పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవ సంఘం తిండిబోతుతనాన్ని ఎలా దృష్టిస్తుంది?
దేవుని వాక్యం త్రాగుబోతుతనాన్ని, తిండిబోతుతనాన్ని దేవుని సేవకులకు తగని ప్రవర్తనగా ఖండిస్తోంది. కాబట్టి క్రైస్తవ సంఘం తిండిబోతుతనానికి అలవాటుపడి మారడానికి ఇష్టపడని వ్యక్తిని త్రాగుబోతుని దృష్టించినట్లే దృష్టిస్తుంది. తిండిబోతులు గానీ త్రాగుబోతులు గానీ క్రైస్తవ సంఘంలో భాగంగా ఉండలేరు.
“ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును” అని సామెతలు 23:20, 21 వచనాలు చెబుతున్నాయి. ద్వితీయోపదేశకాండము 21:20లో ధర్మశాస్త్రం క్రింద మరణ శిక్షకు అర్హుడిగా పరిగణించబడిన ‘మొండివాడై, తిరుగుబాటు చేసే’ వ్యక్తి గురించి మనం చదువుతాము. ఈ వచనం ప్రకారం మొండివాడై, తిరుగుబాటు చేసే ఆ వ్యక్తికిగల రెండు ప్రధాన లక్షణాలు ‘తిండిబోతుతనం, త్రాగుబోతుతనం.’ ప్రాచీన ఇశ్రాయేలులో తిండిబోతుతనం దేవుణ్ణి సేవించాలని కోరుకునేవారికి తగని లక్షణంగా దృష్టించబడేది అని స్పష్టమవుతోంది.
అయితే తిండిబోతు అంటే ఎవరు, ఈ విషయం గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాలు ఏమి చెబుతున్నాయి? తిండిబోతు అంటే “అత్యాశతో, కక్కుర్తితో తినడానికి, త్రాగడానికి అలవాటుపడిన వ్యక్తి” అని నిర్వచించబడింది. కాబట్టి తిండిబోతుతనం ఒక రకమైన అత్యాశ, “లోభులు” లేక అత్యాశాపరులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని వాక్యం మనకు చెబుతోంది. (1 కొరింథీయులు 6:9, 10; ఫిలిప్పీయులు 3:18, 19; 1 పేతురు 4:3) అంతేకాక అపొస్తలుడైన పౌలు ‘శరీరకార్యములకు’ పాల్పడకూడదని క్రైస్తవులను హెచ్చరించినప్పుడు ‘మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవాటిని’ ప్రస్తావించాడు. (గలతీయులు 5:19-21) అధికంగా తినడం సాధారణంగా మత్తతలు అంటే త్రాగుబోతుతనంతోనూ అల్లరితో కూడిన ఆటపాటలతోనూ ఉంటుంది. అంతేకాకుండా పౌలు “మొదలైనవి” అన్నప్పుడు దానిలో తిండిబోతుతనం కూడా ఖచ్చితంగా ఇమిడివుంది. ఇతర ‘శరీరకార్యములకు’ పాల్పడే క్రైస్తవుల విషయంలోలాగే, తిండిబోతుతనానికి పేరు గాంచిన, అత్యాశతో కూడిన తన ప్రవర్తనను మార్చుకోవడానికి మొండిగా నిరాకరించే క్రైస్తవుడు సంఘం నుండి తీసివేయబడాలి.—1 కొరింథీయులు 5:11, 13. *
దేవుని వాక్యం త్రాగుబోతులను, తిండిబోతులను ఒకే విధంగా దృష్టించినా, తిండిబోతులకంటే త్రాగుబోతులను గుర్తించడం చాలా సులభం. త్రాగుబోతుతనపు లక్షణాలు సాధారణంగా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ఖచ్చితమైన తిండిబోతుగా మారతాడో నిర్ణయించడం చాలా కష్టం ఎందుకంటే దానిని కేవలం బాహ్య రూపాన్నిబట్టి నిర్ణయించలేము. కాబట్టి ఈ విషయానికి సంబంధించిన వ్యవహారాలను నిర్ణయించేటప్పుడు సంఘ పెద్దలు చాలా జాగ్రత్తగా వివేచనతో పనిచేయాలి.
ఉదాహరణకు స్థూలకాయం తిండిబోతుతనానికి సూచనగా ఉండవచ్చు, అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. ఒక వ్యక్తి స్థూలకాయుడిగా ఉండడానికి ఏదైనా వ్యాధి కారణం కావచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా కూడా కొంతమంది స్థూలకాయులుగా ఉండవచ్చు. అంతేకాకుండా స్థూలకాయం శారీరక పరిస్థితి అని, తిండిబోతుతనం మానసిక వైఖరి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. స్థూలకాయం “శరీరంలో అధిక కొవ్వు ఉండే పరిస్థితి” అని నిర్వచించబడింది కానీ తిండిబోతుతనం “అత్యాశతో అధికంగా తినడం.” కాబట్టి తిండిబోతుతనాన్ని ఒక వ్యక్తి పరిమాణాన్ని బట్టి కాదు కానీ తిండిపట్ల అతని వైఖరిని బట్టి నిర్ణయించాలి. ఒక వ్యక్తి మామూలుగా లేదా సన్నగా ఉండి కూడా తిండిబోతుగా ఉండవచ్చు. అంతేకాక ఎంత బరువు ఉండాలి, ఎలాంటి ఆకారం ఉండాలి అనే విషయాలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉండవచ్చు.
తిండిబోతుతనపు లక్షణాలు ఏమిటి? ఒక తిండిబోతు ఎల్లప్పుడూ నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తాడు, చాలా అసౌకర్యంగా అనిపించేంతగా లేదా అనారోగ్యం పాలయ్యేంతగా కక్కుర్తితో ఆబగా తింటాడు. అతను అలా నిగ్రహం లేకుండా ప్రవర్తించడం, తాను యెహోవాపైకి, ఆయన ప్రజలకున్న మంచి పేరుపైకి తెస్తున్న నింద గురించి అతనికి అసలు పట్టింపే లేదని సూచిస్తుంది. (1 కొరింథీయులు 10:31) మరోవైపున కొన్ని సందర్భాల్లోనే అధికంగా తినే వ్యక్తిని “లోభిగా” లేక అత్యాశాపరుడిగా దృష్టించకూడదు. (ఎఫెసీయులు 5:5) అయితే గలతీయులు 6:1లోని మాటల ప్రకారం అలాంటి క్రైస్తవునికి సహాయం అవసరం కావచ్చు. ఆ వచనంలో పౌలు ఇలా చెప్పాడు: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.”
అధికంగా తినడానికి దూరంగా ఉండమని బైబిలు ఇస్తున్న ఉపదేశం ప్రత్యేకంగా నేడు ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే ప్రత్యేకించి మన కాలం గురించి యేసు ఇలా హెచ్చరించాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34, 35) ఆధ్యాత్మికంగా హానికరమైన జీవన విధానానికి దూరంగా ఉండేందుకు అధికంగా తినడానికి దూరంగా ఉండడం ఒక ప్రాముఖ్యమైన మార్గం.
మితానుభవులుగా ఉండడం క్రైస్తవుల సుగుణం. (1 తిమోతి 3:2, 11) కాబట్టి ఆహార విషయంలో, మద్యపానీయాలు సేవించే విషయంలో మితంగా ఉండాలనే బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి కృషి చేసేవారికి యెహోవా తప్పకుండా సహాయం చేస్తాడు.—హెబ్రీయులు 4:16.
[అధస్సూచి]
^ పేరా 5 కావలికోట (ఆంగ్లం) మే 1, 1986లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.