‘నా హృదయవాంఛలు’ తీరాయి
జీవిత కథ
‘నా హృదయవాంఛలు’ తీరాయి
డొమీనీక్ మార్గూ చెప్పినది
చివరకు 1998 డిసెంబరులో నేను ఆఫ్రికాలో ఉన్నాను! నా చిన్ననాటి కల ఇప్పుడు నెరవేరింది. ఆఫ్రికాలోని విశాలమైన స్థలాలు, పారవశ్యాన్ని కలిగించే వన్యప్రాణుల గురించిన ఆలోచన నన్ను ఎప్పుడూ పులకరింపజేసేది. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను! అదే సమయంలో నా మరో కల కూడా నెరవేరింది. నేను విదేశాల్లో సేవ చేసే పూర్తికాల సువార్త ప్రచారకురాలిని అయ్యాను. చాలామందికి ఇది అసాధ్యమని అనిపించి ఉండవచ్చు. నా చూపు చాలా మందగించింది, యూరప్ పట్టణాల్లోని వీధుల్లో నడవడానికి శిక్షణ ఇవ్వబడిన గైడ్ డాగ్ (అంధులను నడిపించేందుకు శిక్షణ ఇవ్వబడిన కుక్క) సహాయంతో నేను ఇసుకతో నిండిన ఆఫ్రికా పల్లెల్లో నడుస్తున్నాను. ఆఫ్రికాలో సేవచేయడం నాకు ఎలా సాధ్యమయింది, యెహోవా ‘నా హృదయవాంఛలను’ ఎలా తీర్చాడు అనే విషయాలను నేను మీకు చెబుతాను.—కీర్తన 37:4.
నేను దక్షిణ ఫ్రాన్స్‌లో 1966, జూన్ 9న జన్మించాను. నేను ఏడుగురు పిల్లల్లో చిన్నదాన్ని, ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలం, అందరినీ ప్రేమగల మా తల్లిదండ్రులు చూసుకొనేవారు. అయితే నా యౌవనంలో ఒక దుఃఖకరమైన ఘటన సంభవించింది. మా అమ్మమ్మ, మా అమ్మ, మా అక్కలలో ఒకరిలాగే నేను కూడా చివరకు పూర్తి అంధత్వానికి దారితీసే వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధికి గురయ్యాను.
కౌమారప్రాయంలో ఉన్నప్పుడు నేను జాతి విభేదాలు, వివక్ష, వేషధారణను ఎదుర్కోవాల్సి వచ్చింది, అది నేను సమాజంపై తిరుగుబాటు చేసేందుకు దారితీసింది. ఈ కష్టమైన సమయంలోనే మేము ఏరో అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ అద్భుతమైన ఒక సంఘటన సంభవించింది.
ఒక ఆదివారం ఉదయం ఇద్దరు యెహోవాసాక్షులు మా యింటికి వచ్చారు. వారు మా అమ్మకు తెలుసు, గలతీయులు 2:14.
ఆమె వారిని లోపలికి ఆహ్వానించింది. ఏదో ఒకరోజు బైబిలు అధ్యయనాన్ని అంగీకరిస్తానని వాగ్దానం చేసిన మాట గుర్తుందా అని వారిలో ఒక స్త్రీ అమ్మను అడిగింది. అమ్మ గుర్తుచేసుకొని “మనం ఎప్పుడు ప్రారంభిద్దాం?” అని అడిగింది. ప్రతీ ఆదివారం ఉదయం కలుసుకోవడానికి వారు అంగీకరించారు, ఆ విధంగా మా అమ్మ “సువార్త సత్యాన్ని” తెలుసుకోవడం ప్రారంభించింది.—అంతర్దృష్టి పొందడం
అమ్మ తాను నేర్చుకున్న అంశాలను అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఎంతో కృషి చేసింది. ఆమె అంధురాలు కాబట్టి, ఆమె ప్రతీది కంఠతాః పట్టాల్సి వచ్చేది. సాక్షులు ఆమెతో ఎంతో ఓర్పుతో వ్యవహరించేవారు. నేనైతే, సాక్షులు ఎప్పుడు వచ్చినా నా గదిలో దాక్కొనేదాన్ని, వాళ్ళు వెళ్ళిన తర్వాతే బయటికి వచ్చేదాన్ని. అయితే ఒక మధ్యాహ్నం ఇంటికి వస్తున్న సాక్షుల్లో ఒకరైన యుజనీ నన్ను కలిసి నాతో మాట్లాడింది. లోకంలో ఉన్న వేషధారణ, ద్వేషం, వివక్ష అంతటినీ దేవుని రాజ్యం నిర్మూలిస్తుందని ఆమె నాకు చెప్పింది. “దేవుడు మాత్రమే వాటిని పరిష్కరిస్తాడు” అని చెప్పి, “నీకు ఎక్కువ తెలుసుకోవాలని ఉందా?” అని ఆమె నన్ను అడిగింది. మరుసటి రోజు నేను నా బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాను.
నేను నేర్చుకుంటున్న ప్రతీది నాకు క్రొత్తగా ఉంది. దేవుడు సమంజసమైన కారణాలనుబట్టే భూమ్మీద దుష్టత్వాన్ని తాత్కాలికంగా అనుమతిస్తున్నాడని నేను గ్రహించాను. (ఆదికాండము 3:15; యోహాను 3:16; రోమీయులు 9:17) యెహోవా మనకు నిరీక్షణ లేకుండా చేయడని కూడా నేను తెలుసుకున్నాను. ఆయన మనకు పరదైసు భూమ్మీద నిత్యజీవమనే అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. (కీర్తన 37:29; 96:11, 12; యెషయా 35:1, 2; 45:18) ఆ పరదైసులో, ఇప్పుడు నెమ్మదిగా మందగిస్తున్న, కనుచూపు అనే వరాన్ని నేను తిరిగి పొందుతాను.—యెషయా 35:5.
పూర్తికాల పరిచర్యను చేపట్టడం
నేను 1985 డిసెంబరు 12న, నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు సమర్పించుకున్నాను, అప్పటికే మా అక్క మరీ-క్లార్ బాప్తిస్మం తీసుకుంది. ఆ తర్వాత మా అన్న జాన్-ప్యర్, మా ప్రియమైన అమ్మ బాప్తిస్మం తీసుకున్నారు.
నేను సహవసించిన సంఘంలో చాలామంది క్రమ పయినీర్లు లేదా పూర్తికాల సువార్తికులు ఉన్నారు. వారి ఆనందాన్ని, పరిచర్యపట్ల వారికున్న ఉత్సాహాన్ని చూసి నేను ప్రోత్సహించబడ్డాను. కంటి రోగంతో బాధపడుతుండడమే కాక, ఒక కాలుకి ఆర్థోపెడిక్ సాధనం కూడా ధరించిన మరీ-క్లార్ కూడా పూర్తికాల పరిచర్య చేపట్టింది. ఇప్పటికీ ఆమె ఆదర్శం నాకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో, ఇంట్లో పయినీర్లు ఉండడం నేను పూర్తికాల సేవలో భాగం వహించాలనే బలమైన కోరిక వృద్ధి చేసుకోవడానికి నాకు సహాయం చేసింది. కాబట్టి 1990 నవంబరులో నేను బాజ్యా పట్టణంలో పయినీరుగా సేవ చేయడం ప్రారంభించాను.—కీర్తన 94:17-19.
నిరుత్సాహాన్ని ఎదుర్కోవడం
నేను పరిచర్యలో ఉన్నప్పుడు ఇతర పయినీర్లు నన్ను జాగ్రత్తగా చూసుకోవడం నాకు సహాయం చేసింది. అయినా నా పరిమితుల కారణంగా నేను అప్పుడప్పుడు నిరుత్సాహపడేదాన్ని, ఎక్కువ చేయాలని ఆశించేదాన్ని. అయితే అలా నిరుత్సాహపడుతున్న సమయాల్లో యెహోవా నన్ను ఆదుకున్నాడు. నేను వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో పరిశోధన చేసి, నాలాగే చూపు మందగించడంతో బాధపడిన పయినీర్ల జీవితకథల కోసం వెదికాను. అలాంటి కథలు చాలా ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను! ఆచరణాత్మకమైన, ప్రోత్సాహకరమైన ఆ వృత్తాంతాలు నేను చేయగలుగుతున్న సేవను విలువైనదిగా ఎంచడాన్ని, నా పరిమితులను అంగీకరించడాన్ని నాకు నేర్పించాయి.
నా ఖర్చుల కోసం నేను ఇతర సాక్షులతో కలిసి షాపింగ్ సెంటర్లలో శుభ్రం చేసే పని చేశాను. నా తోటి పనివారు నేను అప్పుడే శుభ్రం చేసిన ప్రాంతాలను మళ్ళీ శుభ్రం చేయడం నేను ఒకరోజు గమనించాను. నేను సరిగ్గా శుభ్రం చేయలేక పోతున్నానని అర్థమైంది. శుభ్రం చేసే బృందాన్ని పర్యవేక్షిస్తున్న వెలెరి అనే పయినీరును కలిసి, నా కారణంగా ఇతరులకు ఏమైనా కష్టం అవుతోందేమో దాపరికం లేకుండా చెప్పమని ఆమెను అడిగాను. నేను ఇక పని చేయలేనని ఎప్పుడు నిర్ణయించుకోవాలనేది ఆమె దయాపూర్వకంగా నాకే వదిలేసింది. నేను 1994 మార్చిలో శుభ్రం చేసే పని మానేశాను.
నేను పనికిరానిదాన్ననే భావం నన్ను మళ్ళీ ముంచెత్తింది. నేను యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాను, ఆయన నా విన్నపాలను విన్నాడని నాకు తెలుసు. బైబిలు అధ్యయనం చేయడం, క్రైస్తవ ప్రచురణలను చదవడం మళ్ళీ నాకు ఎంతో సహాయం చేశాయి. నా కంటిచూపు మందగిస్తున్నా యెహోవాను సేవించాలనే నా కోరిక బలపడుతూనే ఉంది. నేను ఏమి చేయగలను?
మొదట వెయిటింగ్ లిస్టు, ఆ తర్వాత త్వరిత నిర్ణయం
అంధుల కోసం, దృష్టిలోపం ఉన్నవారి కోసం నెమ్‌లో ఉన్న పునరావాస కేంద్రంలో శిక్షణ పొందడానికి నేను దరఖాస్తు చేసుకున్నాను, చివరకు మూడు నెలలకోసం నన్ను చేర్చుకున్నారు. అక్కడ నేను గడిపిన సమయం విలువైనది. నా అంగవైకల్యం ఎంతమేరకు ఉందో గ్రహించి, దానితో సర్దుకుపోవడం నేర్చుకున్నాను. అన్ని రకాల రోగాలతో బాధపడుతున్న వ్యక్తులతో సహవసించడం నా క్రైస్తవ నిరీక్షణ ఎంత అమూల్యమైనదో గుర్తించడానికి నాకు సహాయం చేసింది. నాకు ఒక లక్ష్యమంటూ ఉంది, నేను ఫలవంతమైనది ఏదైనా చేయగలను. అంతేకాక నేను ఫ్రెంచ్ బ్రెయిలీ నేర్చుకున్నాను.
నేను ఇంటికి తిరిగివచ్చినప్పుడు, ఆ శిక్షణ నాకు ఎంత సహాయం చేసిందో నా కుటుంబం గమనించింది. అయితే నాకు అస్సలు నచ్చని ఒక విషయం ఏమిటంటే, నేను ఉపయోగించవలసిన తెల్లని చేతి కర్ర. నేను ఆ “కర్రను” ఉపయోగించక తప్పదనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమయ్యింది. నాకు వేరే సహాయం, బహుశా ఒక గైడ్ డాగ్ సహాయం ఉంటే బాగుంటుంది.
నేను ఒక కుక్క కోసం దరఖాస్తు చేసుకున్నాను కానీ పెద్ద వెయిటింగ్ లిస్టు ఉందని చెప్పారు. అంతేకాక అలాంటి కుక్కలను ఇచ్చే సంస్థ ఒక విచారణను నిర్వహించాలి. ఎందుకంటే గైడ్ డాగ్‌ను ఎవరికిపడితే వారికి ఇవ్వరు. ఒకరోజు, స్థానిక టెన్నీస్ క్లబ్ ఒకటి మా ప్రాంతంలో నివసిస్తున్న ఒక అంధునికి లేక పాక్షికంగా చూపు ఉన్న వ్యక్తికి ఒక గైడ్ డాగ్‌ను విరాళంగా ఇవ్వనుందని అంధుల కోసం ఒక అసోషియేషన్ నడపడంలో సహాయం చేసే ఒక స్త్రీ నాకు చెప్పింది. నేను ఆమెకు గుర్తొచ్చానని ఆమె చెప్పింది. నేను దానిని అంగీకరించాలా? నేను ఆ విషయంలో యెహోవా హస్తాన్ని గుర్తించి ఆ దయాపూర్వక ప్రతిపాదనను అంగీకరించాను. అయితే నేను ఆ కుక్క కోసం వేచి ఉండాల్సివచ్చింది.
ఆఫ్రికా గురించి ఇంకా ఆలోచిస్తున్నాను
నేను కుక్క కోసం వేచి చూస్తూ నా దృష్టిని మరో దిశకు మళ్ళించాను. నేను ఇంతకుముందు పేర్కొన్నట్లు, నాకు బాల్యం నుండి ఆఫ్రికా అంటే ఎంతో ఆసక్తి ఉంది. నా కనుచూపు మందగిస్తున్నా, ప్రత్యేకంగా ఆఫ్రికాలో చాలామంది బైబిలు విషయంలో, యెహోవాను సేవించే విషయంలో
ఆసక్తితో ఉన్నారని తెలియడంతో నా ఆసక్తి మరింత బలపడింది. నేను ఆఫ్రికాను సందర్శించడానికి ఇష్టపడుతున్నానని కొంతకాలం క్రితం వెలెరికి సరదాగా చెప్పాను. నాతో రమ్మని నేను ఆమెను అడిగాను. ఆమె దానికి అంగీకరించింది, మేము ఆఫ్రికా ఖండంలోని, ఫ్రెంచ్ అధికారిక భాషగావున్న, అనేక యెహోవాసాక్షుల బ్రాంచీలకు వ్రాశాం.టోగో నుండి జవాబు వచ్చింది. నేను పులకరించిపోయాను, నా కోసం ఆ ఉత్తరాన్ని చదవమని వెలెరిని అడిగాను. ఆ ఉత్తరం ప్రోత్సాహకరంగా ఉంది, కాబట్టి వెలెరి ఇలా అంది: “అదే నిజమైతే, మనం ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు?” ఆ బ్రాంచీలోని సహోదరులను సంప్రదించిన తర్వాత రాజధాని పట్టణమైన లోమాలో ఉన్న సాండ్రా అనే పయినీరును సంప్రదించాల్సిందిగా వారు నన్ను నిర్దేశించారు. మేము 1998 డిసెంబరు 1న అక్కడికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాం.
ఈ ప్రాంతం ఎంతో వేరుగా ఉంది, కానీ అది ఎంతో ఆనందాన్నిచ్చింది! మేము విమానంలో లోమాకు చేరిన తర్వాత విమానం నుండి క్రిందికి దిగుతున్నప్పుడు ఆఫ్రికాలోని వేడి వాతావరణం మమ్మల్ని ఆవరించినట్లు భావించాం. సాండ్రా మమ్మల్ని కలుసుకుంది. మేము ఇంతకుముందు ఎప్పుడూ ఒకరినొకరం కలుసుకోలేదు, కానీ మేము కలుసుకున్న వెంటనే పాత స్నేహితులన్నట్లు భావించాం. మేము అక్కడికి వెళ్ళడానికి కొద్దికాలం ముందే సాండ్రా, ఆమె భాగస్వామి క్రిస్టీన్, మారుమూలలో ఉన్న టబ్లీగ్భో అనే చిన్న నగరానికి ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డారు. వారి క్రొత్త నియామకానికి వారితోపాటు వెళ్ళే ఆధిక్యత మాకిప్పుడు లభించింది. మేము దాదాపు రెండు నెలలు అక్కడ ఉన్నాం, మేము ఆ ప్రాంతాన్ని వదిలి వస్తున్నప్పుడు నేను మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్తానని నాకు తెలుసు.
నేను తిరిగిరావడానికి ఆనందించాను
నేను ఫ్రాన్సుకు తిరిగి వచ్చిన వెంటనే, టోగోకు రెండవసారి వెళ్ళడానికి సిద్ధపడడం మొదలుపెట్టాను. నా కుటుంబ మద్దతుతో నేను అక్కడ ఆరు నెలలు ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోగలిగాను. కాబట్టి 1999 సెప్టెంబరులో నేను టోగోకు వెళ్ళే విమానాన్ని మళ్ళీ ఎక్కాను. అయితే ఈ సారి నేను ఒంటరిగా ఉన్నాను. నాకు అంగవైకల్యం ఉన్నా నేను ఒంటరిగా వెళ్ళడం నా కుటుంబ సభ్యులు చూసినప్పుడు వారి భావాలను ఊహించండి! అయితే వారు చింతించాల్సిన అవసరం లేదు. నాకు అప్పటికే కుటుంబంలా తయారైన నా స్నేహితులు, లోమాలో నా కోసం వేచి ఉంటారని నా తల్లిదండ్రులకు హామీ ఇచ్చాను.
బైబిలుపట్ల చాలామంది ఆసక్తి చూపించే ప్రాంతానికి తిరిగిరావడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో! అక్కడి ప్రజలు వీధిలో బైబిలు చదవడాన్ని చూడడం అసాధారణమేమీ కాదు. టబ్లీగ్భో ప్రజలు కేవలం బైబిలును చర్చించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇద్దరు ప్రత్యేక పయినీరు సహోదరీలతో నిరాడంబరమైన వసతిని పంచుకోవడం ఎంతటి గొప్ప ఆధిక్యత! నేను మరో సంస్కృతిని తెలుసుకోగలిగాను, విషయాలను వేరే దృక్కోణంలో చూడడం నేర్చుకోగలిగాను. నేను ప్రప్రథమంగా గమనించినదేమంటే ఆఫ్రికాలోని మన క్రైస్తవ సహోదర సహోదరీలు రాజ్య సంబంధ విషయాలకు తమ జీవితాల్లో ప్రథమస్థానం ఇస్తారు. ఉదాహరణకు, రాజ్య మందిరానికి రావడానికి ఎన్నో కిలోమీటర్లు నడవాల్సివచ్చినా వారు కూటాలకు హాజరవకుండా ఉండరు. వారు చూపించే ఆప్యాయత, ఆతిథ్యాల నుండి కూడా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.
ఒకరోజు క్షేత్రసేవ నుండి తిరిగివస్తున్నప్పుడు, ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళాలంటే నాకు భయంగా ఉందని సాండ్రాతో చెప్పాను. నా కంటిచూపు ఇంకా
మందగించింది. తక్కువ కనుదృష్టి ఉన్నవారి జీవితాన్ని కష్టభరితం చేసే బాజ్యా పట్టణంలోని క్రిక్కిరిసి, సందడిగా ఉండే వీధులు, అపార్ట్‌మెంట్లలోని మెట్లు వంటి అనేక విషయాల గురించి ఆలోచించాను. దానికి భిన్నంగా టబ్లీగ్భోలోని వీధుల్లో రోడ్డుకు ఇరుప్రక్కలా ఎత్తుగా కట్టిన కాలిబాట లేకపోయినా, అవి ప్రశాంతంగా ఉంటాయి, పెద్ద గుంపులు, ఎక్కువ ట్రాఫిక్ ఉండవు. నేను ఇప్పుడు టబ్లీగ్భోకు అలవాటుపడ్డాను కాబట్టి నేను ఫ్రాన్స్‌లో ఎలా ఉండగలను?రెండు రోజుల తర్వాత, గైడ్ డాగ్స్‌కు సంబంధించిన పాఠశాలవారు నా కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలియజేయడానికి మా అమ్మ ఫోన్ చేసింది. ఓసేన్ అనే లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన చిన్న కుక్క నా “కళ్ళు”గా పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. మళ్ళీ నా అవసరాలు తీరాయి, నా చింతలు పటాపంచలయ్యాయి. టబ్లీగ్భోలో ఆరు నెలలు సంతోషంగా సేవ చేసిన తర్వాత ఓసేన్‌ను కలుసుకోవడానికి నేను ఫ్రాన్స్‌కు బయలుదేరాను.
ఎన్నో నెలల శిక్షణ తర్వాత ఓసేన్‌ను నాకు ఇచ్చారు. మొదట్లో నాకు కష్టమనిపించింది. మేము ఒకరినొకరం అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఓసేన్ నాకు ఎంత అవసరమో నేను క్రమంగా గుర్తించగలిగాను. నిజానికి ఇప్పుడు ఓసేన్ నాలో ఒక భాగమయ్యింది. నేను ఒక కుక్కతో తమ ఇంటికి రావడం చూసి బాజ్యా వాసులు ఎలా ప్రతిస్పందించారు? వారు నన్ను గౌరవించారు, దయతో వ్యవహరించారు. ఓసేన్ మా ఇంటి పరిసరాల్లో “హీరో” అయింది. చాలామంది వికలాంగులతో వ్యవహరించడానికి ఇబ్బందిపడతారు కాబట్టి, నాతోపాటు కుక్కను తీసుకువెళ్ళడం మూలంగా నా జబ్బు గురించి సహజమైన విధంగా మాట్లాడడానికి నాకు వీలైంది. ప్రజలు ప్రశాంతంగా ఉండి, నేను చెప్పేది వినేవారు. నిజానికి ఓసేన్, సంభాషణ ప్రారంభించడానికి మంచి మార్గంగా తయారైంది.
ఓసేన్‌తో ఆఫ్రికాలో
నేను ఆఫ్రికాను మరచిపోలేదు, నేను ఇప్పుడు నా మూడవ ప్రయాణాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాను. ఈ సారి ఓసేన్ నాతోపాటు వచ్చింది. నాలాగే పయినీర్లుగా ఉన్న ఆంటనీ, ఒరోరో అనే ఒక యువ జంట, నా స్నేహితురాలు కరోలిన్ కూడా నాతోపాటు వచ్చారు. మేము 2000 సెప్టెంబరు 10న, లోమాకు చేరుకున్నాం.
మొదట్లో ఓసేన్‌ను చూసి చాలామంది భయపడేవారు. టోగోలో ఉన్న చాలా కుక్కలు చిన్నగా ఉంటాయి కాబట్టి, లోమాలో చాలా తక్కువమంది అంతకుముందు అలాంటి పెద్ద కుక్కను చూసివుంటారు. కొంతమంది దానికి వేసిన పట్టీ (హార్నెస్) చూసినప్పుడు, అది అదుపులో ఉంచాల్సిన క్రూరమైన జంతువు కావచ్చని భావించారు. అయితే ఓసేన్ మాత్రం ఆత్మరక్షణ వైఖరిని అవలంభించేది, తాను ముప్పు అని గ్రహించిన దేని నుండైనా నన్ను రక్షించేందుకు సిద్ధంగా ఉండేది. అయినా ఓసేన్ క్రొత్త వాతావరణానికి త్వరగా అలవాటుపడి పోయింది. దానికి పట్టీ తగిలించిన వెంటనే అది పనిలో నిమగ్నమైపోతుంది, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది, నా ప్రక్కనే ఉంటుంది. పట్టీ తీసేసినప్పుడు అది ఆటలాడుతుంది, కొన్నిసార్లు అల్లరి చేస్తుంది. మేమిద్దరం కలిసి ఉల్లాసంగా గడుపుతాం.
మేమందరం టబ్లీగ్భోలో సాండ్రా, క్రిస్టెన్‌లతో కలిసి ఉండడానికి ఆహ్వానించబడ్డాం. స్థానిక సహోదర సహోదరీలు ఓసేన్‌కు అలవాటుపడడానికి సహాయం చేసేందుకు మేము వారిని ఇంటికి ఆహ్వానించి, గైడ్ డాగ్ పాత్ర గురించి, అది నాకు ఎందుకు అవసరమో, దానితో వారు ఎలా వ్యవహరించాలో వారికి వివరించాం. ఓసేన్ నాతోపాటు రాజ్య మందిరానికి రావడానికి పెద్దలు ఒప్పుకున్నారు. ఆ ఏర్పాటు టోగోలో చాలా అసాధారణమైనది కాబట్టి, ఆ విషయాన్ని వివరిస్తూ సంఘంలో ఒక ప్రకటన చేయబడింది. పరిచర్య విషయానికి వస్తే, నేను పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే ఓసేన్ నాతోపాటు వచ్చేది అంటే ఓసేన్ నాతో ఎందుకు ఉందో చాలా సులభంగా అర్థం చేసుకోగల పరిస్థితులలోనే అది నాతో పాటు వచ్చేది.
ఈ క్షేత్రంలో ప్రకటించడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది. ఆ దయగల ప్రజలు చూపించిన శ్రద్ధ, నాకు కుర్చీ ఇవ్వడానికి ఉత్సాహం చూపించడం వంటి దయతో కూడిన చర్యలో ప్రదర్శించబడేది, దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేదాన్ని. 2001 అక్టోబరులో నేను టోగోకు నాల్గవసారి వచ్చినప్పుడు మా అమ్మ నాతోపాటు వచ్చింది. నేను బాగున్నాను అనే నమ్మకంతో, సంతోషంతో మూడు వారాల తర్వాత ఆమె ఫ్రాన్స్‌కు తిరిగివెళ్ళింది.
నేను టోగోలో సేవ చేయగలిగినందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. నేను నాకున్నదంతా యెహోవా సేవలో ఉపయోగిస్తుండగా ఆయన నా ‘హృదయవాంఛలను’ ఎల్లప్పుడూ తీరుస్తాడనే నమ్మకం నాకుంది. *
[అధస్సూచి]
^ పేరా 37 సహోదరి మార్గూ ఫ్రాన్స్‌కు తిరిగివచ్చి 2003, అక్టోబరు 6 నుండి 2004, ఫిబ్రవరి 6 మధ్య ఐదవసారి టోగోకు వెళ్ళిరాగలిగింది. విచారకరంగా, వైద్యసంబంధమైన క్లిష్టస్థితి కారణంగా టోగోకు ఆమె చేసిన ఐదవ ప్రయాణం ఈ విధానంలో చివరిది కావచ్చు. అయితే ఆమె బలమైన కోరిక యెహోవాను సేవించాలన్నదే.
[10వ పేజీలోని చిత్రాలు]
ఆఫ్రికాలోని విశాలమైన స్థలాలు, పారవశ్యం కలిగించే వన్యప్రాణుల గురించిన ఆలోచన నన్ను ఎప్పుడూ పులకరింపజేసేది
[10వ పేజీలోని చిత్రం]
ఓసేన్ నాతోపాటు పునర్దర్శనాలకు వచ్చేది
[11వ పేజీలోని చిత్రం]
ఓసేన్‌ను కూటాలకు తీసుకురావడానికి పెద్దలు ఒప్పుకున్నారు