కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“స్నేహశీల దీవుల్లో” దేవుని స్నేహితులు

“స్నేహశీల దీవుల్లో” దేవుని స్నేహితులు

“స్నేహశీల దీవుల్లో” దేవుని స్నేహితులు

ఒక నావ 1932లో టోంగా దీవులకు అమూల్యమైన విత్తనాలు తెచ్చింది. ఆ నావ నాయకుడు చార్లెస్‌ వెటికి “మృతులు ఎక్కడున్నారు?” (ఆంగ్లం) అనే చిన్న పుస్తకం ఇచ్చాడు. తనకు సత్యం లభించిందని ఛార్లెస్‌కు నమ్మకం కుదిరింది. కొంతకాలం తర్వాత, ఆ చిన్న పుస్తకాన్ని తన స్వభాషలోకి అనువదిస్తానని ఛార్లెస్‌ చేసిన విన్నపాన్ని యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం ఆమోదించింది. అనువదించడం ముగించిన తర్వాత, ఆ చిన్న పుస్తకపు ముద్రిత ప్రతులు 1,000 ఆయనకు పంపబడగా, ఆయన వాటిని పంచడం ప్రారంభించాడు. అలా యెహోవా రాజ్యాన్ని గురించిన సత్య విత్తనాలు టోంగా దీవుల్లో వెదజల్లడం ఆరంభమైంది.

దక్షిణ ఫసిఫిక్‌ మ్యాపులో, అంతర్జాతీయ తారీఖు రేఖకు పశ్చిమాన, ఆ తారీఖు రేఖ మకర రేఖను తాకే ప్రాంతంలో టోంగా దీవులను మీరు చూడవచ్చు. వీటిలో అన్నింటికంటే పెద్దదైన టోంగటాపు దీవి న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌కు ఈశాన్యంగా దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. టోంగా దీవులు మొత్తం 171, వాటిలో 45 దీవులు నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటీష్‌ అన్వేషకుడైన జేమ్స్‌ కుక్‌ ఈ మారుమూల దీవులకు స్నేహశీల దీవులు అని నామకరణం చేశాడు.

దాదాపు 1,06,000 జనాభా ఉన్న టోంగా దీవులు మూడు ద్వీప సమూహాలతో ఏర్పడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి టోంగటాపు, హాపి, వావావ్‌. యెహోవాసాక్షుల ఐదు స్థానిక సంఘాల్లో మూడు అత్యధిక జనాభాగల టోంగటాపులో, ఒకటి హాపిలో మరొకటి వావావ్‌లో ఉన్నాయి. దేవుని స్నేహితులయ్యేలా ప్రజలకు సహాయం చేసేందుకు రాజధాని నుకువలోఫాకు దగ్గరలో యెహోవాసాక్షులకు ఒక మిషనరీ గృహంతోపాటు అనువాద కార్యాలయం కూడా ఉంది.​—⁠యెషయా 41:⁠8.

ఛార్లెస్‌ వెటి 1964 వరకు బాప్తిస్మం తీసుకోకపోయినా, 1930వ దశాబ్దం నుండి ఆయన ఒక యెహోవాసాక్షిగానే అందరికీ బాగా తెలుసు. సాక్ష్యపు పనిలో ఇతరులు ఆయనతో చేరగా, 1966లో 30 మంది కూర్చోగల ఒక రాజ్యమందిరం నిర్మించబడింది. 1970లో నుకువలోఫాలో 20 మంది రాజ్య ప్రచారకులతో ఒక సంఘం రూపొందించబడింది.

అప్పటినుండి, టోంగా దీవుల్లో యెషయా ప్రవక్త పలికిన ఈ మాటల నెరవేర్పును స్పష్టంగా చూడవచ్చు: “ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక.” (యెషయా 42:​12) యెహోవాతో సంబంధం ఏర్పరచుకోవడానికి అనేకమందికి సహాయపడుతూ, రాజ్య సేవ ముందుకు కొనసాగింది. 2003లో నుకువలోఫాలో జరిగిన జిల్లా సమావేశానికి శిఖరాగ్ర స్థాయిలో 407 మంది హాజరవగా ఐదుగురు బాప్తిస్మం తీసుకున్నారు. 2004లో జ్ఞాపకార్థ ఆచరణకు 621 మంది హాజరవడం అక్కడి అభివృద్ధి సాధ్యతను సూచిస్తోంది.

నిరాడంబర జీవితం గడపడం

అయితే, రాజధానికి దూరంగా రాజ్య ప్రచారకుల అవసరం ఉన్నట్లుగా కనబడుతోంది. ఉదాహరణకు, హాపి ద్వీప సమూహంలోని 16 దీవుల్లో నివసించే 8,500 మంది బైబిలు సత్యం గురించి మరింత తెలుసుకోవలసి ఉంది. హాపి ద్వీప సముదాయంలో ముఖ్యంగా కొబ్బరి, ఈత, తాటిచెట్లతో నిండిన తెల్లని ఇసుకగల పొడవైన సముద్ర తీరాలున్న దిగువప్రాంత దీవులు ఉన్నాయి. సముద్రపు నీరు 30 మీటర్లకంటే లోతుగా ఉన్నప్పటికీ స్పష్టంగా కనబడేంత తేటగా ఆ నీరు ఉంటుంది. పగడపు దిబ్బలు, వందకంటే ఎక్కువ రకాల రంగురంగుల ఉష్ణప్రాంత చేపల మధ్య ఈదడం అపురూపమైన అనుభవంగా ఉంటుంది. గ్రామాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. ఇళ్లు నిరాడంబరంగా ఉన్నప్పటికీ, ఉష్ణప్రాంత తుఫానులను తట్టుకునేలా నిర్మించబడతాయి.

బ్రెడ్‌ఫ్రూట్‌, మామిడివంటి చెట్లు నీడను, ఆహారాన్ని ఇస్తాయి. ఆహారం సేకరించడానికి, సిద్ధం చేయడానికే రోజులో అధికభాగం పోతుంది. పంది మాంసంతోపాటు సముద్రంలో దొరికే చేపలను ద్వీపవాసులు ఆస్వాదిస్తారు. ఇంటి పెరట్లో వారు దుంపలు, కూరగాయలు పండిస్తారు. నిమ్మ, దబ్బ, నారింజలాంటి చెట్లు సాగు చేయనక్కర లేకుండానే పెరుగుతాయి, కొబ్బరి, అరటి చెట్లకు కొదువే లేదు. ఔషధ మొక్కలు, ఆకులు, బెరడు, వేర్లకు సంబంధించిన పరిజ్ఞానం ఒక తరంనుండి మరో తరానికి సంక్రమింపజేయబడుతోంది.

అయితే హాపిలో అత్యంత ఆహ్లాదకరమైన విషయమేమిటంటే ప్రశాంత వాతావరణానికి తగ్గట్టుగావుండే అక్కడి స్నేహశీలురైన ప్రజలు. నిరాడంబరతే అక్కడి జీవన విధానం. స్త్రీలలో అధికశాతం బుట్టలు అల్లడం, టాప వస్త్రం నేయడం, చాపలు అల్లడంలాంటి చేతిపనులు చేస్తుంటారు. టోంగా స్త్రీలు చెట్లనీడలో కూర్చొని, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, పాడుకుంటూ పనిచేసుకుంటుంటే, పిల్లలు, శిశువులు దగ్గర్లో ఆడుతూనో లేదా నిద్రపోతూనో ఉండడం కనిపిస్తుంది. సాధారణంగా స్త్రీలే అలలు వచ్చే తీర ప్రాంతాల్లో గుల్ల చేపలను, ఆహారానికి పనికొచ్చే చేపలను, రుచికరమైన సలాడ్‌కు పనికొచ్చే కరకరలాడే సముద్రపు మొక్కలను సేకరిస్తారు.

పురుషులు ఎక్కువగా తోటపని, చేపలు పట్టడం, కళాకృతులు చేయడం, పడవలు నిర్మించడం, వలలు అల్లడం వంటివాటికి తమ సమయాన్ని వెచ్చిస్తుంటారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఇతర దీవుల్లోని బంధువులను చూడ్డానికి, వైద్యానికి, వ్యాపారానికి లేదా వస్తువులను అమ్మడానికి చిన్న గూడు పడవల్లో ప్రయాణిస్తుంటారు.

సువార్త చేరలేని మారుమూల ప్రాంతమేదీ లేదు

ఈ సుందర ప్రదేశానికి 2002 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇద్దరు మిషనరీలు, ఇద్దరు పయినీర్లు చేరుకున్నారు. అంతకుముందు అక్కడివారిని అప్పుడప్పుడు కలవడం జరిగింది, దానితో హాపి ప్రజలకు యెహోవాసాక్షుల ప్రచురణలు లభించాయి, కొంతమంది సాక్షులతో బైబిలు అధ్యయనం కూడా చేశారు.

ఆ నలుగురు బైబిలు బోధకులు మూడు లక్ష్యాలతో అక్కడికి చేరుకున్నారు: బైబిలు సాహిత్యాలు అందించడం, గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడం, ఆసక్తిగలవారిని ప్రభువు రాత్రి భోజన ఆచరణకు ఆహ్వానించడం. ఆ మూడు లక్ష్యాలు నెరవేరాయి. యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవమని ఇచ్చిన ఆహ్వానానికి తొంభై ఏడుగురు స్పందించారు. భారీ వర్షం, ఈదర గాలుల మధ్య కూడా కొందరు గూడులేని పడవల్లో ప్రయాణించివచ్చారు. వాతావరణం సరిగాలేని కారణంగా చాలామంది జ్ఞాపకార్థ ఆచరణ జరిగిన చోటే ఆ రాత్రికి ఉండిపోయి మరుసటి రోజు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.

జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగీకుని పరిస్థితి కూడా చెప్పనలవికానిదే. “ఒకే రోజు సాయంకాలం పరాయి భాషలో రెండు జ్ఞాపకార్థ ప్రసంగాలు ఇవ్వడం ఎంత కష్టమో నేను మీకు చెప్పనక్కర్లేదు. నేనెంత కంగారుపడ్డానో మీరు ఊహించవచ్చు. ప్రార్థన నాకెంతో సహాయం చేసింది. నాకు వచ్చని నాకే అంతగా తెలియని పదాలను, వాక్యాలను గుర్తుతెచ్చుకున్నాను” అని ఆ ప్రసంగాలిచ్చిన మిషనరీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు.

హాపి ద్వీపాల్లోవున్న ఆసక్తిని సువార్తికులు పెంపొందించడంవల్ల ఆ ప్రాంతంలోని రెండు వివాహిత జంటలు బాప్తిస్మం తీసుకున్నాయి. వారిలో ఒక భర్త స్థానిక చర్చీలో పరిచారకుడయ్యేందుకు శిక్షణ తీసుకుంటున్న కాలంలో సాక్షుల సాహిత్యాలపట్ల ఆసక్తి చూపాడు.

ఆ భార్యభర్తలు అంత స్థితిపరులు కాకపోయినప్పటికీ, వార్షిక విరాళాల సేకరణా కాలంలో చర్చిలో వారి పేర్లు పిలవబడినప్పుడు డబ్బు ఎక్కువగానే ఇచ్చేవారు. అంతకుముందు వారిని సందర్శించిన సాక్షి ఒకరు, 1 తిమోతి 5:8 తీసి చదవమని భర్తను ఆహ్వానించాడు. అక్కడ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” ఈ బైబిలు సూత్రం భర్త హృదయాన్ని స్పృశించింది. చర్చి పట్టుపట్టి అడుగుతున్న డబ్బును విరాళంగా వేయడం ద్వారా, తన కుటుంబ కనీస అవసరాలు తాను తీర్చలేకపోతున్నట్లు ఆయన గ్రహించాడు. మరుసటి వార్షిక విరాళ సేకరణ కూటంలో తన జేబులో డబ్బు ఉన్నప్పటికీ, 1 తిమోతి 5:⁠8ని ఆయన మర్చిపోలేకపోయాడు. ఆయన తన పేరు పిలిచినప్పుడు, తన కుటుంబ అవసరతలు తనకు ప్రధానమని ధైర్యంగా ప్రీస్టుకు చెప్పాడు. ఫలితంగా చర్చీ పెద్దలు ఆ దంపతులను బహిరంగంగానే చులకనచేసి, తూలనాడారు.

యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసిన తర్వాత ఆ భార్యాభర్తలు సువార్త ప్రచారకులయ్యారు. భర్త ఇలా అంటున్నాడు: “బైబిలు సత్యం నన్ను మార్చింది. నేను నా కుటుంబంపట్ల ఇక ఎంతమాత్రం క్రూరునిగా, కఠినంగా లేను. నేనెంత మాత్రం అమితంగా త్రాగడం లేదు. సత్యం నా జీవితంలో తీసుకొచ్చిన మార్పును గ్రామస్థులు చూడగలుగుతున్నారు. నాలాగే వాళ్లుకూడా సత్యాన్ని ప్రేమిస్తారని నిరీక్షిస్తున్నాను.”

అన్వేషణలో క్వెస్ట్‌ ఉపయోగించబడింది

2002 జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత కొద్ది నెలలకు, మారుమూల హాపికి మరోనావ అమూల్యమైన సరుకు తీసుకొచ్చింది. న్యూజీలాండ్‌ నుండి 18 మీటర్ల పొడవుగల క్వెస్ట్‌ అనే నావ ఒకటి టోంగా దీవులకు చేరుకుంది. గ్యారీ, హిటీ తమ కూతురు కాటీతోపాటు ఆ నావలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు ప్రయాణాల్లో వారితోపాటు తొమ్మిదిమంది టోంగా సహోదర సహోదరీలు, ఇద్దరు మిషనరీలు కూడా వెళ్లారు. స్థానిక సాక్షులు ఆ నావను, కొన్నిసార్లు దాగివున్న పగడపు దిబ్బలగుండా, చాకచక్యంగా నడపడానికి సహాయం చేశారు. ఈ ప్రయాణాలు అంత ఆహ్లాదకరమైనవేమీ కావు. ఆ నావలో ప్రయాణిస్తున్నవారు బైబిలు సత్యం బోధించడానికి వచ్చారు. ఆ ప్రయాణంలో వారు ఆ సముద్రంలో అక్కడక్కడా చెదిరివున్న 14 ద్వీపాలను చుట్టివచ్చారు. ఆ ద్వీపాల్లో కొన్నింటిలో రాజ్య సువార్త ఇంతకు ముందెన్నడూ ప్రకటించబడలేదు.

మరి ప్రజలెలా స్పందించారు? సముద్ర ప్రయాణంచేసి వచ్చే సువార్త ప్రచారకులు సాధారణంగా కుతూహలం, ఆప్యాయతలు కలగలసిన, ద్వీపంలోని సాంప్రదాయ ఆతిథ్యభావంతో ఆహ్వానించబడతారు. ద్వీపవాసులు సందర్శకుల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న తర్వాత తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచారు. ద్వీపవాసులకు దేవుని వాక్యంపట్ల గౌరవం ఉందనీ, వారు తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తిస్తున్నారనీ సందర్శక సాక్షులకు స్పష్టమైంది.​—⁠మత్తయి 5:3.

అనేక సందర్భాల్లో ఆ సందర్శకులు ఉష్ణ ప్రాంతపు చెట్ల క్రింద కూర్చొని తమచుట్టూ చేరి అనేక ప్రశ్నలడిగే ప్రజలతో మాట్లాడారు. చీకటి పడినప్పుడు, ఇళ్లలో బైబిలు చర్చలు కొనసాగాయి. తిరిగి వెళ్లిపోతున్న సాక్షులతో ఒక ద్వీపవాసులు బిగ్గరగా “వెళ్లకండి! మీరు వెళ్లిపోతే మా ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు” అని అడిగారు. ఒక సాక్షి ఇలా అంటున్నాడు: “సత్యం కోసం ఆకలిదప్పులుగల అంతమంది గొర్రెలాంటి ప్రజలను విడిచి రావడం అన్ని సమయాల్లో అంత సులభమయ్యేది కాదు. అనేక సత్యపు విత్తనాలు నాటబడ్డాయి.” క్వెస్ట్‌ మరో ద్వీపానికి చేరుకున్నప్పుడు, అక్కడ ప్రతీ ఒక్కరు విలాప దుస్తులు ధరించి ఉండడం గమనించారు. ఆ పట్టణ అధికారి భార్య చనిపోయింది. బైబిలు నుండి ఓదార్పుకరమైన సందేశాన్ని తీసుకొచ్చినందుకు ఆయన వ్యక్తిగతంగా సహోదరులకు కృతజ్ఞతలు చెప్పాడు.

కొన్ని దీవులకు వెళ్లడం అంత సులభం కాదు. హిటీ ఇలా వివరిస్తోంది: “ఒక ద్వీపంలో ఒడ్డుకుచేరే మార్గమే లేదు, ఒక మీటరు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తుగావున్న దిబ్బలు సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లుగా ఉన్నాయి. చిన్న రబ్బరు పడవలో మాత్రమే ఒడ్డుకు చేరే అవకాశముంది. సాయం చేయడానికి వచ్చిన వారు అందుకొనేలా మొదట మేము మా బ్యాగులు ఒడ్డుకు విసిరేవాళ్లం. ఆ తర్వాత, ఆ రబ్బరు పడవ అలలతోపాటు గుట్టమీద ఉబ్బెత్తు ప్రాంతానికి చేరుకున్నప్పుడు, అది తిరిగి సముద్రంలోకి కిందికి జారకముందే మేము గుట్టమీదకు దూకేసేవాళ్లం.”

అయితే ఆ నావలో ఉన్న వారందరూ ధీరులైన సముద్ర ప్రయాణికులేమీ కాదు. రెండు వారాల ప్రయాణం తర్వాత, టోంగాటాపుకు తిరిగి రావడం గురించి నావ నాయకుడు ఇలా వ్రాశాడు: “మేమింకా 18 గంటలు ప్రయాణం చేయాలి. సముద్ర ప్రయాణం పడనివారు ఉన్న కారణంగా మేము ఏకబిగిన ప్రయాణం చేయడం సాధ్యంకాదు. ఇంటికి తిరిగి వెళ్లడం మాకు ఆనందంగా ఉన్నప్పటికీ, రాజ్య సందేశాన్ని విన్న అంతమందిని వదిలివెళ్లడం మాకు బాధ కలిగిస్తోంది. వారు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు యెహోవా పరిశుద్ధాత్మ, దేవదూతలు సహాయం చేయాలని ఆశిస్తూ మేము వారిని ఆయన సంరక్షణలో విడిచివచ్చాం.”

ఉజ్జ్వల ఉత్తరాపేక్షగల ద్వీపాలు

క్వెస్ట్‌ వెళ్లిన దాదాపు ఆరునెలలకు, హాపి ద్వీప సముదాయాల్లో ప్రకటించేందుకు స్టీవెన్‌, మలాకి అనే ఇద్దరు ప్రత్యేక పయినీరు సువార్తికులు నియమించబడ్డారు. ఇటీవలే బాప్తిస్మం తీసుకున్న రెండు వివాహిత జంటలు బైబిలు బోధించడంలో వారితో కలిశాయి. సిద్ధాంతాలకు సంబంధించి ఉత్సాహవంతమైన చర్చలు కొనసాగుతున్నాయి, ప్రచారకులు బైబిలును ఫలవంతంగా ఉపయోగిస్తున్నారు.

2003, డిసెంబరు 1న హాపిలో ఒక కొత్త సంఘం స్థాపించబడింది, ఇది టోంగాలో ఐదవ సంఘం. హాజరవుతున్న వారిలో పిల్లలే అధికశాతం. శ్రద్ధగా వినడం వారు నేర్చుకున్నారు. వారు నిశ్శబ్దంగా కూర్చొని, ప్రేక్షకులు వ్యాఖ్యానించే భాగాల్లో పాలుపంచుకోవడానికి ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. “నా బైబిలు కథల పుస్తకములో వారికున్న పరిజ్ఞానం తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిలు సత్యాన్ని అభ్యసింపజేయవలసిన తమ బాధ్యతను గంభీరంగా తీసుకుంటున్నట్లు చూపిస్తోంది” అని ప్రాంతీయ పైవిచారణకర్త వ్రాశాడు. కాబట్టి, యెహోవాకు స్నేహితులుకాగల వారు అనేకమంది ఉన్నారనే ఉజ్జ్వల ఉత్తరాపేక్షకు ఆ ద్వీపాలు ఆస్కారమిస్తున్నాయని స్పష్టమవుతోంది.

దాదాపు 70 సంవత్సరాల పూర్వం మృతులు ఎక్కడున్నారు? అనే చిన్న పుస్తకాన్ని చార్లెస్‌ వెటి స్థానిక టోంగా భాషలోకి అనువదించినప్పుడు, తన స్వదేశీయుల హృదయాల్లో రాజ్య సత్యం ఎంత విస్తారంగా వేళ్ళూనుకుంటుందో ఆయన గ్రహించలేదు. అలా చిన్న కార్యంతో ఆరంభమైన సేవను, యెహోవా భూగోళపు ఆ మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటనా పని విస్తరణను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నేడు, యెహోవాను ఆశ్రయించే అనేక మారుమూల ద్వీపాల్లో టోంగా ఒకటని నిశ్చయంగా చెప్పవచ్చు. (కీర్తన 97:1; యెషయా 51:⁠5) ఆ “స్నేహశీల ద్వీపాలు” ఇప్పుడు అనేకమంది యెహోవా స్నేహితులకు ఆవాసంగా ఉన్నాయి.

[8వ పేజీలోని చిత్రం]

ఛార్లెస్‌ వెటి, 1983

[9వ పేజీలోని చిత్రం]

టాప వస్త్రాన్ని నేయడం

[10వ పేజీలోని చిత్రం]

టోంగాలో సువార్త ప్రకటించడానికి “క్వెస్ట్‌” ఉపయోగించబడింది

[11వ పేజీలోని చిత్రం]

అనువాద బృందం, నుకువలోఫా

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

టాప వస్త్రాన్ని నేయడం: © Jack Fields/CORBIS; 8, 9 పేజీల నేపథ్యం, చేపలు పట్టడం: © Fred J. Eckert