కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మార్గాలను తెలుసుకోవడం

యెహోవా మార్గాలను తెలుసుకోవడం

యెహోవా మార్గాలను తెలుసుకోవడం

“నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.”​నిర్గమకాండము 33:​13.

మోషే ఫరో ఇంటిలో పెరిగాడు, ఐగుప్తు పరిపాలకులు గొప్పగా భావించిన జ్ఞానంలో విద్యాభ్యాసం చేశాడు. అయినప్పటికీ, ఆయన తాను ఐగుప్తీయుడను కాదనే విషయాన్ని గ్రహించాడు. ఆయన హెబ్రీ తల్లిదండ్రులకు జన్మించాడు. ఆయన తన 40వ ఏట ఒకరోజు తన ఇశ్రాయేలు సహోదరులను చూడడానికి వెళ్లాడు. అక్కడ ఒక ఐగుప్తీయుడు తన సహోదరుల్లో ఒకరిని బాధపెట్టడం చూసి, దానిని ఉపేక్షించలేకపోయాడు. ఆయన ఆ ఐగుప్తీయుణ్ణి చంపేశాడు. మోషే యెహోవా ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకొని, తన సహోదరుల విముక్తికి దేవుడు తనను ఉపయోగించుకుంటున్నాడని అనుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 7:21-25; హెబ్రీయులు 11:24, 25) ఆ విషయం అందరికీ తెలిసి, ఐగుప్తు రాజగృహంలోని వారు మోషేను ఒక తిరుగుబాటుదారునిగా దృష్టించడంతో ఆయన ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడనుండి పారిపోవలసి వచ్చింది. (నిర్గమకాండము 2:11-15) మోషేను దేవుడు ఉపయోగించుకోవాలంటే, ఆయన యెహోవా మార్గాలను బాగా తెలుసుకోవాలి. అయితే మోషే బోధించడానికి తగిన వ్యక్తిగా ఉంటాడా?​—⁠కీర్తన 25:⁠9.

2 ఆ తర్వాత మోషే 40 సంవత్సరాలపాటు పరవాసిగా, గొర్రెల కాపరిగా జీవించాడు. ఆయన తన హెబ్రీ సహోదరులు తననొక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించలేదని కోపం తెచ్చుకొని నిరాశపడకుండా దేవుడు అనుమతించిన దానికి లోబడ్డాడు. ఎలాంటి గుర్తింపు లభించకుండా అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, యెహోవా తనను తీర్చిదిద్దడానికి ఆయన ఒప్పుకున్నాడు. వ్యక్తిగత అంచనాతో కాకుండా, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో ఆయన ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12:3) యెహోవా మోషేను చాలా అసాధారణమైన రీతుల్లో ఉపయోగించుకున్నాడు. మనం కూడా సాత్వికులుగా ఉండడానికి ప్రయత్నిస్తే, యెహోవా మనలను కూడా ఆశీర్వదిస్తాడు.​—⁠జెఫన్యా 2:⁠3.

మోషే ఆజ్ఞాపించబడ్డాడు

3 యెహోవాకు ప్రాతినిధ్యం వహించిన ఒక దేవదూత ఒకరోజు సీనాయి ద్వీపకల్పంలో ఉన్న హోరేబు కొండ దగ్గర మోషేతో మాట్లాడాడు. ఆయన మోషేకు ఇలా చెప్పాడు: “నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్ట పెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, . . . పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.” (నిర్గమకాండము 3:2, 7, 8) ఈ పని చేయడానికి దేవుడు మోషేను ఉపయోగించుకుంటాడు, అయితే ఆ పని ఆయన యెహోవా నిర్దేశానికి అనుగుణంగా చేయాలి.

4 యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు: “కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను.” అది విన్న మోషే వెనకంజ వేశాడు. అందుకు తాను అర్హుడను కానని ఆయన భావించాడు, ఆయన తన సామర్థ్యం మీదే ఆధారపడే వ్యక్తి అయితే నిజంగానే అర్హుడు కాదు. అయితే, యెహోవా మోషేకు ఇలా హామీ ఇచ్చాడు: “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును.” (నిర్గమకాండము 3:10-12) యెహోవా మోషేకు అద్భుతకార్యాలు చేసే శక్తినిచ్చాడు, ఆ అద్భుతకార్యాలు ఆయనను నిజంగా దేవుడే పంపించాడని రుజువు చేసే నిదర్శనాలుగా పనిచేస్తాయి. మోషే తరఫున మాట్లాడేందుకు ఆయన సహోదరుడు అహరోను ఆయనతో కూడా వెళ్లాలి. అక్కడ వారు ఏమి చేయాలో, ఏమి చెప్పాలో యెహోవాయే వారికి బోధిస్తాడు. (నిర్గమకాండము 4:1-17) మోషే ఆ నియామకాన్ని నమ్మకంగా నెరవేరుస్తాడా?

5 ఇశ్రాయేలీయుల పెద్దలు మొదట్లో మోషేను, అహరోనును నమ్మారు. (నిర్గమకాండము 4:29-31) అయితే ఎక్కువ రోజులు గడవకముందే, “ఇశ్రాయేలీయుల నాయకులు” మోషే, ఆయన అన్న తమను ఫరో ఎదుట, అతని దాసుల ఎదుట “అసహ్యులనుగా” చేశారని నిందించారు. (నిర్గమకాండము 5:19-21; 6:9) ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వస్తున్నప్పుడు, తమను తరుముకొస్తున్న ఫరో రథాలను చూసి వాళ్ళు భయపడ్డారు. ముందు ఎర్ర సముద్రం, వెనుక యుద్ధరథాలు చూసి తాము మధ్యలో చిక్కుకుపోయామని భావించిన ఇశ్రాయేలీయులు మోషేను నిందించారు. మీరే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా స్పందించి ఉండేవారు? ఇశ్రాయేలీయుల దగ్గర వెళ్ళడానికి పడవలు లేకపోయినా వారు బయలుదేరాలనే యెహోవా నిర్దేశాన్నిబట్టి మోషే ప్రజలను పురికొల్పాడు. అప్పుడు యెహోవా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడంతో, ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళగలిగేలా, ఆ సముద్ర గర్భం ఆరిన నేలలా తయారైంది.​—⁠నిర్గమకాండము 14:​1-22.

విడుదలకన్నా మరింత ప్రాముఖ్యమైన వివాదాంశం

6 యెహోవా మోషేకు ఆదేశాలు ఇస్తున్నప్పుడు దేవుని పేరుకున్న ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. ఆ పేరును, ఆ పేరు ధరించిన దేవుణ్ణి గౌరవించడం ఆవశ్యకం. తన పేరు గురించి అడిగినప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నేను ఎలా కావాలంటే అలా అవుతాను.” అంతేకాక, మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాలి: “మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపె[ను].” యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” (నిర్గమకాండము 3:​13-15, NW) యెహోవా పేరు మారలేదు, భూవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకులకు ఆయన ఆ పేరుతోనే తెలుసు.​—⁠యెషయా 12:​4, 5; 43:​10-12.

7 మోషే అహరోనులు ఫరో ఎదుటకు వచ్చినప్పుడు యెహోవా పేరు మీదే వారి సందేశాన్ని సమర్పించారు. అయితే ఫరో అహంకారంతో “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను” అన్నాడు. (నిర్గమకాండము 5:​1, 2) ఆ విధంగా ఫరో తాను కఠినాత్ముడననీ, కుయుక్తిపరుడననీ నిరూపించుకున్నాడు, అయినప్పటికీ యెహోవా మళ్లీ మళ్లీ తన సందేశమేమిటో అతనికి చెప్పమని మోషేను పురికొల్పాడు. (నిర్గమకాండము 7:​14-16, 20-23; 8:1, 2, 20) ఫరోకు చిరాకుగా ఉందని మోషే గ్రహించగలిగాడు. అలాంటప్పుడు అతని దగ్గరకు మళ్లీ వెళ్లడంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇశ్రాయేలీయులు విడుదల కోసం ఆతురతతో ఉన్నారు. ఫరో మొండిగా నిరాకరిస్తూనే ఉన్నాడు. మీరే మోషే స్థానంలో ఉంటే ఏమిచేసి ఉండేవారు?

8 మోషే మరో సందేశాన్ని వినిపిస్తూ ఇలా అన్నాడు: “హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. . . . నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.” దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.” (నిర్గమకాండము 9:13-16) మొండివాడైన ఫరోను దండించడం ద్వారా, తనను ప్రతిఘటించే వారందరికీ ఒక హెచ్చరికలా తన శక్తిని ప్రదర్శించాలని యెహోవా ఉద్దేశించాడు. “లోకాధికారి” అని యేసుక్రీస్తు సంబోధించిన అపవాదియైన సాతాను కూడా వారిలో ఉన్నాడు. (యోహాను 14:30; రోమీయులు 9:17-24) ముందే చెప్పబడినట్లు యెహోవా పేరు భూవ్యాప్తంగా ప్రకటించబడింది. ఆయన చూపించిన దీర్ఘశాంతం ఇశ్రాయేలీయులు, వారితోపాటు దేవుని ఆరాధనలో ఐక్యమైన అనేకులైన అన్యజనుల సమూహం రక్షణ పొందడానికి దారితీసింది. (నిర్గమకాండము 9:​20, 21; 12:37, 38) అప్పటినుండి, యెహోవా పేరు ప్రకటించబడడం సత్యారాధన చేపట్టిన లక్షలాదిమందికి ప్రయోజనాన్ని చేకూర్చింది.

క్లిష్టమైన ప్రజలతో వ్యవహరించడం

9 హెబ్రీయులకు దేవుని పేరు తెలుసు. మోషే వారితో మాట్లాడినప్పుడు ఆ పేరు ఉపయోగించాడు, అయితే ఆ పేరుగల దేవునికి వారు అన్నివేళలా సరైన గౌరవం చూపించలేదు. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి అద్భుత రీతిలో విడుదల చేసిన తర్వాత, వారికి త్రాగడానికి సరైన నీరు వెంటనే లభించకపోవడంతో ఏమి జరిగింది? వారు మోషేకు వ్యతిరేకంగా సణిగారు. ఆ తర్వాత, ఆహారం విషయంలో ఫిర్యాదు చేశారు. వారి సణుగుడు తనకూ అహరోనుకూ వ్యతిరేకంగా కాదు, యెహోవాకే వ్యతిరేకమైనదని మోషే వారిని హెచ్చరించాడు. (నిర్గమకాండము 15:​22-24; 16:2-12) సీనాయి కొండ దగ్గర యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అప్పుడు సహజాతీత సూచనలు కూడా కలిగాయి. అయితే ఆ ప్రజలు అవిధేయులై ఒక బంగారు దూడను చేసుకొని “యెహోవాకు పండుగ” చేస్తున్నామని చెప్పుకున్నారు.​—⁠నిర్గమకాండము 32:​1-9.

10 లోబడనొల్లని ప్రజలు అని యెహోవాయే వర్ణించిన ఆ ప్రజలతో మోషే ఎలా వ్యవహరించాలి? మోషే యెహోవాకు ఇలా విజ్ఞాపన చేశాడు: “నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” (నిర్గమకాండము 33:13) యెహోవా ఆధునికదిన సాక్షులపట్ల శ్రద్ధ వహిస్తున్నప్పుడు, క్రైస్తవ పైవిచారణకర్తలు ఆ జనాంగంకన్నా మరెంతో వినయస్థులైన ప్రజలను కాస్తున్నారు. అయినప్పటికీ వారు కూడా ఇలా ప్రార్థిస్తారు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము.” (కీర్తన 25:4) యెహోవా మార్గాల గురించిన పరిజ్ఞానం, దేవుని వాక్యానికి అనుగుణంగా, ఆయన వ్యక్తిత్వానికి పొందికగా ఉండే విధంగా పరిస్థితులతో వ్యవహరించేలా పైవిచారణకర్తలకు సహాయం చేస్తుంది.

యెహోవా తన ప్రజల నుండి ఏమి ఆశిస్తాడు?

11 యెహోవా తన ప్రజల నుండి ఏమి ఆశిస్తాడో సీనాయి కొండ దగ్గర మౌఖికంగా వెల్లడి చేయబడింది. ఆ తర్వాత మోషేకు లిఖితపూర్వక పది ఆజ్ఞల పలకలు రెండు ఇవ్వబడ్డాయి. ఆయన ఆ కొండ మీదనుండి దిగివస్తూ ఇశ్రాయేలీయులు పోతపోసిన ఒక దూడను ఆరాధించడం చూసి కోపంతో ఆ రెండు పలకలను నేలకు విసిరికొట్టి పగలగొట్టాడు. యెహోవా మళ్లీ, మోషే చెక్కిన రాతిపలకలపై పది ఆజ్ఞలు వ్రాశాడు. (నిర్గమకాండము 32:​19; 34:1) ఆ ఆజ్ఞలు మొదట ఇవ్వబడినప్పటి నుండి ఇప్పటివరకు మారలేదు. మోషే వాటికి అనుగుణంగా ప్రవర్తించాలి. దేవుడు తానెలాంటి వ్యక్తో మోషేకు శక్తిమంతంగా స్పష్టం చేసి, యెహోవా ప్రతినిధిగా ఆయనెలా ప్రవర్తించాలో చూపించాడు. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు, అయితే యెహోవా మోషేకు సెలవిచ్చిన వాటిలో అనేక ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. అవి మారలేదు, యెహోవాను ఆరాధించే వారందరికీ అవి ఇప్పటికీ వర్తిస్తాయి. (రోమీయులు 6:​14; 13:8-10) వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

12యెహోవాపట్ల అవిభాగిత భక్తిని ప్రదర్శించండి. తాను రోషముగలవాడినని లేదా అవిభాగిత భక్తిని కోరేవాడనని యెహోవా ప్రకటించినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అక్కడే ఉంది. (నిర్గమకాండము 20:2-5) ఆ ఇశ్రాయేలీయులు యెహోవాయే సత్యదేవుడు అనడానికి ఎన్నో రుజువులను చూశారు. (ద్వితీయోపదేశకాండము 4:33-35) ఇతర జనాంగాలు ఏమి చేస్తున్నా, తన ప్రజల మధ్య మాత్రం ఎలాంటి విగ్రహారాధనను, అభిచారాన్ని సహించనని యెహోవా స్పష్టం చేశాడు. ఆయనపట్ల వారి భక్తి కేవలం లాంఛనప్రాయంగా ఉండకూడదు. వారందరూ తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, తమ పూర్ణశక్తితో యెహోవాను ప్రేమించాలి. (ద్వితీయోపదేశకాండము 6:5, 6) దీనిలో వారి మాట, ప్రవర్తనే కాదు వారి జీవితంలోని ప్రతీ అంశమూ ఇమిడివుంది. (లేవీయకాండము 20:27; 24:​15, 16; 26:1) యెహోవా అవిభాగిత భక్తిని కోరుతున్నాడని యేసుక్రీస్తు కూడా స్పష్టం చేశాడు.​—⁠మార్కు 12:​28-30; లూకా 4:⁠8.

13యెహోవా ఆజ్ఞలకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఇశ్రాయేలీయులు తాము యెహోవాతో నిబంధనా సంబంధంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకు పూర్తిగా లోబడి ఉంటామని ప్రమాణం చేసినట్లు వారికి గుర్తుచేయాల్సి వచ్చింది. వారు ఎంతో వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించారు, అయితే యెహోవా ఏ యే విషయాల్లో ఆజ్ఞలు ఇచ్చాడో ఆ విషయాల్లో మాత్రం వారు ఖచ్చితంగా లోబడి ఉండాలి. అలా ఉండడం దేవునిపట్ల వారికున్న ప్రేమను నిరూపిస్తుంది. అంతేకాక, యెహోవా నియమాలు వారి మేలు కోసమే కాబట్టి వారికి, వారి సంతానానికి కూడా అది ప్రయోజనం చేకూరుస్తుంది.​—⁠నిర్గమకాండము 19:5-8; ద్వితీయోపదేశకాండము 5:​27-33; 11:​22, 23.

14ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమస్థానం ఇవ్వండి. ఇశ్రాయేలీయులు తమ ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపలేనంతగా తమ భౌతిక అవసరాల్లో మునిగిపోకూడదు. కేవలం లోక సంబంధ విషయాలకే ఇశ్రాయేలీయుల జీవితాలు అంకితం కాకూడదు. యెహోవా ప్రతీవారం తాను పవిత్రమని పరిగణించే నిర్దేశిత సమయాన్ని కేటాయించాడు, ఆ సమయాన్ని సత్యదేవుని ఆరాధనా సంబంధ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. (నిర్గమకాండము 35:1-3; సంఖ్యాకాండము 15:32-36) అదనంగా ప్రతీ సంవత్సరం, ప్రత్యేక పరిశుద్ధ సమావేశాలకు సమయం కేటాయించాలి. (లేవీయకాండము 23:4-44) ఇవి యెహోవా శూరకార్యాలను చర్చించుకోవడానికి, ఆయన మార్గాలను గుర్తుచేసుకోవడానికి, ఆయన చేసిన మేలంతటికీ కృతజ్ఞతలు చెల్లించేందుకు అవకాశాలను ఇస్తాయి. ప్రజలు యెహోవాపట్ల తమ భక్తిని ప్రదర్శించేకొద్దీ, వారు దేవుని భయంలోనూ ప్రేమలోనూ ఎదగడానికే కాక ఆయన మార్గాల్లో నడిచేందుకూ సహాయం పొందుతారు. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) ఆ ఉపదేశాల్లో నిక్షిప్తమైన ఆరోగ్యకరమైన సూత్రాలు నేటి యెహోవా సేవకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.​—⁠హెబ్రీయులు 10:​24-25.

యెహోవా లక్షణాలను అర్థం చేసుకోవడం

15 యెహోవా లక్షణాలను అర్థం చేసుకోవడం కూడా ప్రజలతో వ్యవహరించడానికి మోషేకు సహాయం చేస్తుంది. దేవుడు మోషేను దాటివెళుతూ ఇలా ప్రకటించాడని నిర్గమకాండము 34:5-7 చెబుతోంది: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును.” ఆ మాటలను ధ్యానించడానికి సమయం తీసుకోండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ప్రతీ లక్షణానికి ఎలాంటి అర్థముంది? దానిని యెహోవా ఎలా ప్రదర్శించాడు? ఆ లక్షణాన్ని క్రైస్తవ పైవిచారణకర్తలు ఎలా కనబరచవచ్చు? మనలో ప్రతీ ఒక్కరి చర్యలను ఆ ప్రత్యేక లక్షణం ఎలా ప్రభావితం చేయాలి?’ కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

16 యెహోవా ‘దయ, కనికరముగల దేవుడు.’ మీ దగ్గర లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే రెఫరెన్సు గ్రంథం ఉంటే “Mercy” అనే శీర్షిక క్రిందవున్న సమాచారాన్ని ఎందుకు చదవకూడదు? ఆ విషయం గురించి వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో లేదా వాచ్‌టవర్‌ లైబ్రరీ (సీడీ రామ్‌) * ఉపయోగించి పరిశోధించండి. కనికరం (Mercy) అనే మాట ఉన్న లేఖనాలను కనుగొనేందుకు కాన్‌కార్డెన్సును ఉపయోగించండి. యెహోవా కనికరంలో, కొన్నిసార్లు శిక్షను తగ్గించేందుకు అనుమతించడంతోపాటు ఆయన మహా వాత్సల్యం కూడా చేరి ఉండడాన్ని మీరు చూస్తారు. తన ప్రజలకు ఉపశమనం తీసుకురావడానికి చర్యతీసుకొనేలా అది దేవుణ్ణి పురికొల్పుతుంది. దీనికి రుజువుగా, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్లే ప్రయాణంలో దేవుడు వారికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా అవసరమైనవి సమకూర్చాడు. (ద్వితీయోపదేశకాండము 1:​30-33; 8:4) వారు తప్పు చేసినప్పుడు యెహోవా కనికరంతో వారిని క్షమించాడు. ఆయన తన ప్రాచీన ప్రజలపట్ల కనికరం చూపించాడు. కాబట్టి ఆయన ప్రస్తుత కాల సేవకులు ఇంకా ఎంత ఎక్కువగా పరస్పరం కనికరాన్ని చూపించుకోవాలో కదా!​—⁠మత్తయి 9:​13; 18:​21-35.

17 యెహోవా కనికరంగల వాడేకాదు, దయగలవాడు కూడా. మీ దగ్గర ఒక నిఘంటువు ఉంటే “దయ” అనే మాటకు అర్థాన్ని చూడండి. యెహోవా దయగలవాడు అని చెప్పే లేఖనాలతో దానిని పోల్చండి. యెహోవా దయాగుణంలో తన ప్రజల్లోని బీదలపట్ల ఆయనకున్న ప్రేమపూర్వక శ్రద్ధ ఇమిడివుందని బైబిలు చూపిస్తోంది. (నిర్గమకాండము 22:26, 27) ఏ దేశంలో ఉన్నప్పటికీ, పరదేశులు, ఇతరులు తాము అననుకూల పరిస్థితిలో ఉన్నట్లే భావిస్తారు. అలాంటి వారిపట్ల నిష్పక్షపాతంగా ఉండాలనీ, దయ చూపించాలనీ తన ప్రజలకు బోధించేటప్పుడు, వారు కూడా ఒకప్పుడు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారని యెహోవా వారికి గుర్తుచేశాడు. (ద్వితీయోపదేశకాండము 24:17-22) నేడు దేవుని ప్రజలుగా మన విషయమేమిటి? మనం చూపించే దయ మనలను ఐక్యపరచడమే కాక, యెహోవా ఆరాధనకు ఇతరులను కూడా ఆకర్షిస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35; ప్రకటన 7:​9, 10.

18 అయితే ఇతర జనాంగాలపట్ల ఉండే దయాపూర్వక శ్రద్ధ యెహోవాపట్ల, ఆయన నైతిక ప్రమాణాలపట్ల ఇశ్రాయేలీయులు చూపించవలసిన ప్రేమను నీరుగార్చకూడదు. ఆ విధంగా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూవున్న జనాంగాల పద్ధతులను చేపట్టకూడదనీ, వారి మతాచారాలను, దుర్నీతికరమైన జీవన విధానాలనూ స్వీకరించకూడదని వారు ఉద్బోధించబడ్డారు. (నిర్గమకాండము 34:11-16; ద్వితీయోపదేశకాండము 7:1-4) అది నేడు మనకు కూడా అన్వయిస్తుంది. మన దేవుడైన యెహోవా పరిశుద్ధునిగా ఉన్నట్లే, మనం కూడా పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి.​—⁠1 పేతురు 1:​14-16.

19 మోషే తన మార్గాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో, తాను పాపాన్ని ఆమోదించకపోయినా, దీర్ఘశాంతం చూపించే దేవుడనని యెహోవా స్పష్టం చేశాడు. తన నియమాలేమిటో నేర్చుకుని, వాటికి అనుగుణంగా ప్రవర్తించడానికి ఆయన ప్రజలకు సమయం ఇస్తాడు. పశ్చాత్తాపం చూపిన వారిని ఆయన క్షమిస్తాడు, అయితే గంభీరమైన తప్పులకు తగిన శిక్ష అనుభవించకుండా ఆయన మినహాయింపు ఇవ్వడు. ఇశ్రాయేలీయుల క్రియలనుబట్టి భవిష్యత్తు తరాలకు మంచైనా, చెడైనా జరిగే అవకాశం ఉందని ఆయన మోషేను హెచ్చరించాడు. యెహోవా మార్గాల విషయంలో కృతజ్ఞతా భావం కలిగివుండడం, ప్రజలు స్వయంగా తమపైకి తెచ్చుకున్న పరిస్థితులనుబట్టి దేవుణ్ణి నిందించకుండా లేదా ఆయన ఆలస్యం చేస్తున్నాడని భావించకుండా కాపాడుతుంది.

20 యెహోవా గురించిన, ఆయన మార్గాల గురించిన మీ పరిజ్ఞానాన్ని ఎక్కువ చేసుకోవాలని మీరు కోరుకుంటే, మీరు బైబిలు చదివేటప్పుడు పరిశోధన చేయండి, ధ్యానించండి. యెహోవా వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికరమైన వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి. దేవుణ్ణి మీరు ఎలా అనుకరించవచ్చో, ఆయన సంకల్పానికి అనుగుణంగా మీ జీవితాన్ని మరింత ఎక్కువగా ఎలా మలచుకోవచ్చో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. అది మీరు ప్రమాదాలు తప్పించుకోవడానికి, తోటి విశ్వాసులతో సముచితంగా వ్యవహరించడానికి, మన అద్భుతమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ప్రేమించేందుకు ఇతరులకు సహాయం చేయడానికి మీకు దోహదపడుతుంది.

[అధస్సూచి]

^ పేరా 23 అన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

మీరేమి నేర్చుకున్నారు?

మోషేకు సాత్వికం ఎందుకు అవసరం, అది మనకూ ఎందుకు ఆవశ్యకం?

యెహోవా వాక్యాన్ని ఫరోకు పదేపదే ప్రకటించడం మూలంగా ఎలాంటి మేలు జరిగింది?

మోషేకు బోధించబడినవి, మనకు కూడా అన్వయించేవి అయిన ప్రముఖ సూత్రాలు కొన్ని ఏమిటి?

యెహోవా లక్షణాల గురించిన మన అవగాహనను మనమెలా ఎక్కువ చేసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుల్లో ఒకరిని బాధపెట్టడం చూసినప్పుడు, మోషే ఆ విధంగా ఎందుకు స్పందించాడు? (బి) యెహోవా సేవకు తగిన వ్యక్తిగా ఉండాలంటే, మోషే ఏమి నేర్చుకోవాలి?

3, 4. (ఎ) యెహోవా మోషేకు ఏమని ఆజ్ఞాపించాడు? (బి) మోషేకు ఎలాంటి మద్దతు ఇవ్వబడింది?

5. ఇశ్రాయేలీయుల వైఖరి మోషేకు ఎందుకు సవాలుగా నిలిచింది?

6. మోషేకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యెహోవా దేనిని నొక్కిచెప్పాడు?

7. ఫరో మొండిగా ప్రవర్తిస్తున్నా దేవుడు మోషేను ఏమి చేయమని పురికొల్పాడు?

8. ఫరోతో యెహోవా వ్యవహరించిన విధానంవల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఆ సంఘటనలు మనల్ని ఎలా ప్రభావితం చేయాలి?

9. మోషే సొంత ప్రజలే యెహోవాను ఏ విధంగా అవమానించారు?

10. నిర్గమకాండము 33:13లో వ్రాయబడిన మోషే విజ్ఞాపన, ముఖ్యంగా నేటి క్రైస్తవ పైవిచారణకర్తలకు ఎందుకు ఆసక్తికరంగా ఉంటుంది?

11. యెహోవా మోషేకు ఎలాంటి మార్గనిర్దేశాలు ఇచ్చాడు, వాటిలో మనకు ఎందుకు ఆసక్తి ఉండాలి?

12. యెహోవా అవిభాగిత భక్తిని కోరడం ఇశ్రాయేలును ఎలా ప్రభావితం చేసి ఉండవలసింది?

13. ఇశ్రాయేలీయులు దేవునికి పూర్తిగా ఎందుకు లోబడి ఉండాలి, ఆయనకు లోబడి ఉండేందుకు మనల్ని ఏది పురికొల్పాలి? (ప్రసంగి 12:13)

14. ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమస్థానం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను యెహోవా ఇశ్రాయేలీయులకు ఎలా నొక్కిచెప్పాడు?

15. (ఎ) యెహోవా లక్షణాలను అర్థం చేసుకోవడం మోషేకు ఎందుకు ప్రయోజనం చేకూర్చింది? (బి) యెహోవా లక్షణాల్లో ప్రతీదాని గురించి లోతుగా ఆలోచించడానికి మనకు ఏ ప్రశ్నలు సహాయం చేయవచ్చు?

16. దేవుని కనికరంపట్ల మన అవగాహనను ఎలా ఎక్కువ చేసుకోవచ్చు, అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

17. యెహోవా దయను మనం అర్థం చేసుకోవడం సత్యారాధనను ఎలా ప్రోత్సహించగలదు?

18. ఇతర జనాంగాల ప్రజల మార్గాల విషయంలో ఇశ్రాయేలీయులు పాటించాలని యెహోవా వారికి బోధించిన పరిమితుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

19. తప్పిదం విషయంలో దేవుని దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం ఆయన ప్రజలను ఎలా కాపాడుతుంది?

20. తోటి విశ్వాసులతో, మన పరిచర్యలో మనం కలుసుకునే వారితో సముచితంగా వ్యవహరించడానికి మనకేది దోహదపడగలదు? (కీర్తన 86:11)

[21వ పేజీలోని చిత్రం]

యెహోవా చెప్పినదాన్ని మోషే నమ్మకంగా ఫరోకు ప్రకటించాడు

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా మోషేకు తన నియమాలను వెల్లడిచేశాడు

[24, 25వ పేజీలోని చిత్రం]

యెహోవా లక్షణాలను ధ్యానించండి