కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇప్పుడూ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడం

ఇప్పుడూ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడం

ఇప్పుడూ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడం

జర్మన్‌ వైద్యుడైన అల్రిక్‌ స్ట్రన్జ్‌ ఫరెవర్‌ యంగ్‌ అనే పేరుతో పుస్తకాల పరంపరను వ్రాశాడు. వ్యాయామం, పోషకాహారం, మంచి జీవిత విధానం మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా మనం ఎక్కువకాలం జీవించడానికి కూడా దోహదపడతాయి అని ఆయన ఆ పుస్తకాల్లో వివరించాడు. అయితే తన సలహాలను పాటించడం ద్వారా పాఠకులు నిరంతరం జీవించగలుగుతారు అని మాత్రం ఆయన వాగ్దానం చేయలేదు.

అయితే ఒక రకమైన జ్ఞానం మాత్రం నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తోంది. మీరు నిరంతరం జీవించగలిగితే, నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉంటారు. దేవునికి ప్రార్థిస్తూ యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే [‘జ్ఞానం సంపాదించుకోవడమే,’ NW] నిత్యజీవము.” (యోహాను 17:3) మనం మొదటిగా “నిత్యజీవము” అనే పదాన్ని నిర్వచించి, ఆ తర్వాత ఆ జ్ఞానంలో ఏమేమి చేరివున్నాయి, దానిని ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుందాము.

బైబిలు ప్రకారం, సృష్టికర్త త్వరలోనే ఈ భూమిని అక్షరార్థమైన పరదైసుగా మారుస్తాడు, అప్పుడు మనం ఎక్కువకాలం జీవించడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. అయితే భూమిని పరదైసుగా మార్చే ముందు నోవహు దినాల్లో జలప్రళయాన్ని తీసుకువచ్చినట్లే కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. యేసు మన కాలాన్ని “నోవహు దినములతో” పోల్చాడని మత్తయి 24వ అధ్యాయం, 37 నుండి 39 వచనాలు చూపిస్తున్నాయి, నోవహు దినాల్లో ప్రజలు తామున్న అపాయకరమైన పరిస్థితిని పట్టించుకోలేదు. వారు నోవహు ప్రకటించిన సందేశాన్ని కూడా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత “నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము” రానే వచ్చింది, ఈ జ్ఞానాన్ని తిరస్కరించిన వారందరూ జలప్రళయములో నాశనమయ్యారు. నోవహు, ఆయనతోపాటు ఓడలో ఉన్నవారు మాత్రం సజీవంగా బయటపడ్డారు.

మన కాలంలో అలాంటి “దినము” ఒకటి వస్తుందని యేసు సూచించాడు. ఆ దినముకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని లక్ష్యపెట్టేవారికి సజీవంగా ఉండే ఉత్తరాపేక్షే కాక, నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష కూడా ఉంటుంది. అంతేకాకుండా దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులు తిరిగి లేపబడతారు, వారు మళ్ళీ మరణించే అవసరం లేకుండా నిరంతరం జీవించగలుగుతారు. (యోహాను 5:​28, 29) యేసు ఈ రెండు విషయాలను ఎలా వివరించాడో గమనించండి. మృతుల పునరుత్థానం గురించి మార్తతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు: “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” ఆ “దినము” ఎంతో దూరంలో లేదని అన్ని రుజువులూ చూపిస్తున్నాయి, అంటే మీరు ఇక ‘ఎన్నటికిని చనిపోకుండా’ ఉండే రోజు దగ్గర్లోనే ఉందని దానర్థం.​—⁠యోహాను 11:​25-27.

ఆ తర్వాత యేసు మార్తను ఇలా అడిగాడు: “ఈ మాట నమ్ముచున్నావా?” దానికి ఆమె “అవును ప్రభువా” అని సమాధానం ఇచ్చింది. నేడు యేసు మిమ్మల్ని అదే ప్రశ్న అడిగితే, మీరెలా సమాధానమిస్తారు? ఎన్నడూ చనిపోకుండా ఉండడమనే విషయాన్ని నమ్మడం మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అలా నమ్మడం కష్టమే అయినా, మీరు దాన్ని నమ్మేందుకు తప్పకుండా ఇష్టపడతారు అనడంలో మాత్రం సందేహం లేదు. మీరు ‘ఎన్నటికిని చనిపోకుండా’ ఉంటే ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో ఒక్కసారి ఊహించుకోండి. మీరు నేర్చుకొని చేయాలని ఇష్టపడుతున్నా సమయం లేని కారణంగా చేయలేకపోతున్న పనులన్నీ పూర్తి చేస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. చనిపోయిన మీ ప్రియమైన వారిని మళ్ళీ కలుసుకునే అవకాశం గురించి కూడా ఆలోచించండి! వాటిని సాధ్యం చేయగలిగే జ్ఞానం ఏమిటి, మీరు దానిని ఎలా సంపాదించుకోవచ్చు?

జీవాన్నిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవడం—⁠మనకు సాధ్యమే

దేవుని గురించిన, క్రీస్తును గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం మనకు అసాధ్యమా? కాదు. నిజమే, సృష్టికర్త కార్యాలకు సంబంధించిన జ్ఞానం అపరిమితం. అయితే యేసు ‘జ్ఞానాన్ని,’ ‘నిత్యజీవంతో’ ముడిపెట్టి చెప్పినప్పుడు ఖగోళశాస్త్రం గురించో మరో శాస్త్రం గురించో ఆయన మాట్లాడడం లేదు. సామెతలు 2వ అధ్యాయం 1, 5 వచనాలు, “దేవుని గూర్చిన విజ్ఞానము” సంపాదించుకోవడానికి బైబిలులోని “మాటలు,” “ఆజ్ఞలు” ప్రాముఖ్యమని సూచిస్తున్నాయి. యేసు విషయానికి వస్తే, ఆయన గురించి వ్రాయబడిన విషయాలు మనం “జీవము పొందడానికి” సరిపోతాయని యోహాను 20:​30, 31 వచనాలు సూచిస్తున్నాయి.

కాబట్టి యెహోవా గురించి, యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఉన్న జ్ఞానం, మీరు నిత్యజీవము ఎలా సంపాదించుకోవాలో చూపించడానికి సరిపోతుంది. బైబిలు ఒక అసాధారణమైన పుస్తకం. అధ్యయనం చేసి నేర్చుకోవడానికి చాలా తక్కువ అవకాశాలుగలవారు, పరిమితమైన విద్యగలవారు కూడా నిత్యజీవం పొందడానికి సరిపడే జ్ఞానం సంపాదించుకునే విధంగా బైబిలును వ్రాయడానికి సృష్టికర్త మనుష్యులను ప్రేరేపించాడు. అలాగే విషయాలను త్వరగా గ్రహించే సామర్థ్యంగల వ్యక్తి, ఎక్కువ సమయమూ ఎక్కువ వనరులూ కలిగిన వ్యక్తి ప్రేరేపిత లేఖనాలనుండి ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకోవచ్చు. మీరు ఈ ఆర్టికల్‌ను చదవగలుగుతున్నారు అనే వాస్తవం మీకు నేర్చుకునే సామర్థ్యం ఉంది అనడానికి రుజువు, అయితే మీరు ఆ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?

ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అత్యుత్తమమైన మార్గం, దానిని ఇప్పటికే అర్థం చేసుకున్న వ్యక్తి సహాయంతో వ్యక్తిగతంగా బైబిలు అధ్యయనం చేయడమే అని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజల అనుభవాలు చూపిస్తున్నాయి. నోవహు తన సమకాలీనులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి కృషి చేసినట్లే, యెహోవాసాక్షులు మీతో బైబిలును అధ్యయనం చేయడానికి మీ ఇంటికి రావడానికి సుముఖంగా ఉన్నారు. వారు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్‌ను లేక నిత్యజీవానికి నడిపించు జ్ఞానము * అనే పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. భూపరదైసులో నమ్మకమైన ప్రజలు ‘ఎన్నటికిని చనిపోరు’ అనే ఆలోచనను నమ్మడం మీకు కష్టంగా అనిపించినా, ఈ బైబిలు చర్చల ద్వారా మీరు ఆ వాగ్దానంపై నమ్మకముంచడాన్ని నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు నిరంతరం జీవించడానికి ఇష్టపడితే లేక అలా నిరంతరం జీవించవచ్చని నమ్మడం సహేతుకమా కాదా అని పరిశీలించాలనుకుంటే, మీరేమి చేయాలి? బైబిలును అధ్యయనం చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

బైబిలును అధ్యయనం చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఇంతకుముందు ప్రస్తావించబడిన ఆ 32 పేజీల బ్రోషుర్‌ వందలాది భాషల్లో లభ్యమవుతోంది, దానిలో కేవలం 16 చిన్న పాఠాలు మాత్రమే ఉన్నాయి. లేక మీరు వారానికి ఒక గంట చొప్పున వెచ్చించగలిగితే నిత్యజీవానికి నడిపించు జ్ఞానము అనే పుస్తకాన్ని ఉపయోగించి బైబిలులోని ముఖ్యమైన విషయాల గురించి అధ్యయనం చేయడానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే పడుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకొని, దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకోవడానికి ఈ రెండు ప్రచురణలు ఎంతోమందికి సహాయం చేశాయి. తనను నిజంగా ప్రేమించేవారిని సృష్టికర్త ఆశీర్వదించి, వారు నిరంతరం జీవించడాన్ని సాధ్యం చేస్తాడు.

జీవాన్నిచ్చే జ్ఞానం మనకు అందుబాటులోనే ఉంది, అది సులభంగానే లభ్యమవుతుంది. బైబిల్లోని కొంతభాగం 2,000 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. 235 దేశాల్లోని యెహోవాసాక్షులు మీకు వ్యక్తిగత సహాయం చేయడానికి, మీరు మీ జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి వీలుగా బైబిలు ఆధారిత ప్రచురణలను అందజేయడానికి సంతోషిస్తారు.

వ్యక్తిగత అధ్యయనం

దేవునితో మీ సంబంధం మీకు, సృష్టికర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయం. కేవలం మీరు మాత్రమే దానిని కాపాడుకోగలరు, దానిని బలపర్చుకోగలరు, కేవలం ఆయన మాత్రమే మీకు నిత్యజీవాన్ని ఇవ్వగలడు. కాబట్టి మీరు ఆయన లిఖిత వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడంలో కొనసాగాలి. ఎవరైనా మీ ఇంటికి క్రమంగా వచ్చి మీతో అధ్యయనం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటే, అధ్యయనం కోసం సమయాన్ని కేటాయించడం సులభంగా ఉంటుంది.

బైబిలులో, బైబిలు అధ్యయనానికి సహాయపడే ప్రచురణల్లో “దేవుని గూర్చిన విజ్ఞానము” ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. (సామెతలు 2:5) అలా చేయడం ద్వారా మీరు వాటిని ఎన్నో సంవత్సరాలపాటు భద్రంగా ఉంచుకోగలుగుతారు. మీరు వర్ధమాన దేశాలకు చెందినవారైతే, స్కూలుకు వెళ్ళేటప్పుడు ఎన్నో పాఠ్యపుస్తకాలు ఉపయోగించకపోయి ఉండవచ్చు, కేవలం వినడం ద్వారా గమనించడం ద్వారా నేర్చుకొని ఉండవచ్చు. ఉదాహరణకు, బెనిన్‌లో 50 కంటే ఎక్కువ భాషలు వాడుకలో ఉన్నాయి. అక్కడి ప్రజలు నాలుగు లేదా ఐదు భాషలను అనర్గళంగా మాట్లాడడం సాధారణమైన విషయం, వారు ఎన్నడూ ఆ భాషలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను చదవకపోయినా వారికి ఆ భాషలు వచ్చు. వినడం, గమనించడం, అవధానముంచడం ద్వారా నేర్చుకునే సామర్థ్యం మీకు ఉండడం నిజంగా ఒక వరమే. అయినా కూడా పుస్తకాలు మీ అధ్యయనానికి ఎంతో సహాయం చేస్తాయని మీరు గ్రహిస్తారు.

మీరు చాలా చిన్న ఇంట్లో నివసిస్తున్నా కూడా, మీ బైబిలు దాని సంబంధిత ప్రచురణలు ఉంచడానికి తగిన స్థలాన్ని కొంత కేటాయించండి. సులభంగా తీసుకోగలిగేలా ఉండే స్థలంలో, అవి పాడవకుండా ఉండే స్థలంలో వాటిని ఉంచండి.

కుటుంబ అధ్యయనం

మీరు తల్లి లేక తండ్రి అయితే, మీ పిల్లలు కూడా మీరు సంపాదించుకుంటున్నలాంటి జ్ఞానాన్నే సంపాదించుకోవడానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. వర్ధమాన దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవితానికి అవసరమయ్యే అనేక నైపుణ్యాలను నేర్పిస్తారు. వాటిలో వంట చేయడం, వంటచెరకు సమకూర్చడం, నీళ్ళు తేవడం, పొలం పనులు, చేపలు పట్టడం, సరుకులు తేవడం వంటి పనులు ఉండవచ్చు. అది నిజంగా జీవితానికి ఉపయోగపడే విద్య. అయితే చాలామంది తల్లిదండ్రులు ఆ విద్యలో నిత్యజీవానికి నడిపించగల జ్ఞానాన్ని మాత్రం చేర్చరు.

మీ పరిస్థితులు ఎలాగున్నా సరే, దాని కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు అని మీకు అనిపిస్తుండవచ్చు. సృష్టికర్తకు కూడా ఆ విషయం తెలుసు. పిల్లలకు తన మార్గాలను నేర్పించే విషయంలో ఆయన ఎంతోకాలం ముందే ఏమి చెప్పాడో చూడండి: “నీవు నీ కుమారులకు [లేదా కుమార్తెలకు] వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:7) ఆ మాటల ఆధారంగా, ఈ క్రింద సూచించబడినట్లు మీరు మీ స్వంత బోధనా కార్యక్రమాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి:

1. “నీ యింట కూర్చుండునప్పుడు”: వేరొక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ప్రతివారం ఎలా అధ్యయనం చేసేవాడో అదే విధంగా ప్రతివారం మీ పిల్లలతో మీ ఇంట్లోనే బైబిలు చర్చలను క్రమంగా నిర్వహించడానికి కృషి చేయండి. అన్ని వయసుల పిల్లలకు తగిన రీతిలో బోధించడానికి అనువైన బైబిలు ఆధారిత పుస్తకాలు యెహోవాసాక్షులవద్ద లభిస్తాయి.

2. “త్రోవను నడుచునప్పుడు”: మీ పిల్లలకు జీవితావసరాల గురించి అవకాశం దొరికినప్పుడల్లా బోధించి వారికి మార్గనిర్దేశాలు ఇచ్చినట్లే, యెహోవా గురించి మాట్లాడుతూ ఉండండి.

3. “పండుకొనునప్పుడు”: మీ పిల్లలతోపాటు ప్రతీ సాయంత్రం ప్రార్థన చేయండి.

4. “లేచునప్పుడు”: ప్రతీరోజు ఉదయం ఒక బైబిలు వచనాన్ని పరిశీలించడం ద్వారా చాలా కుటుంబాలు చక్కని ప్రతిఫలాలను చవిచూశాయి. యెహోవాసాక్షులు అలా చేయడానికి ప్రతిదినము లేఖనాలను పరిశోధించడం * అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగిస్తారు.

వర్ధమాన దేశాల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి లౌకిక విద్య లభించేలా చూసేందుకు ఎంతో కష్టపడతారు. ఆ విధంగా చేసినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వాళ్ళను చూసుకోగలుగుతారు. అయితే మీరు బైబిలును అధ్యయనం చేసి మీ పిల్లలు కూడా అలా చేయడానికి సహాయం చేస్తే, మీరూ మీ కుటుంబమూ నిరంతరం జీవించేందుకు సహాయం చేసే జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు.

మనకు అన్నీ తెలుసు అని చెప్పగలిగే రోజు ఎప్పటికైనా వస్తుందా? రాదు. మన భూమి ఈ అనంత విశ్వంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉంటాము. నిజానికి ప్రసంగి 3:⁠11 ఇలా చెబుతోంది: “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును [దేవుడు] నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.” జ్ఞానం సంపాదించుకోవడమనే ఆహ్లాదకరమైన పని ఎన్నటికీ అంతం కాదు.

[అధస్సూచీలు]

^ పేరా 10 ఈ రెండూ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

^ పేరా 23 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

‘జ్ఞానం సంపాదించుకోవడమే నిత్యజీవము’

[7వ పేజీలోని చిత్రాలు]

ఇప్పుడూ ఎల్లప్పుడూ జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండడానికి మీ కుటుంబానికి సహాయం చేయండి