‘ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి’
‘ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి’
మొదటి శతాబ్దపు క్రైస్తవురాలైన ఫీబేకు ఒక సమస్య ఎదురైంది. ఆమె గ్రీసులోవున్న కెంక్రేయ నుండి రోముకు ప్రయాణమయ్యింది, కానీ ఆ నగరంలోవున్న తోటి విశ్వాసులెవరితోనూ ఆమెకు పరిచయం లేదు. (రోమీయులు 16:1, 2) ఎడ్గార్ గుడ్‌స్పీడ్ అనే బైబిలు అనువాదకుడు ఇలా చెబుతున్నాడు: “[ఆ కాలం నాటి] రోమా ప్రపంచం చాలా చెడ్డగా, క్రూరంగా ఉండేది. సత్రాలు ఎంత ఘోరంగా ఉండేవంటే అవి మర్యాదస్థురాలైన స్త్రీ, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీ ఉండడానికి ఏమాత్రం సరైన స్థలాలు కావు.” మరి ఫీబే ఎక్కడ బసచేసింది?
బైబిలు కాలాల్లో ప్రజలు చాలా విస్తృతంగా ప్రయాణించేవారు. యూదయ గలిలయలంతటిలో సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ఆయన శిష్యులుకూడా అలాగే ప్రయాణించారు. ఆ తర్వాత కొంతకాలానికి, పౌలువంటి క్రైస్తవ మిషనరీలు రోమా సామ్రాజ్య రాజధానియైన రోముతో సహా మధ్యధరా సముద్రం చుట్టుప్రక్కల ఉన్న వివిధ ప్రదేశాలకు సందేశాన్ని తీసుకువెళ్లారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు యూదా క్షేత్రంలో ప్రయాణించినా లేదా బయట ప్రయాణించినా ఎక్కడ బసచేసేవారు? వసతి గృహాలను కనుగొనడంలో వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ఆతిథ్యమివ్వడానికి సంబంధించి మనం వారినుండి ఏమి నేర్చుకోవచ్చు?
“నేడు నేను నీ యింట నుండవలసియున్నది”
ఆతిథ్యం అనే పదం గొప్ప మనస్సుతో అతిథులను సాదరంగా ఆహ్వానించడం అని నిర్వచించబడింది. ఆతిథ్యమివ్వడం ఎప్పటినుండో యెహోవా సత్యారాధకుల గుర్తింపు చిహ్నంగా ఉంది. ఉదాహరణకు అబ్రాహాము, లోతు, రిబ్కా ఇతరులకు ఆతిథ్యమిచ్చారు. (ఆదికాండము 18:1-8; 19:1-3; 24:17-20) పితరుడైన యోబు క్రొత్తవారిపట్ల తనకున్న దృక్పథం గురించి వివరిస్తూ ఇలా అన్నాడు: “పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని.”—యోబు 31:32.
ప్రయాణికులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి ఆతిథ్యం పొందాలంటే, నగర కూడలిలో కూర్చుని ఆహ్వానం కోసం వేచివుంటే సరిపోయేది. (న్యాయాధిపతులు 19:15-21) అతిథేయులు సాధారణంగా అతిథుల కాళ్ళు కడిగి, వారికి అన్నపానీయాలు ఇచ్చి, వారి పశువులకు మేత కూడా పెట్టేవారు. (ఆదికాండము 18:4, 5; 19:2; 24:32, 33) తమ అతిథేయులకు భారంగా ఉండకూడదని భావించే ప్రయాణికులు తమ కోసం అవసరమైన రొట్టెలు ద్రాక్షారసం, తమ గాడిదల కోసం మేత తమ వెంట తీసుకువెళ్లేవారు. అలాంటి వారికి రాత్రికి ఆశ్రయం మాత్రం ఇస్తే సరిపోయేది.
యేసు తాను ప్రకటించడానికి ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కడ బసచేసేవాడనే దాని గురించి బైబిలు ఎప్పుడో గానీ స్పష్టంగా చెప్పడం లేదు, అయితే ఆయన, ఆయన శిష్యులు ఎక్కడో ఒకచోట పడుకునేవారనడంలో మాత్రం సందేహం లేదు. (లూకా 9:58) యెరికోను సందర్శిస్తున్నప్పుడు యేసు జక్కయ్యతో ఇలా మాత్రం అన్నాడు: “నేడు నేను నీ యింట నుండవలసియున్నది.” జక్కయ్య తన అతిథిని “సంతోషముతో” చేర్చుకున్నాడు. (లూకా 19:5, 6) యేసు తరచూ బేతనియలో తన స్నేహితులైన మార్త, మరియ, లాజరుల ఇంట్లో అతిథిగా ఉండేవాడు. (లూకా 10:38; యోహాను 11:1, 5, 18) కపెర్నహూములో యేసు, సీమోను పేతురుతో ఉన్నట్లు తెలుస్తోంది.—మార్కు 1:21, 29-35.
యేసు తన పన్నెండుమంది అపొస్తలులకు పరిచర్య సంబంధంగా ఇచ్చిన ఉపదేశం, ఇశ్రాయేలులో వారు ఎలాంటి ఆదరాన్ని అపేక్షించవచ్చనేదాని గురించి ఎంతో తెలియజేస్తుంది. యేసు వారికిలా చెప్పాడు: “మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.” (మత్తయి 10:9-11) సరైన హృదయంగల వ్యక్తులు తన శిష్యులను ఆహ్వానించి వారికి ఆహారం, ఆశ్రయం, ఇతరత్రా అవసరమైనవి సమకూరుస్తారని ఆయనకు తెలుసు.
అయితే ప్రయాణించే సువార్తికులు తమ ఖర్చులు తామే భరిస్తూ తమ గురించి తామే శ్రద్ధ తీసుకోవలసిన సమయం వస్తుందని కూడా ఆయనకు తెలుసు. తన అనుచరులకు భవిష్యత్తులో ఎదురుకాబోయే శత్రుభావం దృష్ట్యా, ఇశ్రాయేలు వెలుపలి ప్రాంతాలకు కూడా ప్రకటనా పని వ్యాపించడం దృష్ట్యా యేసు ఇలా చెప్పాడు: “సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను.” (లూకా 22:36) సువార్త ప్రకటించడానికి ప్రయాణించడం, బసచేయడం తప్పనిసరి.
“శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి”
మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో కొంతమేరకు సమాధానకరమైన పరిస్థితులు, చక్కని రహదారులు ఉండడంవల్ల అప్పట్లో చాలామంది ప్రయాణాలు చేస్తుండేవారు. * ప్రయాణికులు ఎక్కువ కావడంవల్ల వసతి గృహాల అవసరం ఎక్కువైంది. ముఖ్యమైన రహదారుల వెంబడివున్న సత్రాలు ఆ అవసరాన్ని తీర్చాయి, అవి ఒకదాని నుండి మరొకటి ఒక రోజు ప్రయాణమంత దూరంలో ఉండేవి. అయితే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇన్ ఇట్స్ గ్రేకో-రోమన్ సెట్టింగ్ అనే పుస్తకం ఇలా పేర్కొన్నది: “అలాంటి వసతి గృహాల గురించి సాహిత్యం ద్వారా మనకు తెలిసే విషయాలు అంత సంతృప్తికరంగా లేవు. ఆ సత్రాల్లోని వసతి సౌకర్యాలు సాధారణంగా పాడైపోయి అపరిశుభ్రంగా ఉండేవి, అక్కడ బల్లలు కుర్చీలు ఉండేవి కావు, నల్లులుండేవి, ఆహారపానీయాలు నాసిరకంగా ఉండేవి, యాజమాన్యం మరియు పనివాళ్ళు ఎంతమాత్రం నమ్మకస్థులు కాదు, ఖాతాదారులు గౌరవనీయులు కాదు, సాధారణంగా నైతికంగా దిగజారిపోయిన పరిస్థితులు ఉండేవి అని మనకు అందుబాటులో ఉన్న సాహిత్య, పురావస్తు మూలాలు వెల్లడిచేస్తున్నాయి.” కాబట్టి నైతికంగా మంచి స్థితిలో ఉన్న ప్రయాణికులు సాధ్యమైనంత మేరకు అలాంటి సత్రాలలో ఉండడానికి ఇష్టపడరనే సంగతి అర్థం చేసుకోదగినదే.
కాబట్టి క్రైస్తవులు ఇతరులకు ఆతిథ్యమివ్వాలని లేఖనాలు పదేపదే ప్రోత్సహించడంలో ఆశ్చర్యం లేదు. పౌలు రోములోని క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.” (రోమీయులు 12:13) యూదా క్రైస్తవులకు ఆయనిలా గుర్తుచేశాడు: “ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.” (హెబ్రీయులు 13:1) పేతురు తన తోటి ఆరాధకులకు ఇలా ఉద్బోధించాడు: “సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.”—1 పేతురు 4:9.
అయితే, ఆతిథ్యమివ్వడం అనుచితమయ్యే పరిస్థితులు కూడా ఉండేవి. “క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగే” ప్రతి ఒక్కరి గురించి అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” (2 యోహాను 9-11) పశ్చాత్తాపపడని పాపుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.”—1 కొరింథీయులు 5:11.
మోసగాళ్ళు, మరితరులు నిజక్రైస్తవుల మంచి స్వభావాన్ని తమ స్వలాభానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. సా.శ. రెండవ శతాబ్దానికి చెందిన, ద డీడాహీ లేదా టీచింగ్ ఆఫ్ ద ట్వెల్వ్ అపోస్టల్స్ అనే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన బైబిలేతర నిర్దేశక గ్రంథం, ప్రయాణించే ప్రచారకుడికి “ఒక రోజు లేదా అవసరమైతే రెండు రోజులు” ఆతిథ్యమివ్వాలని సిఫారసు చేస్తోంది. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయేటప్పుడు “ఆయనకు ఆహారం తప్ప మరేమీ ఇవ్వకూడదు . . . ఒకవేళ ఆయన డబ్బు కావాలని అడిగితే ఆయన అబద్ధ ప్రవక్త క్రిందే లెక్క.” ఆ గ్రంథం ఇంకా ఇలా చెబుతోంది: “ఆయనకు ఏదైనా వృత్తి తెలిసివుండి మీ మధ్య నివాసం ఏర్పరచుకోవాలనుకుంటే,
ఆయన తన ఆహారం కోసం పనిచేసుకోనివ్వండి. అయితే ఆయనకు ఏ వృత్తీ తెలియకపోతే మీకు తోచిన విధంగా ఏదైనా పని ఇచ్చి సహాయం చేయండి, ఎందుకంటే మీ మధ్యన క్రైస్తవులెవరూ పనిలేకుండా ఉండకూడదు. కానీ ఆయన పని చేయడానికి ఇష్టపడకపోతే, ఆయన క్రైస్తవత్వాన్ని తన స్వలాభానికి వాడుకుంటున్నట్లే; అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి.”అపొస్తలుడైన పౌలు కొన్ని నగరాల్లో దీర్ఘకాలంపాటు ఉన్నప్పుడు తన అతిథేయులపై విపరీతమైన భారం పడకుండా జాగ్రత్తపడేవాడు. ఆయన తననుతాను పోషించుకోవడానికి డేరాలు కుట్టేవాడు. (అపొస్తలుల కార్యములు 18:1-3; 2 థెస్సలొనీకయులు 3:7-12) తొలి క్రైస్తవులు తమ మధ్యవున్న అర్హులైన ప్రయాణికులకు సహాయం చేయడానికి సిఫారసు లేఖలను ఉపయోగించేవారని తెలుస్తోంది, పౌలు ఫీబేను పరిచయం చేస్తూ వ్రాసిన లేఖ అటువంటిదే. ఆయనిలా వ్రాశాడు: “ఫీబే అను మన సహోదరిని . . . ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను.”—రోమీయులు 16:1, 2.
ఆతిథ్యమివ్వడం ద్వారా లభించే ఆశీర్వాదాలు
మొదటి శతాబ్దపు క్రైస్తవ మిషనరీలు తమకు కావలసినవన్నీ యెహోవా అనుగ్రహిస్తాడని విశ్వసించారు. అయితే తోటివిశ్వాసులు వారికి ఆతిథ్యం ఇచ్చేవారా? లూదియ పౌలును, ఇతరులను తన ఇంటికి ఆహ్వానించింది. అపొస్తలుడు కొరింథులో అకుల ప్రిస్కిల్లలతో ఉన్నాడు. ఫిలిప్పీలోని ఒక చెరసాల అధికారి పౌలు సీలలకు భోజనం ఏర్పాటు చేశాడు. థెస్సలోనీకలో యాసోను, కైసరయలో ఫిలిప్పు, కైసరయ నుండి యెరూషలేముకు వెళ్ళే మార్గంలో మ్నాసోను పౌలుకు ఆతిథ్యమిచ్చారు. రోమాకు వెళ్తున్నప్పుడు పొతియొలిలోని సహాదరులు పౌలును ఆదరించారు. ఆయనకు ఆహ్వానం పలికిన అతిథేయులకు ఆ సందర్భాలు ఆధ్యాత్మికంగా ఎంత ప్రతిఫలదాయకంగా ఉండి ఉండవచ్చో కదా!—అపొస్తలుల కార్యములు 16:33, 34; 17:6; 18:1-3; 21:8, 16; 28:13, 14.
విద్వాంసుడైన ఫ్రెడ్రిక్ ఎఫ్. బ్రూస్ ఇలా పేర్కొంటున్నాడు: “పౌలుకు సహాయం చేయడానికి ఈ స్నేహితులను, తోటి పనివారిని, అతిథేయులను పురికొల్పింది ఆయనపట్ల, ఆయన సేవించే ప్రభువుపట్ల వారికున్న ప్రేమ తప్ప మరింకేమీ కాదు. తాము పౌలుకు సేవ చేయడం ద్వారా తమ ప్రభువైన యేసుకు సేవ చేస్తున్నామని వారికి తెలుసు.” ఆతిథ్యమివ్వడానికి ఇది శ్రేష్ఠమైన ప్రేరణ.
ఆతిథ్యమివ్వవలసిన అవసరం ఇప్పుడు కూడా ఉంది. యెహోవాసాక్షులలోని వేలాదిమంది ప్రయాణ ప్రతినిధులు తమ తోటివిశ్వాసుల ఆతిథ్యాన్ని పొందుతున్నారు. కొంతమంది రాజ్య ప్రచారకులు, సువార్త అంతగా చేరని ప్రాంతాలలో ప్రకటించడానికి తమ సొంత ఖర్చులతో వెళ్తున్నారు. అలాంటి వారిని మన ఇళ్ళలోకి, అవి ఎంత చిన్నవైనా సరే, ఆహ్వానించడం ద్వారా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణ భోజనం పెట్టి హృదయపూర్వకంగా ఇచ్చే ఆతిథ్యం, ‘ఒకరి చేత ఒకరు ఆదరణ పొందడానికి,’ మన సహాదరులపట్ల మన దేవునిపట్ల ప్రేమ చూపించడానికి చక్కని అవకాశాలను కల్పిస్తుంది. (రోమీయులు 1:11, 12) అలాంటి సందర్భాలు ప్రాముఖ్యంగా అతిథేయికి ఎంతో ప్రతిఫలదాయకంగా ఉంటాయి, ఎందుకంటే “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
[అధస్సూచి]
^ పేరా 11 సా.శ. 100వ సంవత్సరం నాటికి రోమా సామ్రాజ్యంలో దాదాపు 80,000 కిలోమీటర్ల రహదార్లు ఉన్నట్లు అంచనా వేయబడింది.
[23వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ‘శ్రద్ధగా ఆతిథ్యమిస్తారు’