“అన్యుల స్వరము” విషయంలో జాగ్రత్త
“అన్యుల స్వరము” విషయంలో జాగ్రత్త
“అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవును.”—యోహాను 10:5.
పునరుత్థానం చేయబడిన యేసు ఖాళీగావున్న తన సమాధి దగ్గర ఒక స్త్రీ నిలబడి ఉండడం చూశాడు. ఆయనకు ఆమె బాగా తెలుసు. ఆమె మగ్దలేనే మరియ. దాదాపు రెండు సంవత్సరాల క్రితం, ఆమెకు పట్టిన దయ్యం నుండి ఆయన ఆమెను విముక్తురాలిని చేశాడు. అప్పటి నుండి ఆమె ఆయనను, ఆయన అపొస్తలులను వెంబడిస్తూ వారి దైనందిన అవసరాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ వచ్చింది. (లూకా 8:1-3) అయితే యేసు చనిపోవడం, పైగా ఆయన శరీరం కనబడకుండా పోవడం చూసి ఆమె భరించలేని వేదనతో ఏడుస్తూవుంది. అది చూసిన యేసు “అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆయన తోటమాలి అనుకుని ఆమె “అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని” జవాబిచ్చింది. అప్పుడు యేసు ఆమెను “మరియా అని” పిలిచాడు. ఆయన పిలిచిన తీరు విన్న వెంటనే ఆమె ఆయనను గుర్తిస్తూ ఆనందంతో ‘బోధకుడా!’ అని బిగ్గరగా పిలుస్తూ ఆయనను సమీపించింది.—యోహాను 20:11-18.
2 యేసు కొద్దికాలం క్రితం చెప్పిన విషయాన్ని ఈ వృత్తాంతం మనస్సును తాకేలా ఉదహరిస్తోంది. తనను గొర్రెల కాపరితో, తన అనుచరులను గొర్రెలతో పోలుస్తూ ఆ గొర్రెల కాపరి తన గొర్రెలను పేరుపెట్టి పిలుస్తాడనీ అవి ఆయన స్వరం గుర్తుపడతాయనీ చెప్పాడు. (యోహాను 10:3, 4, 14, 27, 28) అవును గొర్రెలు గొర్రెలకాపరి స్వరం గుర్తు పట్టినట్టుగానే, మరియ తన కాపరియైన క్రీస్తు స్వరం గుర్తుపట్టింది. ఇది నేటి యేసు అనుచరుల విషయంలోనూ వాస్తవమైయుంది. (యోహాను 10:16) గొర్రెల కాపరికి చేరువగా ఉండేందుకు గొర్రెల సునిశిత వినికిడి వాటికి సహాయం చేసినట్లే, మన ఆధ్యాత్మిక అవగాహన మన మంచి కాపరియైన యేసుక్రీస్తు అడుగుజాడల్లో సన్నిహితంగా నడవడానికి మనకు సహాయం చేస్తుంది.—యోహాను 13:15; 1 యోహాను 2:5, 6; 5:20.
3 అయితే అదే ఉపమానం ఉదహరించినట్లుగా మానవ స్వరాలను గుర్తించడంలో గొర్రెకున్న సామర్థ్యం, అది తన మిత్రుణ్ణే కాక శత్రువును కూడా గుర్తుపట్టడానికి సహాయం చేస్తుంది. మనకు వక్ర స్వభావంగల శత్రువులున్నారు కాబట్టి అలా గుర్తుపట్టడం మనకు చాలా ప్రాముఖ్యం. వాళ్లెవరు? వారెలా పనిచేస్తారు? మనల్ని మనమెలా రక్షించుకోవచ్చు? ఈ అంశాలు తెలుసుకోవడానికి, యేసు గొర్రెలమందకు సంబంధించిన తన ఉపమానంలో ఇంకా ఏమి చెప్పాడో చూద్దాం.
‘ద్వారమున ప్రవేశించనివాడు’
4 యేసు ఇలా వివరించాడు: “ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవును.” (యోహాను 10:2-5) యేసు “స్వరము” అనే మాటను మూడుసార్లు ఉపయోగించాడని గమనించండి. రెండుసార్లు ఆయన గొర్రెల కాపరి స్వరము గురించి మాట్లాడాడు, కానీ మూడవసారి ఆయన “అన్యుల స్వరము” గురించి మాట్లాడాడు. ఇక్కడ యేసు ఏ విధమైన అన్యుని గురించి మాట్లాడుతున్నాడు?
5 ఆతిథ్యమివ్వాలని మనమనుకునే అన్యుని గురించి యేసు ఇక్కడ మాట్లాడడం లేదు. ఎందుకంటే బైబిలు మూలభాషలో ఆతిథ్యమనే పదానికి “అన్యులను ప్రేమించడం” అనే భావముంది. (హెబ్రీయులు 13:1) యేసు ఉపమానంలో ప్రస్తావించబడిన అన్యుడు ఆహ్వానించబడిన అతిథి కాదు. అతడు “గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు.” వాడు “దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.” (యోహాను 10:1) దేవుని వాక్యంలో మొదట ప్రస్తావించబడిన, దొంగగా దోచుకొనేవాడిగా మారిన వ్యక్తి ఎవరు? అపవాదియగు సాతానే. దీనికి రుజువు మనం ఆదికాండములో చూస్తాము.
అన్యుని స్వరం మొదటిసారి వినబడిన సమయం
6 భూమి మీద మొదటిసారిగా అన్యుని స్వరమెలా వినబడిందో ఆదికాండము 3:1-5 వివరిస్తోంది. సాతాను మొదటి స్త్రీయైన హవ్వను సమీపించి ఒక పాము ద్వారా మోసపూరితంగా మాట్లాడాడని ఆ వృత్తాంతం వివరిస్తోంది, అయితే ఆ వృత్తాంతం సాతానును అక్షరార్థంగా “అన్యుడు” అని చెప్పలేదన్నది నిజమే. అయినప్పటికీ, అతడు అనేకరీతుల్లో యోహాను 10వ అధ్యాయంలోని యేసు ఉపమానంలో వర్ణించబడిన అన్యునిలాగే ఉన్నాడని అతని క్రియలు చూపిస్తున్నాయి. సారూప్యంగల కొన్ని క్రియల్ని పరిశీలించండి.
7 ఆ అన్యుడు గొర్రెలమందను దొడ్డిదారిలో సమీపిస్తాడని యేసు చెప్పాడు. అదే విధంగా, సాతాను పామును ఉపయోగించి తన ఎరయైన హవ్వను పరోక్షంగా సమీపించాడు. ఈ మోసపూరిత పన్నాగం సాతాను ఖచ్చితంగా దొడ్డిదారిన ప్రవేశించే దొంగని వెల్లడించింది. అంతేకాకుండా, గొర్రెలమందలో ప్రవేశించిన ఆ అన్యుడు గొర్రెల యజమాని వద్ద నుండి గొఱ్ఱెలను దోచుకోవడానికి వచ్చాడు. నిజానికి అతడు దొంగకంటే కూడా దుర్మార్గుడు, ఎందుకంటే “హత్యను, నాశనమును చేయ[డమే]” వాడి లక్ష్యం. (యోహాను 10:10) అదే విధంగా, సాతాను ఒక దొంగ. హవ్వను మోసగించి దేవునితో ఆమెకున్న సంబంధాన్ని అతడు దోచుకున్నాడు. అంతేకాక, సాతాను మానవులపైకి మరణం కూడా తెచ్చాడు. కాబట్టి వాడు నరహంతకుడు.
8 యెహోవా మాటలను, ఉద్దేశాలను వక్రీకరించిన విధానంలో సాతాను మోసం స్పష్టమైంది. ‘ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?’ అని అతడు హవ్వను అడిగాడు. ‘దేవుడు అంత అనుచితంగా ఎలా ఉండగలడు?’ అని అతడు మాట్లాడిన రీతిలో ఆమెకు తన విస్మయాన్ని వెలిబుచ్చాడు. అతడు ఇంకా, “మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని . . . దేవునికి తెలియునని” చెప్పాడు. ‘దేవునికి తెలుసు’ అని అతడు చెప్పడాన్ని ఆదికాండము 2:16, 17; 3:1, 5) విచారకరంగా, ఆదాము హవ్వలు ఆ అన్యుని స్వరానికి దూరంగా ఉండలేదు. బదులుగా వారు దానిని లక్ష్యపెట్టి తమకూ, తమ సంతానానికీ ఆపద తెచ్చుకున్నారు.—రోమీయులు 5:12, 14.
గమనించండి. నిజానికి ‘దేవునికేమి తెలుసో నాకు తెలుసు, ఆయన ఉద్దేశమేమిటో నాకు తెలుసు, ఆయన ఉద్దేశాలు చెడ్డవి’ అన్నట్లు సాతాను మాట్లాడాడు. (9 నేడు దేవుని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సాతాను అదేవిధమైన పద్ధతులను ఉపయోగిస్తున్నాడు. (ప్రకటన 12:9) అతడు “అబద్ధమునకు జనకుడు,” అతడిలాగే దేవుని సేవకులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే వారు అతని పిల్లలు. (యోహాను 8:44) నేడు ఈ అన్యుల స్వరం ఏయే విధాలుగా వినిపిస్తుందో కొన్ని విధానాలను మనం పరిశీలిద్దాం.
నేడు అన్యుల స్వరం వినబడే విధానం
10మోసకరమైన తర్కాలు. అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి.” (హెబ్రీయులు 13:9) అవి ఎలాంటి బోధలు? అవి మనల్ని ‘తిప్పివేయగలవు’ కాబట్టి, మన ఆధ్యాత్మికతను బలహీనపరిచే బోధలను పౌలు సూచిస్తున్నాడని స్పష్టమవుతోంది. అలాంటి అన్య బోధలను ఎవరు వినిపిస్తున్నారు? పౌలు క్రైస్తవ పెద్దల్లో కొందరికి ఇలా చెప్పాడు: “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:30) నిజమే పౌలు కాలంలోలాగే నేడు కూడా ఒకప్పుడు క్రైస్తవ సంఘంలో భాగస్థులైన కొందరు “వంకర మాటలు” అంటే అర్థ సత్యాలు, పచ్చి అబద్ధాలు చెబుతూ గొర్రెలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అపొస్తలుడైన పేతురు చెబుతున్నట్లుగా, వారు “కల్పనావాక్యములు” అంటే అవి సత్యమే అన్నట్లుగా ఉన్నప్పటికీ నకిలీ నోట్లలా పనికిరాని మాటలు మాట్లాడతారు.—2 పేతురు 2:3.
11 “భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” అని చెబుతూ పేతురు ఆ మతభ్రష్టుల విధానాలను మరింత స్పష్టం చేశాడు. (2 పేతురు 2:1, 3) గొర్రెల మందకు సంబంధించిన యేసు ఉపమానంలోని దొంగ ‘గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కినట్లే,’ మతభ్రష్టులు రహస్యంగా సమీపిస్తారు. (గలతీయులు 2:4; యూదా 4) వారి ఆశయమేమిటి? “మీవలన లాభము సంపాదించుకొందురు” అని పేతురు చెబుతున్నాడు. తమను సమర్థించుకోవడానికి మతభ్రష్టులు ఏమి చెప్పినప్పటికీ, దొంగచాటుగా ప్రవేశించేవారి నిజమైన ఆశయం కేవలం ‘దొంగతనము, హత్య, నాశనము’ చేయడమే. (యోహాను 10:10) అలాంటి అన్యుల విషయంలో జాగ్రత్త!
12హానికరమైన సహవాసులు. మనం సహవసించే 1 కొరింథీయులు 15:33) మొదటి మానవ జతలో వయస్సులో చిన్నది, తక్కువ అనుభవము గలది అయిన హవ్వను సాతాను లక్ష్యంగా చేసుకున్నాడని గుర్తుంచుకోండి. ఆమె స్వేచ్ఛకు యెహోవా అతిగా హద్దులు పెడుతున్నాడని ఆమెను నమ్మించాడు, అయితే అసలు విషయం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. యెహోవా తన మానవ సృష్టిని ప్రేమించాడు, వారి సంక్షేమం పట్ల శ్రద్ధ చూపించాడు. (యెషయా 48:17) అదే విధంగా నేడు ఆ అన్యులు, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల స్వేచ్ఛకు అతిగా హద్దులు పెడుతున్నారని వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి అన్యులు మీపై ఎలా ప్రభావం చూపించవచ్చు? ఒక క్రైస్తవ బాలిక ఇలా అంగీకరిస్తోంది: “నా తోటి విద్యార్థులవల్ల కొద్ది కాలంపాటు నా విశ్వాసం కొంతమేరకు బలహీనపడింది. నా మతం హద్దులు పెట్టేదనీ, అనుచితమైనదనీ వారు పోరుపెట్టి చెప్పారు.” కానీ వాస్తవమేమిటంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి మీ తోటి విద్యార్థులు మీ తల్లిదండ్రులపై అనుమానం పుట్టించడానికి ప్రయత్నిస్తే హవ్వలాగ మోసపోకండి.
వారి ద్వారా ఆ అన్యుల స్వరం వినబడవచ్చు. హానికరమైన సహవాసాలు ప్రత్యేకంగా యౌవనులను ప్రమాదంలో పడవేస్తాయి. (13 హానికరమైన సహవాసం గురించి కీర్తనకర్తయైన దావీదు ఇలా చెబుతున్నాడు: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను; వేషధారులతో పొందుచేయను.” (కీర్తన 26:4) మీరు అన్యుల విశిష్ఠ లక్షణమేమిటో గమనించారా? సర్పాన్ని ఉపయోగిస్తూ సాతాను ఎలా తన గుర్తింపును మరుగుచేశాడో అలాగే వారు తమ వేషధారణను లేదా నిజస్వరూపాన్ని బయటపడనివ్వరు. నేడు కొందరు దుర్నీతిపరులు ఇంటర్నెట్ను ఉపయోగిస్తూ తమ గుర్తింపును, తమ నిజ ఉద్దేశాలను దాచిపెడతారు. ఛాట్ రూమ్స్‌లో, మిమ్మల్ని ఉచ్చులోకి లాగడానికి వక్రబుద్ధిగల వృద్ధులు తమను యౌవనులుగా చెప్పుకుంటారు. యౌవనులారా, మీకు ఆధ్యాత్మిక హాని కలగకుండా, దయచేసి అత్యంత అప్రమత్తంగా ఉండండి.—కీర్తన 119:101; సామెతలు 22:3.
14అబద్ధ ఆరోపణలు. యెహోవాసాక్షులను గురించిన కొన్ని వార్తా నివేదికలు నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఆ వార్తా మాధ్యమాలే పక్షపాత వైఖరిగల అన్యుల స్వరాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, ఒక దేశంలోని ఒక వార్తాపత్రిక రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యెహోవాసాక్షులు హిట్లర్ పరిపాలనకు మద్దతిచ్చారని అబద్ధం చెప్పింది. మరో దేశంలో యెహోవాసాక్షులు చర్చీలను నాశనం చేస్తున్నారని ఒక నివేదిక ఆరోపించింది. అనేక దేశాల్లో వార్తా మాధ్యమాలు సాక్షులు తమ పిల్లలకు వైద్య చికిత్సను నిరాకరిస్తున్నారనీ, తోటి విశ్వాసులు చేసిన ఘోరమైన తప్పుల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనీ ఆరోపించాయి. (మత్తయి 10:22) అయినప్పటికీ, మనల్ని వ్యక్తిగతంగా ఎరిగిన యథార్థ ప్రజలకు అలాంటి ఆరోపణలు అబద్ధాలని తెలుసు.
15 అలాంటి అన్యుల స్వరం ద్వారా ప్రచారం చేయబడిన ఆరోపణలు మనకు ఎదురైనప్పుడు మనమేమి చేయాలి? అలాంటప్పుడు మనం సామెతలు 14:15లోని ఈ హితవును మనస్సులో ఉంచుకోవాలి: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” వార్తా మాధ్యమాల్లో నిజమని చెప్పబడిన ప్రతీది నమ్మడం జ్ఞానయుక్తం కాదు. మనం లోకసంబంధ సమాచారాన్నంతా అనుమానించకపోయినా, ‘లోకమంతయు దుష్టుని యందున్నదని’ ఖచ్చితంగా గుర్తిస్తాం.—1 యోహాను 5:19.
‘ఆయా ఆత్మలను పరీక్షించండి’
16 అయితే మనం మిత్రునితో వ్యవహరిస్తున్నామో విరోధితో వ్యవహరిస్తున్నామో మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? “గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక” అవి గొర్రెల కాపరిని అనుసరిస్తాయని యేసు చెప్పాడు. (యోహాను 10:4) గొర్రెల కాపరి పైరూపాన్ని బట్టి కాదుగానీ అతని స్వరాన్ని బట్టి గొర్రెలు అతన్ని అనుసరిస్తాయి. గొర్రెలు వాటి కాపరి స్వరాన్ని బట్టి కాదుగానీ అతని వస్త్రాలను బట్టి అతన్ని గుర్తిస్తాయని ఒక సందర్శకుడు ఓ సందర్భంలో వాదించాడని బైబిలు ప్రాంతాల గురించిన ఒక పుస్తకం వివరిస్తోంది. అయితే ఒక గొర్రెల కాపరి, వాటికి పరిచయమున్న స్వరాన్నే అవి గుర్తిస్తాయని చెప్పాడు. ఈ విషయాన్ని నిరూపించడానికి, ఆయన, ఆ అన్యుడు ఒకరి దుస్తులు మరొకరు వేసుకున్నారు. కాపరి దుస్తులు ధరించిన ఆ అన్యుడు గొర్రెలను పిలిచాడు, అయితే అవి స్పందించలేదు. వాటికి ఆ స్వరం తెలియదు. కానీ వేరే దుస్తుల్లో ఉన్న కాపరి పిలవగానే అవి దగ్గరకు పరుగెత్తుకొచ్చాయి. కాబట్టి ఒక వ్యక్తి కాపరిలా కనిపించవచ్చు, కానీ గొర్రెలకు ఆయనే నిజమైన కాపరి అనే విషయాన్ని అది నిరూపించదు. నిజానికి గొర్రెలు పిలిచిన వ్యక్తి స్వరాన్ని కాపరి స్వరానికి పోలుస్తూ పరీక్షిస్తాయి. మనమూ అదే చేయాలని అంటే “ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో” పరీక్షించాలని దేవుని వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (1 యోహాను 4:1; 2 తిమోతి 1:13) అలా చేయడానికి మనకేది సహాయం చేస్తుంది?
17 కాబట్టి మనం యెహోవా స్వరాన్ని ఎంత బాగా తెలుసుకొనివుంటే అంత సులభంగా మనం అన్యుల స్వరాన్ని కనిపెట్టగలుగుతాం. అలాంటి పరిజ్ఞానాన్ని మనమెలా వృద్ధిచేసుకోవచ్చో బైబిలు సూచిస్తోంది. అదిలా చెబుతోంది: “ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) మన వెనుక నుండి వచ్చే ఆ “శబ్దము” దేవుని వాక్యం నుండి మనకు వినిపిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడల్లా, మన గొప్ప కాపరియైన యెహోవా స్వరాన్ని మనం వింటున్నట్లే. (కీర్తన 23:1) కాబట్టి, మనమెంత ఎక్కువగా బైబిలు అధ్యయనం చేస్తే, అంత ఎక్కువగా దేవుని స్వరం మనకు పరిచయమవుతుంది. ఆ ఖచ్చితమైన పరిజ్ఞానం అన్యుల స్వరాన్ని తక్షణమే గుర్తించడానికి మనకు సహాయం చేస్తుంది.—గలతీయులు 1:8.
18 యెహోవా స్వరాన్ని తెలుసుకొని ఉండడంలో ఇంకా ఏమి ఇమిడివుంది? అందులో కేవలం వినడమే కాదుగానీ విధేయత చూపడం కూడా ఉంది. మళ్లీ ఒకసారి యెషయా 30:21 చూడండి. దేవుని వాక్యమిలా ప్రకటిస్తోంది: “ఇదే త్రోవ.” అవును, బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, మనం యెహోవా మార్గనిర్దేశాలను వింటాం. ఆ తర్వాత ఆయనిలా ఆజ్ఞాపిస్తున్నాడు: “దీనిలో నడువుడి.” మనం వినే దానినిబట్టి నడుచుకోవాలని యెహోవా కోరుతున్నాడు. అలా మనం నేర్చుకున్నది అనువర్తించుకోవడం ద్వారా, మనం యెహోవా స్వరాన్ని వినడమే కాదుగానీ దానిని పాటిస్తున్నామని చూపిస్తాం. (ద్వితీయోపదేశకాండము 28:1) యెహోవా స్వరానికి లోబడడమంటే యేసు స్వరానికి కూడా లోబడడమని అర్థం, ఎందుకంటే అలాచేయమని యెహోవాయే స్వయంగా మనకు చెప్పాడు. (మత్తయి ) మంచి కాపరియైన యేసు ఏమి చేయమని మనకు బోధించాడు? శిష్యులను చేయమనీ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ణ్ణి]” నమ్మమనీ ఆయన మనకు బోధించాడు. ( 17:5మత్తయి 24:45; 28:18-20) ఆయన స్వరానికి లోబడడమంటే మనకు నిత్యజీవమని అర్థం.—అపొస్తలుల కార్యములు 3:23.
‘అవి వానియొద్దనుండి పారిపోవును’
19 అన్యుల స్వరానికి మనమెలా స్పందించాలి? గొర్రెలు స్పందించినట్లే స్పందించాలి. యేసు ఇలా చెప్పాడు: “అవి . . . అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవును.” (యోహాను 10:5) మన స్పందన రెండు విధాలుగా ఉంటుంది. మొదటగా మనం ‘అన్యుని ఎంతమాత్రం వెంబడించం.’ అవును, ఆ అన్యుణ్ణి మనం స్థిరంగా తిరస్కరిస్తాం. వాస్తవానికి, బైబిలు సంబంధిత గ్రీకు భాషలో, “ఎంతమాత్రమును” అని అనువదించబడిన మాట ఆ భాషలో అత్యంత తీవ్రంగా తిరస్కరించడాన్ని సూచిస్తోంది. (మత్తయి 24:35; హెబ్రీయులు 13:5) రెండవది, మనం ‘వానియొద్దనుండి పారిపోతాం’ లేదా అతనికి దూరంగా ఉంటాం. మంచి కాపరి స్వరానికి అనుగుణంగాలేని వారి బోధలకు మనం స్పందించగల సరైన పద్ధతి అదే.
20 కాబట్టి, మతభ్రష్ట తలంపులను వ్యక్తం చేసేవారు మనకు తారసపడినప్పుడు దేవుని వాక్యం చెప్పినట్లుగా చేయాలని మనం కోరుకుంటాం. అదిలా చెబుతోంది: ‘మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడి, వారిలోనుండి తొలగిపోవుడి.’ (రోమీయులు 16:17, 18; తీతు 3:10) అదే విధంగా, హానికరమైన సహవాస ప్రమాదాలను ఎదుర్కొనే క్రైస్తవ యౌవనులు, యౌవనుడైన తిమోతికి పౌలు ఇచ్చిన ఈ సలహాను అన్వయించుకోవాలని కోరుకుంటారు: ‘నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము.’ అలాగే వార్తా మాధ్యమాల్లో అబద్ధ ఆరోపణలు మీరు చూసినప్పుడు, పౌలు తిమోతికి ఇచ్చిన ఈ హితవును గుర్తుపెట్టుకోవాలని మనం కోరుకుంటాం: ‘జనులు [అన్యుల స్వరం వినేవారు] కల్పనాకథలవైపు తిరుగుదురు, నీవైతే అన్ని విషయములలో మితముగా [“జాగ్రత్తగా,” NW] ఉండుము.’ (2 తిమోతి 2:22; 4:3-5) అన్యుల స్వరం ఎంతో మృదువుగా ఉన్నట్లనిపించినా మనం మన విశ్వాసాన్ని కూలదోసే దేన్నైనా మనం విసర్జిస్తాం.—కీర్తన 26:5; సామెతలు 7:5, 21; ప్రకటన 18:2, 4.
21 ఆత్మాభిషిక్త క్రైస్తవులు అన్యుల స్వరాన్ని తిరస్కరిస్తూ లూకా 12:32లోని మంచి కాపరి మాటలకు ప్రతిస్పందిస్తారు. అక్కడ ఆయన వారికిలా చెప్పాడు: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” అదే విధంగా “వేరే గొఱ్ఱెలు” కూడా యేసు పలికిన ఈ మాటలు వినడానికి అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” (యోహాను 10:16; మత్తయి 25:34) మనం ‘అన్యుల స్వరాన్ని’ విసర్జిస్తే మనకెంతటి హృదయానందకరమైన బహుమానం వేచివున్నదో కదా!
మీకు జ్ఞాపకమున్నాయా?
• గొర్రెలమందకు సంబంధించిన యేసు ఉపమానంలో పేర్కొన్న అన్యుని వర్ణనకు సాతాను ఎలా సరిపోతాడు?
• నేడు అన్యుల స్వరమెలా వినిపిస్తోంది?
• అన్యుల స్వరాన్ని మనమెలా గుర్తించవచ్చు?
• అన్యుల స్వరానికి మనమెలా ప్రతిస్పందించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) యేసు పిలిచినప్పుడు మరియ ఎలా ప్రతిస్పందించింది, ఈ సంఘటన యేసు అంతకు ముందు చెప్పిన ఏ మాటలను ఉదహరిస్తోంది? (బి) యేసుకు చేరువగా ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?
3. గొర్రెలమందకు సంబంధించిన యేసు ఉపమానం ఎలాంటి కొన్ని ప్రశ్నలను మనస్సుకు తెస్తుంది?
4. గొర్రెల కాపరికి సంబంధించిన ఉపమానం ప్రకారం, గొర్రెలు ఎవరిని వెంబడిస్తాయి, ఎవరిని వెంబడించవు?
5. యోహాను 10వ అధ్యాయంలో పేర్కొనబడినటువంటి అన్యునికి మనమెందుకు ఆతిథ్యమివ్వము?
6, 7. సాతానును అన్యుడని, దొంగని పిలవడం ఎందుకు సరైనది?
8. యెహోవా మాటలను, ఉద్దేశాలను సాతాను ఎలా వక్రీకరించాడు?
9. నేడు అన్యుల స్వరం వినబడుతుందని మనమెందుకు ఎదురుచూడాలి?
10. అన్యుల స్వరం వినబడే ఒక మార్గమేమిటి?
11. రెండవ పేతురు 2:1, 3లోని మాటలు మతభ్రష్టుల పద్ధతిని, ఆశయాన్ని ఎలా వెల్లడి చేస్తున్నాయి?
12. (ఎ) మన సహవాసం మనల్ని అన్యుల ప్రభావానికి ఎలా గురిచేయగలదు? (బి) సాతాను తంత్రాలకూ, నేటి అన్యుల తంత్రాలకూ మధ్య ఎలాంటి సారూప్యముంది?
13. దావీదు ఎలాంటి జ్ఞానవంతమైన చర్య తీసుకున్నాడు, ఆయనను మనం అనుకరించగల ఒక మార్గమేమిటి?
14. కొన్నిసార్లు వార్తా మాధ్యమాలు అన్యుల స్వరాన్నెలా వినిపిస్తాయి?
15. వార్తా మాధ్యమాల్లో చెప్పబడేదంతా నమ్మడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?
16. (ఎ) యోహాను 10:4లోని యేసు మాటల సత్యసంధతను గొర్రెల ప్రవర్తన ఎలా ఉదహరిస్తోంది? (బి) ఏమి చేయమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది?
17. (ఎ) యెహోవా స్వరం మనకెలా పరిచయమవుతుంది? (బి) యెహోవా గురించిన పరిజ్ఞానం మనమేమి చేయడానికి సహాయం చేస్తుంది?
18. (ఎ) యెహోవా స్వరం తెలుసుకొని ఉండడంలో ఏమి ఇమిడివుంది? (బి) మత్తయి 17:5 ప్రకారం మనమెందుకు యేసు స్వరానికి లోబడాలి?
19. అన్యుల స్వరానికి మనమెలా ప్రతిస్పందించాలి?
20. మనకు (ఎ) మోసకరమైన మతభ్రష్టులు, (బి) హానికరమైన సహవాసులు, (సి) పక్షపాతపు వార్తా నివేదికలు ఎదురైనప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాం?
21. అన్యుల స్వరాన్ని తిరస్కరించే వారికోసం ఏ బహుమానం వేచివుంటుంది?
[15వ పేజీలోని చిత్రం]
మరియ యేసును గుర్తుపట్టింది
[16వ పేజీలోని చిత్రం]
అన్యుడు గొర్రెలను నేరుగా సమీపించడు
[18వ పేజీలోని చిత్రం]
అన్యుని స్వరానికి మనమెలా ప్రతిస్పందిస్తాం?