మన గురించి ఇతరులు ఏమనుకుంటారనేది అంత ప్రాముఖ్యమా?
మన గురించి ఇతరులు ఏమనుకుంటారనేది అంత ప్రాముఖ్యమా?
“దాదాపు ప్రతి ఒక్కరూ పొగడబడాలనే కోరుకుంటారు. ప్రశంసలు మనం ఏదో సాధించామనే భావననిస్తూ మనం సంతోషించేలా చేస్తాయి. మెప్పు మనం మరింత మెరుగుపడాలని కోరుకునేలా చేస్తుంది. అయితే మనల్ని కొంతమంది విమర్శిస్తున్నారని తెలిసినప్పుడు, ప్రతిస్పందన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాసీనమైన జవాబు లేదా విమర్శనాత్మక వ్యాఖ్యానం మన మనస్సును కృంగదీస్తుంది. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనేది మనల్ని మనం దృష్టించుకునేదానిపై ప్రగాఢమైన ప్రభావం చూపిస్తుంది.
ఇతరులు మనల్ని ఎలా దృష్టిస్తారనే విషయాన్ని అలక్ష్యం చేయడం పొరపాటే అవుతుంది. ఇతరులు మన ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తే నిజానికి దాని నుండి మనం ప్రయోజనమే పొందుతాము. ఇతరుల అభిప్రాయాలు ఉన్నత నైతిక సూత్రాలపై ఆధారపడి ఉన్నప్పుడు, అవి ప్రయోజనకరంగా ఉండి మనం సరైనది చేయడానికి మనల్ని పురికొల్పుతాయి. (1 కొరింథీయులు 10:31-33) అయితే, ప్రజాభిప్రాయం సాధారణంగా చాలా అన్యాయంగా ఉంటుంది. “వీనిని సిలువవేయుము సిలువవేయుము” అని కేకలు వేసినప్పుడు ప్రధానయాజకులకు, ఇతరులకు యేసుక్రీస్తుపట్ల ఉన్న వక్రమైన దృక్కోణం గురించి ఒకసారి ఆలోచించండి. (లూకా 23:13, 21-25) తప్పుడు సమాచారం ఆధారంగా లేక ఈర్ష్యతో లేక దురభిమానంతో చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి, మనం మంచి అవగాహనను ప్రదర్శిస్తూ ఇతరుల అభిప్రాయాలకు విచక్షణతో ప్రతిస్పందించాలి.
ఎవరి అభిప్రాయాలు ప్రాముఖ్యమైనవి?
సత్యారాధనలో మనకు సన్నిహితంగా ఉన్నవారి ఆమోదం పొందాలని మనం కోరుకుంటాం. వారిలో విశ్వాసంలోవున్న కుటుంబ సభ్యులు, మన క్రైస్తవ సహోదర సహోదరీలు ఉన్నారు. (రోమీయులు 15:2; కొలొస్సయులు 3:18-21) తోటి విశ్వాసుల ప్రేమాగౌరవాలు, వారి నుండి మనం పొందే “ఆదరణ” మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. (రోమీయులు 1:11, 12) ‘వినయమైన మనస్సు కలిగి మనకంటె ఇతరులు యోగ్యులని ఎంచుతాం.’ (ఫిలిప్పీయులు 2:2-4) అంతేగాక, మన మధ్య “నాయకులుగా ఉన్న” సంఘ పెద్దల ఆమోదం పొందాలని కోరుకుని, దాన్ని విలువైనదిగా ఎంచుతాం.—హెబ్రీయులు 13:17.
అంతేగాక “సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందడం” కూడా కోరదగినదే. (1 తిమోతి 3:7) అవిశ్వాసులైన బంధువులు, తోటి ఉద్యోగస్థులు, పొరుగువారు మనల్ని గౌరవిస్తే, అది ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! మనం ఎవరికైతే ప్రకటిస్తామో వారు రాజ్య సందేశానికి అనుకూలంగా ప్రతిస్పందించాలనే ఉద్దేశంతో మనం వారి ఎదుట మంచిగా ప్రవర్తించాలని కోరుకోమా? సమాజంలో నైతిక శుభ్రతగలవారు, మంచివారు, నిజాయితీగలవారు అనే పేరు మనకుండడం దేవునికి ఘనతను తెస్తుంది. (1 పేతురు 2:12) అయితే, ఇతరుల అభిమానాన్ని చూరగొనడానికి మనం బైబిలు సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడలేము; అలాగే ఇతరులను మెప్పించడానికి వేషధారణను ఆశ్రయించలేము. అందరినీ మెప్పించడం అసాధ్యమని కూడా మనం గుర్తించాలి. యేసు ఇలా చెప్పాడు: “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” (యోహాను 15:19) మనల్ని వ్యతిరేకించేవారి గౌరవాన్ని పొందడానికి మనమేమైనా చేయగలమా?
వ్యతిరేకుల గౌరవాన్ని పొందడం
యేసు ఇలా హెచ్చరించాడు: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.” (మత్తయి 10:22) ఈ ద్వేషం కొన్నిసార్లు హానికరమైన నిందారోపణలకు కారణమవుతుంది. పక్షపాత వైఖరిగల ప్రభుత్వాధికారులు మనం “రాజద్రోహులమని” లేదా “ప్రభుత్వ వ్యతిరేకులమని” మనల్ని నిందించవచ్చు. నిష్ఠూరంగా మాట్లాడే వ్యతిరేకులు మనం సమస్యలు సృష్టించే తెగకు చెందినవారమనీ మనల్ని అణచివేయాలనీ వాదించవచ్చు. (అపొస్తలుల కార్యములు 28:22) మనం ఈ అబద్ధ నిందారోపణలను కొన్నిసార్లు త్రిప్పికొట్టవచ్చు. ఎలా? “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండమని అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా అలా చేయవచ్చు. (1 పేతురు 3:15) అంతేగాక, “పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాటయేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు” మనం ‘మోసములేని ఉపదేశమును’ ఉపయోగించాలి.—తీతు 2:7.
మనం మనమీద పడిన నిందను తొలగించుకోవడానికి ప్రయత్నించేటప్పుడు, మనం అన్యాయంగా ద్రోహానికి గురైనప్పుడు మనం నిరుత్సాహపడకూడదు లేదా ఉక్కిరిబిక్కిరైపోకూడదు. దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసు దేవదూషణ, రాజద్రోహం, అభిచారం వంటి నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలకు గురయ్యాడు. (మత్తయి 9:3; మార్కు 3:22; యోహాను 19:12) అపొస్తలుడైన పౌలు కూడా దూషించబడ్డాడు. (1 కొరింథీయులు 4:13) యేసు, పౌలు ఇద్దరూ అలాంటి విమర్శలను పట్టించుకోకుండా, తమ పనిలో నిమగ్నమైపోయారు. (మత్తయి 15:14) “లోకమంతయు దుష్టుని యందున్నది” కాబట్టి తమ శత్రువుల ఆమోదాన్ని తాము ఎన్నటికీ పొందలేమని వారికి తెలుసు. (1 యోహాను 5:19) నేడు, మనం కూడా అదే సవాలును ఎదుర్కొంటున్నాం. మనల్ని ద్వేషించే వ్యతిరేకులు మన గురించి అబద్ధాలు వ్యాప్తి చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు.—మత్తయి 5:11.
నిజంగా ప్రాముఖ్యమైన అభిప్రాయాలు
ప్రజలు మన గురించి ఏమి అనుకుంటారనేది చాలామేరకు వారి ఉద్దేశాల మీద, వారు మన గురించి విన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. కొందరు మనల్ని పొగడి కొనియాడతారు, మరికొందరు మనల్ని నిందించి ద్వేషిస్తారు. అయితే మనం బైబిలు సూత్రాల ప్రకారం నడుచుకొంటున్నంత వరకు మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండడానికి మనకు ప్రతి కారణం ఉంది.
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16, 17) మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని వాక్యాన్ని అన్ని విషయాల్లో మన మార్గదర్శినిగా అంగీకరించడం ద్వారా మనం యెహోవా దేవుని ఆమోదాన్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆమోదాన్ని పొందుతాము. ఏదేమైనా యెహోవా అభిప్రాయం, ఆయన కుమారుని అభిప్రాయం అత్యంత ప్రాముఖ్యమైనవి. వాళ్ళు మన గురించి అభిప్రాయపడేదే మన నిజమైన విలువను ప్రతిబింబిస్తుంది. చివరగా, మన జీవం వారి ఆమోదం మీదే ఆధారపడి ఉంది.—యోహాను 5:27; యాకోబు 1:12.
[30వ పేజీలోని బ్లర్బ్]
“పొగడ్త నేను సిగ్గుపడేలా చేస్తుంది, ఎందుకంటే అంతరంగంలో నేను పొగడ్త కావాలనే కోరుకుంటాను.”—భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్
[31వ పేజీలోని చిత్రాలు]
మన తోటి విశ్వాసుల అభిప్రాయాలు ప్రాముఖ్యమైనవి
[30వ పేజీలోని చిత్రసౌజన్యం]
Culver Pictures