యెహోవా వాక్యంపై నమ్మకం ఉంచండి
యెహోవా వాక్యంపై నమ్మకం ఉంచండి
“నీ మాట నమ్ముకొనియున్నాను.”—కీర్తన 119:42.
కీర్తన 119ని వ్రాసిన రచయిత యెహోవా వాక్యాన్ని అమూల్యమైనదిగా పరిగణించాడు. ఆయన యూదా రాజైన హిజ్కియా కావచ్చు. ఈ ప్రేరేపిత కీర్తనలో వ్యక్తపరచబడిన భావాలు, తాను రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ‘యెహోవాను హత్తుకొనిన’ హిజ్కియా స్వభావానికి తగినట్టుగా ఉన్నాయి. (2 రాజులు 18:3-7) ఒకటి మాత్రం నిజం: ఆ రచయిత తన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించాడు.—మత్తయి 5:3.
2 దేవుని వాక్యపు లేదా సందేశపు విలువే 119వ కీర్తన మూలాంశం. * బహుశా జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయంగా ఉంటుందని ఆ రచయిత ఈ కీర్తనను అక్షరమాల క్రమంలో రచించాడు. దీనిలో ఉన్న 176 వచనాలు హీబ్రూ అక్షరమాలలోని అక్షరాల వరుసలో ఉన్నాయి. ఆదిమ హీబ్రూలో ఆ కీర్తనలోని 22 గేయ భాగాల్లోని 8 వరుసలు ఒకే అక్షరంతో మొదలవుతాయి. ఈ కీర్తన దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, శాసనాలను, మార్గాలను, ఆజ్ఞలను, కట్టడలను, న్యాయవిధులను, వాక్కులను ప్రస్తావిస్తోంది. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో హీబ్రూ బైబిలు మూలపాఠపు ఖచ్చితమైన అనువాదానికి అనుగుణంగా 119వ కీర్తన చర్చించబడుతుంది. ప్రాచీన, ఆధునిక కాల యెహోవా సేవకుల అనుభవాలను ధ్యానించడం ఈ దైవ ప్రేరిత కీర్తనపట్ల మన అవగాహనను ఎక్కువచేస్తూ, దేవుని లిఖిత వాక్యమైన బైబిలుపట్ల మన కృతజ్ఞతా భావాన్ని అధికం చేయాలి.
దేవుని వాక్యానికి లోబడండి, సంతోషంగా ఉండండి
3 నిజమైన ధన్యత లేదా సంతోషం దేవుని ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నడుచుకోవడం మీదే ఆధారపడి ఉంది. (కీర్తన 119:1-8) మనమలా నడుచుకున్నప్పుడు, యెహోవా మనలను ‘నిర్దోషముగా నడుచుకునే’ వారిగా పరిగణిస్తాడు. (కీర్తన 119:1) నిర్దోషులుగా ఉండడం అంటే దానర్థం మనం పరిపూర్ణులుగా ఉన్నామని కాదుగానీ, మనం యెహోవా దేవుని చిత్తం చేయడానికి కృషి చేస్తున్నామని అది సూచిస్తుంది. నోవహు ‘దేవునితో కూడా నడిచిన’ వ్యక్తిగా ‘తన తరములో నిందారహితునిగా’ ఉన్నాడు. ఆ నమ్మకస్థుడైన పితరుడు యెహోవా నిర్దేశించిన మార్గాన్ని అనుసరించిన కారణంగా ఆయన, ఆయన కుటుంబ సభ్యులు జలప్రళయాన్ని తప్పించుకున్నారు. (ఆదికాండము 6:9; 1 పేతురు 3:20) అదే ప్రకారంగా, ఈ లోకాంతాన్ని తప్పించుకోవాలంటే మనం ‘దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొంటూ’ ఆయన చిత్తం చేయాలి.—కీర్తన 119:4.
4 మనం యెహోవాకు ‘యథార్థ హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన కట్టడలు గైకొంటూ ఉంటే’ ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. (కీర్తన 119:7, 8) ‘ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము దాని ధ్యానించమని’ ఇవ్వబడిన ఉపదేశాన్ని అన్వయించుకున్న ఇశ్రాయేలీయ నాయకుడైన యెహోషువను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది ఆయన విజయం సాధించడానికి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి సహాయం చేసింది. (యెహోషువ 1:8) యెహోషువ తన జీవిత చరమాంకంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఇశ్రాయేలీయులకు ఇలా గుర్తుచేయగలిగాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు.” (యెహోషువ 23:14) యెహోషువ, 119వ కీర్తన రచయితల్లాగే యెహోవాను స్తుతిస్తూ, ఆయన వాక్యంపై నమ్మకం ఉంచడం ద్వారా మనం కూడా సంతోష సాఫల్యాలను పొందవచ్చు.
యెహోవా వాక్యం మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది
5 దేవుని వాక్యానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉంటే, మనం ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండవచ్చు. (కీర్తన 119:9-16) మన తల్లిదండ్రులు మంచి మాదిరిగా ఉండకపోయినా మనం ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండవచ్చు. హిజ్కియా తండ్రి విగ్రహారాధకుడైనా, హిజ్కియా మాత్రం అన్యమత ప్రభావాల నుండి ‘తన నడతను పరిశుభ్రం చేసుకున్నాడు.’ నేడు దేవుణ్ణి సేవిస్తున్న ఒక యౌవనుడు గంభీరమైన పాపం చేశాడని అనుకుందాం. పశ్చాత్తాపం, ప్రార్థన, తల్లిదండ్రుల సహాయం, క్రైస్తవ పెద్దల ప్రేమపూర్వక మద్దతు, ఆయన హిజ్కియాలాగే ‘తన నడతను పరిశుభ్రపరచుకొని జాగ్రత్తగా ఉండడానికి’ సహాయం చేయగలవు.—యాకోబు 5:13-15.
6కీర్తన 119 కూర్చబడడానికి ఎంతోకాలం పూర్వమే రాహాబు, రూతు జీవించినప్పటికీ వారు కూడా ‘తమ నడతను పరిశుభ్రం’ చేసుకున్నారు. రాహాబు కనానీయ వేశ్య, అయితే ఆమె తన విశ్వాసాన్ని బట్టి యెహోవా ఆరాధకురాలిగా మంచి పేరు తెచ్చుకుంది. (హెబ్రీయులు 11:30, 31) మోయాబీయురాలైన రూతు తన దేవుళ్లను విడిచిపెట్టి, యెహోవాను సేవిస్తూ ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి లోబడింది. (రూతు 1:14-17; 4:9-13) ఇశ్రాయేలీయులు కాని ఈ స్త్రీలిద్దరూ ‘దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా’ నడుచుకోవడంవల్ల యేసుక్రీస్తు పూర్వీకులయ్యే అద్భుతమైన ఆధిక్యతను పొందారు.—మత్తయి 1:1, 4-6.
7 “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది,” అయినా యౌవనులు సాతాను ఆధీనంలో ఉన్న ఈ కుళ్లిన ప్రపంచంలో కూడా పరిశుభ్ర మార్గాన్ని అనుసరించవచ్చు. (ఆదికాండము 8:21; 1 యోహాను 5:19) దానియేలు, ముగ్గురు హెబ్రీ యువకులు బబులోను చెరలో ఉన్నా, ‘దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా’ ప్రవర్తించారు. ఉదాహరణకు, వారు ‘రాజు భుజించు భోజనము పుచ్చుకొని’ తమను తాము అపవిత్రపరచుకోలేదు. (దానియేలు 1:6-10) బబులోనీయులు మోషే ధర్మశాస్త్రం నిషేధించిన అపవిత్రమైన జంతువులను భుజించేవారు. (లేవీయకాండము 11:1-31; 20:24-26) వారు సాధారణంగా చంపిన జంతువుల రక్తాన్ని ఒలికించేవారు కాదు, రక్తం ఒలికించని మాంసాన్ని భుజించడంద్వారా వారు రక్తం విషయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. (ఆదికాండము 9:3, 4) కాబట్టి ఆ నలుగురు హెబ్రీయులు, రాజు భుజించే భోజనాన్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు. దైవభక్తిగల ఆ యువకులు తమ ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడుకొని, చక్కని ఆదర్శంగా ఉన్నారు.
నమ్మకంగా ఉండడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది
8 యెహోవాపట్ల నమ్మకంగా ఉండడానికి దేవుని వాక్యాన్ని ప్రేమించడం ఒక ప్రాముఖ్యమైన అంశం. (కీర్తన 119:17-24) మనం ఆ ప్రేరేపిత కీర్తనకర్తలాగే ఉంటే, మనం కూడా దేవుని ధర్మశాస్త్రంలోని “ఆశ్చర్యమైన సంగతులను” గ్రహించాలని ప్రగాఢంగా కోరుకుంటాం. మనం ఎల్లప్పుడూ ‘యెహోవా న్యాయవిధుల కోసం ఆశపడతాము,’ ‘ఆయన శాసనములనుబట్టి సంతోషిస్తాము.’ (కీర్తన 119:18, 20, 24) మనం యెహోవాకు సమర్పించుకుని కొద్దికాలమే అయినా, మనం ‘నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షిస్తున్నామా?’ (1 పేతురు 2:1-2) మనం దేవుని నియమాలను చక్కగా అర్థం చేసుకొని వాటిని అన్వయించుకునేవారిగా ఉండాలంటే, బైబిల్లోని ప్రాథమిక బోధలను మనం అర్థం చేసుకోవాలి.
9 మనకు దేవుని శాసనాలంటే ప్రేమ ఉండవచ్చు, కానీ “అధికారులు” ఏదో కారణాన్నిబట్టి మనకు విరోధంగా మాట్లాడితే అప్పుడేమిటి? (కీర్తన 119:23, 24) నేడు అధికారంలో ఉన్నవారు, దేవుని నియమాలకన్నా మానవ నియమాలకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వమని మనలను బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తారు. మానవ అధికారానికి దేవుని చిత్తానికి మధ్య విభేదం ఏర్పడినప్పుడు మనమేమి చేయాలి? దేవుని వాక్యంపట్ల మనకున్న ప్రేమ మనం యెహోవాపట్ల నమ్మకంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. హింసించబడినప్పుడు యేసుక్రీస్తు అపొస్తలులు చెప్పినలానే మనం కూడా, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని చెబుతాం.—అపొస్తలుల కార్యములు 5:29.
10 అత్యంత కష్టభరితమైన పరిస్థితుల్లో సహితం మనం యెహోవాకు నమ్మకంగా ఉండవచ్చు. (కీర్తన 119:25-32) దేవునిపట్ల మన యథార్థతను కాపాడుకోవడంలో మనం విజయం సాధించాలంటే, మనం బోధింపతగిన వారిగా ఉంటూ, ఆయన ఉపదేశం కోసం మనఃపూర్వకంగా ప్రార్థించాలి. దానితోపాటు ‘సత్యమార్గాన్ని’ కూడా ఎంచుకోవాలి.—కీర్తన 119:26, 30.
11 బహుశా 119వ కీర్తనను వ్రాసిన హిజ్కియా “సత్యమార్గమును” ఎన్నుకున్నాడు. ఆయన చుట్టూ అబద్ధ ఆరాధకులు ఉన్నా, ఆయనను రాజ భవనపు సభ్యులు ఎగతాళి చేసినా ఆయన ఆ మార్గాన్నే ఎన్నుకున్నాడు. అలాంటి పరిస్థితుల మూలంగా ఆయన ‘ప్రాణము వ్యసనమువలన నీరైపోయి’ ఉండవచ్చు. (కీర్తన 119:28) అయితే హిజ్కియా దేవునిపై నమ్మకం ఉంచాడు, మంచి రాజుగా పరిపాలించాడు, “యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని” అనుసరించాడు. (2 రాజులు 18:1-5) దేవునిపై ఆధారపడడం ద్వారా మనం కూడా పరీక్షలను సహించి దేవునిపట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవచ్చు.—యాకోబు 1:5-8.
యెహోవా వాక్యం ధైర్యాన్ని నింపుతుంది
12 దేవుని వాక్య నిర్దేశాన్ని అనుసరించడం ద్వారా మనం జీవిత పరీక్షలను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని కీర్తన 119:33-40) యెహోవా నియమాలను “పూర్ణహృదయముతో” అనుసరించడానికి మనం వినయంతో ఆయన ఉపదేశాన్ని కోరతాము. (కీర్తన 119:33, 34) కీర్తనకర్తలాగే మనం దేవుణ్ణి ఇలా అర్థిస్తాము: “లోభముతట్టు [లేదా అన్యాయపు లాభంతట్టు] కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.” (కీర్తన 119:36) అపొస్తలుడైన పౌలులా మనం ‘అన్ని విషయాల్లో యోగ్యముగా [లేదా నిజాయితీగా] ప్రవర్తిస్తాం.’ (హెబ్రీయులు 13:18) మన యజమాని మనచేత అవినీతికరమైన పనులు చేయించాలని చూసినప్పుడు, మనం దేవుని నిర్దేశాలకే హత్తుకొని ఉండడానికి ధైర్యం తెచ్చుకోవాలి. అలాంటి వైఖరిని యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. నిజానికి, సమస్త చెడు తలంపులను నియంత్రించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఇలా ప్రార్థిద్దాము: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.” (కీర్తన 119:37) దేవుడు ద్వేషించే వ్యర్థమైన వాటిని కోరదగినదిగా దృష్టించాలని మనమెన్నటికీ కోరుకోము. (కీర్తన 97:10) అశ్లీలత, అభిచార క్రియల్లాంటి వాటికి దూరంగా ఉండడానికి ఇది మనలను పురికొల్పుతుంది.—1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8.
పొందవచ్చు. (13 దేవుని వాక్యపు ఖచ్చితమైన పరిజ్ఞానం, మనకు ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి కావలసిన మనోబలాన్ని ఇస్తుంది. (కీర్తన 119:41-48) మనల్ని ‘నిందించేవారికి ఉత్తరమివ్వడానికి’ మనకు ధైర్యం అవసరం. (కీర్తన 119:42) మనం కొన్నిసార్లు హింసలపాలైన యేసుక్రీస్తు శిష్యుల్లా ఉండవచ్చు, వారు ఇలా ప్రార్థించారు: “ప్రభువా, . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” ఆ ప్రార్థన ఫలితమేమిటి? “వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.” ఆ సర్వాధికారియైన ప్రభువే ఆయన వాక్యాన్ని ధైర్యంగా బోధించేందుకు మనకూ ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు.—అపొస్తలుల కార్యములు 4:24-31.
14 మనం “సత్యవాక్యమును” విలువైనదిగా పరిగణిస్తూ ‘నిరంతరం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ’ ఉంటే ఎలాంటి అవమాన భయం లేకుండా సాక్ష్యమిచ్చేందుకు కావలసిన ధైర్యం మనకు లభిస్తుంది. (కీర్తన 119:43, 44) దేవుని లిఖిత వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ‘రాజుల ఎదుట ఆయన శాసనముల గురించి మాట్లాడేందుకు’ మనలను సంసిద్ధులను చేస్తుంది. (కీర్తన 119:46) ప్రార్థన, యెహోవా ఆత్మ, మనం సత్య విషయాలను సరైన రీతిలో చెప్పడానికి కూడా మనకు సహాయం చేస్తాయి. (మత్తయి 10:16-20; కొలొస్సయులు 4:6) పౌలు మొదటి శతాబ్దపు పరిపాలకుల ఎదుట ధైర్యంగా దేవుని శాసనముల గురించి మాట్లాడాడు. ఉదాహరణకు, ఆయన “క్రీస్తుయేసునందలి విశ్వాసమును గూర్చి వినిన” రోమా అధిపతి ఫేలిక్సుకు సాక్ష్యమిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 24:24, 25) అధిపతియైన ఫేస్తు, రాజైన అగ్రిప్ప ఎదుట కూడా పౌలు సాక్ష్యమిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 25:22-26:32) యెహోవా సహాయంతో మనం కూడా ‘సువార్తను గురించి ఎన్నటికీ సిగ్గుపడని’ ధైర్యవంతులైన సాక్షులుగా ఉండవచ్చు.—రోమీయులు 1:16.
దేవుని వాక్యం మనకు ఓదార్పును ఇస్తుంది
15 యెహోవా వాక్యం మనకు స్థిరమైన ఓదార్పును లేదా నెమ్మదిని ఇస్తుంది. (కీర్తన 119:49-56) మనకు ప్రత్యేకంగా ఓదార్పు కావలసిన సమయాలు ఉంటాయి. యెహోవాసాక్షులముగా మనం ధైర్యంగా మాట్లాడినప్పటికీ, “గర్విష్ఠులు” అంటే దేవుని విషయంలో అహంకారంగా ప్రవర్తించేవారు కొన్నిసార్లు ‘మనలను మిగుల అపహసిస్తారు.’ (కీర్తన 119:51) అయితే మనం ప్రార్థించినప్పుడు దేవుని వాక్యంలోని సానుకూల విషయాలు మనకు జ్ఞాపకం రావచ్చు, ఆ విధంగా మనం ‘ఓదార్పు పొందవచ్చు.’ (కీర్తన 119:52) మనం ప్రార్థనలో మన విన్నపాలను తెలియజేస్తున్నప్పుడు, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఓదార్పును, ధైర్యాన్ని కలిగించే ఒక లేఖన నియమం లేదా సూత్రం మనకు గుర్తుకురావచ్చు.
16 కీర్తనకర్తను అపహసించిన ఆ గర్విష్ఠులు ఎవరోకాదు, దేవునికి సమర్పించుకున్న ఇశ్రాయేలు జనాంగ సభ్యులే. అదెంత సిగ్గుమాలిన పనో కదా! అయితే వారికి భిన్నంగా మనం దేవుని ధర్మశాస్త్రం నుండి ఎన్నటికీ వైదొలగకుండా ఉండడానికి తీర్మానించుకుందాం. (కీర్తన 119:51) అనేక సంవత్సరాలపాటు నాజీ హింసలను, అలాంటి ఇతర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, వేలాదిమంది యెహోవా సేవకులు దేవుని వాక్యంలోని నియమాలను సూత్రాలను అతిక్రమించేందుకు నిరాకరించారు. (యోహాను 15:18-21) యెహోవా కట్టడలు సాంత్వన కలిగించే మధుర గీతాల్లాంటివి కాబట్టి వాటికి లోబడడం మనకు ఏ మాత్రం భారం కాదు.—కీర్తన 119:54;1 యోహాను 5:3.
యెహోవా వాక్యంపట్ల కృతజ్ఞతతో ఉండండి
17 మనం దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా దానిపట్ల మన కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిస్తాము. (కీర్తన 119:57-64) కీర్తనకర్త ‘యెహోవా వాక్యములను అనుసరిస్తానని వాగ్దానం చేయడమే’ కాక ‘దేవుని నీతియుక్తమైన న్యాయవిధులనుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రివేళ మేల్కొన్నాడు.’ మనకు రాత్రివేళ మెలకువ వస్తే, అది ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఎంత చక్కని అవకాశమో కదా! (కీర్తన 119:57, 62) దేవుని వాక్యంపట్ల మనకున్న గౌరవభావం ఆయన బోధను వెదికేందుకు మనలను పురికొల్పుతుంది, ‘యెహోవాయందు భయభక్తులుగల వారందరితో’ అంటే దేవునిపట్ల భక్తిపూర్వక భయంగల వ్యక్తులతో సంతోషంగా సహవసించేవారిగా చేస్తుంది. (కీర్తన 119:63, 64) ఈ భూమిపై ఇంతకన్నా మంచి సహవాసం ఎక్కడ లభిస్తుంది?
18 మనం పూర్ణహృదయంతో ప్రార్థిస్తూ, మనకు బోధించమని వినయంతో యెహోవాను అర్థించినప్పుడు, మనలను ‘కటాక్షించమని’ ఆయనను వేడుకుంటున్నవారిగా ఉంటాము. ప్రత్యేకంగా ‘భక్తిహీనులపాశములు మనలను చుట్టిముట్టినప్పుడు’ మనమాయనకు ప్రార్థించాలి. (కీర్తన 119:58, 61) యెహోవా మనలను అడ్డగించే శత్రువుల పాశములను త్రెంచి, రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో కొనసాగే స్వేచ్ఛను మనకు ఇస్తాడు. (మత్తయి 24:14; 28:19, 20) మన సేవ నిషేధించబడిన దేశాల్లో ఇది చాలాసార్లు స్పష్టమైంది.
దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచండి
19 దేవునిపై, ఆయన వాక్యంపై మనకున్న విశ్వాసం శ్రమలను సహిస్తూ ఆయన చిత్తం చేయడానికి మనకు సహాయం చేస్తుంది. (కీర్తన 119:65-72) గర్విష్ఠులు తన మీద ‘అబద్ధాలు కల్పించినప్పటికీ’ కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.” (కీర్తన 119:66, 69, 71) యెహోవా సేవకులు శ్రమను అనుభవించడం మేలు ఎలా అవుతుంది?
20 మనం శ్రమ అనుభవించినప్పుడు ఖచ్చితంగా యెహోవాను మనఃపూర్వకంగా వేడుకుంటాం, అది మనలను ఆయనకు సన్నిహితులను చేస్తుంది. మనం దేవుని లిఖిత వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, దానిని అన్వయించుకోవడానికి మరింత ఎక్కువగా కృషి చేస్తాం. ఫలితంగా మనకు సంతోషభరితమైన జీవితం లభిస్తుంది. అయితే శ్రమలు ఎదురైనప్పుడు మనం అసహనంగా, అహంకారంతో ప్రవర్తించి మనకు కోరదగని లక్షణాలున్నాయని ప్రదర్శిస్తే అప్పుడెలా? మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ, దేవుని వాక్యం, ఆత్మ సహాయంతో అలాంటి లోపాలను అధిగమించి మనం మరింత ఎక్కువగా ‘నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం.’ (కొలొస్సయులు 3:9-14) అంతేకాక, మనం శ్రమలను సహించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. (1 పేతురు 1:6, 7) పౌలు తనకు ఎదురైన శ్రమలనుండి ప్రయోజనం పొందాడు, ఎందుకంటే అవి ఆయనను యెహోవాపై మరింతగా ఆధారపడేలా చేశాయి. (2 కొరింథీయులు 1:8-10) బాధలు మనపై మంచి ప్రభావం చూపడానికి మనం అనుమతిస్తున్నామా?
ఎల్లప్పుడూ యెహోవాపై నమ్మకం ఉంచండి
21 యెహోవాపై నమ్మకం ఉంచడానికి దేవుని వాక్యం మనకు తగిన ఆధారాన్ని ఇస్తోంది. (కీర్తన 119:73-80) మనం నిజంగా మన సృష్టికర్తపై నమ్మకం ఉంచితే, మనం సిగ్గుపడడానికి ఎలాంటి కారణమూ ఉండదు. అయితే ఇతరులు చేసే పనుల కారణంగా మనకు ఓదార్పు అవసరమవుతుంది కాబట్టి మనం ఇలా ప్రార్థించాలని భావించవచ్చు: “నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.” (కీర్తన 119:76-78) యెహోవా అలాంటి వారిని సిగ్గుపరచినప్పుడు, అది వారి దుష్ట మార్గాలను బహిర్గతం చేసి, ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధం చేస్తుంది. దేవుని ప్రజలను హింసించేవారు నిజానికి ఏమీ సాధించలేరని మనం నమ్మవచ్చు. ఉదాహరణకు, వారు పూర్ణహృదయంతో దేవునిపై నమ్మకముంచే యెహోవాసాక్షులను గతంలోనూ నిర్మూలించలేదు, భవిష్యత్తులోనూ నిర్మూలించలేరు.—సామెతలు 3:5, 6.
22 మనం హింసకు గురైనప్పుడు దేవుని వాక్యం ఆయనపై మన నమ్మకాన్ని బలపరుస్తుంది. (కీర్తన 119:81-88) గర్విష్ఠులు కీర్తనకర్తను హింసించిన కారణంగా ఆయన ఇలా భావించాడు: “నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని.” (కీర్తన 119:83, 86) బైబిలు కాలాల్లో నీటిని, ద్రాక్షారసాన్ని, ఇతర ద్రవ పదార్థాలను నిల్వచేయడానికి జంతు చర్మంతో చేసిన సిద్దెలు ఉపయోగించేవారు. వాటిని ఉపయోగించని సమయాల్లో, పొగగొట్టం లేని గదిలో మంటకు సమీపంగా వాటిని వ్రేలాడ దీసినప్పుడు అవి ముడతలుపడేవి. కష్టాలు లేదా హింసలవల్ల మీరెప్పుడైనా “పొగ తగులుచున్న సిద్దెవలె” ఉన్నట్లు భావించారా? అలాగైతే, యెహోవాపై నమ్మకముంచి ఇలా ప్రార్థించండి: “నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము.”—కీర్తన 119:88.
23 కీర్తన 119లో మనం పరిశీలించిన అర్ధభాగం, యెహోవా సేవకులు ఆయన వాక్యంపై నమ్మకముంచి ఆయన కట్టడలను, శాసనములను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు కాబట్టి ఆయన వారిపట్ల కృప చూపిస్తాడని చూపించింది. (కీర్తన 119:16, 47, 64, 70, 77, 88) తన భక్తులు తన వాక్యానుసారంగా జాగ్రత్తగా నడవడాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. (కీర్తన 119:9, 17, 41, 42) ఈ ప్రోత్సాహకరమైన కీర్తనలోని మిగతా భాగాన్ని అధ్యయనం చేయడానికి ఎదురుచూస్తుండగా, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా వాక్యం నా త్రోవను వెలుగుమయం చేసేందుకు నేను నిజంగా అనుమతిస్తున్నానా?’
[అధస్సూచి]
^ పేరా 4 ఇక్కడ ప్రస్తావించబడినది యెహోవా సందేశమే తప్ప దేవుని వాక్యమైన బైబిలు మొత్తం కాదు.
మీరెలా సమాధానమిస్తారు?
• నిజమైన సంతోషం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
• యెహోవా వాక్యము మనలను ఎలా ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచుతుంది?
• దేవుని వాక్యం ఏయే విధాలుగా మనలో ధైర్యాన్ని, ఓదార్పును నింపుతుంది?
• మనం యెహోవాపై, ఆయన వాక్యంపై ఎందుకు విశ్వాసముంచాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1. కీర్తన 119 రచయిత గుర్తింపు, ఆయన స్వభావం గురించి మీరేమి చెప్పగలరు?
2. కీర్తన 119 మూలాంశం ఏమిటి, ఈ కీర్తన ఎలా కూర్చబడింది?
3. నిర్దోషులుగా ఉండడం అంటే ఏమిటో వివరించి, ఉదాహరించండి.
4. మన సంతోషం, సాఫల్యాలు వేటిపై ఆధారపడి ఉంటాయి?
5. (ఎ) ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండడం ఎలా సాధ్యమో వివరించండి. (బి) గంభీరమైన పాపం చేసిన యౌవనునికి ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది?
6. ‘తమ నడతను పరిశుభ్రపరచుకొని దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా’ నడుచుకొన్న స్త్రీలు ఎవరు?
7. దానియేలు, ముగ్గురు హెబ్రీ యువకులు తమ ఆధ్యాత్మిక పరిశుభ్రతను కాపాడుకునే విషయంలో ఎలా చక్కని ఆదర్శాన్ని ఉంచారు?
8. మనం దేవుని నియమాలను అర్థం చేసుకొని, వాటిని అన్వయించుకోవడానికి మనకు ఎలాంటి దృక్పథం, పరిజ్ఞానం అవసరం?
9. దేవుని నియమాలకు, మానవ అధికారానికి మధ్య విభేదం ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి?
10, 11. అత్యంత కష్టభరితమైన పరిస్థితుల్లోనూ మనం యెహోవాపట్ల మనకున్న యథార్థతను ఎలా కాపాడుకోవచ్చో ఉదాహరించండి.
12. కీర్తన 119:36, 37ను మనం వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకోవచ్చు?
13. హింసలపాలైన యేసు శిష్యులు ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి కావలసిన శక్తిని ఎలా పొందారు?
14. పౌలు ఇచ్చినట్లే మనం కూడా ధైర్యంగా సాక్ష్యమిచ్చేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?
15. ఇతరులు మనలను అపహసించినప్పుడు దేవుని వాక్యం మనకు ఎలా ఓదార్పును ఇస్తుంది?
16. హింసలు ఎదురైనా మనం ఏమి చేయలేదు?
17. దేవుని వాక్యంపట్ల మనకున్న గౌరవభావం మనమేమి చేయడానికి మనల్ని పురికొల్పుతుంది?
18. ‘భక్తిహీనుల పాశములు మనల్ని చుట్టుముట్టినప్పుడు’ యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు?
19, 20. శ్రమలు అనుభవించడం ఎలా మేలు కాగలదు?
21. దేవుడు గర్విష్ఠులు సిగ్గుపడేలా చేసినప్పుడు ఏమి జరుగుతుంది?
22. కీర్తనకర్త ఏ భావంలో “పొగ తగులుచున్న సిద్దెవలె” ఉన్నాడు?
23. కీర్తన 119:1-88 వచనాల సమీక్షలో మనమేమి పరిశీలించాం, మనం కీర్తన 119:89-176 వచనాలను అధ్యయనం చేయడానికి ఎదురుచూస్తుండగా మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు?
[11వ పేజీలోని చిత్రాలు]
రూతు, రాహాబు, బబులోను పరవాసంలో ఉన్న హెబ్రీ యువకులు ‘దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్నారు’
[12వ పేజీలోని చిత్రం]
పౌలు ధైర్యంగా ‘రాజుల ఎదుట దేవుని శాసనముల గురించి మాట్లాడాడు’