కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా?

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా?

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా?

మనమందరమూ ఎప్పుడో ఒకప్పుడు మనకంటే అందంగా ఉన్న వ్యక్తిని, ఇతరులు మనకంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని, విషయాలను మనకంటే త్వరగా అర్థం చేసుకునే వ్యక్తిని, లేదా స్కూల్లో మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వ్యక్తిని కలిసే ఉంటాము. బహుశా ఇతరులు మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, వారికి మరింత మంచి ఉద్యోగం ఉండవచ్చు, వారు మరింత విజయవంతంగా ఉండవచ్చు, లేదా వారికి ఎక్కువమంది స్నేహితులు ఉండవచ్చు. వారికి ఎక్కువ ఆస్తి, ఎక్కువ డబ్బు, కొత్త కారు ఉండవచ్చు లేదా వారు మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు కనిపించవచ్చు. అలాంటి విషయాలను గమనించినప్పుడు, మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటామా? అలా పోల్చుకోవడం అనివార్యమా? ఒక క్రైస్తవుడు అలా పోల్చుకోకుండా ఉండాలని ఎందుకు కోరుకోవచ్చు? మనల్ని మనం ఎవ్వరితో పోల్చుకోకుండానే సంతృప్తిగా ఎలా ఉండవచ్చు?

మనం ఎందుకు, ఎప్పుడు పోల్చుకుంటాము?

ప్రజలు తమను తాము ఇతరులతో పోల్చుకోవడానికి ఒక కారణమేమిటంటే అది వారి స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి లేదా దానిని అధికం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. తమ తోటివారు సాధిస్తున్నవాటిని తాము కూడా సాధిస్తున్నామని తెలుసుకున్నప్పుడు ప్రజలు సంతృప్తిగా భావిస్తారు. మరో కారణమేమిటంటే, మనం మనకున్న అభద్రతా భావాలను తగ్గించుకునే ప్రయత్నంలో, మన సామర్థ్యాలను మన పరిమితులను అర్థం చేసుకునే ప్రయత్నంలో మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవచ్చు. మనం ఇతరులు సాధించినవాటిని గమనిస్తాము. వారు అనేక విషయాల్లో మనలాగే ఉండి కొన్ని లక్ష్యాలను చేరుకుంటే, మనం కూడా అలాంటి లక్ష్యాలను చేరుకోగలమని భావిస్తాము.

అలా పోల్చుకోవడం తరచూ పరస్పర సారూప్యంగల ప్రజల మధ్య జరుగుతుంది, అంటే ఒకే లింగానికి, ఒకే వయస్సుకు, ఒకే సామాజిక స్థాయికి చెందినవారి మధ్య, పరిచయస్థుల మధ్య జరుగుతుంది. ఎదుటి వ్యక్తికి, మనకు మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉందనిపిస్తే ఆ వ్యక్తితో మనల్ని మనం పోల్చుకోము. మరోవిధంగా చెప్పాలంటే, ఒక సాధారణ యువతి తనను తాను ఒక ప్రముఖ సినీతారతో కాక తోటి విద్యార్థులతో పోల్చుకుంటుంది, అలాగే ఆ సినీతార తనను తాను ఒక సాధారణ యువతితో పోల్చుకోదు.

మనం ఏయే విషయాల్లో పోల్చుకుంటాము? సమాజంలో విలువైనవిగా ఎంచబడే తెలివితేటలు, అందం, ఆస్తులు, బట్టలు వంటివేవైనా మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడానికి ఆధారంగా ఉండవచ్చు. అయితే మనకు ఆసక్తిగల విషయాలకు సంబంధించి మాత్రమే మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడానికి మొగ్గు చూపిస్తాము. ఉదాహరణకు, మనకు స్టాంపులు సేకరించడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే, పరిచయస్థుడైన మరో వ్యక్తి దగ్గరున్న స్టాంపుల సంఖ్యను చూసి మనం అసూయపడే అవకాశముంది.

అలా ఇతరులతో పోల్చుకోవడం మనలో సంతృప్తి, మానసిక కృంగుదల, ప్రశంస, ఇతరులను అనుకరించాలనే కోరిక, ఆందోళన, ప్రతికూల భావాలు వంటి వివిధ రకాలైన భావోద్వేగాలను కలుగజేస్తుంది. వాటిలో కొన్ని భావోద్వేగాలు హానికరమైనవి, అవి క్రైస్తవ లక్షణాలకు విరుద్ధమైనవి.

పోటీతత్వంతో పోల్చుకోవడం

తమను తాము ఇతరులతో పోల్చుకునేటప్పుడు “విజేతలుగా” ఉండడానికి ప్రయత్నించే చాలామంది పోటీతత్వాన్ని ప్రదర్శిస్తారు. వారు ఇతరులకంటే మెరుగైనవారిగా ఉండాలనుకుంటారు, తాము అలా ఉన్నామని భావించేవరకూ వారు సంతృప్తిపడరు. అలాంటి వ్యక్తులతో ఉండడం కష్టంగా ఉంటుంది. వారితో స్నేహం దెబ్బతింటుంది, వారితో సంబంధాలు కలతతో నిండివుంటాయి. అలాంటి ప్రజలకు వినయం లోపించడమే కాకుండా వారు తమ తోటివారిని ప్రేమించమని బైబిలు ఇచ్చే ఉపదేశాన్ని అన్వయించుకోవడంలో కూడా విఫలమవుతారు, ఎందుకంటే వారి వైఖరి ఇతరులలో ఆత్మన్యూనతా భావాలను కలుగజేసి వారిని అవమానపరుస్తుంది.​—⁠మత్తయి 18:1-5; యోహాను 13:34, 35.

ఇతరులు తాము “ఓడిపోయేవారమని” భావించేలా చేస్తే అది వారిని గాయపరుస్తుంది. ఒక రచయిత ప్రకారం, “మనలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఇతరులు మనం కోరుకునేవాటిని సంపాదించుకున్నారని అనిపిస్తే మన వైఫల్యాలు మరింత బాధాకరంగా తయారవుతాయి.” కాబట్టి పోటీతత్వ స్వభావం, ఎదుటి వ్యక్తికున్న ఆస్తులు, అతని అభివృద్ధి, అంతస్తు, కీర్తి, ప్రయోజనాలు, ఇతరత్రా వాటినిబట్టి ఆ వ్యక్తిపట్ల అసూయను, అయిష్టతను, కోపాన్ని పురికొల్పుతుంది. అది మరింత పోటీతత్వ స్వభావానికి దారి తీసి, చివరకు ఒక విషవలయంగా మారుతుంది. బైబిలు ‘ఒకరియందు ఒకరు అసూయపడడాన్ని’ ఖండిస్తోంది.​—⁠గలతీయులు 5:26.

అసూయాపరులు తమ ప్రత్యర్థులు సాధించినవాటిని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా దెబ్బతిన్న తమ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా స్పందించడం చాలా అల్పమైనదిగా కనిపించవచ్చు, కానీ దానిని గుర్తించి సరిదిద్దుకోకపోతే, అది దురుద్దేశంతో తప్పు చేయడానికి దారితీస్తుంది. అసూయ ఒక కారకంగా ఉన్న రెండు బైబిలు వృత్తాంతాలను మనం పరిశీలిద్దాం.

ఇస్సాకు ఫిలిష్తీయుల మధ్య నివాసమేర్పరచుకున్న తర్వాత “అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు” అసూయపడ్డారు. వాళ్ళు ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము త్రవ్విన బావులు పూడ్చివేసి తమ అసూయను ప్రదర్శించారు, అంతేకాక వాళ్ళ రాజు ఇస్సాకును ఆ దేశం విడిచి వెళ్ళిపొమ్మన్నాడు. (ఆదికాండము 26:1-3, 12-16) వాళ్ళ అసూయ హానికరమైనది, వినాశనకరమైనది. ఇస్సాకు తమ మధ్య ఉండగా వర్ధిల్లడాన్ని, ఆనందించడాన్ని వాళ్ళు సహించలేకపోయారు.

ఎన్నో శతాబ్దాల తర్వాత దావీదు యుద్ధరంగంలో అసాధారణ ప్రతిభను చూపించాడు. ఇశ్రాయేలు స్త్రీలు ఆయన విజయాన్ని కొనియాడుతూ, “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరి” అని పాడారు. వారు పాడిన పాటలో సౌలుకు కూడా కొంత ప్రశంస లభించినప్పటికీ తనను దావీదుతో పోల్చడం అవమానకరమని అతను భావించాడు, అతని హృదయంలో అసూయ చెలరేగింది. అప్పటినుండి సౌలు దావీదుపట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. అతను దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అసూయనుండి ఎంతటి దుష్టత్వం పుడుతుందో కదా!​—⁠1 సమూయేలు 18:6-11.

కాబట్టి మనల్ని మనం ఇతరులతో, అంటే వారు సాధించినవాటితో లేదా వారికున్న ప్రయోజనాలతో పోల్చుకున్నప్పుడు మనలో అసూయ లేదా పోటీతత్వం పురికొల్పబడితే జాగ్రత్త సుమా! ఇలాంటి హానికరమైన భావోద్వేగాలు దేవుని ఆలోచనా విధానానికే విరుద్ధమైనవి. అయితే అలాంటి వైఖరులను నిరోధించడమెలాగో పరిశీలించే ముందు, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడాన్ని పురికొల్పే మరో విషయం గురించి చర్చిద్దాము.

మన పరిమితులను గ్రహించడం, సంతృప్తి చెందడం

‘నేను తెలివిగలవాడినా, ఆకర్షణీయంగా ఉంటానా, సమర్థవంతంగా పని చేస్తానా, ఆరోగ్యవంతుడినా, గౌరవించదగిన వ్యక్తినా, ప్రేమించదగిన వ్యక్తినా? నాలో ఈ లక్షణాలు ఎంతమేరకు ఉన్నాయి?’ మనం అద్దంముందు నిలబడి ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం చాలా అరుదు. అయితే ఒక రచయిత ప్రకారం, “ఇలాంటి ప్రశ్నలు తరచూ మన మదిలో పరోక్షంగా తలెత్తుతాయి, అవి ఎంతో నేర్పుగా దాదాపు సంతృప్తికరమైన సమాధానాలనే రాబడతాయి.” తాను ఫలానా పని సాధించగలను అనే నమ్మకం లేని వ్యక్తి ఇలాంటి విషయాల గురించి ఎలాంటి పోటీతత్వము గానీ అసూయ గానీ లేకుండానే ఆలోచిస్తాడు. ఆయన కేవలం తనను తాను పరిశీలించుకుని తన పరిమితులను గ్రహిస్తున్న వ్యక్తిగా ఉంటాడు. దానిలో తప్పేమీ లేదు. అయితే అలా మన పరిమితులను గ్రహించడానికి మనల్ని మనం ఇతరులతో పోల్చుకోనవసరం లేదు.

మనకు అనేక కారణాలనుబట్టి వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. మనకంటే బాగా చేయగలవారిగా కనిపించే వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వాళ్ళను అసూయతో చూసే బదులు మనం మన సామర్థ్యాలను దేవుని నీతియుక్త ప్రమాణాలకు అనుగుణంగా అంచనా వేసుకోవాలి, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునేటప్పుడు దేవుని నీతియుక్త ప్రమాణాలు ఆధారపడదగిన మార్గనిర్దేశంగా పనిచేస్తాయి. మనం వ్యక్తిగతంగా ఎలాంటి వారమనేదే యెహోవాకు ప్రాముఖ్యం. మనల్ని మరొకరితో పోల్చవలసిన ఆవసరం ఆయనకు లేదు. అపొస్తలుడైన పౌలు మనకు ఇలా సలహా ఇస్తున్నాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”​—⁠గలతీయులు 6:⁠4.

అసూయను నిరోధించడం

మానవులందరూ అపరిపూర్ణులు కాబట్టి, అసూయను నిరోధించడానికి ఎంతోకాలంపాటు తీవ్రంగా ప్రయత్నించడం అవసరం కావచ్చు. “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని లేఖనాలు చెబుతున్నాయని తెలిసి ఉండడం ఒక అంశమైతే, దానిని పాటించడం మరో అంశం. పౌలు తాను పాపం చేయడానికే మొగ్గు చూపుతున్నానని గుర్తించాడు. దానికి విరుద్ధంగా పోరాడడానికి ఆయన ‘తన శరీరాన్ని నలగగొట్టి, దానిని లోపరచుకోవలసి’ వచ్చింది. (రోమీయులు 12:10; 1 కొరింథీయులు 9:​27) మనం కూడా అలా చేయాలంటే పోటీతత్వ తలంపులను నిరోధించి వాటి స్థానంలో ప్రోత్సాహకరమైన తలంపులను ఉంచాలి. మనల్ని మనం ‘ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకోకుండా’ ఉండేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాలి.​—⁠రోమీయులు 12:⁠3.

బైబిలును అధ్యయనం చేయడం, ధ్యానించడం కూడా సహాయకరంగా ఉంటాయి. ఉదాహరణకు, దేవుడు వాగ్దానం చేసిన పరదైసు గురించి ఆలోచించండి. అప్పుడు అందరికీ శాంతి, మంచి ఆరోగ్యం, కావలసినంత ఆహారం, సౌకర్యవంతమైన ఇళ్ళు, సంతృప్తికరమైన పని ఉంటాయి. (కీర్తన 46:​8, 9; 72:7, 8, 16; యెషయా 65:21-23) అప్పుడు ఎవరైనా ఇతరులతో పోటీ పడడానికి మొగ్గు చూపిస్తారా? చూపించరు. అలా చేయడానికి కారణమే ఉండదు. అప్పుడు జీవితం ఎలా ఉంటుందనే విషయానికి సంబంధించి యెహోవా మనకు అన్ని వివరాలూ ఇవ్వలేదు, అయితే అందరూ తమకు ఇష్టమైన పనులను చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఒకరు ఖగోళశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు, మరొకరు అందమైన వస్త్రాలను రూపొందించవచ్చు. వారిద్దరూ ఒకరిని చూసి మరొకరు అసూయ పడాల్సిన అవసరమేముంటుంది? మన తోటివారు చేసే పనులు మనం మరిన్ని విజయాలు సాధించడానికి స్ఫూర్తిగానే పని చేస్తాయి తప్ప, ప్రతికూల భావాలను రేకెత్తించేలా ఉండవు. అలాంటి భావాలు గతించినవిగా ఉంటాయి.

అలాంటి జీవితం కావాలని మనం కోరుకుంటే, మనం అలాంటి వైఖరినే పెంపొందించుకోవడానికి ఇప్పుడే కృషి చేయవద్దా? మనం ఇప్పటికే మన చుట్టూ ఉన్న లోకంలోని ఎన్నో సమస్యలనుండి స్వతంత్రులమై ఆధ్యాత్మిక పరదైసును ఆనందిస్తున్నాము. దేవుని నూతనలోకంలో పోటీతత్వమే ఉండదు కాబట్టి, ఇప్పుడు మనం దానికి దూరంగా ఉండడానికి మరింత బలమైన కారణం ఉంది.

అలాంటప్పుడు, మరి మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం తప్పా? లేక అలా చేయడం సముచితంగానే ఉండే సందర్భాలు కూడా ఉన్నాయా?

పోల్చుకోవడానికి సముచితమైన సందర్భాలు

తమను తాము ఇతరులతో పోల్చుకొని చాలామంది బాధపడ్డారు, కృంగిపోయారు, కానీ మనం అలా ఉండనవసరం లేదు. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను గమనించండి: “విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుడి.” (హెబ్రీయులు 6:11-12) ప్రాచీన కాలాల్లోని యెహోవా నమ్మకమైన సేవకుల లక్షణాలను అలవరచుకోవడానికి కృషి చేయడం సత్ఫలితాలను తీసుకురావచ్చు. అలా చేయడానికి మనల్ని మనం వారితో పోల్చుకోవలసి రావచ్చు. అయినప్పటికీ, మనం అనుకరించగల మాదిరులను చూడడానికి, మనం మెరుగుపడవలసిన రంగాలను గుర్తించడానికి అది సహాయం చేస్తుంది.

యోనాతాను విషయమే తీసుకోండి. నిజానికి, ఆయన అసూయపడడానికి కారణం ఉంది. ఇశ్రాయేలు రాజైన సౌలు పెద్ద కుమారుడిగా తర్వాత రాజయ్యేది తానే అని యోనాతాను ఒక సమయంలో అనుకొని ఉండవచ్చు, కానీ యెహోవా ఆయనకంటే 30 సంవత్సరాలు చిన్నవాడైన దావీదును ఎంపిక చేసుకున్నాడు. ఆ కారణాన్నిబట్టి యోనాతాను కోపం పెంచుకునే బదులు యెహోవా ఎంపిక చేసుకున్న రాజైన దావీదుతో నిస్వార్థంగా స్నేహం చేసి ఆయనకు మద్దతునిచ్చి విశిష్ఠమైన మాదిరినుంచాడు. యోనాతాను నిజంగా ఆధ్యాత్మిక వ్యక్తే. (1 సమూయేలు 19:1-4) దావీదును ఒక ప్రత్యర్థిగా చూసిన తన తండ్రిలా కాకుండా యోనాతాను యెహోవాయే విషయాలను నడిపిస్తున్నాడని గ్రహించి ఆయన చిత్తానికి లోబడ్డాడు; “దావీదే ఎందుకు నేనెందుకు కాకూడదు?” అని ప్రశ్నించుకుంటూ ఆయన తనను తాను దావీదుతో పోల్చుకోలేదు.

మనం మన తోటి క్రైస్తవులతో ఉన్నప్పుడు వారు మనల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారనో లేదా మన స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారనో భయపడాల్సిన పని లేదు. పోటీతత్వం క్రైస్తవులకు తగినది కాదు. పరిణతి చెందిన క్రైస్తవులకు పోటీతత్వం కాదు గానీ సహకారం, ఐక్యత, ప్రేమ వంటి లక్షణాలు గుర్తింపు చిహ్నంగా ఉంటాయి. “ప్రేమ అసూయకు బద్ధ శత్రువు. మనం ఎవరినైనా ప్రేమిస్తే, ఆ వ్యక్తికి మంచి జరగాలని మనం కోరుకుంటాము, ఆయన విజయం సాధించి సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాము” అని సామాజికవేత్త ఫ్రాన్సెస్కో ఆల్బెరోని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ సంఘంలో ఎవరికైనా ఒక ఆధిక్యత ఇవ్వబడినప్పుడు, దానిని చూసి సంతోషించడమే ప్రేమపూర్వకమైన పని. యోనాతాను కూడా అలాగే చేశాడు. ఆయనలాగే మనం యెహోవా సంస్థలో బాధ్యతాయుతమైన స్థానాల్లో నమ్మకంగా సేవ చేస్తున్నవారికి మద్దతునిస్తే ఆశీర్వదించబడతాము.

తోటి క్రైస్తవులు ఉంచిన మంచి మాదిరులను చూసి మనం తగినట్లుగా ప్రభావితమవ్వవచ్చు. మనల్ని మనం సమతుల్య దృక్పథంతో వారితో పోల్చుకున్నప్పుడు, వారి విశ్వాసాన్ని మనం అనుకరించేందుకు పురికొల్పబడతాము. (హెబ్రీయులు 13:7) అయితే మనం జాగ్రత్తగా ఉండకపోతే అలా అనుకరించాలనుకోవడం, పోటీపడడంగా మారవచ్చు. మనం ప్రశంసించే వారెవరైనా మనల్ని అధిగమించారని మనకు అనిపించినప్పుడు మనం ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడితే లేదా విమర్శిస్తే మనం ఆయనను అనుకరించట్లేదు కానీ ఆయనను చూసి అసూయపడుతున్న వారిగా ఉంటాము.

అపరిపూర్ణ మానవులెవ్వరూ పరిపూర్ణ మాదిరిగా ఉండలేరు. కాబట్టి “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి” అని లేఖనాలు చెబుతున్నాయి. అంతేకాక, “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (ఎఫెసీయులు 5:1, 2; 1 పేతురు 2:​21) యెహోవా మరియు యేసు ప్రదర్శించిన ప్రేమ, ఆప్యాయత, సానుభూతి, వినయం వంటి లక్షణాలను మనం అనుకరించడానికి కృషి చేయాలి. మనం వారి లక్షణాలతో, సంకల్పాలతో, వారు పనులు చేసే విధానంతో మనల్ని మనం పోల్చుకోవడానికి సమయం తీసుకోవాలి. అలా పోల్చుకోవడం మన జీవితాలను మెరుగుపరుస్తుంది, మనకు మార్గనిర్దేశాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది, మనం పరిణతిగల క్రైస్తవ స్త్రీపురుషులుగా తయారవడానికి సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:13) వారి పరిపూర్ణ మాదిరిని అనుకరించడానికి మనం మనకు సాధ్యమైనదంతా చేయడంపై అవధానముంచితే, మన తోటి మానవులతో మనల్ని మనం పోల్చుకోవడానికి తక్కువ మొగ్గు చూపుతాము.

[28, 29వ పేజీలోని చిత్రం]

సౌలు రాజు దావీదును చూసి అసూయపడ్డాడు

[31వ పేజీలోని చిత్రం]

యోనాతాను తనకంటే చిన్నవాడైన దావీదును ఎన్నడూ తన ప్రత్యర్థిగా భావించలేదు