుగలు అంటే జీయస్‌కు అంకితం చేయబడిన ఒలింపిక్‌ మరియు నీమీన్‌ క్రీడలు, అపొల్లోకు పోసిడోన్‌కు అంకితం చేయబడిన పైథియన్‌ మరియు ఇస్తుమియన్‌ క్రీడలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని చివరికి అవి గ్రీసు దేశపు పండుగల స్థాయికి చేరుకున్నాయి. అంటే గ్రీసు దేశపు నలుమూలల నుండి పోటీదారులు వాటిలో పాల్గొనే అవకాశముండేది. ఈ పండుగల సమయాల్లో బలులు అర్పించబడేవి, ప్రార్థనలు జరిగేవి అంతేగాక ఆ పండుగలు అత్యున్నత క్రీడా లేదా కళా పోటీల ద్వారా దేవతలనూ ఘనపరిచేవి.

అలాంటి పండుగల్లో అతిపురాతనమైనది, అత్యంత ప్రతిష్ఠాకరమైనది జీయస్‌ గౌరవార్థం ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపియాలో జరిగేది, అది మొదటిసారిగా సా.శ.పూ. 776లో జరిగినట్లు చెప్పబడుతోంది. ప్రాముఖ్యత విషయంలో రెండవ స్థానంలోవున్నది పైథియన్‌ పండుగ. ఇది ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధ పూజా స్థలమైన డెల్ఫీకి దగ్గరలో జరిగేది, ఈ పండుగలో కూడా క్రీడలు ఉండేవి. కావ్య సంగీతాల పోషకుడైన అపొల్లో గౌరవార్థం పాటలకు, నాట్యానికి ప్రాముఖ్యత ఇవ్వబడేది.

క్రీడాంశాలు

ఆధునిక క్రీడలతో పోలిస్తే, అక్కడ క్రీడాంశాలు పరిమితంగానే ఉండేవి, వాటిలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. ప్రాచీనకాల ఒలింపిక్‌ కార్యక్రమంలో ఎప్పుడూ పది క్రీడాంశాలకంటే ఎక్కువ ఉండేవి కావు. కొలొస్సియమ్‌లో ప్రదర్శించబడిన ప్రతిమలు, కుడ్యచిత్రాలు, మొజాయిక్‌లు, పింగాణీ కూజాల మీదున్న చిత్రాలు ఆ క్రీడాంశాల గురించి కొంత సమాచారమిచ్చాయి.

మూడు రకాల పరుగు పందేలు ఉండేవి, స్టేడియం, అంటే 200 మీటర్ల పరుగు; డబుల్‌ కోర్స్‌, అంటే నేటి 400 మీటర్ల పరుగులాంటిది; లాంగ్‌ రేస్‌, అంటే 4,500 మీటర్ల పరుగు పందెం. వీటిలో క్రీడాకారులు పూర్తి నగ్నంగానే పరుగెత్తేవారు, కసరత్తు చేసేవారు. పెంటథలాన్‌లో పోటీపడేవారు ఐదురకాల క్రీడాంశాల్లో అంటే పరుగులో, లాంగ్‌ జంప్‌లో, డిస్కస్‌, జావెలిన్‌ మరియు మల్ల యుద్ధంలో పాల్గొనేవారు. ఇతర పోటీల్లో ముష్టి యుద్ధం మరియు “వట్టి చేతి కణుపుల ముష్టి ఘాతాలతో, మల్ల యుద్ధంతో కూడుకున్న క్రూరమైన క్రీడగా” వర్ణించబడిన పాంక్రేషియమ్‌ ఉండేవి. ఆ తర్వాత చిన్నసైజు చక్రాలతో రెండు లేదా నాలుగు పిల్లగుర్రాలు లేదా పెద్ద గుర్రాలు లాగే పైకప్పులేని తేలికపాటి రథాలతో ఎనిమిది స్టేడియంల అంటే దాదాపు 1,600 మీటర్ల దూరపు రథాల పరుగుపోటీలు ఉండేవి.

ముష్టి యుద్ధాలు తీవ్ర హింసతో కొన్నిసార్లు ప్రాణాంతకంగా ఉండేవి. ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచేందుకు పోటీదారులు లోహపు సీలలు పొదిగిన తోలు పట్టీలు తమ పిడికిళ్లకు చుట్టుకునేవారు. స్ట్రాటొఫోంటే అనే పోటీదారుడు నాలుగు రౌండ్ల ముష్టి యుద్ధం తర్వాత అద్దంలో చూసుకుని తననుతాను ఎందుకు గుర్తుపట్టలేకపోయాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన ప్రతిమలు, మొజాయిక్‌లు ఈ ముష్టి యుద్ధం చేసేవారు తీవ్రంగా విరూపులయ్యే వారని రుజువు చేస్తున్నాయి.

మల్ల యుద్ధాల్లో నియమాలు శరీర పైభాగాన్ని ఒడిసి పట్టుకోవడాన్ని మాత్రమే అనుమతించేవి, తన ప్రత్యర్థిని మూడుసార్లు మొదట ఎవరు నేల కరిపించి కదలకుండా చేస్తారో వారే విజేత. దీనికి భిన్నంగా పాంక్రేషియమ్‌లో ఒడిసి పట్టుకునే విధానంలో ఎలాంటి నియమాలూ ఉండేవి కావు. పోటీదారులు తన్నుకోవచ్చు, ముష్టిఘాతాలు ప్రయోగించవచ్చు, కీళ్లు విరువవచ్చు. కళ్లు పీకడం, గీరడం, కొరకడం మాత్రమే నిషేధించబడ్డాయి. ప్రత్యర్థిని నేల కరిపించి కదలకుండాచేసి, దాసోహమనిపించడమే లక్ష్యం. దీనిని కొందరు “ఒలింపియా అంతటిలో ఇదే అత్యంత శ్రేష్ఠమైన క్రీడగా” పరిగణించారు.

ప్రాచీనకాలాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పాంక్రేషియమ్‌ సా.శ.పూ. 564లో ఒలింపిక్‌ చివరి పోటీలో జరిగిందని చెప్పబడింది. ఊపిరి ఆడనంతగా తన గొంతు నొక్కిపెట్టబడినప్పటికీ ఆరాహియోన్‌ తన ప్రత్యర్థి బొటనవ్రేలు కీలు తప్పించే తన ప్రయత్నం మానలేదు. చివరకు, అతని ప్రత్యర్థి బాధకు తాళలేక లొంగిపోయిన మరుక్షణమే ఆరాహియోన్‌ తన ప్రాణం విడిచాడు. న్యాయనిర్ణేతలు ఆరాహియోన్‌ శవాన్నే విజేతగా ప్రకటించారు!

క్రీడల్లో రథాల పరుగు పందేలు అత్యంత ప్రతిష్ఠాకరమైనవే కాకుండా అవి ప్రభువుల వంశానికి సంబంధించిన ప్రముఖుల్లో ప్రసిద్ధిగాంచాయి. ఎందుకంటే రథసారధిని కాదుగానీ రథం, గుర్రాల యజమానినే విజేతగా ప్రకటించేవారు. ఈ పోటీలో అత్యంత కీలక సమయాలు ఆరంభ సమయాలే, అప్పుడు రథాలు పంక్తుల్లోనే ఉండాలి, అంతేగాక పంక్తులకు రెండు చివరలలోనూ ఉండే స్తంభాల దగ్గర మలుపు తిరిగే ప్రతీసారీ రథాలు వాటి సంబంధిత పంక్తుల్లోనే ఉండాలి. క్రీడలో జరిగే పొరపాట్లు లేదా తప్పులవల్ల జరిగే ప్రమాదాలు ఈ క్రీడను మరింత ఆసక్తికరం చేసేవి.

బహుమానం

“పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందును.” (1 కొరింథీయులు 9:​24) అన్నింటికంటే ముఖ్యం గెలవడమే. అక్కడ వెండి లేదా కాంస్య పతకాలు లేవు, అంటే ద్వితీయ, తృతీయ స్థానాలు లేవు. “గెలుపు లేదా ‘నైకీ,’ క్రీడాకారుని అంతిమ లక్ష్యం. అతని సొంత భౌతిక, నైతిక విలక్షణతకు, తన సొంతపట్టణ గర్వకారణానికి అదే నిజమైన ప్రతిబింబంగా ఉంటుంది కాబట్టి గెలుపే అత్యంత ప్రాముఖ్యం” అని ఆ ప్రదర్శన వివరించింది. “అన్ని సందర్భాల్లో సర్వోత్కృష్టంగా ఉండడం నేను నేర్చుకున్నాను” అని హోమర్‌ వ్రాసిన వాక్యంలోనే ఆ దృక్పథపు సారాంశముంది.

గ్రీసు దేశపు ఆటల్లో విజేతకిచ్చే బహుమానం పూర్తిగా సూచనార్థకమైనది, అది కేవలం ఆకుల కిరీటమే. దానిని పౌలు “క్షయమగు కిరీటము” అని పిలిచాడు. (1 కొరింథీయులు 9:​25) అయినప్పటికీ, ఆ బహుమానానికి చాలా ప్రాధాన్యత ఉండేది. విజేతపై ప్రకృతి కుమ్మరించిన శక్తికి అది ప్రతీకగా ఉండేది. పూర్తి ఏకాగ్రతతో కృషిచేసి సంపాదించుకున్న ఆ గెలుపు దైవానుగ్రహం పొందడంతో సమానంగా పరిగణించబడేది. ప్రాచీనకాల శిల్పకారులు, చిత్రకారులు రెక్కలున్న గ్రీసు దేశపు గెలుపు దేవతయైన నైకీ స్వయంగా విజేతకు కిరీటం పెడుతున్నట్లు ఎలా ఊహించేవారో ప్రదర్శనలోని ఆయాభాగాలు తెలియజేశాయి. ఒలింపియాలో గెలవడం ఏ క్రీడాకారునికైనా అంతిమ లక్ష్యంగా ఉండేది.

ఒలింపిక్‌ కిరీటం అడవి ఒలీవ ఆకులతో చేయబడగా, ఇస్తుమియన్‌ కిరీటం పైన్‌ ఆకులతో, పైథియన్‌ లారెల్‌ ఆకులతో, నీమీన్‌ అడవి సీలరీ ఆకులతోను తయారు చేయబడేవి. వేరేచోట్ల ఆటలు ఏర్పాటుచేసే వారు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆకర్షించేందుకు డబ్బు లేదా ఇతర బహుమతులు ఇచ్చేవారు. ఆ ప్రదర్శనలో ప్రదర్శనకు పెట్టిన అనేక కూజాలు, ఎథేనా దేవత గౌరవార్థమై ఏథెన్సులో నిర్వహించిన పానథేనియాక్‌ ఆటల్లో ఇవ్వబడిన బహుమతులే. ఈ ప్రాచీనకాల కూజాల్లో మొదట ప్రశస్తమైన ఎటిక్‌ తైలం నింపబడి ఉండేది. అలంకరణగా ఈ కూజాలపై ఒక ప్రక్క ఆ దేవత చిత్రంతోపాటు “ఎథేనా పోటీదారుల బహుమతి” అనే మాటలుకూడా ఉన్నాయి. మరో ప్రక్క ఉన్నది బహుశా క్రీడాకారుడు గెలుచుకున్న ఆ ప్రత్యేక క్రీడాంశపు చిత్రీకరణ కావచ్చు.

గ్రీసు దేశపు నగరాలు తమ నగర క్రీడాకారుల క్రీర్తి ప్రతిష్ఠలనుబట్టి ఉల్లసిస్తే, ఆ క్రీడాకారుల విజయాలు వారి స్వసమాజాల్లో వారిని వీరపురుషులుగా చేశాయి. ఆ విజేతలు తిరిగిరావడాన్ని విజయోత్సవ ఊరేగింపులతో వేడుక చేసుకునేవారు. వారి విగ్రహాలు దేవతలకు కృతజ్ఞతార్పణగా నిలబెట్టబడేవి​—⁠సాధారణంగా మానవులకు ఇలాంటి ఘనత ఇవ్వబడేది కాదు​—⁠కవులు వారి వీరగాథల్ని ఆలపించేవారు. ఆ తర్వాత విజేతలకు ప్రజా ఉత్సవాల్లో అగ్రపీఠాలు ఇవ్వబడేవి, ప్రజా ధనంలోనుండి వారికి భరణం కూడా లభించేది.

వ్యాయామశాలలు, సంబంధిత క్రీడాకారులు

పౌరయోధుల వికాసానికి వ్యాయామక్రీడల పోటీ ఆవశ్యక అంశంగా పరిగణించబడేది. గ్రీసు దేశపు నగరాలన్నింటిలో సంబంధిత వ్యాయామశాలలు ఉండేవి, అక్కడ యువకులకు శారీరక శిక్షణతోపాటు మేధాసంబంధమైన, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కూడా బోధించబడేది. కసరత్తు కోసమైన విశాల స్థలాల చుట్టూ వ్యాయామశాలలు నిర్మించబడేవి, చుట్టూవున్న మండపాలు, పైకప్పుగల ఇతర ప్రాంతాలు గ్రంథాలయాలుగా, తరగతి గదులుగా ఉపయోగించబడేవి. పనిచేయడానికి బదులు విద్యకు సమయం కేటాయించగల సంపన్న కుటుంబాల యువకులు తరచూ అలాంటి కేంద్రాలకు వెళ్లేవారు. ఇక్కడ ఆటలకోసం క్రీడాకారులు శిక్షకుల సహాయంతో ఎక్కువ సమయం బాగా సిద్ధపడేవారు. ఆహార నియమాలతోపాటు ఈ శిక్షకులు వారిని లైంగిక ప్రలోభానికి దూరంగా ఉంచేవారు.

ఆదిమ గ్రీకు శిల్పాల రోమన్‌ నకళ్లే అత్యధికంగా ఉన్న ప్రాచీన క్రీడాకారుల మేలైన శిల్పాలు చూసే అవకాశాన్ని ఆ కొలొస్సియమ్‌ ప్రదర్శన సందర్శకులకు ఇచ్చింది. ప్రాచీన గ్రీకు ఆలోచనా విధానంలో శారీరక పరిపూర్ణత నైతిక పరిపూర్ణతకు సదృశ్యంగా ఉండడమే కాక అది కేవలం కులీనపాలకుల స్వాధీనంలోనే ఉన్నందువల్ల, విజేతలైన వివిధ క్రీడాకారుల చక్కని సౌష్ఠవంగల ఈ శరీరాకృతులు తత్వసంబంధ ఆదర్శానికి ప్రతీకగా ఉన్నాయి. రోమన్లు వాటిని కళాకృతులుగా పరిగణించడంవల్ల వాటిలో అనేక శిల్పాలను స్టేడియంలలో, స్నానాల గదుల్లో, భవంతుల్లో, రాజభవనాల్లో అలంకరణగా ఉంచారు.

రోమన్లకు హింసాత్మక దృశ్యాలంటే అన్ని సందర్భాల్లోనూ ఎక్కువ ఇష్టపడేవారు, అందువల్ల రోమ్‌లో నిర్వహించబడిన గ్రీసుదేశపు క్రీడలన్నింటిలోకి ముష్టి యుద్ధాలు, మల్ల యుద్ధాలు, పాంక్రేషియమ్‌ వంటివి హెచ్చుగా జనాదరణ పొందాయి. అలాంటి క్రీడలను రోమన్లు బలాబలాలు తేల్చుకోవడానికి ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగే పోటీగా కాకుండా కేవలం వినోదం అన్నట్లుగా పరిగణించేవారు. విద్యలో ఒక భాగంగా విశిష్ఠ క్రీడాయోధులు సమిష్టిగా భాగం వహించాలనే క్రీడల తొలి ఆలోచనకు స్వస్థిచెప్పబడింది. దానికి బదులుగా, రోమన్లు గ్రీకు ఆటలను స్నానానికిముందు చేసే ఆరోగ్య కసరత్తుగా లేదా గ్లాడియేటోరియల్‌ పోటీలవంటి కిందిస్థాయి ఆటగాళ్లు ఆడే ప్రేక్షకానంద క్రీడలుగా మార్చివేశారు.

క్రైస్తవులు మరియు ఆటలు

ఆ ఆటలను మొదటి శతాబ్దపు క్రైస్తవులు విసర్జించడానికి వాటికున్న మతస్వభావమే ఒక కారణంగా నిలిచింది, ఎందుకంటే “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?” (2 కొరింథీయులు 6:​14, 16) మరి నేటి క్రీడల విషయమేమిటి?

నిజమే, ఆధునిక క్రీడలు అన్య దేవతలను ఘనపరచవు. అయితే, ప్రాచీనకాలాల్లో ఉన్నట్లే కొన్ని క్రీడల్లో దాదాపు మతావేశంలాంటిది అలుముకొని ఉండడం నిజం కాదా? అంతేకాకుండా, ఇటీవలి కొన్ని సంవత్సరాల నివేదికలు చూపిస్తున్నట్లుగా, గెలవడానికి కొందరు క్రీడాకారులు తమ క్రీడా సామర్థ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యానికి హానికరమైన, చివరకు తమకు ప్రాణహాని కలిగించే డ్రగ్స్‌ తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు.

శరీర సంబంధ ఘనకార్యం క్రైస్తవులకు అంత విలువైనదేమీ కాదు. ‘అంతరంగ స్వభావానికి’ సంబంధించిన ఆధ్యాత్మిక లక్షణాలే దేవుని దృష్టిలో మనల్ని అందమైనవారిగా చేస్తాయి. (1 పేతురు 3:​3, 4) నేడు క్రీడల్లో భాగం వహించే వారందరికీ కాదుగానీ, చాలామందికే తీవ్రమైన పోటీ స్వభావం ఉందని మనకు తెలుసు. అలాంటి వారితో సహవసించడం ‘కక్షచేతనైనా, వృథాతిశయముచేతనైనా ఏమీ చేయకుండా వినయమైన మనస్సుతో ఉండుడనే’ లేఖన ప్రబోధాన్ని అనుసరించడానికి మనకు సహాయం చేస్తుందా? లేదా అలాంటి సహవాసం “ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు” తీసుకురాదా?​—⁠ఫిలిప్పీయులు 2:3; గలతీయులు 5:​19-21.

క్రీడాకారులు కలిసి ఆడే అనేక ఆధునిక క్రీడల్లో బలత్కారం ప్రబలే అవకాశం మెండుగా ఉంది. అలాంటి క్రీడలపట్ల ఆకర్షితులయ్యే ఎవరైనాసరే కీర్తన 11:5లోని ఈ మాటలు గుర్తుంచుకోవాలి: “యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.”

తగిన స్థానంలో ఉన్నప్పుడే శరీర సాధకం ఆనందమిస్తుంది, “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 తిమోతి 4:​7-10) అయితే ఆయన గ్రీకు ఆటల గురించి మాట్లాడినప్పుడు, క్రైస్తవులకు ఉండవలసిన ఆశానిగ్రహం, సహనంయొక్క ప్రాముఖ్యతను సముచితంగా ఉదహరించడానికే వాటిని ప్రస్తావించాడు. అన్నింటికంటే మిన్నగా పౌలు సంపాదించుకోవడానికి శ్రమించిన లక్ష్యం, దేవుడు అనుగ్రహించే నిత్యజీవమనే ‘కిరీటం’ పొందడమే. (1 కొరింథీయులు 9:24-27; 1 తిమోతి 6:​12) ఆ విషయంలో ఆయన మనకు ఒక ఆదర్శంగా ఉన్నాడు.

[అధస్సూచి]

^ పేరా 4 నైకీ అనే గ్రీకు పదానికి “గెలుపు” అని అర్థం.

[31వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పోరాటం ముగించిన ముష్టి యుద్ధ యోధుడు

సా.శ.పూ. 4వ శతాబ్దానికి చెందిన ఈ కాంస్య విగ్రహం ప్రాచీనకాల ముష్టి యుద్ధపు తీవ్ర ప్రభావాలను చూపిస్తోంది, రోమ్‌ ప్రదర్శనశాల వివరణ ప్రకారం, “తీవ్రపోరాటాల్లో పాల్గొనే ముష్టియుద్ధ వీరుని . . . ప్రతిఘటన ఆదర్శనీయమైనదిగా పొగడబడింది, అలాంటి పోరాటాల్లో ‘గాయానికి ప్రతిగాయం’ చేయబడేది.” అలాగే “గతపోరాట గాయాల మచ్చలకు తాజా పోరాట గాయాల మచ్చలు తోడయ్యేవి” అని కూడా ఆ వివరణ తెలియజేసింది.

[29వ పేజీలోని చిత్రం]

ప్రాచీన పోటీల్లో రథాల పరుగుపందెం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరుగాంచింది

[30వ పేజీలోని చిత్రం]

రెక్కలుగల గెలుపు దేవతయైన నైకీ స్వయంగా విజేతకు కిరీటం పెడుతున్నట్టు ప్రాచీనకాల చిత్రకారులు ఊహించారు