కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి’

‘మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి’

‘మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి’

‘మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి, మీరేమై ఉన్నారో రుజువు చేసుకుంటూ ఉండండి.’​—⁠2 కొరింథీయులు 13:⁠5, Nw.

గ్రామీణ ప్రాంతం గుండా వెళ్తున్న ఒక వ్యక్తికి ఒక కూడలి ఎదురయింది. గమ్యం చేరడానికి ఎటు వెళ్లాలో తెలియక ఆయన ఆ దారిన వెళ్తున్న వ్యక్తిని వివరాలు అడిగాడు, అయితే ఆయనకు పొంతనలేని సమాచారమే లభించింది. ఆయన సందిగ్ధంలోపడి ఎటూ వెళ్లలేకపోయాడు. మన నమ్మకాల విషయంలో సందేహాలు ఉండడం మనమీద కూడా అలాంటి ప్రభావమే చూపించే అవకాశం ఉంది. అలాంటి సందిగ్ధతాస్థితి నిర్ణయాలు తీసుకునే మన సామర్థ్యంపై ప్రభావం చూపిస్తూ, మనం నడవాల్సిన దారేదో మనకు తెలియకుండా చేయగలదు.

2 మొదటి శతాబ్దంలో గ్రీసులోని కొరింథులో ఉన్న క్రైస్తవ సంఘంలోని కొందరిపై అలాంటి ప్రభావమే చూపించగల పరిస్థితి తలెత్తింది. “అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిది” అంటూ ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులు’ అపొస్తలుడైన పౌలు అధికారాన్ని సవాలు చేశారు. (2 కొరింథీయులు 10:7-12; 11:​5, 6) అలాంటి దృక్కోణం కొరింథు సంఘంలోని కొందరిని తామెలా నడుచుకోవాలో తెలియని సందిగ్ధంలో పడేసి ఉండవచ్చు.

3 పౌలు సా.శ. 50లో కొరింథును సందర్శించిన సమయంలో అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆయన కొరింథులో “దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు” ఉన్నాడు. నిజానికి, “కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.” (అపొస్తలుల కార్యములు 18:​5-11) కొరింథులోని తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల పౌలుకు ప్రగాఢ ఆసక్తి ఉంది. అంతేకాకుండా, కొన్ని విషయాలపై సలహా కోసం కొరింథీయులు ఆయనకు ఉత్తరం కూడా వ్రాశారు. (1 కొరింథీయులు 7:⁠1) అందుకే ఆయన వారికి చక్కని ఉపదేశం ఇచ్చాడు.

4 ‘మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి, మీరేమై ఉన్నారో రుజువు చేసుకుంటూ ఉండండి’ అని పౌలు వారికి వ్రాశాడు. (2 కొరింథీయులు 13:⁠5, NW) ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవడం కొరింథులోని ఆ సహోదరులు తామెలా నడుచుకోవాలనే సందిగ్ధంలో పడకుండా వారిని కాపాడింది. అది నేడు మనల్ని కూడా అలాగే కాపాడగలదు. అట్లయితే, మనం పౌలు సలహాను ఎలా అనుసరించవచ్చు? మనం విశ్వాసంలో ఉన్నామో లేదో ఎలా పరీక్షించి చూసుకోవచ్చు? మనమేమై ఉన్నామో రుజువు చేసుకోవడంలో ఏమి ఇమిడివుంది?

‘మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి’

5 సాధారణంగా ఒక పరీక్షలో, ఒక విషయం పరీక్షించబడుతుంది, ఆ పరీక్షకు తగిన ఒక ఆధారం లేదా ఒక ప్రమాణం ఉంటుంది. ఇక్కడ పరీక్షా విషయం విశ్వాసం కాదు, అంటే మనం హత్తుకున్న ప్రధాన నమ్మకాలు కాదు. ఆయా వ్యక్తులుగా మనమే ఆ పరీక్షా విషయంగా ఉన్నాం. పరీక్షించడానికి మనకొక పరిపూర్ణ ప్రమాణం ఉంది. కీర్తనకర్త దావీదు కూర్చిన శ్రావ్యమైన కీర్తన ఒకటి ఇలా చెబుతోంది: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.” (కీర్తన 19:​7, 8) బైబిల్లో యెహోవా పరిపూర్ణ శాసనాలు, నిర్దోషమైన ఆదేశాలు, నమ్మదగిన జ్ఞాపికలు, నిర్మలమైన ఆజ్ఞలు ఉన్నాయి. అందులోని సందేశం పరీక్షించడానికి ఒక ఆదర్శవంతమైన ప్రమాణం.

6 ఆ దైవ ప్రేరేపిత సందేశం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:​12) అవును, దేవుని వాక్యం మన హృదయాలను అంటే అంతరంగంలో మనం నిజంగా ఎలా ఉన్నామనే విషయాన్ని పరీక్షించగలదు. వాడియైన, శక్తిమంతమైన ఈ సందేశాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు? ఎలా అన్వయించుకోవచ్చో కీర్తనకర్త మనకు స్పష్టంగా చెబుతున్నాడు. ఆయన ఇలా ఆలపించాడు: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” (కీర్తన 1:​1, 2) “యెహోవా ధర్మశాస్త్రము” దేవుని లిఖిత వాక్యమైన బైబిల్లో కనబడుతుంది. యెహోవా వాక్యాన్ని చదవడంలో మనం ఆనందించాలి. అవును, మనం దానిని చదివి, ధ్యానించడానికి సమయం తీసుకోవాలి. మనమలా చేస్తూ అక్కడ వ్రాయబడినవాటి ప్రమాణాన్నిబట్టి పరీక్షా విషయాన్ని అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి.

7 కాబట్టి మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి, దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానిస్తూ మనం నేర్చుకునే దానికి అనుగుణంగా ఎంతమేరకు ప్రవర్తిస్తున్నామో చూసుకోవడమే అత్యుత్తమ విధానం. అయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకెంతో సహాయం అందుబాటులో ఉన్నందుకు సంతోషించవచ్చు.

8 లేఖనాలను వివరించే, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ సాహిత్యాల ద్వారా యెహోవా బోధలను, ఉపదేశాలను అందజేశాడు. (మత్తయి 24:​45) ఉదాహరణకు, యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని చాలా అధ్యాయాల చివర్లో ఉన్న, “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సునే తీసుకోండి. * ఆ పుస్తకంలోని ఈ అంశం వ్యక్తిగత ధ్యానానికి ఎంత చక్కని అవకాశాలను ఇస్తుందో కదా! మన పత్రికలైన కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో చర్చించబడిన అనేక అంశాలు కూడా మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. ఇటీవలి కావలికోట సంచికల్లో సామెతల పుస్తకానికి సంబంధించిన ఆర్టికల్స్‌ గురించి ఒక క్రైస్తవ స్త్రీ ఇలా చెప్పింది: “ఈ ఆర్టికల్స్‌ చాలా ఆచరణీయంగా ఉన్నట్లు నేను గ్రహించాను. అవి నా మాట, ప్రవర్తన, దృక్పథం నిజంగా యెహోవా నీతియుక్త ప్రమాణాలకు అనుగుమంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేశాయి.”

9 సంఘ కూటాల్లో, సమావేశాల్లో కూడా మనం విస్తారమైన నిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతాం. ఇవి, “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి​—⁠యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు” అని యెషయా ఎవరి గురించైతే ప్రవచించాడో వారి కోసం దేవుడు చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లలో భాగం. (యెషయా 2:​2, 3) యెహోవా మార్గాల విషయంలో అలాంటి ఉపదేశం లభించడం ఖచ్చితంగా ఒక ఆశీర్వాదమే.

10 క్రైస్తవ పెద్దలతోసహా ఆధ్యాత్మిక అర్హతలున్న వారినుండి లభించే ఉపదేశం కూడా మనల్ని మనం పరీక్షించుకోవడానికి సహాయంచేస్తుంది. వారి గురించి బైబిలు ఇలా చెబుతోంది: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” (గలతీయులు 6:⁠1) మన దిద్దుబాటు కోసం చేయబడిన ఈ ఏర్పాటునుబట్టి కూడా మనమెంత కృతజ్ఞులమో కదా!

11 మన సాహిత్యాలు, క్రైస్తవ కూటాలు, నియమించబడిన పురుషులు యెహోవా అనుగ్రహించిన అద్భుతమైన వరాలు. అయితే విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి, స్వీయ పరీక్ష అవసరం. కాబట్టి మన సాహిత్యాలు చదువుతున్నప్పుడు లేదా లేఖన హెచ్చరికలు వింటున్నప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఇది నన్ను వర్ణిస్తోందా? నేను ఇలా చేస్తున్నానా? నేను క్రైస్తవ సమగ్ర నమ్మకాలకు హత్తుకొని ఉంటున్నానా?’ ఈ ఏర్పాట్ల ద్వారా మనకు లభించే సమాచారంపట్ల మనకున్న దృక్పథం కూడా మన ఆధ్యాత్మిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి. [అయితే] ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 2:​14, 15) కాబట్టి మన పుస్తకాల్లో, పత్రికల్లో, ఇతర సాహిత్యాల్లో మనం చదివేవాటి విషయంలో, మన కూటాల్లో, పెద్దలనుండి వినేవాటి విషయంలో మనం కృతజ్ఞతాపూర్వకమైన, ఆధ్యాత్మికమైన దృక్కోణాన్ని కాపాడుకునేందుకు కృషి చేయవద్దా?

‘మీరేమై ఉన్నారో రుజువు చేసుకుంటూ ఉండండి’

12 మనమేమై ఉన్నామో రుజువు చేసుకోవడంలో మనల్ని మనం అంచనా వేసుకోవడం ఇమిడి ఉంది. మనం సత్యంలో ఉండవచ్చు, కానీ మన ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉంది? మనమేమై ఉన్నామో రుజువు చేసుకోవడంలో మన పరిణతి గురించి, ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల మనకున్న నిజమైన కృతజ్ఞతా భావం గురించి రుజువు ఇవ్వడం ఇమిడివుంది.

13 క్రైస్తవ పరిణతికి సంబంధించిన ఏ రుజువును మనలో మనం చూసుకోవాలి? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:​14) మన జ్ఞానేంద్రియాలకు లేదా అవగాహనా సామర్థ్యాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పరిణతి చెందామనే రుజువును మనమివ్వగలం. ఒక క్రీడాకారుడు తన క్రీడలో విజయం సాధించే ముందు ఆయన శరీరంలోని కొన్ని కండరాలకు పదేపదే సాధన అవసరమైనట్లే, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో మన అవగాహనా సామర్థ్యాలకు శిక్షణ ఇవ్వాలి.

14 అయితే మన అవగాహనా సామర్థ్యాలకు శిక్షణ ఇచ్చుకోవడానికి ముందు మనం జ్ఞానం సంపాదించుకోవాలి. దీనికి పట్టుదలగా వ్యక్తిగత అధ్యయనం చేయడం ఆవశ్యకం. మనం క్రమంగా వ్యక్తిగత అధ్యయనం, ప్రత్యేకంగా దేవుని వాక్యపు లోతైన అంశాలను అధ్యయనం చేసినప్పుడు మన అవగాహనా సామర్థ్యాలు మెరుగవుతాయి. చాలా సంవత్సరాలుగా కావలికోట పత్రికలో అనేక లోతైన అంశాలు చర్చించబడ్డాయి. లోతైన సత్యాలను చర్చించిన ఆర్టికల్స్‌ ఎదురైనప్పుడు మనమెలా స్పందిస్తాం? అవి “గ్రహించుటకు కష్టమైనవి[గా]” ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తామా? (2 పేతురు 3:​16) అలా దూరంగా ఉండకుండా, చర్చించబడిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం గట్టిగా ప్రయత్నిస్తాం.​—⁠ఎఫెసీయులు 3:​15-18.

15 మనకు ఒకవేళ వ్యక్తిగత అధ్యయనం చేయడం కష్టమైతే అప్పుడేమిటి? దానిపట్ల అభిరుచిని కలిగించుకోవడానికి లేదా వృద్ధి చేసుకోవడానికి కృషి చేయడం ప్రాముఖ్యం. * (1 పేతురు 2:​1-2) పరిణతి సాధించడానికి దేవుని వాక్యపు లోతైన సత్యాలనే బలమైన ఆహారంతో పోషించబడడం నేర్చుకోవాలి. లేకపోతే మన అవగాహనా సామర్థ్యాలు పరిమితంగానే ఉండిపోతాయి. అయితే పరిణతి చెందామని రుజువివ్వడంలో కేవలం అవగాహనా సామర్థ్యాలు సంపాదించుకోవడంకన్నా ఇంకా ఎక్కువే ఉంది. పట్టుదలతో చేసే వ్యక్తిగత అధ్యయనం ద్వారా లభించే జ్ఞానాన్ని మనం మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి.

16 మనల్ని మనం రుజువు చేసుకోవడం, సత్యంపట్ల మన కృతజ్ఞతను ప్రదర్శించడంలో అంటే మన విశ్వాస క్రియల్లో కూడా కనబడుతుంది. మనల్ని మనం అంచనా వేసుకోవడానికి సంబంధించిన ఈ రంగాన్ని వివరించడానికి ఒక శక్తిమంతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తూ శిష్యుడైన యాకోబు ఇలా చెబుతున్నాడు: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”​—⁠యాకోబు 1:22-25.

17 యాకోబు ఇలా చెబుతున్నాడు: ‘దేవుని వాక్యమనే అద్దములో చూసుకొని, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. ఎల్లప్పుడూ అలా చేస్తూ, దేవుని వాక్యంలో మీరు చూస్తున్నవాటి ప్రకారం మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. ఆ తర్వాత, మీరు చూసింది వెంటనే మరచిపోకండి. అవసరమైన దిద్దుబాట్లు చేసుకోండి.’ ఈ సలహాను పాటించడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు.

18 ఉదాహరణకు, రాజ్య ప్రకటనా పనిలో భాగం వహించే నియమమే తీసుకోండి. “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 10:​10) రక్షణ కలిగేలా నోటితో ఒప్పుకోవడానికి అనేక సర్దుబాట్లు చేసుకోవాలి. ప్రకటనా పనిలో భాగం వహించడం మనలో చాలామందికి కష్టంగా ఉంటుంది. ఆ పనిలో ఆసక్తిగా పాల్గొనడానికీ, మన జీవితాల్లో దానికి తగినస్థానం ఇవ్వడానికీ మరెన్నో మార్పులు, త్యాగాలు అవసరమవుతాయి. (మత్తయి 6:​33) అయితే దేవుడిచ్చిన ఈ పని చేయడం మొదలుపెట్టినప్పుడు, అది యెహోవాకు స్తుతిని తీసుకొస్తుంది కాబట్టి మనం ఆనందంగా ఉంటాం. మరి మనం ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా ఉన్నామా?

19 మన విశ్వాస క్రియలు ఎంత సమగ్రంగా ఉండాలి? పౌలు ఇలా చెబుతున్నాడు: “మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (ఫిలిప్పీయులు 4:⁠9) మనం నేర్చుకున్న, అంగీకరించిన, విన్న, చూసిన వాటిని అభ్యసించడం ద్వారా అంటే మన క్రైస్తవ సమర్పణ, శిష్యరికానికి సంబంధించిన సంపూర్ణ జీవన విధానం ద్వారా మనల్ని మనం రుజువు చేసుకుంటాం. “ఇదే త్రోవ, దీనిలో నడువుడి” అని యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఆదేశిస్తున్నాడు.​—⁠యెషయా 30:21.

20 దేవుని వాక్య శ్రద్ధాపూర్వక విద్యార్థులుగా, సువార్తను ఆసక్తిగా ప్రకటించేవారిగా, తమ యథార్థతలో లోపంలేని వారిగా, రాజ్యానికి విశ్వసనీయ మద్దతుదారులుగా ఉన్న స్త్రీపురుషులు సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంటారు. అలాంటివారు ఉండడం వారు సహవసిస్తున్న సంఘ స్థిరత్వానికి దోహదపడుతుంది. శ్రద్ధ చూపించవలసిన క్రొత్తవారు ప్రత్యేకంగా చాలామంది ఉన్నారు కాబట్టి, అలాంటి స్త్రీపురుషులు చాలా సహాయకరంగా ఉన్నట్లు రుజువు చేసుకుంటారు. ‘మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి, మీరేమై ఉన్నారో రుజువు చేసుకుంటూ ఉండండి’ అని పౌలు ఇచ్చిన సలహాను మనం లక్ష్యపెట్టినప్పుడు, మనం కూడా ఇతరులపై మంచి ప్రభావం చూపిస్తాం.

దేవుని చిత్తం చేయడంలో సంతోషాన్ని పొందండి

21 “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఆలపించాడు. (కీర్తన 40:⁠8) దేవుని చిత్తం చేయడంలో దావీదు సంతోషించాడు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా ధర్మశాస్త్రం దావీదు హృదయంలో ఉంది. తాను నడవవలసిన త్రోవ విషయంలో దావీదుకు అనుమానమే లేదు.

22 దేవుని ధర్మశాస్త్రం మన ఆంతర్యములో ఉన్నప్పుడు, మనం నడవాల్సిన త్రోవ విషయంలో మనకు అనుమానమే ఉండదు. దేవుని చిత్తం చేయడంలో మనం సంతోషాన్ని పొందుతాం. కాబట్టి, హృదయపూర్తిగా యెహోవాను సేవిస్తూ మనమన్ని విధాలా “తీవ్రంగా కృషిచేద్దాం.”​—⁠లూకా 13:​24, NW.

[అధస్సూచీలు]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 19 అధ్యయనం ఎలా చేయాలనే దాని గురించిన సహాయకరమైన సూచనల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలో 27-32 పేజీలు చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

మనం విశ్వాసముగల వారిగా ఉన్నామా లేదా అని మనమెలా పరీక్షించుకోవచ్చు?

మనమేమై ఉన్నామో రుజువు చేసుకోవడంలో ఏమి ఇమిడివుంది?

మన క్రైస్తవ పరిణతికి మనమెలాంటి రుజువివ్వవచ్చు?

మనల్ని మనం అంచనా వేసుకోవడానికి మన విశ్వాస క్రియలు ఎలా సహాయం చేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మన నమ్మకాల విషయంలో సందిగ్ధత మనలను ఎలా ప్రభావితం చేయవచ్చు? (బి) మొదటి శతాబ్దపు కొరింథులోని ఏ పరిస్థితి కొందరిని తామెలా నడుచుకోవాలో తెలియని సందిగ్ధంలోపడేసి ఉండవచ్చు?

3, 4. కొరింథీయులకు పౌలు ఇచ్చిన హెచ్చరిక మనకెందుకు ఆసక్తి కలిగించాలి?

5, 6. మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి మనకు ఎలాంటి ప్రమాణం ఉంది, అదెందుకు ఒక ఆదర్శవంతమైన ప్రమాణం?

7. మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకునేందుకు అత్యుత్తమ విధానం ఏమిటి?

8. మనం విశ్వాసంలో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడానికి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ సాహిత్యాలు మనకెలా సహాయం చేస్తాయి?

9, 10. మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి యెహోవా చేసిన ఎలాంటి ఏర్పాట్లు మనకు సహాయం చేస్తాయి?

11. మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవడంలో ఏమి ఇమిడివుంది?

12. మనమేమై ఉన్నామో రుజువు చేసుకోవడంలో ఏమి ఇమిడివుంది?

13. హెబ్రీయులు 5:⁠14 ప్రకారం మన పరిణతికి ఏది రుజువుగా ఉంటుంది?

14, 15. దేవుని వాక్యపు లోతైన సంగతులను అధ్యయనం చేయడానికి మనమెందుకు పట్టుదలగా ప్రయత్నించాలి?

16, 17. “వాక్యప్రకారము ప్రవర్తించువారై” ఉండడం విషయంలో శిష్యుడైన యాకోబు ఏ హెచ్చరిక ఇచ్చాడు?

18. యాకోబు ఇచ్చిన సలహాను అనుసరించడం ఎందుకు కష్టంగా ఉంటుంది?

19. మన విశ్వాస క్రియల్లో ఏమి చేరివుండాలి?

20. ఎలాంటి వ్యక్తులు సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంటారు?

21, 22. దేవుని చిత్తం చేయడంలో మనమెలా సంతోషించవచ్చు?

[23వ పేజీలోని చిత్రం]

మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోవడానికి శ్రేష్ఠమైన విధానమేమిటో మీకు తెలుసా?

[24వ పేజీలోని చిత్రం]

అవగాహనా సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా మన క్రైస్తవ పరిణతికి మనం రుజువిస్తాం

[25వ పేజీలోని చిత్రాలు]

‘విని మరచిపోయే వారిగా కాక, వాక్య ప్రకారము చేయువారిగా’ ఉండడం ద్వారా మనమేమై ఉన్నామో రుజువు చేసుకుంటాం