మరణపు నాశనకరమైన ప్రభావం
మరణపు నాశనకరమైన ప్రభావం
“ఆరు సంవత్సరాల చిన్నారి ఆత్మహత్య.” విభ్రాంతి కలిగించే ఈ పతాక శీర్షిక జాకీ అనే ఒక చిన్న అమ్మాయి విషాద మరణాన్ని సూచిస్తోంది. ఆమె తల్లి ప్రాణాంతకమైన వ్యాధితో ఇటీవలే మరణించింది. జాకీ రైలుకు ఎదురుగా వెళ్ళే ముందు తాను ‘ఒక దేవదూతగా మారి తన తల్లితో ఉండాలని’ అనుకుంటున్నట్లు తన తోబుట్టువులకు చెప్పింది.
ఈయన్, తన తండ్రి క్యాన్సర్‌తో చనిపోవడానికిగల కారణాన్ని చెప్పమని తన ఫాదిరీని అర్థించినప్పుడు ఆయన వయసు 18. ఈయన్ తండ్రి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని ఫాదిరీ వివరించాడు. ఆ వివరణ విన్న తర్వాత అలాంటి క్రూరమైన దేవుని గురించి తెలుసుకోకూడదని ఈయన్ నిశ్చయించుకున్నాడు. జీవితం అర్థరహితంగా అనిపించడంతో ఈయన్ సుఖ జీవితం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన మద్యపానాన్ని, మాదకద్రవ్యాలను, అనైతికతను ఆశ్రయించాడు. ఆయన జీవిత విధానం మీద ఆయన అదుపు కోల్పోయాడు.
“బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు”
మరణం ప్రజల జీవితాలను ఎలా నాశనం చేయగలదో, ప్రత్యేకంగా అది ఊహించని విధంగా విరుచుకుపడినప్పుడు ఎలా నాశనం చేయగలదో ఆ రెండు విషాద ఘటనలు ఉదాహరిస్తున్నాయి. నిజమే, “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు” అని బైబిలు చెబుతున్న వాస్తవం అందరికీ తెలుసు. (ప్రసంగి 9:5) అయితే చాలామంది ఆ కఠోర సత్యాన్ని ఉపేక్షించడానికే ఇష్టపడతారు. మీ విషయమేమిటి? జీవితంలో అనేక విషయాలకు మన సమయాన్ని వెచ్చించాల్సి వస్తున్నందుకు, శ్రద్ధ చూపించాల్సి వస్తున్నందుకు సుదూరమైన విషయంగా అనిపించగల మన మరణం గురించి మనం ఆలోచించకపోవచ్చు.
“చాలామంది మరణం గురించి భయపడి దాని గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు” అని ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా చెబుతోంది. అయితే ఏదైనా దుర్ఘటన గానీ ప్రాణాంతక వ్యాధి గానీ అకస్మాత్తుగా మరణాన్ని ముఖాముఖిగా చూసే పరిస్థితి తీసుకురావచ్చు. బహుశా ఒక స్నేహితుని లేక ఒక బంధువు అంత్యక్రియలు, సర్వమానవాళికి చివరకు ఎదురయ్యే పర్యవసానం గురించిన కఠోర సత్యాన్ని మనకు గుర్తు చేయవచ్చు.
అయినా, అంత్యక్రియలప్పుడు విలపించేవారు సాధారణంగా “జీవితం కొనసాగవలసిందే” వంటి మాటలు చెబుతారు. అవును, జీవితం కొనసాగుతుంది. వాస్తవానికి, జీవితం ఎంత త్వరగా గడవవచ్చంటే అతి కొద్ది కాలంలోనే మనం వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాం. ఆ సమయంలో మరణం సుదూర భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇక ఎంతమాత్రం కాదు. మనం ఎన్నో అంత్యక్రియలకు హాజరుకావాల్సి వస్తుంది, దీర్ఘకాలిక స్నేహితులను చాలామందిని కోల్పోవాల్సి వస్తుంది. చాలామంది వృద్ధులకు “నా వంతు ఎప్పుడో” అనే కలవరపెట్టే ప్రశ్న ఎక్కువగా మనస్సులో మెదులుతుంటుంది.
ఒక పెద్ద మర్మం
మరణం తప్పదనే వాస్తవాన్ని ఎవరూ తిరస్కరించకపోయినా, మరణం తర్వాత ఏమవుతుందనేది ఒక పెద్ద మర్మంగా ఉండవచ్చు. మరణం గురించి పరస్పర విరుద్ధమైన అనేక వివరణలు ఉన్నాయి, అవన్నీ తెలియని విషయం గురించి చేస్తున్న వ్యర్థమైన చర్చలు అని ఒక సంశయవాది పరిగణించేందుకు నడిపించవచ్చు. వాస్తవిక దృక్పథంగల ఒక వ్యక్తి సాధ్యమైనంత మట్టుకు జీవితంలోని మంచి విషయాలను ఆస్వాదించాలనే ముగింపుకు రావచ్చు.
దానికి భిన్నంగా, మరణం అన్నిటికీ అంతమనే విషయాన్ని నమ్మడానికి కొందరు నిరాకరిస్తారు. అంతేగాక మరణించిన తర్వాత ఏమవుతుందనే విషయం గురించి కూడా
వారికి స్పష్టమైన అవగాహన ఉండదు. వారిలో కొందరు, నిత్య సంతోషం ఉండే స్థలంలో జీవితం కొనసాగుతుందని ఊహిస్తారు, మరికొందరైతే ఎప్పుడో భవిష్యత్తులో బహుశా మరో వ్యక్తిగా తాము మళ్ళీ జీవిస్తామని భావిస్తారు.“చనిపోయినవారు ఎక్కడ ఉన్నారో” అని దుఃఖిస్తున్న బంధువులు ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. చాలా సంవత్సరాల క్రితం, ఒక ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఆటగాళ్ళు క్రీడా ప్రాంగణానికి వెళ్తున్నప్పుడు వారి మినీబస్సును ఒక ట్రక్కు ఢీకొనడంతో ఆ మినీబస్సు పల్టీలు కొడుతూ రోడ్డు ప్రక్కకు పడిపోయింది. అందులోవున్న ఐదుగురు ఆటగాళ్ళు మరణించారు. ఆ దుర్ఘటనలో తన కుమారుడ్ని కోల్పోయిన ఒక తల్లి అప్పటినుండి సాధారణ జీవితాన్ని దాదాపు గడపలేకపోతోంది. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమె క్రమంగా ఆయన సమాధి దగ్గరకు వెళ్ళి చాలాసేపు ఆయనతో బిగ్గరగా మాట్లాడుతుంటుంది. “మరణం తర్వాత ఏమీ లేదు అనేది నేను అసలు నమ్మలేకపోతున్నాను, అయితే మరణం తర్వాత ఏమవుతుందో కూడా నాకు ఖచ్చితంగా తెలియదు” అని ఆమె విచారం వ్యక్తం చేస్తోంది.
స్పష్టంగా, మరణంపట్ల మన వైఖరి మన జీవితాలను ఇప్పుడు ప్రభావితం చేయగలదు. మరణ విషాదం గురించి ప్రజల ప్రతిస్పందనలను చూస్తే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మీరు వాటికి ఎలా ప్రతిస్పందిస్తారో ఆలోచించండి. మనం మరణం గురించి మరచిపోయి కేవలం జీవించడంపైనే దృష్టి నిలపాలా? లేక భయోత్పాదకమైన ఈ మరణం మన జీవితాన్ని పాడు చేయడానికి అనుమతించాలా? దుఃఖంలో ఉన్న ఒక బంధువు, చనిపోయిన తన ప్రియమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడని నిరంతరం ఆలోచిస్తూ ఉండాల్సిందేనా? మరణం ఒక మర్మంగా ఉండిపోవలసిందేనా?