“మీరీలాగు ప్రార్థనచేయుడి”
“మీరీలాగు ప్రార్థనచేయుడి”
మీకు పరలోక ప్రార్థన తెలుసా? అది యేసుక్రీస్తు నేర్పించిన మాదిరి ప్రార్థన. యేసు, ప్రసిద్ధిగాంచిన కొండమీది ప్రసంగం ఇస్తున్నప్పుడు “మీరీలాగు ప్రార్థనచేయుడి” అని చెప్పాడు. (మత్తయి 6:9) దాన్ని యేసు పరిచయం చేశాడు కాబట్టి అది ప్రభువు ప్రార్థన అని కూడా పిలువబడుతుంది.—లాటిన్, పాటర్నాస్టర్.
ప్రపంచమంతటా లక్షలాదిమంది పరలోక ప్రార్థనను కంఠతః నేర్చుకొని తరచూ వల్లిస్తుంటారు, బహుశా ప్రతి దినం వల్లె వేస్తుండవచ్చు. ఈ ప్రార్థనను ఇటీవలి సంవత్సరాల్లో పాఠశాలల్లోను, బహిరంగ స్థలాల్లోను చాలామంది వల్లించారు. పరలోక ప్రార్థనను అంత ఉన్నతంగా పరిగణించడానికి కారణమేమిటి?
మూడవ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతాచార్యుడు సిప్రియన్ ఇలా వ్రాశాడు: “క్రీస్తు ద్వారా మనకివ్వబడిన ప్రార్థన కంటే మరింత ఆధ్యాత్మిక ప్రార్థనగా ఏది ఉండగలదు? సత్యవంతుడైన కుమారుని ద్వారా మనకు అందించబడిన ప్రార్థనకంటే ఏ ప్రార్థన మరింత సత్యవంతంగా ఉండగలదు?”—యోహాను 14:6.
రోమన్ క్యాథలిక్ చర్చి, పరలోక ప్రార్థనను మత సిద్ధాంత బోధల్లో “ప్రధానమైన క్రైస్తవ ప్రార్థన”గా పరిగణిస్తుంది. ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా, ఈ ప్రార్థనకు క్రైస్తవ మతసామ్రాజ్యపు మతాలన్నింటిలో ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, “క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక వ్యాఖ్యల్లో” ఒకటిగా దీన్ని వర్ణిస్తోంది.
అయితే పరలోక ప్రార్థనను వల్లించే చాలామందికి దానర్థం ఏమిటో పూర్తిగా తెలియదని ఒప్పుకోవలసిందే. “మీకు ఎలాంటి క్రైస్తవ నేపథ్యమున్నా మీరు పరలోక ప్రార్థనను ఊపిరి పీల్చుకోకుండా గడగడా వల్లించడం సులభమే కావచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకొని నెమ్మదిగా చెప్పాలంటే మీకు కష్టంగా ఉండవచ్చు” అని ఒట్టావా సిటిజన్ అనే కెనడా వార్తాపత్రిక వ్యాఖ్యానించింది.
మనం దేవునికి చేసే ప్రార్థనలను అర్థం చేసుకోవడం నిజంగా ప్రాముఖ్యమా? యేసు మనకు పరలోక ప్రార్థనను ఎందుకు నేర్పించాడు? దాన్ని మీరెలా అర్థం చేసుకుంటారు? ఈ ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం.