మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• డిసెంబరు 25ను యేసు జన్మదినంగా ఎంపిక చేయడం వెనుకున్న కారణమేమిటి?
యేసు జన్మించిన తేదీని దేవుని వాక్యం తెలియజేయడం లేదు. ఎన్సైక్లోపీడియా ఎస్పానికా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “డిసెంబరు 25న జరుపుకునే క్రిస్మస్ పండుగ ఖచ్చితమైన కాలాన్ని లెక్కించి నిర్ణయించినది కాదుగాని, రోమ్‌లో జరుపుకునే శీతాకాలపు పండుగలకు క్రైస్తవత్వాన్ని అంటగట్టి నిర్ణయించినదే.” శీతాకాలపు ఆకాశంలో మొదటిసారి సూర్యుడు కనబడడాన్ని ప్రాచీన రోమన్లు విందులు వినోదాలతో, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో ఒక పండుగలా ఆచరించేవారు.—12/15, 4-5 పేజీలు.
• అపొస్తలుల కార్యములు 7:59 ప్రకారం స్తెఫను యేసుకు ప్రార్థించాడని అర్థమా?
కాదు. యెహోవా దేవునికి మాత్రమే ప్రార్థించాలని బైబిలు తెలియజేస్తోంది. దర్శనంలో యేసును చూసిన తర్వాత స్తెఫను, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము” అని నేరుగా ఆయనకే విజ్ఞప్తి చేయడానికి వెనుకాడలేదని స్పష్టమవుతోంది. చనిపోయినవారిని పునరుత్థానం చేసే అధికారం యేసుకు ఇవ్వబడిందని స్తెఫనుకు తెలుసు. (యోహాను 5:27-29) కాబట్టి తనను పరలోకంలో అమర్త్యమైన జీవితానికి పునరుత్థానం చేసేంతవరకూ తన ఆత్మను లేదా జీవ శక్తిని భద్రంగా ఉంచమని స్తెఫను యేసును అడిగాడు లేదా వేడుకున్నాడు.—1/1, 31వ పేజీ.
• ఒక వ్యక్తి విధి ముందుగా నిర్ణయించబడదని మనకెలా తెలుసు?
దేవుడు మానవునికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, అది విధి నిర్ణయం అనే సిద్ధాంతం అర్థరహితమైనదని రుజువు చేస్తుంది. యెహోవా మనం చేపట్టాల్సిన విధానాన్ని మనం పుట్టక ముందే నిర్ధారించి, మనం చేసే పనులకు మనల్ని బాధ్యులుగా ఎంచితే, అది ఎంతో ప్రేమరహితమైన, అన్యాయమైన చర్యగా ఉంటుంది. (1 యోహాను 4:8; ద్వితీయోపదేశకాండము 32:4)—1/15, 4-5 పేజీలు.
• అద్భుతాలు జరగడం అసాధ్యమని చెప్పడం ఎందుకు సబబు కాదు?
కొంతమంది శాస్త్రజ్ఞులు దేవుని సృష్టిలోని వైజ్ఞానిక అద్భుతాలకు సంబంధించి తమకు కేవలం పాక్షిక జ్ఞానమే ఉందని గుర్తించి, ఇప్పుడిక ఏదైనా పూర్తిగా అసాధ్యమని ఖచ్చితంగా చెప్పలేము అని అంగీకరిస్తున్నారు. అలా జరగకపోవచ్చు అని మాత్రమే చెప్పడానికి వారు ఇష్టపడుతున్నారు.—2/15, 5-6 పేజీలు.
• ఫిలిష్తీయుల కుమార్తే తనకు భార్యగా కావాలని న్యాయాధిపతియైన సమ్సోను తన తల్లిదండ్రులకు ఎందుకు చెప్పాడు? (న్యాయాధిపతులు 14:2)
అబద్ధ ఆరాధకురాలిని పెళ్ళి చేసుకోవడం దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధం. (నిర్గమకాండము 34:11-16) అయినప్పటికీ, సమ్సోను ఫిలిష్తీయురాలినే ‘ఇష్టపడ్డాడు.’ సమ్సోను ‘ఫిలిష్తీయులకేమైన చేయుటకై రేపబడ్డాడు’ కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతోనే ఆ స్త్రీని ఇష్టపడ్డాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయనకు అండగా నిలబడ్డాడు. (న్యాయాధిపతులు 13:25; 14:3, 4, 6)—3/15, 26వ పేజీ.
• ఒక క్రైస్తవుడు తన పనులు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి బక్షీసు లేక ఒక విధమైన బహుమానం ఇవ్వాలా?
ఒక ప్రజాధికారి తన బాధ్యతకు విరుద్ధంగా లేదా చట్టానికి విరుద్ధంగా పని చేసి పెట్టాలని లేదా మనపట్ల ప్రత్యేక ఆదరం చూపించాలని అతడికి లంచం ఇవ్వడం లేదా విలువైనదేదైనా ఇవ్వడం తప్పు. అయితే ఒక చట్టబద్ధమైన పని చేయించుకోవడానికి లేదా అన్యాయమైన వ్యవహారాన్ని నివారించడానికి ఒక ప్రజాధికారికి బక్షీసు లేదా బహుమతి ఇస్తే అది లంచం ఇచ్చినట్లు కాదు.—4/1, 29వ పేజీ.