దైవిక జ్ఞానం సహాయంతో మీ పిల్లలను కాపాడుకోవడం
దైవిక జ్ఞానం సహాయంతో మీ పిల్లలను కాపాడుకోవడం
ప్రతీరోజు మన శరీరాలు పోరాటం చేయాలి. అవి వేలాది సూక్ష్మక్రిములను ఎదిరించాలి. అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, అలాంటి దాడులనుండి మనల్ని రక్షించి మనం అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడే రోగనిరోధక వ్యవస్థ మనకు వారసత్వంగా లభించింది.
అదేవిధంగా క్రైస్తవులు లేఖనవిరుద్ధమైన ఆలోచనా విధానంతో, లేఖనవిరుద్ధమైన విలువలతో, మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నాశనం చేయగల ఒత్తిళ్ళతో పోరాడాలి. (2 కొరింథీయులు 11:3) మన మనస్సులపై హృదయాలపై ప్రతీరోజు జరిగే ఈ దాడిని నిరోధించడానికి మనం ఆధ్యాత్మిక ఆత్మరక్షణా పద్ధతులను అలవరచుకోవాలి.
అలాంటి ఆత్మరక్షణా పద్ధతులు మన పిల్లలకు ఎంతో అవసరం, ఎందుకంటే ఈ లోకాత్మను నిరోధించే ఆధ్యాత్మిక రక్షణతో వారు జన్మించలేదు. (ఎఫెసీయులు 2:2) పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారు తమ సొంత ఆత్మరక్షణా పద్ధతులను వృద్ధిచేసుకునేందుకు తల్లిదండ్రులు వారికి సహాయం చేయడం ఎంతో అవసరం. ఆ పద్ధతులు దేనిపై ఆధారపడివుంటాయి? బైబిలు ఇలా వివరిస్తోంది: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు . . . తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.” (సామెతలు 2:6, 8) హానికరమైన సహవాసానికి, స్నేహితుల ఒత్తిడికి, చెడు వినోదానికి లొంగిపోయే యౌవనస్థులను దైవిక జ్ఞానం కాపాడగలదు. తల్లిదండ్రులు యెహోవా మార్గనిర్దేశాన్ని అనుసరించి తమ పిల్లలకు దైవిక జ్ఞానాన్ని ఎలా నేర్పించవచ్చు?
ప్రోత్సాహకరమైన సహవాసాన్ని వెదకడం
యౌవనస్థులు ఇతర యౌవనస్థుల సహవాసాన్ని ఇష్టపడతారు, అయితే వారు అనుభవంలేని ఇతర యౌవనస్థులతో మాత్రమే సహవసిస్తే అది వారు దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, దానిని ఉపయోగించడానికి సహాయం చేయదు. “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని ఒక సామెత హెచ్చరిస్తోంది. (సామెతలు 22:15) సహవాసం విషయంలో దైవిక జ్ఞానాన్ని అన్వయించుకోవడానికి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేశారు?
డాన్ * అనే తండ్రి ఇలా చెప్పాడు: “మా అబ్బాయిలు తమ వయసుకు చెందిన స్నేహితులతో చాలా సమయం గడిపేవారు, అయితే వారు మా ఇంట్లో మా సమక్షంలోనే తమ స్నేహితులతో సమయం గడిపేవారు. మేము ఎప్పుడూ పిల్లలకు స్వాగతం పలికేవాళ్ళము కాబట్టి మా ఇల్లు ఎప్పుడూ పిల్లలతో నిండివుండేది, వారికి మేము తినడానికి కావలసినవి వండిపెట్టి చక్కగా చూసుకునేవాళ్ళము. పిల్లలు సంతోషంగా గడపడానికి సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు మేము వారు చేసే గోలను భరించడానికి కూడా సిద్ధపడ్డాం.”
బ్రాయన్‌కు, మేరీకి ముగ్గురు చక్కని పిల్లలున్నారు, అయితే వారిని పెంచడం అంత సులభం కాదని వారు ఒప్పుకుంటున్నారు. వారు ఇలా చెప్పారు: “మా సంఘంలో మా అమ్మాయి జేన్‌తో సహవసించడానికి యౌవనస్థులు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే జేన్‌కు సూజన్ అనే స్నేహపూర్వకమైన ఉత్సాహవంతమైన యువతి స్నేహితురాలిగా ఉండేది. సూజన్ తల్లిదండ్రులు మేము ఉన్నంత ఖచ్చితంగా ఉండేవారు కాదు. సూజన్‌కు రాత్రి బాగా పొద్దుపోయే వరకూ బయట తిరగడానికి, కురచగావుండే స్కర్టులు వేసుకోవడానికి, అశ్లీలమైన సంగీతం వినడానికి, చెడు సినిమాలు చూడడానికి అనుమతి లభించేది. చాలాకాలం వరకూ జేన్‌కు మేము తనను ఎందుకు అనుమతించడం లేదు అనే విషయం అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది. ఆమెకు సూజన్ తల్లిదండ్రులు మరింత అర్థం చేసుకునేవారిగా కనిపించారు, మేమేమో మరీ ఖచ్చితంగా ఉండేవారిగా కనిపించాము. అయితే మేము అలా స్థిరంగా ఉండడమే తనను కాపాడిందని, సూజన్ కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మాత్రమే జేన్‌కు అర్థమయ్యింది. మేము మా అమ్మాయికి సరైనవి అని తలంచినవాటి విషయంలో స్థిరంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము.”
జేన్‌లాగే చాలామంది యౌవనస్థులు, సహవాసుల విషయంలో తమ తల్లిదండ్రుల సలహాను స్వీకరించడం జ్ఞానయుక్తమని తెలుసుకున్నారు. “జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును” అని ఒక సామెత చెబుతోంది. (సామెతలు 15:31) దైవిక జ్ఞానం, యౌవనస్థులు ప్రోత్సాహకరమైన స్నేహితుల సహవాసాన్ని వెదికేలా చేస్తుంది.
వేరేవాళ్ళలా ప్రవర్తించాలని కలిగే ఒత్తిడిని అధిగమించడం
సహవాసానికి, స్నేహితుల ఒత్తిడికి దగ్గరి సంబంధం ఉంది. వేరేవాళ్ళలా ప్రవర్తించాలనే ఒత్తిడి మన పిల్లల ఆత్మరక్షణా పద్ధతులపై దాడి చేస్తూనే ఉంటుంది. యౌవనస్థులు తమ వయసుకు చెందినవారి ఆమోదం పొందాలని ప్రయత్నిస్తారు కాబట్టి ఈ లోకం ఆకర్షణీయమైనదిగా దృష్టించేవాటిని చేయమని వారి స్నేహితులు వారిని బలవంతపెట్టవచ్చు.—సామెతలు 29:25.
“లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని బైబిలు మనకు గుర్తు చేస్తోంది. (1 యోహాను 2:17) కాబట్టి ఈ లోకపు దృక్కోణాలను మరీ ఎక్కువగా పట్టించుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతించకూడదు. క్రైస్తవులకు తగినవిధంగా ఆలోచించేలా వారు తమ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?
రిచర్డ్ అనే ఒక తండ్రి ఇలా చెప్పాడు: “మా కూతురు ఇతర యౌవనస్థులు వేసుకునేలాంటి దుస్తులే కావాలని మారాం చేసేది. కాబట్టి ఆమె ఏదైనా కోరిన ప్రతిసారి మేము ఆ కోరికవల్ల వచ్చే లాభనష్టాలను ఓపికగా ఆమెతో చర్చించేవాళ్ళము. అంగీకారయోగ్యమైన ఫ్యాషన్లే అనిపించే దుస్తుల విషయంలో కూడా మేము కొన్ని సంవత్సరాల క్రితం విన్న ఈ సలహాను పాటించేవాళ్ళము: ‘కొత్త ఫ్యాషన్ దుస్తులను వెంటనే కొనని వ్యక్తి, అందరూ వదిలేసినా దానినే పట్టుకొని వేలాడని వ్యక్తి తెలివైనవాడు.’”
పౌలీన్ అనే పేరుగల ఒక తల్లి, స్నేహితులనుండి వచ్చే ఒత్తిడితో మరో విధంగా పోరాడింది. ఆమె ఇలా గుర్తు చేసుకుంది: “నా పిల్లలు ఆసక్తి చూపించే విషయాల్లో నేను కూడా ఆసక్తి చూపించేదాన్ని, వారితో మాట్లాడడానికి క్రమంగా వాళ్ళ గదికి వెళ్ళేదాన్ని. నేను అలా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతూ గడపడంవల్ల వారి ఆలోచనా విధానాన్ని మలిచి, విషయాలను ఇతర విధాలుగా కూడా ఎలా దృష్టించవచ్చో అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేశాను.”
స్నేహితుల ఒత్తిడి ఎల్లప్పుడూ ఉంటుంది, కాబట్టి తల్లిదండ్రులు ‘లౌకిక వితర్కములను పడద్రోసి,’ పిల్లలు తమ 2 కొరింథీయులు 10:5) అయితే తల్లిదండ్రులు పిల్లలు ‘ప్రార్థనయందు పట్టుదల కలిగియుండడం’ ద్వారా ఆ ప్రాముఖ్యమైన పనిని పూర్తిచేయడానికి కావలసిన బలాన్ని పొందవచ్చు.—రోమీయులు 12:12; కీర్తన 65:2.
ఆలోచనలను ‘క్రీస్తుకు లోబడునట్లు’ చేసుకునేందుకు వారికి సహాయం చేయడానికి ఎడతెగక పోరాడవలసి రావచ్చు. (వినోదం యొక్క శక్తిమంతమైన ఆకర్షణ
తల్లిదండ్రులు అధిగమించడానికి కష్టంగా అనిపించే మూడవ ప్రభావం, వినోదం. సహజంగానే చిన్న పిల్లలకు వినోదమంటే ఇష్టముంటుంది. ఇంకాస్త పెద్ద పిల్లలు కూడా వినోద కాలక్షేపాన్ని ఎంతో ఇష్టపడతారు. (2 తిమోతి 2:22) కానీ తెలివితక్కువ పద్ధతుల్లో వినోదాన్ని పొందాలని చూస్తే అది వారి ఆధ్యాత్మిక ఆత్మరక్షణను బలహీనపరుస్తుంది. ఆ ప్రమాదం ముఖ్యంగా రెండు విధాలుగా వస్తుంది.
మొదటిగా వినోద కార్యక్రమాల్లో చాలామట్టుకు ఈ లోకపు నీచమైన నైతిక ప్రమాణాలు చూపించబడతాయి. (ఎఫెసీయులు 4:17-19) అవి నీచమైనవే అయినా ఎంతో ఉత్తేజవంతమైన, ఆకర్షణీయమైన విధంగా చూపించబడతాయి. ఉచ్చులు ఉన్నాయని గ్రహించని యౌవనస్థులకు అది ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
రెండవది, వినోదం కోసం వెచ్చించే సమయం కూడా సమస్యలను తేగలదు. కొంతమందికి సరదాగా గడపడమే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా తయారవుతుంది, వారు దాని కోసం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చిస్తారు. “తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు” అని సామెతలు హెచ్చరిస్తోంది. (సామెతలు 25:27) అదేవిధంగా మితిమీరిన వినోదం ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవాలనే కోరికను నశింపజేసి, మానసిక సోమరితనానికి నడిపిస్తుంది. (సామెతలు 21:17; 24:30-34) ఈ లోకాన్ని అమితముగా అనుభవించడం, యౌవనస్థులను ‘వాస్తవమైన జీవమును సంపాదించుకోకుండా’ అంటే దేవుని నూతనలోకంలో నిత్యజీవం సంపాదించుకోకుండా అడ్డుకుంటుంది. (1 తిమోతి 6:12, 18) తల్లిదండ్రులు ఈ సవాలుతో ఎలా వ్యవహరించారు?
ముగ్గురు కూతుర్ల తల్లి మేరి కార్మెన్ ఇలా చెప్పింది: “మా అమ్మాయిలు ఆరోగ్యకరమైన ఉల్లాస కార్యకలాపాల్లో పాల్గొని సంతోషకరమైన సమయం గడపాలని మేము అనుకున్నాము. కాబట్టి మా కుటుంబమంతా కలిసి క్రమంగా బయటకు వెళ్ళేవాళ్ళము, వారు సంఘంలోని స్నేహితులతో కూడా సమయం గడిపేవారు. అయితే మేము ఉల్లాస కార్యకలాపాలకు సరైన స్థానాన్ని మాత్రమే ఇచ్చాము. మేము దానిని భోజనం ముగిసిన తర్వాత తినే మిఠాయితో పోల్చాము, అది తియ్యగా రుచికరంగా ఉంటుంది కానీ అదే అత్యంత ప్రాముఖ్యమైన ఆహారం కాదు. వారు ఇంటి దగ్గర, స్కూల్లో, సంఘంలో చక్కగా పనిచేసేవారిగా తయారయ్యారు.”
డాన్, రూత్ అనే దంపతులు కూడా తమ పిల్లలకు వినోదాన్ని అందించడానికి ప్రయత్నించేవారు. “మేము శనివారాన్ని కుటుంబమంతా కలిసి ఆనందంగా గడపడానికి కేటాయించేవాళ్ళము. మేము ఉదయం క్షేత్ర పరిచర్యకు వెళ్ళి, మధ్యాహ్నం ఈత కొట్టడానికి వెళ్ళి, సాయంత్రం ప్రత్యేక వంటలు చేసుకొని తినేవాళ్ళము” అని వారు వివరించారు.
ఈ తల్లిదండ్రుల వ్యాఖ్యానాలు, పిల్లలకు వినోదాన్ని అందించేటప్పుడు సమతుల్యంగా ఉండవలసిన ప్రాముఖ్యతనూ ఒక క్రైస్తవుని జీవితంలో దానికి సరైన స్థానాన్ని కేటాయించవలసిన అవసరాన్నీ చూపిస్తున్నాయి.—ప్రసంగి 3:4; ఫిలిప్పీయులు 4:5.
యెహోవాపై నమ్మకముంచండి
ఆధ్యాత్మిక ఆత్మరక్షణా పద్ధతులను పెంపొందించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. దైవిక జ్ఞానాన్ని అందించి, పిల్లలను తమ పరలోక తండ్రిపై విశ్వాసముంచడానికి కదిలించే అద్భుతమైన మందు లేదు. తల్లిదండ్రులే ‘ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి.’ (ఎఫెసీయులు 6:4) పిల్లలకు ఎల్లప్పుడూ ‘బోధిస్తూ ఉండడం’ అంటే వారికి విషయాలను దేవుడు దృష్టించే విధంగా దృష్టించడాన్ని నేర్పించడం అని అర్థం. తల్లిదండ్రులు దాన్ని ఎలా చేయవచ్చు?
క్రమమైన కుటుంబ బైబిలు అధ్యయనం చాలా ప్రాముఖ్యమైన అంశం. అలా అధ్యయనం చేయడం, ‘ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసేలా పిల్లల కన్నులు తెరుస్తుంది.’ (కీర్తన 119:18) త్యేగో కుటుంబ అధ్యయనాన్ని చాలా గంభీరంగా తీసుకొని తన పిల్లలు యెహోవాకు సన్నిహితమయ్యేందుకు సహాయం చేశాడు. “నేను అధ్యయనం కోసం బాగా సిద్ధపడేవాడిని. లేఖనాధారిత ప్రచురణల్లో పరిశోధన చేయడం ద్వారా నేను నా పిల్లలకు బైబిల్లోని పాత్రలను నిజమైన వ్యక్తులుగా చిత్రీకరించడం నేర్చుకున్నాను. తమ జీవితాలకు బైబిల్లోని నమ్మకమైన సేవకుల జీవితాలకు మధ్య ఉన్న పోలికలను గుర్తించమని నేను వారిని ప్రోత్సహించేవాడిని. అలా చేయడం ద్వారా నా పిల్లలు యెహోవాను ఏది సంతోషపరుస్తుంది అనే విషయాన్ని చక్కగా గుర్తుంచుకోగలిగారు.”
పిల్లలు క్రమపద్ధతిలోనే కాక మామూలుగా కూడా నేర్చుకుంటారు. ‘ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును’ తమ పిల్లలతో యెహోవా జ్ఞాపికల గురించి మాట్లాడమని మోషే తల్లిదండ్రులను ప్రోత్సహించాడు. (ద్వితీయోపదేశకాండము 6:7) ఒక తండ్రి ఇలా వివరించాడు: “నా కొడుకు తన హృదయాన్ని కుమ్మరించి తన భావాలను వ్యక్తం చేయడానికి సమయం కావాలి. మేమిద్దరం కలిసి వాహ్యాళికి వెళ్ళినప్పుడు లేదా ఏదో పని చేస్తున్నప్పుడు చివరికి వాడు తన భావాలను నిస్సంకోచంగా వ్యక్తం చేస్తాడు. అలాంటి సందర్భాల్లో మేము మా ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండేలా చక్కగా సంభాషించుకుంటాము.”
తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు కూడా పిల్లలపై ఎంతో ప్రభావం చూపించగలవు. తమ తల్లిదండ్రులు సహాయం కోసం క్షమాపణ కోసం వినయంగా దేవునికి ప్రార్థించడాన్ని పిల్లలు విన్నప్పుడు, దేవుడు ‘ఉన్నాడని నమ్మేందుకు’ వారు కదిలించబడతారు. (హెబ్రీయులు 11:6) పిల్లలను చక్కగా పెంచడంలో కృతార్థులైన తల్లిదండ్రులు చాలామంది కుటుంబమంతా చేసే ప్రార్థనల ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు, వారు చేసే ప్రార్థనల్లో స్కూలు విషయాలు, తమ పిల్లలు చింతిస్తున్న ఇతర విషయాల గురించి చేసే ప్రార్థనలు కూడా చేరివుండాలి. పిల్లలు స్కూలుకు వెళ్లేముందు ప్రతీరోజు వారితో కలిసి తన భార్య ప్రార్థన చేస్తుంది అని ఒక తండ్రి చెప్పాడు.—కీర్తన 62:8; 112:7.
“మనము మేలుచేయుట యందు విసుకక యుందము”
తల్లిదండ్రులు తప్పులు చేస్తారు, వారు కొన్ని పరిస్థితుల్లో వ్యవహరించిన విధానం మంచిది కాదని తర్వాత చింతించవచ్చు. అలాంటప్పుడు కూడా ‘మేలుచేయుట యందు విసుకక’ ఉండమని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది.—గలతీయులు 6:9.
అయితే కొన్నిసార్లు తమ పిల్లలను అస్సలు అర్థం చేసుకోలేకపోయినప్పుడు తల్లిదండ్రులు ఇక తాము ఏమి చేయలేమని ఆశ వదులుకుంటారు. యువతరం భిన్నమైనది, దానిని అర్థం చేసుకోవడం కష్టం అనే ముగింపుకు రావడం సులభంగా అనిపిస్తుంది. కానీ వాస్తవమేమిటంటే, నేటి పిల్లలకు కూడా ముందు తరాలవారికి ఉన్న బలహీనతలే ఉన్నాయి, వారు కూడా అదే విధమైన శోధనలను ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు తప్పు చేయాలనే ఒత్తిడి మునుపటి కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక తండ్రి తన కొడుకును సరిదిద్దిన తర్వాత, దయాపూర్వకంగా ఇలా అన్నాడు: “నేను నీ వయసులో ఉన్నప్పుడు నా హృదయం చేయాలని కోరుకున్నవాటినే నీ హృదయం కూడా చేయాలని కోరుకుంటోంది.” తల్లిదండ్రులకు కంప్యూటర్ల గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ వారికి అపరిపూర్ణ శరీరపు కోరికల గురించి బాగా తెలుసు.—మత్తయి 26:41; 2 కొరింథీయులు 2:11.
బహుశా కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల నడిపింపును స్వీకరించడానికి ఇష్టపడకపోవచ్చు, వారికి లభించే శిక్షణపట్ల వారు తిరుగుబాటు కూడా చేయవచ్చు. అలాంటప్పుడు సామెతలు 22:6; 23:22-25) ఇప్పుడు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న మాథ్యూ అనే యువ క్రైస్తవుడు ఇలా చెప్పాడు: “నేను యౌవనస్థుడిగా ఉన్నప్పుడు, నా తల్లిదండ్రులు విధించే పరిమితులు సరైనవి కావని భావించేవాడిని. నా స్నేహితుల తల్లిదండ్రులు అనుమతించినప్పుడు నా తల్లిదండ్రులు ఎందుకు అనుమతించకూడదు? అని నేను తర్కించేవాడిని. నాకు పడవ నడపడమంటే చాలా ఇష్టం, అయితే నా తల్లిదండ్రులు కొన్నిసార్లు క్రమశిక్షణలో భాగంగా, పడవ నడిపేందుకు నన్ను అనుమతించేవారు కాదు, అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. అయితే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ సమర్థవంతమైనదే కాక అవసరమైనది కూడా అని తెలుసుకున్నాను. నాకు అవసరమైన నడిపింపును సరిగ్గా నాకు అవసరమైన సమయంలో ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని.”
తల్లిదండ్రులకు మళ్ళీ సహనం అవసరం. పిల్లలు మొదట్లో శిక్షణను ఇష్టపడకపోయినా, వినడానికి మొండికేసినా చాలామంది పిల్లలు చివరకు తమ తల్లిదండ్రుల మాట వింటారు. (మన పిల్లలు కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉండవలసి వచ్చినా వారు చక్కని క్రైస్తవులుగా పెరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. బైబిలు వాగ్దానం చేస్తున్నట్లుగా దైవిక జ్ఞానం వారికి ఆధ్యాత్మిక ఆత్మరక్షణా పద్ధతులను నేర్పించగలదు. “జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.”—సామెతలు 2:10-12.
ఒక శిశువును తొమ్మిది మాసాలపాటు గర్భంలో మోయడం సులభమైన విషయం కాదు. ఆ తర్వాత వచ్చే 20 సంవత్సరాలు సంతోషంతోపాటు కొంత భావోద్వేగపరమైన బాధను కూడా తెస్తాయి. కానీ క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు కాబట్టి వారిని దైవిక జ్ఞానం ద్వారా కాపాడడానికి తమ శాయశక్తులా కృషి చేస్తారు. వృద్ధ అపొస్తలుడైన యోహాను తన ఆధ్యాత్మిక పిల్లల గురించి భావించినట్లే వారు తమ పిల్లల గురించి ఇలా భావిస్తారు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.”—3 యోహాను 4.
[అధస్సూచి]
^ పేరా 7 ఈ ఆర్టికల్‌లో కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[24వ పేజీలోని చిత్రం]
“మేము పిల్లలకు ఎప్పుడూ స్వాగతం పలికేవాళ్ళము కాబట్టి మా ఇల్లు ఎప్పుడూ పిల్లలతో నిండివుండేది”
[25వ పేజీలోని చిత్రం]
మీ పిల్లలు ఆసక్తి చూపించే విషయాల్లో మీరు కూడా ఆసక్తి చూపించండి
[26వ పేజీలోని చిత్రాలు]
“నేను అధ్యయనం కోసం బాగా సిద్ధపడేవాడిని”