గలిలయ సముద్రంలో
గలిలయ సముద్రంలో
మార్కు 4:35-41లో నమోదు చేయబడిన ఒక వృత్తాంతం, యేసూ ఆయన శిష్యులూ గలిలయ సముద్రాన్ని దాటడానికి ఒక దోనెలో ఎక్కారని నివేదిస్తోంది. మనం ఆ వచనంలో ఇలా చదువుతాం: “అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన [యేసు] దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను.”
బైబిల్లో “తలగడ” అని అనువదించబడిన గ్రీకు పదం ఇక్కడ ఒక్కచోటనే కనిపిస్తుంది. కాబట్టి విద్వాంసులకు ఆ పదానికి ఇక్కడ ఉపయోగించబడిన ఖచ్చితమైన అర్థం తెలియదు. చాలా బైబిళ్ళు ఆ పదాన్ని “తలగడ” లేక “దిండు” అని అనువదించాయి. అయితే అది ఎలాంటి తలగడ? ఆదిమ భాషలో, మార్కు ఇక్కడ తలగడ అనే పదాన్ని, అది దోనెలో ఉండే ఉపకరణాల్లో ఒకటని సూచించే విధంగా ఉపయోగించాడు. 1986లో గలిలయ సముద్రానికి సమీపంలో ఒక దోనె కనుగొనబడింది. అది మార్కు ఉపయోగించిన గ్రీకు పదానికి అర్థాన్ని వెల్లడి చేయవచ్చు.
ఎనిమిది మీటర్ల పొడవున్న ఆ దోనె, తెరచాపలతో, తెడ్లతో నడిపించబడేదని పరిశోధనలో వెల్లడయ్యింది. అది చేపలు పట్టడానికి ఉపయోగించబడేది, చేపలుపట్టే పెద్ద బరువైన వలను పెట్టేందుకు వీలుగా దానిలో అమరము (డెక్కు) ఉంది. ఆ దోనె అవశేషాలు సా.శ.పూ. 100 నుండి సా.శ. 70వ సంవత్సరం మధ్య కాలానికి చెందినవి. యేసూ, ఆయన శిష్యులూ ఉపయోగించినటువంటి దోనె అలాగే ఉండివుండవచ్చు. దోనెను వెలికితీసే పనిలో పాల్గొన్న షెల్లె వాక్ష్మాన్, ద సీ ఆఫ్ గేలీలి బోట్—ఆన్ ఎక్స్ట్రార్డినరీ 2000 ఇయర్ ఓల్డ్ డిస్కవరీ అనే పుస్తకాన్ని రాశాడు. యేసు నిద్రించడానికి ఉపయోగించిన “తలగడ,” దోనెలో సమతుల్యత కోసం ఉపయోగించే ఇసుక సంచి కావచ్చని సూచిస్తున్నాడు. పెద్ద వలను ఉపయోగించడంలో జాఫ్నాకు చెందిన ఒక అనుభవజ్ఞుడైన మత్స్యకారుడు ఇలా అన్నాడు: “నా చిన్నప్పుడు మధ్యధరాలో నేను పనిచేసిన దోనెల్లో ఎప్పుడూ ఒకటి లేక రెండు ఇసుక సంచీలు ఉండేవి. . . . దోనెను సమతుల్యంగా ఉంచడానికి ఆ సంచీలను దోనెలో ఉంచేవారు. అయితే వాటిని ఉపయోగించని సమయాల్లో అమరము క్రింద వాటిని పెట్టేవాళ్ళం. ఎవరైనా అలసిపోతే అమరము క్రిందకు వెళ్ళి, ఇసుక సంచిని తలగడగా ఉపయోగించి పడుకునేవారు.”
తుఫాను సమయంలో దోనెలో అతి క్షేమమైన భాగంలో అంటే అమరము క్రింద సమతుల్యత కోసం ఉపయోగించే ఇసుకసంచీ మీదనే యేసు నిద్రించినట్లు మార్కు వివరణకు భావం అని చాలామంది విద్వాంసులు నమ్ముతున్నారు. అయితే ఆ తలగడ ఏ రూపంలో ఉందనే దానికన్నా ఆ తర్వాత సంభవించింది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని మద్దతుతో, శక్తితో యేసు తుఫానుతో అల్లకల్లోలమైన సముద్రాన్ని శాంతింపజేశాడు. శిష్యులు కూడా ఇలా అడిగారు: “ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి?”