కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతం మానవాళిని ఐక్యపరచగలదన్న నమ్మకం చాలామందికి ఎందుకు లేదు?

మతం మానవాళిని ఐక్యపరచగలదన్న నమ్మకం చాలామందికి ఎందుకు లేదు?

మతం మానవాళిని ఐక్యపరచగలదన్న నమ్మకం చాలామందికి ఎందుకు లేదు?

“నీ పొరుగువాని ప్రేమింప వలెను.” (మత్తయి 22:​39) మానవుల ప్రవర్తనను నిర్దేశించే ఈ ప్రాథమిక నియమాన్ని చాలా మతాలు ఎంతో ప్రశంసిస్తాయి. ఆ మతాలు పొరుగువారిని ప్రేమించమని తమ సభ్యులకు సమర్థవంతంగా బోధించివుంటే, వారు ఒకరికొకరు సన్నిహితమై ఐక్యంగా ఉండేవారే. అయితే మీరు అలా జరగడాన్ని చూశారా? మతాలు ప్రజలను ఐక్యపరిచే శక్తిగా ఉన్నాయా? జర్మనీలో ఇటీవల జరిగిన ఒక సర్వేలో ఈ ప్రశ్న వేయబడింది: “మతాలు ప్రజలను ఐక్యపరుస్తాయా లేక విభజిస్తాయా?” ఆ ప్రశ్నకు ప్రతిస్పందించినవారిలో 22 శాతం మంది మతాలు ప్రజలను ఐక్యపరుస్తాయని భావిస్తే, 52 శాతం మంది అవి ప్రజలను విభజిస్తాయని లేక వేరుచేస్తాయని భావించారు. బహుశా మీ దేశంలోని ప్రజలు కూడా అలాగే భావిస్తుండవచ్చు.

మతం మానవాళిని ఐక్యపరచగలదన్న నమ్మకం చాలామందికి ఎందుకు లేదు? బహుశా గతంలో జరిగిన సంఘటనల కారణంగా వారు అలా భావిస్తుండవచ్చు. మతం ప్రజలను సన్నిహితం చేసే బదులు తరచూ వారిని దూరం చేసింది. కొన్ని సందర్భాల్లో, మతం ముసుగులో అత్యంత దారుణమైన అకృత్యాలు జరిగాయి. గత 100 సంవత్సరాల చరిత్రలోని కొన్ని ఉదాహరణలు గమనించండి.

మతంచేత ప్రేరేపించబడినవి

రెండవ ప్రపంచ యుద్ధంలో రోమన్‌ క్యాథలిక్కు క్రొయేషియన్లు, బాల్కన్‌ రాష్ట్రాల్లోని సాంప్రదాయక సెర్బియన్లు పోరాటానికి దిగారు. ఈ రెండు గుంపులకు చెందినవారు, తమ పొరుగువారిని ప్రేమించమని తన అనుచరులకు బోధించిన యేసును అనుసరిస్తున్నామని చెప్పుకున్నారు. అయినా, ఒక పరిశోధకుడు చెప్పినట్లు, వారి పోరాటం “చరిత్రలోనే అత్యంత ఘోరమైన సామూహిక సంహారాలకు” దారి తీసింది. అప్పుడు 5,00,000 కంటే ఎక్కువమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మరణించారని తెలుసుకుని ప్రపంచం నివ్వెరపోయింది.

1947లో భారత ఉపఖండంలో జనాభా దాదాపు 40 కోట్లు, అది ప్రపంచ జనాభాలో 20 శాతం. వారిలో ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్‌లు, సిక్కులు ఉండేవారు. భారతదేశం విభాగించబడినప్పుడు ఇస్లామ్‌ దేశమైన పాకిస్తాన్‌ ఆవిర్భవించింది. అప్పుడు వరుసగా జరిగిన మతసంబంధ సామూహిక సంహారాల్లో రెండు దేశాల నుండి వలస వచ్చిన లక్షలాదిమంది శరణార్థులు దహించబడ్డారు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు, తుపాకులతో కాల్చబడ్డారు.

గగుర్పాటు కలిగించే పై ఉదాహరణలు చాలవన్నట్లు 21వ శతాబ్దం ప్రారంభంలోనే ఉగ్రవాదపు సమస్య మొదలయ్యింది. ఉగ్రవాదం నేడు మొత్తం ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకుంది, చాలా ఉగ్రవాద గుంపులు తమకు మతంతో సంబంధాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నాయి. మతం ఐకమత్యాన్ని ప్రోత్సహించేదిగా దృష్టించబడడంలేదు. బదులుగా అది తరచూ దౌర్జన్యంతోనూ ప్రజలను విభజించడంతోనూ ముడిపెట్టబడుతోంది. కాబట్టి ఫోకస్‌ అనే జర్మన్‌ వార్తాపత్రిక, ప్రపంచంలోని ప్రముఖ మతాలైన ఇస్లామ్‌, కన్ఫ్యూషియనిజమ్‌, క్రైస్తవత్వం, బౌద్ధ మతం, టావోయిజమ్‌, యూదా మతం, హిందూ మతం వంటి మతాలను పేలుడు పదార్థంతో పోల్చడంలో ఆశ్చర్యం లేదు.

అంతరంగిక జగడాలు

కొన్ని మతాలు ఇతర మతాలతో పోరాడుతుంటే మరికొన్ని మతాలు అంతరంగిక జగడాలతో సతమతమవుతున్నాయి. ఉదాహరణకు, ఇటీవలి సంవత్సరాల్లో క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు సిద్ధాంతాలకు సంబంధించి ఎంతోకాలంగా జరుగుతున్న వాదోపవాదాల కారణంగా చీలిపోయాయి. అటు మతనాయకులకు, ఇటు సాధారణ ప్రజలకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు: కుటుంబ నియంత్రణను అనుమతించవచ్చా? గర్భస్రావం విషయమేమిటి? స్త్రీలను ప్రీస్టులుగా నియమించాలా? స్వలింగ సంపర్కాన్ని చర్చి ఎలా దృష్టించాలి? యుద్ధానికి మతం మద్దతునివ్వాలా? ఇలాంటి అనైక్యతను చూసి చాలామంది ‘మతం తన సొంత సభ్యులనే ఐక్యపరచలేకపోతే మొత్తం మానవాళిని ఎలా ఐక్యపరుస్తుంది?’ అని అనుకుంటున్నారు.

మతం ఐక్యతను ప్రోత్సహించే శక్తిగా ఉండడంలో విఫలమైందని స్పష్టమవుతోంది. అయితే అన్ని మతాలు ఇలా విభజించబడే ఉన్నాయా? ఇతర మతాలకు భిన్నంగా మానవాళిని ఐక్యపరిచే మతమేదైనా ఉందా?

[3వ పేజీలోని చిత్రం]

1947లో భారతదేశంలో మతగుంపుల మధ్య జరిగిన పోరాటంలో గాయపడిన పోలీసులు

[చిత్రసౌజన్యం]

Photo by Keystone/Getty Images