విశ్వసనీయత, స్థిరత్వం నాడూ నేడూ
విశ్వసనీయత, స్థిరత్వం నాడూ నేడూ
పోలండ్ దక్షిణభాగంలో, దాని సరిహద్దునవున్న స్లొవాకియాకూ, ఛెక్ రిపబ్లిక్‌కూ దగ్గర్లో వీస్వా అనే ఒక చిన్న పట్టణం ఉంది. వీస్వా గురించి మీరెన్నడూ వినకపోయినా, నిజ క్రైస్తవులకు ఆసక్తి కలిగించే చరిత్ర దానికి ఉంది. దాని చరిత్ర యెహోవా ఆరాధన పట్ల ఉండే యథార్థత, అభినివేశాలను బట్టి గుర్తించబడింది. ఏ విధంగా?
వీస్వా ప్రకృతి అందాలతో కనుల పండుగ చేసే పర్వత ప్రాంతంలో ఉంది. గలగలపారే సెలయేళ్లు, రెండు వాగులు విస్టులా నదిలో కలుస్తాయి, అక్కడ నుండి ఆ నది అరణ్యాలు నిండిన పర్వతాలు, లోయల గుండా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. అక్కడి ప్రజల స్నేహశీలత, విలక్షణమైన స్థానిక వాతావరణం వీస్వాను ప్రఖ్యాత వైద్య కేంద్రంగా, వేసవి సెలవుల విడిదిగా, శీతాకాల సందర్శనా స్థలంగా నిలబెట్టాయి.
అక్కడ మొట్టమొదట 1590లో వీస్వా అనే పేరుతో వలస సమాజం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక చిన్న రంపపు మిల్లు స్థాపించబడింది, ఆ తర్వాత గొర్రెలను, పశువులను పెంచుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్లు చెట్లుచేమలు లేని ఆ పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ సాధారణ ప్రజలు మత మార్పిడి అనే సుడిగాలిలో చిక్కుకున్నారు. మార్టిన్ లూథర్ ప్రారంభించిన మత సంస్కరణలతో ఈ ప్రాంతం ఎంతో ప్రభావితం చెందింది. పరిశోధకుడైన యాన్‌జ ఓడ్చెక్ ప్రకారం, లూథరన్ మతం “1545లో రాష్ట్రమతం”గా అవతరించింది. అయితే 30 సంవత్సరాలు సాగిన యుద్ధం, ఆ తర్వాత జరిగిన క్యాథలిక్ సంస్కరణా ఉద్యమం పరిస్థితిని నాటకీయంగా మార్చివేశాయి. “1654లో ప్రొటస్టెంట్ల నుండి చర్చీలన్నీ లాక్కోబడ్డాయి, వారి సేవలు నిషేధించబడ్డాయి, బైబిళ్లు, ఇతర మత సంబంధ పుస్తకాలు జప్తు చేయబడ్డాయి” అని ఓడ్చెక్ వివరించాడు. అయినప్పటికీ, స్థానిక ప్రజల్లో అనేకులు లూథరన్లుగానే నిలిచిపోయారు.
బైబిలు సత్యపు మొదటి విత్తనాలు
ఆనందకరమైన ఒక చక్కని విశేషమేమిటంటే, మరింత ప్రాముఖ్యమైన మత సంస్కరణ వారి కోసం వేచివుంది. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడిన అభినివేశంగల ఇద్దరు యెహోవాసాక్షులు, 1928లో అక్కడ బైబిలు
సత్యమనే విత్తనాలను మొట్టమొదట విత్తారు. ఆ మరుసటి సంవత్సరం, యాన్ గొమోలా ఒక ఫోనోగ్రాఫ్తో వీస్వాకు వచ్చి, దాని సహాయంతో రికార్డు చేయబడిన లేఖనాధార ప్రసంగాలను వినిపించాడు. ఆ పిమ్మట ఆయన దగ్గర్లోనే ఉన్న ఒక లోయకు వెళ్లాడు, అక్కడ ఆయనకు శ్రద్ధగా వినే ఒక వ్యక్తి కలిశాడు. పొట్టిగా, లావుగావున్న సహృదయంగల పర్వత ప్రాంత నివాసి అయిన ఆ వ్యక్తి పేరు యాన్‌జ రష్కా. ఫోనోగ్రాఫ్ ప్రసంగాల్లో చెప్పబడిన విషయాలను పరిశీలించడానికి రష్కా వెంటనే తన బైబిలు బయటకు తీశాడు. ఆ తర్వాత ఆయన, “నా సహోదరుడా, చివరకు నేను సత్యమేమిటో తెలుసుకున్నాను! మొదటి ప్రపంచ యుద్ధకాలంలో నేను కందకాల్లో ఉన్న దగ్గర నుండి జవాబుల కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ఉత్సాహం ఉరకలేస్తున్న రష్కా, గొమోలాకు తన స్నేహితులైన యార్జాను, యాన్‌జ పిల్క్ను పరిచయం చేయడానికి తీసుకెళ్ళాడు. ఆ ఇద్దరు రాజ్య సందేశానికి వెంటనే స్పందించారు. వారిద్దరు దేవుని సందేశపు పరిజ్ఞానాన్ని మరింత అధికం చేసుకోవడానికి, ఫ్రాన్స్‌లో బైబిలు సత్యం నేర్చుకున్న యాన్‌జ టిర్నా వారికి సహాయం చేశాడు. వారు త్వరలోనే బాప్తిస్మం తీసుకున్నారు. వీస్వాలో ఉన్న బైబిలు విద్యార్థుల చిన్న గుంపుకు సహాయం చేయడానికి, 1930వ దశాబ్దపు మధ్య సంవత్సరాల్లో పొరుగు పట్టణాల్లోని సహోదరులు అక్కడికి వచ్చారు. అక్కడ వారికి ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయి.
గమనార్హమైన రీతిలో కొత్తగా ఆసక్తి చూపుతున్నవారు ఒక ప్రవాహంలా వచ్చారు. స్థానిక లూథరన్ కుటుంబాల వారికి తమ ఇళ్ళలో బైబిలు చదివే అలవాటు ఉంది. అందువల్ల నరకాగ్ని సిద్ధాంతం, త్రిత్వానికి సంబంధించి ఒప్పింపజేసే లేఖనాధార తర్కాలను విన్న వెంటనే, చాలామంది సత్యానికీ, అసత్యానికీ ఉన్న తేడాను పసిగట్టగలిగారు. అనేక కుటుంబాలు అబద్ధ మత బోధలను త్యజించాలని నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా వీస్వాలోని సంఘం వృద్ధిచెంది, 1939కల్లా దానిలో 140 మంది సభ్యులు తయారయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ సంఘంలోని పెద్దవాళ్ళలో అనేకులు బాప్తిస్మం తీసుకున్నవారు కాదు. “అంటే బాప్తిస్మం తీసుకోని ఆ ప్రచారకులు యెహోవా పక్షాన నిలబడలేదని అర్థం కాదు” అని అక్కడి తొలి సాక్షుల్లో ఒకరైన హెలెనా చెబుతోంది. ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “వారు ఎదుర్కొన్న విశ్వాస పరీక్షల్లో తమ యథార్థతను నిరూపించుకున్నారు.”
మరి పిల్లల విషయమేమిటి? వాళ్ళు తమ తల్లిదండ్రులు సత్యం కనుగొన్నారని గ్రహించారు. ఫ్రాన్సిజెక్ బ్రాంట్జ్ ఇలా వివరిస్తున్నాడు: “మా నాన్నగారు తనకు సత్యం లభించిందని తెలిసినప్పుడు, ఆయన నాకూ, మా అన్నయ్యకూ వాటిని నేర్పించడం మొదలుపెట్టారు. అప్పుడు మా వయస్సు 8, 10 సంవత్సరాలు. నాన్నగారు మమ్మల్ని ‘దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి? యేసుక్రీస్తు గురించి మీకేమి తెలుసు?’ వంటి ప్రశ్నలు అడిగేవారు. మేము వాటికి జవాబులు వ్రాసి, వాటిని బైబిలు వచనాలతో నిరూపించేవాళ్లం.” మరో సాక్షి ఇలా చెబుతున్నాడు: “మా తల్లిదండ్రులు రాజ్య సందేశానికి వెంటనే స్పందించి, 1940లో లూథరన్ చర్చిని విడిచిపెట్టినప్పుడు, నేను పాఠశాలలో వ్యతిరేకత ఎదుర్కొని, దెబ్బలు తిన్నాను. నాలో బైబిలు సూత్రాలు నాటినందుకు నేను నా తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞుడను. ఆ గడ్డు కాలాలు తప్పించుకొనేలా సహాయం చేయడంలో అది కీలకపాత్ర వహించింది.”
పరీక్షలో విశ్వాసంగా ఉండడం
రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమై, నాజీలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు, వాళ్ళు యెహోవాసాక్షులను అంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మొదట పెద్దవాళ్ళను ప్రత్యేకించి తండ్రులను, కొన్ని ప్రయోజనాలు పొందడానికి జర్మనీ జాతీయతను అంగీకరిస్తున్నట్లు ప్రకటించే ఒక పత్రంలో సంతకం చేయడానికి పురికొల్పారు. ఆ సాక్షులు నాజీలతో ఏకీభవించడానికి నిరాకరించారు. సైన్యంలో చేరే వయస్సుగల చాలామంది సహోదరులు, ఆసక్తిపరులు ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదేమిటంటే, సైన్యంలో చేరడం లేదా ఖచ్చితమైన తటస్థ వైఖరి కాపాడుకొని తీవ్రంగా శిక్షించబడడం. “సైనిక సేవను నిరాకరించడం అంటే, ఖచ్చితంగా ఆష్విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడడమనే అర్థం. నేను అప్పటికి ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, కానీ మత్తయి 10:28, 29లో యేసు ఇచ్చిన అభయం నాకు తెలుసు. యెహోవా పట్ల విశ్వాసం మూలంగా నేను ఒకవేళ చనిపోతే, నన్ను ఆయన మళ్ళీ జీవానికి తేగలడని నాకు తెలుసు” అని 1943లో గెస్టపో అరెస్టు చేసిన యాన్‌జ షాల్బోట్ వివరిస్తున్నాడు.
1942 తొలి భాగంలో, నాజీలు వీస్వాలోని 17 మంది సహోదరులను అరెస్టు చేశారు. మూడు నెలల్లోనే వారిలో 15 మంది ఆష్విట్జ్లో చనిపోయారు. వీస్వాలో మిగిలిన సాక్షులపై అది ఎలాంటి ప్రభావం చూపించింది? అది వారు తమ విశ్వాసాన్ని విసర్జించేలా చేయడానికి బదులుగా, రాజీపడని ధోరణితో యెహోవాను హత్తుకునేలా ప్రోత్సహించింది. ఆ తర్వాతి ఆరు నెలల్లో, వీస్వాలోని ప్రచారకుల సంఖ్య రెండింతలయ్యింది. త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగాయి. అంతా కలిపి 83 మంది సహోదరులు, ఆసక్తిపరులు, పిల్లలు హిట్లర్ అణచివేత దళాల ప్రభావానికి గురయ్యారు. వారిలో యాభై మూడు మంది కాన్సంట్రేషన్ క్యాంపులకు (ముఖ్యంగా ఆష్విట్జ్కు) పంపించబడ్డారు లేదా పోలండ్, జర్మనీ, బొహెమియాల్లోని గనుల దగ్గర గల లేబర్ క్యాంపులకు బలవంతంగా తరలించబడ్డారు.
విశ్వసనీయత, స్థిరత్వం
ఆష్విట్జ్లో, వెంటనే విడిచిపెడతామని ఆశచూపించి సాక్షులను లొంగదీసుకోవడానికి నాజీలు ప్రయత్నించారు. ఒక SS గార్డు, ఒక సహోదరునితో ఇలా అన్నాడు: “నువ్వు బైబిలు విద్యార్థులను వదిలేస్తున్నానని పేపరు మీద కేవలం ఒక్క సంతకం చేస్తే చాలు, నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు.” ఆ ప్రతిపాదన చాలాసార్లు చేయబడింది, అయినప్పటికీ ఆ సహోదరుడు యెహోవాతో తనకున్న సంబంధం విషయంలో రాజీ పడలేదు. ఫలితంగా, ఆయన దెబ్బలు తిన్నాడు, హేళన భరించాడు, జర్మనీలోని ఆష్విట్జ్లోను, మిట్టెల్బా డోరాలోను బానిసలా పని చేశాడు. విడుదలకు కొద్ది రోజుల ముందు, ఈ సహోదరుడు తాను ఉంచబడిన క్యాంపుపై జరిగిన బాంబుల దాడిలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.
ఈ మధ్యే చనిపోయిన పావెల్ జాల్బాట్ అనే ఒక సాక్షి, ఒకసారి ఇలా అన్నాడు: “నన్ను విచారణ చేసేటప్పుడు, నేను జర్మనీ సైన్యంలో చేరి, హిట్లర్‌కు జై అనడానికి ఎందుకు నిరాకరించానో చెప్పమని గెస్టపో పదేపదే అడిగింది.” ఆయన తన క్రైస్తవ తటస్థతకు బైబిలు ఆధారాన్ని వివరించిన తర్వాత, ఆయుధ కర్మాగారంలో పని చేయడానికి పంపించబడ్డాడు. “నా మనస్సాక్షిని బట్టి నేను ఆ పనికి అంగీకరించలేక పోయాను, అందువల్ల వాళ్ళు నన్ను గనిలో పనిచేయడానికి పంపించారు.” అయినప్పటికీ ఆయన నమ్మకంగానే నిలబడ్డాడు.
ఖైదు చేయబడని వారు, అంటే స్త్రీలు పిల్లలు ఆష్విట్జ్లో ఉన్నవారికి ఆహారపు పొట్లాలు పంపేవారు. “వేసవిలో మేము అడవిలో కాన్‌బెర్రీ పండ్లను ఏరుకొచ్చి వాటిని గోధుమలకు మారుగా అమ్మేవాళ్లం. సహోదరీలు రొట్టెలు కాల్చి వాటిని కొవ్వునూనెలో నానబెట్టేవారు. ఆ తర్వాత మేము ఆ రొట్టెలను కొన్ని చెరలో ఉన్న సహోదరులకు పంపేవాళ్లం” అని అప్పట్లో యౌవనునిగా ఉన్న ఒక సహోదరుడు చెబుతున్నాడు.
వీస్వా నుండి అంతా కలిపి 53 మంది వయోజనులైన సాక్షులను కాన్సంట్రేషన్ క్యాంపులకు పంపించి, బలవంతంగా పని చేయించారు. వారిలో ముప్పై ఎనిమిది మంది మరణించారు.
యువత ముందుకు రావడం
నాజీల అణచివేత, యెహోవాసాక్షుల పిల్లలపై కూడా ప్రభావం చూపించింది. కొంతమంది పిల్లలు తమ తల్లులతో పాటు బొహెమియాలోని తాత్కాలిక క్యాంపులకు పంపించబడ్డారు. మరికొందరు తమ తల్లిదండ్రుల నుండి వేరు చేయబడి, దురాగతాలకు పేరుగాంచిన లోడ్జ్‌లోని పిల్లల క్యాంపుకు పంపించబడ్డారు.
“లోడ్జ్కు జర్మన్లు మొదటి దఫాగా తీసుకెళ్ళిన పదిమందిమి, ఐదు నుండి తొమ్మిది ఏండ్ల లోపువాళ్ళమే. మేము ప్రార్థన చేసుకుంటూ, బైబిలు అంశాలు చర్చించుకుంటూ ఒకరినొకరం ప్రోత్సహించుకున్నాం. అక్కడి అనుభవం ఎంతో కష్టమైనది” అని వారిలో ముగ్గురు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 1945లో ఆ పిల్లలందరూ తమ ఇంటికి తిరిగి చేరుకున్నారు. వారు బ్రతికే ఉన్నప్పటికీ చిక్కి శల్యమై పోయారు. అయినా, వారి యథార్థతను ఏదీ భంగం చేయలేకపోయింది.
ఆ తర్వాత ఏమి జరిగింది?
రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా, వీస్వాలోని సాక్షులు విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండి తమ ప్రకటనా పనిని ఆసక్తితో, దృఢ సంకల్పంతో తిరిగి చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. సహోదరుల గుంపులు వీస్వాకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ప్రజలను సందర్శించి వారికి ప్రకటిస్తూ బైబిలు సాహిత్యాలు అందించారు. “అనతికాలంలోనే మా పట్టణంలో మూడు చురుకైన సంఘాలు నెలకొల్పబడ్డాయి” అని యాన్ జోక్ చెబుతున్నాడు. అయితే వారి మత స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలవలేదు.
నాజీల స్థానంలో వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం, పోలండ్‌లో యెహోవాసాక్షుల కార్యకలాపాలను 1950లో నిషేధించింది. అందువల్ల స్థానిక సహోదరులు తమ పరిచర్యలో యుక్తిగా ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు వాళ్ళు పశువులు లేదా ధాన్యం కొంటామనే నెపంతో ప్రజలను వారి ఇళ్ళలో సందర్శించేవారు. క్రైస్తవ కూటాలు సాధారణంగా చిన్న గుంపులుగా రాత్రిపూటే జరిగేవి. అయినప్పటికీ భద్రతా సిబ్బంది, విదేశీ గూఢచార విభాగం తరఫున పని చేస్తున్నారని ఎటువంటి ఆధారమూ లేని ఆరోపణ చేస్తూ అనేకమంది యెహోవాసాక్షులను అరెస్టు చేసింది. కొంతమంది అధికారులు పావెల్ పిల్చ్ను హేళనగా బెదిరిస్తూ ఇలా అన్నారు: “హిట్లర్ మిమ్మల్ని ఏమీ చేయలేకపోయాడు, కానీ మేము చేస్తాం.” అయినా సరే, ఆయన ఐదు సంవత్సరాల జైలు శిక్షా కాలంలో యెహోవా పట్ల విశ్వసనీయంగా నిలిచాడు. కొందరు యౌవన సాక్షులు, సోషలిస్టు పార్టీ దస్తావేజు మీద సంతకం చేయడానికి నిరాకరించినప్పుడు, వారు పాఠశాల నుండి లేదా తమ ఉద్యోగాల నుండి వెళ్లగొట్టబడ్డారు.
యెహోవా వారితోనే ఉన్నాడు
1989వ సంవత్సరంలో రాజకీయ వాతావరణం మారి, పోలండ్‌లో యెహోవాసాక్షులు చట్టబద్ధంగా గుర్తించబడ్డారు. వీస్వాలో స్థిరంగా నిలబడ్డ యెహోవా ఆరాధకులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు, ఇది పయినీర్లు లేదా పూర్తికాల పరిచారకులు పెరిగిన సంఖ్యలో కనబడింది. ఈ ప్రాంతంలోని దాదాపు 100 మంది సహోదర సహోదరీలు పయినీరు సేవ చేపట్టారు. అందువల్ల ఆ పట్టణం పయినీరు కర్మాగారం అని సరదాగా పిలవబడిందంటే అందులో ఆశ్చర్యం లేదు.
దేవుడు గతంలో తన సేవకులకిచ్చిన మద్దతు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసి యుందురు.” (కీర్తన 124:2, 3) మనకాలంలో కూడా వీస్వాలోని యెహోవా ఆరాధకులు, సాధారణ ప్రజానీకంలో విస్తరించిన ఉదాసీనత, అనైతిక లోక పోకడల మధ్య తమ యథార్థతను కాపాడుకోవడానికి కృషి చేస్తూ చక్కని ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు. ఆ ప్రాంతపు సాక్షుల తర్వాతి తరాల వారు “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” అని పలికిన అపొస్తలుడైన పౌలు మాటల సత్యత్వాన్ని రుజువు చేస్తున్నారు.—రోమీయులు 8:31.
[26వ పేజీలోని చిత్రం]
ఎమెల్యా జోక్ తన పిల్లలు హెలెనా, ఎమెల్యా, యాన్లతో బొహెమియాలోని తాత్కాలిక క్యాంపుకు పంపబడింది
[26వ పేజీలోని చిత్రం]
పావెల్ జాల్బాట్ సైనిక సేవను నిరాకరించినప్పుడు, గనిలో పనిచేయడానికి పంపించబడ్డాడు
[27వ పేజీలోని చిత్రం]
సహోదరులను ఆష్విట్జ్కు పంపించినా, వారక్కడ మరణించినా, వీస్వాలో సేవాభివృద్ధి కుంటుపడలేదు
[28వ పేజీలోని చిత్రం]
పావెల్ పిల్చ్, యాన్ పోలెక్ లోడ్జ్‌లోని యూత్ క్యాంప్‌కు తరలించబడ్డారు
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
బెర్రీ పండ్లు, పూలు: © R.M. Kosinscy / www.kosinscy.pl