కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒకప్పుడు తొలి క్రైస్తవత్వం వర్ధిల్లిన ప్రాంతంలో ప్రకటనా పని విస్తరణ

ఒకప్పుడు తొలి క్రైస్తవత్వం వర్ధిల్లిన ప్రాంతంలో ప్రకటనా పని విస్తరణ

ఒకప్పుడు తొలి క్రైస్తవత్వం వర్ధిల్లిన ప్రాంతంలో ప్రకటనా పని విస్తరణ

మధ్యధరా సముద్రంలోకి విస్తరించిన బూటు ఆకారంలో ఉండే ఇటలీ ద్వీపకల్పంలో, ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మతపరమైన, సాంస్కృతికపరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దానిలో ఉన్న విభిన్న ప్రకృతి దృశ్యాల అందాలు, ప్రఖ్యాతి గాంచిన కళాకృత్యాలు, అక్కడ దొరికే కమ్మని ఆహారం కోట్లాదిమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆ దేశంలో బైబిలు విద్య కూడా వర్ధిల్లుతోంది.

సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవులుగా మారిన యూదులు, యూదామత ప్రవిష్టులు యెరూషలేము నుండి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పుడు, అప్పటి ప్రపంచాధిపత్యానికి రాజధానిగా ఉన్న రోముకు నిజ క్రైస్తవత్వం మొట్టమొదటిసారిగా చేరి ఉండవచ్చు. దాదాపు సా.శ. 59లో అపొస్తలుడైన పౌలు మొదటిసారిగా ఇటలీని సందర్శించాడు. సముద్రతీరం దగ్గర ఉన్న పొతియొలీ అనే ప్రాంతంలో ఆయన విశ్వాసులైన ‘సహోదరులను చూశాడు.’​—⁠అపొస్తలుల కార్యములు 2:5-11; 28:​11-16.

యేసు, ఆయన అపొస్తలులు ముందుగా చెప్పినట్లు సా.శ. మొదటి శతాబ్దాంతానికి ముందు మతభ్రష్ట గుంపులు నెమ్మదిగా నిజ క్రైస్తవత్వం నుండి ప్రక్కదారి పట్టాయి. అయితే ఈ దుష్ట విధానాంతానికి ముందు, యేసు నిజ శిష్యులు ఇటలీతోపాటు ప్రపంచవ్యాప్తంగా, సువార్త ప్రకటించే పనికి నాయకత్వం వహించారు.​—⁠మత్తయి 13:​36-43; అపొస్తలుల కార్యములు 20:​29, 30; 2 థెస్సలొనీకయులు 2:​3-8; 2 పేతురు 2:1-3.

నిరుత్సాహపరచిన ప్రారంభం

బైబిలు విద్యార్థుల (యెహోవాసాక్షులను అప్పుడు అలా పిలిచేవారు) ప్రపంచవ్యాప్త పనికి నాయకత్వం వహిస్తున్న ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ 1891లో మొదటిసారిగా కొన్ని ఇటలీ నగరాలను సందర్శించారు. తన పరిచర్య ఫలితం అంత ఆశాజనకంగా లేదని ఆయన ఒప్పుకోవాల్సివచ్చింది: “ఇటలీలో కోతపని జరుగుతుందని ఆశించేలా మమ్మల్ని ప్రోత్సహించేదేదీ మేము కనుగొనలేదు.” 1910 వసంతకాలంలో బ్రదర్‌ రస్సెల్‌ ఇటలీకి మళ్ళీవచ్చి, రోము మధ్యలో ఉన్న వ్యాయామశాలలో ఒక బైబిలు ప్రసంగం ఇచ్చారు. దాని ఫలితం ఎలా ఉంది? “మొత్తానికి ఆ సమావేశం నిరాశనే మిగిల్చింది” అని ఆయన నివేదించారు.

వాస్తవానికి కొన్ని దశాబ్దాల వరకు ఇటలీలో సువార్త ప్రకటనా పనికి సంబంధించిన అభివృద్ధి నిదానంగానే కొనసాగింది, ఫాసిస్టు నియంతృత్వం యెహోవాసాక్షులను హింసించడమే దానికి కొంతవరకు కారణం. ఆ సమయంలో దేశంలో ఉన్న యెహోవాసాక్షులు 150 కన్నా మించిలేరు, వారిలో బైబిలు సత్యాన్ని విదేశాల్లో ఉన్న తమ బంధువుల నుండో స్నేహితుల నుండో నేర్చుకున్నవారే చాలామంది ఉన్నారు.

అద్భుతమైన అభివృద్ధి

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చాలామంది మిషనరీలు ఇటలీకి పంపించబడ్డారు. వాటికన్‌ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు మిషనరీలను బహిష్కరించమని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రభుత్వ పాత దస్తావేజులలో కనుగొనబడిన ఉత్తరప్రత్యుత్తరాలు వెల్లడి చేస్తున్నాయి. ఏదో కొద్దిమంది మినహాయించి, మిషనరీలందరూ దేశాన్ని విడిచి వెళ్లాలనే ఒత్తిడికి గురయ్యారు.

అడ్డంకులు ఎదురైనా, ఇటలీలోని జనసమూహం యెహోవా ఆరాధనా ‘పర్వతానికి’ ప్రవాహం వచ్చినట్లు వచ్చారు. (యెషయా 2:​2-4) సాక్షుల సంఖ్య అసాధారణమైన రీతిలో పెరిగింది. 2004లో సువార్తను ప్రకటించే ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 2,33,527 మందికి చేరింది. అంటే ప్రతీ 248 మంది నివాసులకు ఒక సాక్షి ఉన్నారు, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 4,33,242 మంది హాజరయ్యారు. యెహోవాసాక్షుల 3,049 సంఘాలు సౌకర్యవంతమైన రాజ్యమందిరాల్లో సమావేశమవుతున్నాయి.

అనేక భాషల్లో ప్రకటించడం

ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా జనాభాలోని కొన్ని వర్గాలవారు గణనీయంగా అభివృద్ధి చెందారు. ఆఫ్రికా, ఆసియా, తూర్పు యూరప్‌ దేశాల నుండి చాలామంది వలసదార్లు పనికోసమనో మెరుగైన జీవనం కోసమనో కొన్ని సందర్భాల్లో విషాదకరమైన పరిస్థితులను తప్పించుకోవడానికనో ఇటలీకి వస్తున్నారు. అలా వలస వస్తున్న లక్షలాదిమందికి ఆధ్యాత్మికంగా ఎలా సహాయం చేయవచ్చు?

ఇటలీలోని చాలామంది సాక్షులు అంహరిక్‌, అరబిక్‌, ఆల్బేనియన్‌, చైనీస్‌, తగాలోగ్‌, పంజాబీ, బెంగాలీ, సింహళ వంటి కష్టమైన విదేశీ భాషలను నేర్చుకోవాలనే సవాలును అంగీకరించారు. అలా సంసిద్ధత చూపించిన వారికి విదేశీ భాషల్లో సాక్ష్యం ఇవ్వడాన్ని బోధించడానికి 2001వ సంవత్సరంతో మొదలుకొని భాషా కోర్సులు నిర్వహించబడ్డాయి. గత మూడు సంవత్సరాల్లో 17 భాషల్లో నిర్వహించబడిన 79 కోర్సులకు 3,711 మంది సాక్షులు హాజరయ్యారు. ఇది 25 భాషల్లో 146 సంఘాలను, 274 గుంపులను ప్రారంభించి, వాటిని బలపరిచేందుకు తోడ్పడింది. అలా చాలామంది యథార్థవంతులు సువార్త విని, బైబిలు అధ్యయనం ప్రారంభించారు. తరచూ ఫలితాలు అసాధారణంగా ఉన్నాయి.

ఒక యెహోవాసాక్షి ఇండియా నుండి వచ్చిన జార్జ్‌ అనే మలయాళీ వ్యక్తితో బైబిలు గురించి మాట్లాడాడు. జార్జ్‌కు పనికి సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నా బైబిలు అధ్యయనాన్ని సంతోషంగా అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత జార్జ్‌ తన స్నేహితుడైన గిల్‌ అనే పంజాబీ వ్యక్తిని రాజ్య మందిరానికి తీసుకువెళ్ళాడు, ఆయనతో కూడా బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. గిల్‌, డేవిడ్‌ అనే తెలుగు వ్యక్తిని సాక్షులకు పరిచయం చేశాడు. కొంతకాలంలోనే డేవిడ్‌ బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. డేవిడ్‌ ఉంటున్న ఇంట్లోనే సోనీ, శుభాష్‌ అనే ఇద్దరు భారతీయులు నివసిస్తున్నారు. వాళ్ళు కూడా బైబిలు అధ్యయనానికి కూర్చున్నారు.

కొన్ని వారాల తర్వాత దలీప్‌ అనే మరాఠీ వ్యక్తి సాక్షులకు ఫోన్‌ చేశాడు. ఆయన ఇలా కోరాడు: “నేను జార్జ్‌ స్నేహితుణ్ణి. మీరు నాకు బైబిలు బోధిస్తారా?” సుమిత్‌ అనే తమిళ వ్యక్తి అధ్యయనం చేయడానికి ఇష్టపడ్డాడు. జార్జ్‌ మరో స్నేహితుడు ఫోన్‌ చేసి బైబిలు అధ్యయనం కోసం అడిగాడు. జార్జ్‌ ఆ తర్వాత మ్యాక్స్‌ అనే మరో యువకుణ్ణి రాజ్య మందిరానికి తీసుకువచ్చాడు. ఆయన కూడా అధ్యయనం కోసం అడిగాడు. ఇప్పటివరకు ఆరు బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి, ఇంకా నాలుగు అధ్యయనాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిలో ఉర్దూ, తమిళం, తెలుగు, పంజాబీ, మరాఠీ, మలయాళం, హిందీ భాషల్లోని ప్రచురణలను ఉపయోగిస్తున్నా ఆ అధ్యయనాలన్నీ ఆంగ్లంలోనే జరుగుతున్నాయి.

బధిరులు సువార్త “వింటున్నారు”

ఇటలీలో 90,000 కన్నా ఎక్కువమంది బధిరులు ఉన్నారు. 1970ల మధ్యకాలంలో సాక్షులు వారికి బైబిలు సత్యాన్ని బోధించే విషయంలో శ్రద్ధ చూపించడం ప్రారంభించారు. మొదట, కొందరు బధిరులైన సాక్షులు ఆ క్షేత్రంలో సహకరించేందుకు ఇష్టపడుతున్న తమ తోటి పరిచారకులకు ఇటాలియన్‌ సంజ్ఞాభాష నేర్పించారు. ఆ తర్వాత చాలామంది బధిరులు బైబిలు విషయంలో ఆసక్తి చూపించడం ప్రారంభించారు. నేడు, ఇటాలియన్‌ సంజ్ఞాభాషను ఉపయోగిస్తున్న 1,400 కన్నా ఎక్కువమంది క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నారు. పదిహేను సంఘాలు, 52 గుంపులు ఇటాలియన్‌ సంజ్ఞాభాషలో కూటాలను నిర్వహిస్తున్నాయి.

ప్రారంభంలో బధిరులకు ప్రకటించడం అనేది ప్రధానంగా కొంతమంది సాక్షులు చూపించిన చొరవతోనే జరిగింది. కానీ 1978లో యెహోవాసాక్షుల ఇటలీ బ్రాంచి కార్యాలయం బధిరుల కోసం సమావేశాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మిలాన్‌లో జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో బధిరుల కోసం కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆ సంవత్సరంలోని మే నెలలో ప్రకటించబడింది. బధిరుల కోసం మొదటి ప్రాంతీయ సమావేశం 1979 ఫిబ్రవరిలో మిలాన్‌లోని అసెంబ్లీ హాలులో నిర్వహించబడింది.

బ్రాంచి కార్యాలయం అప్పటినుండి చాలామంది సువార్తికులను ఈ భాషకు సంబంధించి తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోమని ప్రోత్సహించడం ద్వారా బధిరుల ఆధ్యాత్మిక పోషణ విషయంలో అధిక శ్రద్ధ చూపించింది. 1995 నుండి బధిరులైన సాక్షులకు పరిచర్యలో శిక్షనివ్వడానికి, క్రైస్తవ కూటాలను వ్యవస్థీకరించడానికి ప్రత్యేక పయినీర్లు (పూర్తికాల సువార్తికులు) కొన్ని గుంపులకు పంపించబడుతున్నారు. మూడు అసెంబ్లీ హాళ్ళలో కార్యక్రమాన్ని స్పష్టంగా చూడడానికి ఎంతో మెరుగైన ఆధునిక వీడియో సిస్టమ్స్‌ సమకూర్చబడ్డాయి. దానితోపాటు బధిరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి క్రైస్తవ ప్రచురణల వీడియో క్యాసెట్లు లభ్యమవుతున్నాయి.

బధిరుల ఆధ్యాత్మిక అవసరాల విషయంలో సాక్షులు చక్కని శ్రద్ధ తీసుకుంటున్నట్లు పరిశీలకులు గమనించారు. ఇటలీకి చెందిన బధిరుల సంస్థ ప్రచురించిన పారోలె ఏ సాన్యీ అనే పత్రిక ఒక క్యాథలిక్‌ మతాధికారి పంపించిన ఒక ఉత్తరాన్ని ఉల్లేఖించింది. ఆ మతాధికారి, “బధిరుల గురించి ఎల్లప్పుడూ ఇతరులు శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది కాబట్టి బధిరులుగా ఉండడం చాలా కష్టం. ఉదాహరణకు ఆయన చర్చికి ఎలాంటి కష్టం లేకుండా ఒంటరిగా వస్తాడు, అయితే చర్చి సేవలప్పుడు చదివే వాటిని, ప్రకటించేవాటిని లేక పాడే పాటలను అర్థం చేసుకోవాలంటే ఆయనకు ద్విభాషి సహాయం అవసరం. విచారకరంగా చర్చి ఆ లోటు తీర్చడానికి ఇంకా సిద్ధంగా లేదు, పారిష్‌ చర్చి కన్నా యెహోవాసాక్షుల రాజ్య మందిరంలో చాలామంది బధిరుల మీద సరైన శ్రద్ధ చూపించబడుతోంది అని అంగీకరించినట్లు” ఆ పత్రిక తెలియజేసింది.

ఖైదీలకు సువార్త ప్రకటించడం

ఎవరైనా కారాగారంలో ఉండి కూడా స్వేచ్ఛను అనుభవించగలరా? అనుభవించగలరు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి దానిని తమ జీవితాల్లో అన్వయించుకొనేవారిని ‘స్వతంత్రులను’ చేసే శక్తి దానికి ఉంది. యేసు “చెరలోనున్న వారికి” పాపము నుండి, అబద్ధమతం నుండి విముక్తి అనే సందేశాన్ని ప్రకటించాడు. (యోహాను 8:32; లూకా 4:​16-19) ఇటలీలోని కారాగారాల్లో ప్రకటించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఖైదీలను సందర్శించి వారికి ఆధ్యాత్మిక సహాయం చేసేందుకు దాదాపు 400 మంది యెహోవాసాక్షులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాంటి అనుమతిని అడిగి సంపాదించుకున్న క్యాథలిక్కేతర సంస్థల్లో యెహోవాసాక్షులు మొదటివారు.

బైబిలు సందేశం అనుకోని మార్గాల్లో వ్యాప్తి చెందవచ్చు. ఖైదీలు తమ తోటి ఖైదీలతో యెహోవాసాక్షుల బైబిలు విద్యా కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఆ కారణంగా ఇతర ఖైదీల్లో కొందరు ఒక సాక్షి తమను సందర్శించాలని కోరారు. కొన్నిసార్లు బైబిలు అధ్యయనం ప్రారంభించిన కుటుంబ సభ్యులు, సాక్షుల సందర్శనం కోసం కోరమని ఖైదీలను ప్రోత్సహిస్తారు. నరహత్య లేదా ఇతర గంభీరమైన నేరాలకు పాల్పడినందుకు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నవారిలో కొందరు ఖైదీలు పశ్చాత్తాపపడి, తమ జీవితాల్లో గమనార్హమైన మార్పులు చేసుకున్నారు. అది వారిని యెహోవాదేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధం చేస్తుంది.

చాలా కారాగారాల్లో, బైబిలు అంశాల మీద బహిరంగ ప్రసంగాలు ఇవ్వడానికి, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడానికి, యెహోవాసాక్షులు నిర్మించిన బైబిలు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో క్యాసెట్లను చూపించడానికి ఏర్పాట్లు జరిగాయి. తరచూ చాలామంది ఖైదీలు ఆ కూటాలకు హాజరవుతున్నారు.

ఖైదీలకు ఆచరణాత్మకమైన మార్గాల్లో సహాయం చేయడానికి ఖైదీలకు ఉపయోగపడే అంశాలను చర్చించే పత్రికలను సాక్షులు విస్తృతంగా పంచిపెట్టారు. అలా పంచిపెట్టిన పత్రికల్లో “ఖైదీలను సంస్కరించగలమా?” అనే అంశాన్ని చర్చించిన మే 8, 2001, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రిక ఒకటి. ఏప్రిల్‌ 8, 2003 (ఆంగ్లం) సంచిక “కుటుంబంలో ఎవరైనా మాదకద్రవ్యాలను ఉపయోగిస్తుంటే మీరు ఏమి చేయవచ్చు?” అనే అంశాన్ని చర్చించింది. ఆ పత్రికల వేలాది కాపీలను ఖైదీలకు పంచిపెట్టారు. దాని ఫలితంగా వందలాది బైబిలు అధ్యయనాలు జరుగుతున్నాయి. కొందరు కారాగార కాపలాదారులు కూడా బైబిలు సందేశంపట్ల ఆసక్తి చూపించారు.

కొస్టాన్‌టినో అనే ఖైదీ, అధికారుల నుండి ప్రత్యేక అనుమతి లభించిన తర్వాత సాన్‌ రిమోలోని రాజ్య మందిరంలో 138 స్థానిక సాక్షుల సమక్షంలో బాప్తిస్మం పొందాడు. “నా మీద ఆప్యాయత కురిపించబడినట్లు నేను భావించాను” అని బాప్తిస్మం తీసుకున్న తర్వాత భావోద్వేగానికి గురైనట్లు కనిపించిన కొస్టాన్‌టినో అన్నాడు. ఒక స్థానిక వార్తాపత్రిక, కారాగార వార్డెన్‌ చెప్పిన మాటలను ఇలా నివేదించింది: “మేము అధిక ఆనందంతో . . . ఆ అనుమతిని ఇచ్చాం. ఒక ఖైదీకి సామాజికపరంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికపరంగా పునరావాసానికి దోహదపడే ప్రతీ విషయాన్ని పరిశీలించాలి.” బైబిలులోని ఖచ్చితమైన జ్ఞానం కొస్టాన్‌టినో జీవితం మీద ప్రభావం చూపించిన విధానం కొస్టాన్‌టినో భార్యను, కూతురును ఆకర్షించింది: “ఆయన చేసుకున్న మార్పులవల్ల ఆయనను బట్టి మేము గర్విస్తున్నాం. ఆయన ఇప్పుడు శాంతమూర్తి అయ్యాడు, మా మీద ఆయనకు శ్రద్ధ ఎక్కువవుతుంది. మాకు తిరిగి ఆయన మీద నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి.” వారు కూడా బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించి క్రైస్తవ కూటాలకు హాజరవడం ప్రారంభించారు.

దొంగతనం, సాయుధ దోపిడీ, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌, నరహత్య మొదలైన నేరాలకు నిందితుడైన సెర్‌జోకు 2024 వరకు కారాగార శిక్షపడింది. లేఖనాలను మూడు సంవత్సరాలు పరిశీలించి తన జీవితంలో అనేక మార్పులు చేసుకున్న తర్వాత సెర్‌జో బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఎల్బా ద్వీపంలో ఉన్న పోర్టో ఆట్సురో కారాగారంలో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్న 15వ ఖైదీ. కారాగారపు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి తొట్టిలో చాలామంది తోటి ఖైదీల సమక్షంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.

లియోనార్డో 20 సంవత్సరాల కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు, పర్మాలోని ఒక రాజ్యమందిరంలో బాప్తిస్మం తీసుకోవడానికి ఆయనకు ప్రత్యేక అనుమతి లభించింది. స్థానిక వార్తాపత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు “తాను కారాగారపు చీకటి నుండి బయటపడే మార్గం కనుగొనేందుకు కాకుండా ప్రాముఖ్యమైన తన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికే ఒక యెహోవాసాక్షిని కాదల్చుకున్నాను అని స్పష్టం చేయాలని” అనుకుంటున్నట్లు లియోనార్డో చెప్పాడు. లియోనార్డో ఇలా చెప్పాడు: “నేను జీవితమంతా తప్పులు చేశాను, అయితే వాటన్నింటినీ నేను విడిచిపెట్టాను. నేను మారాను, కానీ అది రాత్రికి రాత్రి జరిగినది కాదు. నేను యథార్థవంతునిగా ఎల్లప్పుడూ కొనసాగాలి.”

నరహత్య నేరానికి నిందితుడైన సాల్వేటోర్‌, స్పోలెటొ కట్టుదిట్టమైన కాపలాగల కారాగారంలో ఉన్నాడు. కారాగారపు గోడల మధ్య నిర్వహించబడిన ఆయన బాప్తిస్మం చాలామందిని ఆకట్టుకుంది. అక్కడి కారాగారపు వార్డెన్‌ ఇలా అన్నాడు: “అందరితో మంచిగా ప్రవర్తించేందుకు దోహదపడే ఈ నిర్ణయానికి ఉన్న సామాజిక ప్రాముఖ్యతను కారాగారంలోని వారి శ్రేయస్సు కోసం, సమాజమంతటి శ్రేయస్సు కోసం ప్రోత్సహించాలి.” సాల్వేటోర్‌ చేసుకున్న మార్పుల కారణంగా ఆయన భార్య, కూతురు ఇప్పుడు యెహోవాసాక్షుల కూటాలకు హాజరవుతున్నారు. సాల్వేటోర్‌ సాక్ష్యం ఇచ్చిన ఒక ఖైదీ సమర్పించుకున్న యెహోవా సేవకునిగా బాప్తిస్మం తీసుకున్నాడు.

తొలి క్రైస్తవత్వపు విస్తరణ, అభివృద్ధి ఇటలీలో కొంత జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:10; రోమీయులు 1:⁠7) కోతపని జరుగుతున్న ఈ కాలంలో, పౌలు, ఆయన తోటి క్రైస్తవులు సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడిన ప్రాంతాల్లోనే ఆధ్యాత్మిక అభివృద్ధి, విస్తరణ కొనసాగుతున్నాయి.​—⁠అపొస్తలుల కార్యములు 23:11; 28:​14-16.

[13వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఇటలీ

రోమ్‌

[15వ పేజీలోని చిత్రాలు]

బిటొన్టో అసెంబ్లీ హాల్‌, రోములోని ఒక ఇటాలియన్‌ సంజ్ఞాభాష సంఘం

[16వ పేజీలోని చిత్రం]

బైబిలు సత్యం ఖైదీలను ‘స్వతంత్రులను’ చేస్తోంది

[17వ పేజీలోని చిత్రాలు]

తొలి క్రైస్తవత్వం ఒకప్పుడు వర్ధిల్లిన ప్రాంతంలో ఆధ్యాత్మిక అభివృద్ధి కొనసాగుతోంది