కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చీకటికొట్ల నుండి స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలకు

చీకటికొట్ల నుండి స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలకు

జీవిత కథ

చీకటికొట్ల నుండి స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలకు

లోటర్‌ వాల్టర్‌ చెప్పినది

తూర్పు జర్మనీకి చెందిన కమ్యూనిస్టు చీకటికొట్లలో క్షణమొక యుగంలా మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత, స్వేచ్ఛా మాధుర్యాన్ని, నా కుటుంబంతో వాత్సల్యపూరిత సహవాసాన్ని అనుభవించడానికి నేను ఒక్క క్షణం కూడా నిలువలేకపోయాను.

అయితే ఆరేళ్ల మా అబ్బాయి జొహెన్నాస్‌ ముఖంలో కనిపించిన కలవరాన్ని నేను ముందుగా ఊహించలేదు. గత మూడు సంవత్సరాలుగా వాడు నన్ను చూడలేదు. వాడికి నేను పూర్తిగా అపరిచితుణ్ణి.

మా అబ్బాయిలా కాకుండా నేను నా బాల్యంలో మా అమ్మానాన్నల ప్రేమానురాగాల మధ్య పెరిగాను. జర్మనీలోని కెమ్‌నిట్స్‌లోవున్న మా ఇంట్లో ఎప్పుడూ ఆప్యాయతానురాగాల వాతావరణం నెలకొని ఉండేది, అక్కడే నేను 1928లో పుట్టాను. మా నాన్నగారు మతంపట్ల తన అయిష్టతను బహిరంగంగానే వెల్లడి చేసేవారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఇరుపక్షాల “క్రైస్తవ” సైనికులు డిసెంబరు 25న అవతలి వారికి “క్రిస్మస్‌ శుభాకాంక్షలు” తెలుపుకొని, ఆ మరుసటి రోజే ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమయ్యేవారని ఆయన గుర్తుచేసుకునేవారు. ఆయన దృష్టిలో వేషధారణకు మారుపేరే మతం.

భ్రమ తొలిగి విశ్వాసం చోటుచేసుకుంది

సంతోషకరమైన విషయమేమిటంటే, నేనలాంటి ఆశాభంగానికి గురికాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి నాకు 17 ఏళ్లు, సైన్యంలో ప్రవేశించడాన్ని నేను తృటిలో తప్పించుకున్నాను. కానీ, ‘ఎందుకు ఇలా చంపుకోవడం? ఎవరిని నమ్మాలి? నిజమైన భద్రత ఎక్కడ లభిస్తుంది?’ లాంటి కలవరపరిచే ప్రశ్నలతో నేను చాలా బాధపడేవాణ్ణి. మేము నివసిస్తున్న తూర్పు జర్మనీ సోవియట్‌ ఆధీనంలోకి వచ్చింది. విధ్వంసకర యుద్ధంతో విసిగివేసారిన వారు న్యాయం, సమానత్వం, ఏకీభావం, శాంతి సంబంధాలవంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షించబడ్డారు. అనతికాలంలోనే ఇలాంటి అమాయకులు చాలామంది ఘోరమైన ఆశాభంగానికి గురయ్యారు. ఈసారి వారు మతంవల్ల కాదుగానీ రాజకీయాలవల్లనే ఆశాభంగానికి గురయ్యారు.

అలా నేను అర్థవంతమైన జవాబుల కోసం వ్యక్తిగతంగా అన్వేషిస్తున్న సమయంలోనే, యెహోవాసాక్షిగావున్న మా పెద్దమ్మ తన విశ్వాసం గురించి నాతో మాట్లాడింది. ఆమె నాకు బైబిలు ఆధారిత సాహిత్యమొకటి ఇచ్చింది, అది నేను మొదటిసారిగా మత్తయి 24వ అధ్యాయమంతా చదివేలా నన్ను పురికొల్పింది. మన కాలాల్ని “యుగసమాప్తి” కాలాలుగా గుర్తిస్తూ, మానవాళి సమస్యలకు మూలకారణమేమిటో సూచిస్తూ ఆ పుస్తకంలో ఇవ్వబడిన కారణయుక్తమైన ఒప్పింపజేసే వివరణలకు నేను ముగ్ధుణ్ణయ్యాను.​—⁠మత్తయి 24:3; ప్రకటన 12:⁠9.

త్వరలోనే నాకు యెహోవాసాక్షుల సాహిత్యాలు మరిన్ని లభించడంతో, వాటిని ఆత్రంగా చదివి నేను తీవ్రంగా వెదకుతున్న సత్యం నాకు లభించిందని గ్రహించాను. 1914లో యేసుక్రీస్తు పరలోకంలో రాజయ్యాడనీ, విధేయతగల మానవాళికి ఆశీర్వాదాలు తెచ్చేందుకు ఆయన త్వరలోనే భక్తిహీన శక్తులను జయిస్తాడనీ తెలుసుకోవడం నన్ను పులకరింపజేసింది. నేను తెలుసుకున్న మరో గొప్ప విషయం, విమోచన క్రయధనాన్ని నేను మరింత స్పష్టంగా అర్థంచేసుకోవడమే. అది యెహోవా దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించి, క్షమాపణ వేడుకునేలా అది నాకు సహాయం చేసింది. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు 4:​8లో ఇవ్వబడిన ప్రేమపూర్వక ఆహ్వానం నాపై బలమైన ప్రభావం చూపింది.

కొత్తగా అర్థంచేసుకున్న సత్యంపట్ల నాలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నప్పటికీ, నేను చెప్పింది అంగీకరించడానికి మా తల్లిదండ్రులు, మా అక్క మొదట ఇష్టపడలేదు. అయితే కెమ్‌నిట్స్‌కు దగ్గర్లో సాక్షుల చిన్నగుంపు జరుపుకునే క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలనే నా కోరికను అది అణగార్చలేదు. నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, మా తల్లిదండ్రులు, మా అక్క నాతోపాటు మొదటి కూటానికి హాజరయ్యారు! అది 1945/46 శీతాకాలం. ఆ తర్వాత మేము నివసిస్తున్న హార్‌తావ్‌లో బైబిలు అధ్యయన గుంపు ఏర్పాటు చేయబడినప్పుడు మా కుటుంబం క్రమంగా హాజరవడం ఆరంభించింది.

“నేను బాలుడనే”

ముఖ్యమైన బైబిలు సత్యాలు నేర్చుకోవడం, యెహోవా ప్రజలతో క్రమంగా సహవాసం చేయడం యెహోవాకు నా జీవితం సమర్పించుకోవడానికి దారితీయడంతో, నేను 1946 మే 25న బాప్తిస్మం తీసుకున్నాను. మా కుటుంబ సభ్యులు కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధిచెంది, చివరకు వాళ్ళు ముగ్గురూ నమ్మకమైన సాక్షులు కావడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మా అక్క ఇప్పటికీ కెమ్‌నిట్స్‌లోని ఒక సంఘంలో చురుకుగా సేవచేస్తోంది. మా అమ్మానాన్నలు 1965లో ఒకరు, 1986లో మరొకరు మరణించేంత వరకు విశ్వసనీయంగా సేవచేశారు.

నేను బాప్తిస్మం తీసుకున్న ఆరునెల్ల తర్వాత ప్రత్యేక పయినీరుగా సేవచేయడం ఆరంభించాను. అప్పుడే నేను, “సమయమందును అసమయమందును” పాటుపడుతూ నా జీవిత సేవను ప్రారంభించాను. (2 తిమోతి 4:⁠2) త్వరలోనే నాకు కొత్త సేవాధిక్యతలు లభించాయి. తూర్పు జర్మనీ మారుమూల ప్రాంతంలో పూర్తికాల సువార్తికుల అవసరం ఏర్పడింది. ఆ నియామకం చేపడతామని నేను మరో సహోదరుడు అడిగాం, కానీ అంతటి బాధ్యతగల సేవ చేపట్టడానికి నాకంత అనుభవం గానీ పరిణతి గానీ లేవని నేను భావించాను. నా వయస్సు అప్పటికింకా 18 సంవత్సరాలే కాబట్టి నేను కూడా యిర్మీయాలాగే ఇలా భావించాను: “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు.” (యిర్మీయా 1:⁠6) నేనిలా భయపడుతున్నప్పటికీ, బాధ్యతగల సహోదరులు దయతో మాకొక అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా మేమిద్దరం బ్రాండెన్‌బర్గ్‌ రాష్ట్రంలోని చిన్న పట్టణమైన బెల్‌జిగ్‌కు నియమించబడ్డాం.

ఆ ప్రాంతంలో ప్రకటించడం చాలా కష్టంగా ఉండేది, అయితే అది నాకు విలువైన శిక్షణనిచ్చింది. అనతికాలంలోనే, ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలు రాజ్య సందేశాన్ని అంగీకరించి యెహోవాసాక్షులయ్యారు. అయితే వారలా మారడం ఆ మారుమూల సమాజంలో లోతుగా పాతుకుపోయివున్న ఆచారాలకు, భయాలకు పూర్తి వ్యతిరేకమైనది. దానితో అటు క్యాథలిక్‌ ఇటు ప్రొటస్టెంట్‌ మతనాయకులు మొండిగా మమ్మల్ని వ్యతిరేకిస్తూ మేము చేస్తున్న ప్రకటనా పని మూలంగా మాపై లేనిపోని అబద్ధ ఆరోపణలు చేశారు. అయితే మార్గనిర్దేశం కోసం, రక్షణకోసం మేము యెహోవాపై నమ్మకం ఉంచడంవల్ల, ఆసక్తిగలవారు చాలామంది సత్యాన్ని హత్తుకొనేలా మేము సహాయం చేయగలిగాం.

అసహనీయతా మేఘాలు కమ్ముకోవడం

1948వ సంవత్సరం అటు ఆశీర్వాదాలను ఇటు ఊహించని కష్టాలను తెచ్చింది. మొదట, నేను తురింజియాలోవున్న రూడాల్‌స్టాడ్‌లో పయినీరు నియామకం అందుకున్నాను. అక్కడ నాకు చాలామంది నమ్మకమైన సహోదర సహోదరీలు పరిచయమయ్యారు, వారి సాంగత్యాన్ని నేనెంతో ఆనందించాను. మరో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం నాకు అదే సంవత్సరం జూలైలో లభించింది. కెమ్‌నిట్స్‌ సంఘంలో నేను కూటాలకు హాజరు కావడం మొదలుపెట్టినప్పటి నుండి నాకు పరిచయమున్న ఎరికా ఉల్‌మాన్‌ అనే నమ్మకమైన, చురుకైన క్రైస్తవ యువతిని నేను వివాహం చేసుకున్నాను. మేమిద్దరం కలిసి నా సొంత పట్టణమైన హార్‌తావ్‌లో పయినీరు సేవ చేపట్టాం. అయితే ఆరోగ్య సమస్యలవల్ల, ఇతర కారణాలవల్ల ఎరికా పూర్తికాల సేవను కొనసాగించలేకపోయింది.

యెహోవా ప్రజలకు అవి గడ్డుకాలాలు. ప్రకటించే పని మానేసి పూర్తికాల ఉద్యోగం చేపట్టడానికి నన్ను బలవంతం చేసే ప్రయత్నంలో కెమ్‌నిట్స్‌లోని లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు మా రేషన్‌ కార్డ్‌ను రద్దుచేశారు. మన పరిచర్యను ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించాలని విన్నవించుకొనేందుకు బాధ్యతగల సహోదరులు నా కేసును ఉపయోగించారు. కానీ దానిని త్రోసిపుచ్చి, నేను జరిమానా కట్టాలి లేదా 30 రోజులు జైలుశిక్ష అనుభవించాలి అని 1950 జూన్‌ 23న తీర్పు ఇచ్చారు. మేము ఆ నిర్ణయం మీద అప్పీలు చేశాము, అయితే పైన్యాయస్థానం మా అప్పీలును కొట్టివేసి నాకు జైలుశిక్ష విధించింది.

రాబోయే వ్యతిరేకతకు, విపత్కర సంక్షోభానికి అది కేవలం చిన్న సూచన మాత్రమే. ఒక నెలయినా గడవక ముందే అంటే 1950 సెప్టెంబరులో, సమాచార మాధ్యమాల ద్వారా అబద్ధపు ప్రచారం ముమ్మరంగా కొనసాగించిన తర్వాత కమ్యూనిస్టు పరిపాలన మా కార్యకలాపాలను నిషేధించింది. వేగంగా జరుగుతున్న మా అభివృద్ధి కారణంగా, మా తటస్థ వైఖరి కారణంగా మాపై, మతం ముసుగులో “సంశయాత్మక కార్యకలాపాలకు” పాల్పడుతున్న ప్రమాదకరమైన పాశ్చాత్య గూఢచారి వ్యవస్థకు చెందినవారనే ముద్రవేశారు. నిషేధం విధించబడిన ఆ రోజునే నేను జైల్లో ఉండగా ఇంటిదగ్గర నా భార్య నా కుమారుడైన జొహెన్నాస్‌కు జన్మనిచ్చింది. మంత్రసాని అడ్డుకుంటున్నప్పటికీ ఆగకుండా ప్రభుత్వ భద్రతా అధికారులు మా అపార్ట్‌మెంట్‌లో జొరబడి వారి ఆరోపణలు నిరూపించడానికి తగిన ఆధారాలకోసం ఇల్లంతా సోదాచేశారు. అయితే అలాంటివేవీ వారికి లభించలేదు. అయితే ఆ తర్వాత వారు ఒక ఇన్‌ఫార్మర్‌ను మా సంఘంలో ప్రవేశపెట్టడంలో కృతార్థులయ్యారు. అది నాతోపాటు బాధ్యతగల సహోదరులందరినీ 1953 అక్టోబరులో అరెస్టు చేయడానికి దారితీసింది.

చీకటి కొట్లలో

బంధించబడి మూడు నుండి ఆరు సంవత్సరాలపాటు జైలు శిక్షలు వేయబడిన తర్వాత మేము జ్వికావ్‌లోవున్న ఓస్టర్‌స్టీన్‌ భవనంలోని మురికి చీకటికొట్లలో చాలామంది సహోదరులను కలిశాం. అక్కడి నికృష్ట పరిస్థితుల మధ్యనూ, పరిణతిచెందిన సహోదరులతో సహవసించడం నిజంగా ఆనందంగా ఉండేది. మాకు స్వేచ్ఛలేదంటే దానర్థం ఆధ్యాత్మిక ఆహారం లేదని కాదు. ప్రభుత్వంచే తృణీకరించబడి, నిషేధించబడినప్పటికీ కావలికోట నేరుగా జైల్లోకి, మా గదుల్లోకి రహస్యంగా చేరవేయబడేది! ఎలా?

కొంతమంది సహోదరులు బొగ్గుగనుల్లో పనిచేయడానికి నియమించబడ్డారు, చెరసాలలో వేయబడని సాక్షులు అక్కడ వీళ్లను కలిసి పత్రికలిచ్చేవారు. అప్పుడు ఆ సహోదరులు ఆ పత్రికల్ని జైల్లోకి రహస్యంగా తీసుకొచ్చి, అక్కడున్న మా అందరికీ ఎంతో అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని నేర్పుగా అందజేసేవారు. ఈ విధంగా యెహోవా చూపిన శ్రద్ధను, నిర్దేశాన్ని అనుభవించడం నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది!

మేము 1954 చివరికల్లా భయంకరమైన టార్‌గావ్‌ జైలుకు పంపించబడ్డాం. అక్కడున్న సహోదరులు మేము వస్తున్నందుకు సంతోషపడ్డారు. అప్పటివరకు వారు పాత కావలికోట సంచికల్లోనుండి తాము గుర్తుంచుకున్న విషయాలనే వల్లెవేస్తూ ఆధ్యాత్మికంగా దృఢంగా నిలబడ్డారు. తాజా ఆధ్యాత్మిక ఆహారం కోసం వారెంత పరితపించిపోయారో! జ్వికావ్‌లో మేము అధ్యయనం చేసిన అంశాలు వారితో పంచుకోవడం ఇప్పుడు మా కర్తవ్యం. ప్రతిదినం నడిచేటప్పుడు మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోకూడదనే కఠిన నిషేధం ఉండగా మేమెలా వారితో ఆ అంశాలు పంచుకోగలం? అది మేమెలా చేయవచ్చో తెలియజేస్తూ ఆ సహోదరులు మాకు చక్కని సూచనలిచ్చారు, పైగా యెహోవా బలమైన రక్షణహస్తం మాకు తోడుగా ఉంది. స్వేచ్ఛ, అవకాశం ఉన్నప్పుడే శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయడం, ధ్యానించడం వంటివాటి ప్రాముఖ్యతను ఇది మాకు నేర్పింది.

ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం

యెహోవా సహాయంతో మేము స్థిరంగా నిలబడ్డాం. మా అందరికీ గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, మాలో చాలామందికి 1956 చివరికల్లా మన్నింపు లభించింది. చెరసాల ద్వారాలు తెరుచుకున్నప్పుడు మాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. అప్పటికి, మా అబ్బాయికి ఆరేళ్లు, తిరిగి నా భార్యను కలుసుకొని మా కొడుకును పెంచడం నాకు చెప్పలేని ఆనందాన్నిచ్చింది. కొద్దిరోజులు జొహెన్నాస్‌ నన్నొక కొత్త వ్యక్తిగా చూసినా, త్వరలోనే మా ఇద్దరి మధ్యా ఆప్యాయతానుబంధం నెలకొంది.

తూర్పు జర్మనీలోని యెహోవాసాక్షులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మా క్రైస్తవ పరిచర్యపట్ల, తటస్థ వైఖరిపట్ల పెరుగుతున్న విరోధ స్వభావంవల్ల మేమన్ని సందర్భాల్లో భయంతో అంటే ప్రమాదం, ఆరాటం, ఇరకాటాల పీడతో జీవించాల్సివచ్చింది. ఆ విధంగా, నేనూ ఎరికా కలిసి మా పరిస్థితిని జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా బేరీజు వేసుకొని, మేము కలవరంతో క్షీణించిపోకుండా ఉండాలంటే మరింత అనుకూల పరిస్థితులున్నచోటికి వెళ్లడం అవసరమని భావించాం. యెహోవాను సేవించడానికీ, ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడానికీ మాకు స్వేచ్ఛ కావాలని మేము కోరుకున్నాం.

మాకు 1957 వసంత ఋతువులో పశ్చిమ జర్మనీలోని స్టట్‌గార్ట్‌కు వెళ్లే అవకాశం లభించింది. అక్కడ సువార్త పని నిషేధించబడలేదు, మన సహోదరులతో మేము స్వేచ్ఛగా సహవసించగలిగాం. వారిచ్చిన ప్రేమపూర్వక మద్దతు చాలా గొప్పది. మేము ఏడు సంవత్సరాలు హేడెల్‌ఫిన్‌జెన్‌లో ఉన్న సంఘంతో గడిపాం. ఆ సంవత్సరాల్లో, మా అబ్బాయి పాఠశాల విద్య ఆరంభించి సత్యంలో మంచి ప్రగతి సాధించాడు. నాకు 1962 సెప్టెంబరులో వెయిస్‌బాడెన్‌నందు రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరయ్యే ఆధిక్యత లభించింది. జర్మన్‌ మాట్లాడే బైబిలు బోధకుల అవసరమున్న చోటికి నేను కుటుంబంతోసహా వెళ్లేందుకు అక్కడ నాకు ప్రోత్సాహమివ్వబడింది. దానిలో జర్మనీ స్విట్జర్లాండ్‌లకు చెందిన కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలకు

ఆ విధంగా, 1963లో మేము స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల మధ్యలో, అందమైన లూసెర్న్‌ సరస్సును ఆనుకునివున్న బ్రూనెన్‌ పట్టణంలోని ఒక చిన్న సంఘంతో కలిసి పనిచేయాలని మాకు నిర్దేశించబడింది. మాకది పరదైసులో ఉన్నట్టుగానే అనిపించింది. అక్కడ మేము స్థానిక జర్మన్‌ మాండలికానికి, స్థానిక జీవన విధానానికి, ప్రజల మనస్తత్వానికి అలవాటుపడవలసి వచ్చింది. ఏమైనప్పటికీ, శాంతికాముకులైన ఆ ప్రజలమధ్య పనిచేయడంలో ప్రకటించడంలో మేము ఆనందించాము. మేము బ్రూనెన్‌లో 14 సంవత్సరాలున్నాం. మా అబ్బాయి అక్కడే పెరిగాడు.

నాకు దాదాపు 50 సంవత్సరాలప్పుడు అంటే 1977లో తున్‌లోవున్న స్విట్జర్లాండ్‌ బెతెల్‌లో సేవచేసే ఆహ్వానం వచ్చింది. అది మేము ఊహించని ఆధిక్యతగా భావించి ఎంతో కృతజ్ఞతాభావంతో దానిని అంగీకరించాం. నేను నా భార్య బెతెల్‌ సేవలో 9 సంవత్సరాలు గడిపాం, దానిని మేము మా క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత ఆధ్యాత్మిక వికాసంలో ఒక ప్రత్యేక మైలురాయిగా గుర్తుపెట్టుకుంటాం. ఎల్లప్పుడూ యెహోవా “అద్భుత కార్యములను” అంటే గంభీరమైన బెర్నిస్‌ ఆల్ప్స్‌ పర్వతాలను చూస్తూ తున్‌లోని, దాని సమీప ప్రాంతాల్లోని స్థానిక ప్రచారకులతో కలిసి ప్రకటించడాన్ని కూడా మేము ఆనందించాం.​—⁠కీర్తన 9:1.

మరో ప్రాంతానికి వెళ్లడం

మేము 1986 ఆరంభంలో మరో ప్రాంతానికి వెళ్లాం. స్విట్జర్లాండ్‌ తూర్పు ప్రాంతంలోవున్న బుక్స్‌ సంఘానికి నియమించబడిన విస్తృతమైన సేవా ప్రాంతంలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేసే నియామకం మాకు లభించింది. మళ్లీ మేము మరో విభిన్నమైన జీవన విధానానికి అలవాటుపడాల్సి వచ్చింది. అయితే మేము ఎక్కడ చక్కగా ఉపయోగించబడగలమో అక్కడ యెహోవాను సేవించాలని కోరుకున్నాము, ఆ కోరికతో పురికొల్పబడి మేము ఈ కొత్త నియామకాన్ని ఆయన ఆశీర్వాదంతో చేపట్టగలిగాం. సంఘాలను సందర్శించి వాటిని బలపరచడానికి కొన్నిసార్లు నేను ప్రత్యామ్నాయ ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేశాను. 18 సంవత్సరాలు గడిచిపోయాయి, మేము ఇక్కడ గడిపిన కాలంలో ఈ ప్రాంతంలో ప్రకటనా పనిలో మాకు చాలా ఆనందకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. బుక్స్‌లోని సంఘం అభివృద్ధి చెందింది, ఐదు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన అందమైన రాజ్య మందిరంలో సమకూడడాన్ని మేము ఆనందిస్తున్నాం.

అత్యంత ఉదారతతో యెహోవా మా పట్ల శ్రద్ధ చూపించాడు. మేము మా జీవితపు శ్రేష్ఠమైన భాగాన్ని పూర్తికాల పరిచర్యలో గడిపాం, అయినా ఎప్పుడూ మాకేదీ కొదువకాలేదు. మా కుమారుడు, కోడలు, వారి పిల్లలు, అలాగే వారి పిల్లల కుటుంబాలు యెహోవా మార్గంలో నమ్మకంగా నడవడం చూసే ఆనందం, తృప్తి మాకు కలిగాయి.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నిశ్చయంగా మేము “సమయమందును అసమయమందును” యెహోవాను సేవించామని నేను భావిస్తున్నాను. నేను క్రైస్తవ పరిచర్యను చేపట్టడం నన్ను కమ్యూనిస్టు చెరసాలల చీకటికొట్ల నుండి స్విట్జర్లాండ్‌లోని మహాద్భుతమైన ఆల్ప్స్‌ పర్వతాలకు తీసుకెళ్లింది. నేను, నా కుటుంబం ఒక్క క్షణం కూడా మా నిర్ణయాన్ని బట్టి చింతించలేదు.

[28వ పేజీలోని బాక్సు]

“రెండు రకాల బాధితులు” హింసల్లో స్థిరంగా నిలబడ్డారు

తూర్పు జర్మనీ అని కూడా పిలువబడే జర్మన్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ (జిడిఆర్‌)లో యెహోవాసాక్షులు క్రూరమైన అణచివేతకు గురయ్యారు. 5,000 కంటే ఎక్కువమంది సాక్షులు తమ క్రైస్తవ పరిచర్య, తటస్థ వైఖరి కారణంగా లేబర్‌ క్యాంపులకు, నిర్బంధ కేంద్రాలకు పంపించబడ్డారని రికార్డులు చూపిస్తున్నాయి.​—⁠యెషయా 2:4.

వీరిలో కొందరు “రెండు రకాల బాధితులు” అని వర్ణించబడ్డారు. వారిలో దాదాపు 325 మంది నాజీ నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో ఖైదు చేయబడ్డారు. ఆ తర్వాత 1950వ దశాబ్దంలో స్టాజీ అంటే జిడిఆర్‌ స్టేట్‌ సెక్యూరిటీ సర్వీస్‌, వాళ్లను చంపే ఉద్దేశంతో ఖైదు చేసింది. కొన్ని జైళ్లు కూడా జంట జైళ్లుగా అంటే మొదట నాజీ జైళ్లుగా ఆ తర్వాత స్టాజీ జైళ్లుగా ఉపయోగించబడ్డాయి.

తీవ్ర హింస ప్రబలిన మొదటి దశాబ్దంలో అంటే 1950 నుండి 1961 వరకున్న కాలంలో హింస, కుపోషణ, వ్యాధి, వృద్ధాప్యం కారణంగా మొత్తం 60 మంది సాక్షులైన స్త్రీపురుషులు జైల్లోనే మరణించారు. పన్నెండు మంది సాక్షులకు జీవిత ఖైదు విధించబడింది, ఆ తర్వాత దానిని 15 సంవత్సరాల జైలుశిక్షకు తగ్గించారు.

నేడు, బెర్లిన్‌లోని పూర్వపు స్టాజీ ప్రధాన కార్యాలయంలో, యెహోవాసాక్షులను తూర్పు జర్మనీలో 40 సంవత్సరాలపాటు అధికారికంగా హింసించిన విషయాన్ని నొక్కితెలిపే దాఖలాలు శాశ్వతంగా ప్రదర్శించబడుతున్నాయి. అక్కడ ప్రదర్శించబడిన ఫొటోలు, వ్యక్తిగత వృత్తాంతాలు పరీక్షా సమయంలో నమ్మకంగా నిలబడిన ఈ సాక్షుల ధైర్యానికి, ఆధ్యాత్మిక బలానికి మౌన సాక్ష్యమిస్తున్నాయి.

[24, 25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

తూర్పు జర్మనీ

రూడాల్‌స్టాడ్‌

బెల్‌జిగ్‌

టార్‌గావ్‌

కెమ్‌నిట్స్‌

జ్వికావ్‌

[25వ పేజీలోని చిత్రం]

జ్వికావ్‌లోని ఓస్టర్‌స్టీన్‌ భవనం

[చిత్రసౌజన్యం]

Fotosammlung des Stadtarchiv Zwickau, Deutschland

[26వ పేజీలోని చిత్రం]

నా భార్య ఎరికాతో