మీరు ఒక మతంలో సభ్యులుగా ఉండాలా?
మీరు ఒక మతంలో సభ్యులుగా ఉండాలా?
‘దేవుణ్ణి నమ్మడం కోసం నేనొక మతంలో సభ్యునిగా ఉండాల్సిన అవసరం గానీ మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనవలసిన అవసరం గానీ లేదు!’ అనేకమంది ఏదైనా ఒక చర్చిలో లేదా మత సంస్థలో సభ్యులుగా ఉండే విషయంలో ఈ విధంగానే భావిస్తారు. వాస్తవానికి కొంతమంది తాము మతపరమైన కార్యానికి హాజరైనప్పటికంటే బయట ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే దేవునికి సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నామని అంటారు. దేవుణ్ణి నమ్మడానికి ఒక మత గుంపుతో లేదా సంస్థతో మిళితమై ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయం నేడు సర్వసాధారణం అయింది.
అయితే మరికొందరు దీనికి పూర్తి భిన్నంగా భావిస్తారు. దేవుని ఆమోదం ఉండాలంటే ఒక మతసంస్థలో సభ్యత్వం, దాని కార్యాల్లో పాల్గొనడం అవసరం మాత్రమే కాక చాలా ప్రాముఖ్యమని వారు వాదిస్తారు. దీన్నిబట్టి మతంతో మిళితమైవుండడం అనేది నిజంగా అవసరమా అనే ప్రశ్న, మతపరమైన గణాంకాలనో లేక మత సంబంధమైన ఇతర వాస్తవాలనో తెలుసుకునే విద్యాపరమైన ప్రశ్న కాదనీ, అది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనదనీ ద్యోతకమవుతోంది. ఏదేమైనా ఈ విషయం దేవునితో మనకున్న సంబంధంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఈ సభ్యత్వంపై దేవుని దృక్పథం ఏమిటో తెలుసుకోవడం మంచిది కాదా? ఈ విషయంలో మనం ఆయన వాక్యమైన బైబిలు నుండి ఏమి నేర్చుకోవచ్చు?
గతంలో దేవుడు ప్రజలతో వ్యవహరించిన విధానం
దాదాపు 4,400 సంవత్సరాల క్రితం, ఒక మహా జలప్రళయం మొత్తం భూమిని ముంచివేసింది. ఆ సంఘటన సులభంగా మరచిపోగలిగేది కాదు, ప్రపంచం నలువైపులా ప్రజల తొలి చరిత్రలో దాని గురించిన కథలు ఉన్నాయి. వివరాల్లో తేడా ఉన్నప్పటికీ ఆ కథలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి, కేవలం కొన్ని జంతువులు మరియు కొంతమంది మనుషులు మాత్రమే బ్రతికి బయటపడ్డారన్న వాస్తవమే వాటి సారాంశం.
జలప్రళయం నుండి బ్రతికి బయటపడ్డవారు కేవలం సమయం అనుకూలించి యాధృచ్చికంగా నాశనం నుండి తప్పించుకున్న వ్యక్తులా? కాదని బైబిలు వృత్తాంతం చూపిస్తోంది. రానున్న జలప్రళయం గురించి దేవుడు ఒక్కొక్క వ్యక్తికి చెప్పలేదన్నది గమనార్హం. ఆయన సమీపిస్తున్న ఆ జలప్రళయం గురించి నోవహుతో చెప్పాడు, ఆదికాండము 6:13-16; 2 పేతురు 2:5.
నోవహు తిరిగి తన సమకాలీనులను హెచ్చరించాడు.—అప్పుడు బ్రతికి బయటపడ్డవారు, సన్నిహితంగా కలిసివుంటున్న గుంపులో భాగమై ఉండడంవల్ల, దేవుడు నోవహుకు ఇచ్చిన మార్గదర్శకాన్ని స్వీకరించడానికి ఇష్టపడడంవల్ల మాత్రమే ప్రాణాలతో ఉండిపోయారు. జలప్రళయం నుండి ప్రాణాలతో బయటపడిన ఆ ఓడలోని జంతువులు కూడా ఈ గుంపుకు దూరంగా ఉండలేదు. జంతువుల ప్రాణ రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయడానికి నోవహుకు నిర్దిష్టమైన సలహాలు ఇవ్వబడ్డాయి.—ఆదికాండము 6:17-7:8.
శతాబ్దాల తర్వాత, నోవహు కుమారుడైన షేము వంశీయులు ఐగుప్తులో బానిసలయ్యారు. అయితే వారిని విడిపించి వారి పితరుడైన అబ్రాహాముకు తాను వాగ్దానం చేసిన దేశానికి వారిని తీసుకురావాలన్నది దేవుని సంకల్పం. ఈసారి కూడా, ఆ విషయం ప్రతీ ఒక్కరికి తెలియజేయబడలేదు, కానీ వారి నాయకులుగా ఎంపిక చేయబడిన మోషేకు ఆయన అన్న అహరోనుకు మొదట తెలియజేయబడింది. (నిర్గమకాండము 3:7-10; 4:27-31) గతంలో బానిసలుగా ఉన్నవారు ఐగుప్తు నుండి ఒక గుంపుగా విడుదలైన తర్వాత, సీనాయి పర్వతం దగ్గర వారికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడింది, ఇశ్రాయేలు ఒక జనాంగంగా రూపొందించబడింది.—నిర్గమకాండము 19:1-6.
ప్రతీ ఇశ్రాయేలీయుడు దేవుడు స్థాపించిన గుంపుతో సన్నిహితంగా ఉంటూ ఆ గుంపులోని నియమిత నాయకుల మార్గదర్శకాన్ని అనుసరించడంవల్లనే వారికి విడుదల సాధ్యమైంది. ఐగుప్తీయులు కూడా దేవుని ఆమోదం స్పష్టంగా ఉన్న ఆ గుంపుతో సహవసించే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది ఐగుప్తీయులు వారితోపాటు వెళ్ళారు, ఆ విధంగా వారికి దేవుని ఆశీర్వాదం పొందే అవకాశం లభించింది.—నిర్గమకాండము 12:37, 38.
ఆ తర్వాత మొదటి శతాబ్దంలో, యేసు తన ప్రకటనా పనిని ప్రారంభించి ప్రజలను తన శిష్యులుగా సమకూర్చాడు. ఆయన వారి వారి అవసరాలను బట్టి వ్యక్తిగతంగా ప్రేమపూర్వక శ్రద్ధ చూపించినప్పటికీ ఆయన వారితో ఒక గుంపుగానే వ్యవహరించాడు. నమ్మకస్థులైన 11 మంది అపొస్తలులతో యేసు ఇలా అన్నాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:28, 29) ఆ తర్వాత శిష్యుల మీదకు దేవుని పరిశుద్ధాత్మ రావడం వారు ఒక గుంపుగా ఉన్నప్పుడే జరిగింది.—అపొస్తలుల కార్యములు 2:1-4.
ఈ ఉదాహరణలు, గతంలో దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఒక సంస్థీకరించబడిన గుంపుగానే వ్యవహరించాడని స్పష్టంగా చూపిస్తున్నాయి. నోవహు, మోషే, యేసు, తదితరులైన కొందరు వ్యక్తులతోనే దేవుడు వ్యక్తిగతంగా వ్యవహరించాడు, వాస్తవానికి ఆయన వారిని సన్నిహితంగా ఉంటున్న గుంపుతో సంభాషించడానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు తన సేవకులతో నేడు మరో విధంగా వ్యవహరిస్తాడనడానికి ఏ కారణమూ లేదు. అయితే ఇది, ఏదోక మతగుంపుతో సహవసిస్తే సరిపోతుందా? అనే మరో ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నను మనం తర్వాతి ఆర్టికల్లో పరిశీలిద్దాం.
[4వ పేజీలోని చిత్రం]
పూర్వకాలం నుండే దేవుడు తన ప్రజలతో సంస్థీకరించబడిన ఒక గుంపుగా వ్యవహరించాడు