మీరు భయం లేని లోకం కోసం పరితపిస్తున్నారా?
మీరు భయం లేని లోకం కోసం పరితపిస్తున్నారా?
“‘ఏ సమయంలోనైనా ఏ రూపంలోనైనా హెచ్చరిక లేకుండానే మనకు ప్రమాదం కలగవచ్చు’ అన్న భయంతో ‘అప్రమత్తతా, నిస్సహాయతా తీవ్రంగా పెరిగిపోయిన’ స్థితిలో మనం జీవిస్తున్నాం.”
ఈ మాటలు గత సంవత్సరం న్యూస్వీక్ పత్రికలో కనబడ్డాయి, అవి నేటి అల్లకల్లోలిత లోకంలో జీవిస్తున్న అనేకమంది ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి భావాలు సమీప భవిష్యత్తులో ఉంటాయని యేసుక్రీస్తు సూచించాడు. ఒక సమయం వస్తుందనీ అప్పుడు దేశాలు ఎటు వెళ్ళాలో తోచని కలవరానికి గురవుతాయనీ మనుష్యులు భూమిపైకి రానున్న వాటిని తలంచుకుంటూ భయకంపితులై ధైర్యం కోల్పోతారనీ ఆయన ముందే చెప్పాడు. కానీ మనం భయపడాల్సిన లేదా నిస్సహాయులుగా భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”—లూకా 21:25-28.
ఆ విడుదల తర్వాత భూమ్మీద తన ప్రజల జీవన పరిస్థితుల గురించి వర్ణిస్తూ, యెహోవా దేవుడు ఇలా ప్రకటించాడు: “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” (యెషయా 32:17) యెహోవా తన ప్రవక్త అయిన మీకా ద్వారా ఇలా అన్నాడు: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
నేటి జీవన స్థితితో పోల్చి చూస్తే అదెంత భిన్నంగా ఉందో కదా! మానవాళికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే భయం ఉండదు. తీవ్రమైన అప్రమత్తత, నిస్సహాయతల స్థితికి బదులు నిరంతర శాంతి, సంతోషాలు ఉండే స్థితి ఉంటుంది.