కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవునితో నడుస్తారా?

మీరు దేవునితో నడుస్తారా?

మీరు దేవునితో నడుస్తారా?

‘మీ దేవునితో నడవడంలో అణకువతో ఉండండి.’​—⁠మీకా 6:⁠8, Nw.

పాప నెమ్మదిగా లేచినిలబడి, తనవైపు చేతులు చాచిన తల్లిదండ్రులవైపు తప్పటడుగులు వేస్తుంది. అదంత విశేషమన్నట్లు అనిపించకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకు అదొక మైలురాయి, భవిష్యత్తుపై ఆశలు పెంచే మధురమైన క్షణం. భవిష్యత్తులో అనేక విధాలుగా ఆ పాపకు చాలాకాలంపాటు మార్గనిర్దేశాన్ని, మద్దతును ఇవ్వాలని వారు నిరీక్షిస్తారు.

2 యెహోవా దేవునికి కూడా తన భూసంబంధమైన పిల్లలపట్ల అలాంటి భావాలే ఉన్నాయి. ఒకసారి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి లేదా ఎఫ్రాయిము గురించి ఆయనిలా చెప్పాడు: “ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే . . . ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని.” (హోషేయ 11:​3, 4) యెహోవా ఇక్కడ తననుతాను ఒక పిల్లవాని చెయ్యిపట్టుకొని ఓపికగా నడక నేర్పిస్తూ, వాడు క్రిందపడితే చేతుల్లోకి తీసుకునే ప్రేమగల తండ్రితో పోల్చుకుంటున్నాడు. సర్వోత్తమ తండ్రియైన యెహోవా ఎలా నడవాలో మనకు నేర్పించాలనే ఆకాంక్షతో ఉన్నాడు. మనం ఎడతెగక ప్రగతి సాధిస్తుండగా ఆయన మనతోపాటు ఉండేందుకు ఆనందిస్తాడు. మన ముఖ్య వచనం చూపిస్తున్నట్లుగా దేవునితో నడిచే అవకాశం మనకుంది! (మీకా 6:​8, NW) అయితే దేవునితో నడవడమంటే అర్థమేమిటి? మనం ఆయనతో ఎందుకు నడవాలి? అదెలా సాధ్యం? దేవునితో నడవడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి? ఈ నాలుగు ప్రశ్నలను ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం.

దేవునితో నడవడమంటే అర్థమేమిటి?

3 రక్తమాంసాలుగల మానవులు, ఆత్మ స్వరూపియైన యెహోవాతో అక్షరార్థంగా నడవలేరు. (నిర్గమకాండము 33:20; యోహాను 4:24) కాబట్టి మానవులు దేవునితో నడవడం గురించి బైబిలు మాట్లాడినప్పుడు, అది అలంకారార్థ భాషను ఉపయోగిస్తోంది. అది జాతిపరమైన, సంస్కృతిపరమైన పరిధులకు అతీతమైన వర్ణనను, చివరికి కాలాతీతమైన, గమనార్హమైన వర్ణనను అందిస్తోంది. నిజానికి, ఒక వ్యక్తి మరో వ్యక్తితో కలిసి నడవడాన్ని ఏ ప్రాంతంలోనివారు, ఏ కాలానికి చెందినవారు మాత్రం అర్థం చేసుకోలేరు? ఈ వర్ణన స్నేహశీలతను, సాన్నిహిత్యాన్ని సూచించదా? అలాంటి భావాలు, దేవునితో నడవడమంటే అర్థమేమిటో నిశితంగా గ్రహించడానికి మనకు సహాయం చేస్తాయి. అయితే మనమీ విషయాన్ని మరింత నిర్దిష్టంగా పరిశీలిద్దాం.

4 నమ్మకస్థులైన హనోకును, నోవహును గుర్తు చేసుకోండి. వారు దేవునితో నడిచినట్లు ఎందుకు వర్ణించబడ్డారు? (ఆదికాండము 5:​24; 6:9) బైబిల్లో “నడవడం” అనే మాటకు తరచూ ఫలాని కార్యవిధానాన్ని అనుసరించడమనే అర్థముంది. హనోకు, నోవహు యెహోవా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్న జీవన విధానాన్ని ఎంచుకున్నారు. వారు తమచుట్టూ ఉన్నవారికి భిన్నంగా ఉంటూ, మార్గనిర్దేశం కోసం యెహోవావైపు చూసి, ఆయన నిర్దేశానికి విధేయులయ్యారు. వారు ఆయనను విశ్వసించారు. అంటే యెహోవా వారికోసం నిర్ణయాలు తీసుకున్నాడని దానర్థమా? కాదు. యెహోవా మానవులకు స్వేచ్ఛాచిత్తమిచ్చి, ఆ వరాన్ని మనం మన ‘తర్కశక్తితో’పాటు ఉపయోగించాలని ఇష్టపడుతున్నాడు. (రోమీయులు 12:⁠1, NW) అయితే మనం నిర్ణయాలు తీసుకొనేటప్పుడు, యెహోవా అత్యుత్తమ మేధచేత మన తర్కశక్తి నిర్దేశించబడేందుకు మనం వినయంగా అనుమతిస్తాం. (సామెతలు 3:5, 6; యెషయా 55:8, 9) అలా చేసినప్పుడే మనం మన జీవితయాత్రలో యెహోవాతో సన్నిహితంగా కలిసి నడుస్తాం.

5 బైబిలు తరచూ జీవితాన్ని ఒక ప్రయాణంతో లేదా నడవడంతో పోలుస్తోంది. కొన్నిసార్లు ఆ పోలిక ప్రత్యక్షంగాను, మరికొన్నిసార్లు సూచనార్థకంగాను ఉంటుంది. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు [‘జీవిత కాలాన్ని,’ NW] మూరెడెక్కువ చేసికొనగలడు?” (మత్తయి 6:27) ఆ మాటలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కాలంతో కొలిచే ఒక వ్యక్తి ‘జీవిత కాలానికి,’ దూరాన్ని కొలిచే మూరను చేర్చి యేసు ఎందుకు మాట్లాడాడు? * యేసు జీవితాన్ని ఒక ప్రయాణంతో పోలుస్తున్నాడనేది స్పష్టం. నిజానికి ఆయన, చింత మీ జీవితయాత్రలో చిన్న అడుగు వేయడానికి కూడా సహాయం చేయదని బోధించాడు. అలాగని ఆ ప్రయాణ దూరం గురించి మనం చేయగలిగింది ఏమీలేదనే ముగింపుకు రావాలా? ఎంతమాత్రం రాకూడదు! ఇది మనం దేవునితో ఎందుకు నడవాలి అనే మన రెండవ ప్రశ్నకు మనల్ని తీసుకెళ్తుంది.

మనం దేవునితో ఎందుకు నడవాలి?

6 మనం దేవునితో ఎందుకు నడవాలనేదానికి ఒక కారణం యిర్మీయా 10:23లో ఇలా వివరించబడింది: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” అందువల్ల, మానవులమైన మనకు మన సొంత జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సామర్థ్యం గానీ, హక్కు గానీ లేవు. మనకు మార్గనిర్దేశం ఎంతో అవసరం. దేవుని ప్రమేయం లేకుండా తమ సొంత మార్గంలో వెళ్లాలని పట్టుబట్టేవారు, ఆదాము హవ్వలు చేసిన తప్పునే చేస్తారు. ఆ మొదటి దంపతులు మంచిచెడులను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందన్నట్లు వ్యవహరించారు. (ఆదికాండము 3:1-6) ఆ హక్కు మన “వశములో” లేదు.

7 జీవితయాత్రలో మనకు మార్గనిర్దేశం అవసరమని మీరు భావించరా? ప్రతీరోజు మనం చిన్న, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటాం. వాటిలో కొన్ని కష్టంగా ఉండి మన జీవితాన్నీ, మన ప్రియమైనవారి జీవితాన్నీ ప్రభావితం చేయగలవు. అయితే మనకంటే మహావృద్ధుడు, అనంత జ్ఞానియైన దేవుడు ఆ నిర్ణయాల విషయంలో ప్రేమపూర్వక మార్గనిర్దేశం ఇచ్చేందుకు సంతోషంగా ఉండడాన్ని ఒక్కసారి ఊహించుకోండి! విచారకరంగా నేడు చాలామంది తమ సొంత పరిజ్ఞానాన్ని నమ్ముకొని, తమ అడుగులను తామే నిర్దేశించుకునేందుకు ఇష్టపడుతున్నారు. వారు సామెతలు 28:⁠26లో చెప్పబడిన ఈ సత్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.” మోసకరమైన మానవ హృదయాన్ని నమ్ముకోవడం ద్వారా కలిగే విపత్తులను మనం తప్పించుకోవాలని యెహోవా కోరుతున్నాడు. (యిర్మీయా 17:9) మనం జ్ఞానంతో నడుచుకుంటూ, ఆయనను మన జ్ఞానవంతుడైన ఉపదేశకునిగా, నిర్దేశకునిగా నమ్మాలని ఆయన కోరుతున్నాడు. మనమలా చేసినప్పుడు, మన జీవితయాత్ర సురక్షితంగా, సంతృప్తిదాయకంగా, ఫలవంతంగా ఉంటుంది.

8 మనం దేవునితో నడిచేందుకున్న మరో కారణంలో మనమెంత దూరం నడవాలని ఇష్టపడుతున్నామనేది ఇమిడివుంది. బైబిలు ఒక కఠోరమైన సత్యాన్ని వెల్లడి చేస్తోంది. ఒక విధంగా, అపరిపూర్ణ మానవులందరూ ఒకే దిశవైపు నడుస్తున్నారు. వృద్ధాప్యం కారణంగావచ్చే పరీక్షలను వర్ణిస్తూ ప్రసంగి 12:5 ఇలా చెబుతోంది: “ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు.” “నిత్యమైన ఉనికిపట్టు” ఏమిటి? అది పాపమరణాలు మనల్ని చివరికి నడిపించే సమాధే. (రోమీయులు 6:23) అయితే, పుట్టుక నుండి చావువరకు సాగే ఆ కష్టభరితమైన స్వల్పకాలపు నడకకన్నా ఎక్కువే మనం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. (యోబు 14:1) మనం దేవునితో నడిచినప్పుడు మాత్రమే ఎంతకాలం నడవాలని మనం ఉద్దేశించబడ్డామో అంతకాలం అంటే నిత్యమూ నడిచేందుకు నిరీక్షించగలం. మీరు కోరుకునేది అదే కాదా? కాబట్టి, మీరు మీ తండ్రితో నడవాలనేది స్పష్టం.

మనం దేవునితో ఎలా నడవగలం?

9 మన చర్చలోని మూడవ ప్రశ్నకు మనం మరింత సునిశిత అవధానమివ్వాలి. అదే, మనం దేవునితో ఎలా నడవగలం? దాని జవాబు మనకు యెషయా 30:20, 21లో లభిస్తుంది. అదిలా ఉంది: “ఇకమీదట నీ బోధకులు [“మహోపదేశకుడు,” NW] దాగియుండరు, నీవు కన్నులార నీ బోధకులను [“మహోపదేశకుణ్ణి,” NW] చూచెదవు. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను​—⁠ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” ప్రోత్సాహకరమైన ఈ భాగంలో 20వ వచనంలో వ్రాయబడిన యెహోవా వాక్కులు, తన ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వారి విషయంలో దాగివున్నాడని వారికి గుర్తుచేసి ఉండవచ్చు. (యెషయా 1:​15; 59:2) అయితే ఇక్కడ యెహోవా దాగివున్నట్లుగా కాక, తన నమ్మకమైన ప్రజల కన్నుల ఎదుట నిలబడి ఉన్నట్లు వర్ణించబడ్డాడు. తన విద్యార్థులు నేర్చుకోవలసిన విషయాలను వారి ఎదుట నిలబడి వారికి వివరిస్తున్న ఉపాధ్యాయుని గురించి మనం ఆలోచించవచ్చు.

10 ఇరవై ఒకటవ వచనంలో మరో విభిన్నమైన వర్ణన ఉంది. యెహోవా తన ప్రజల వెనుక నడుస్తూ, సరైన దిశలో వెళ్లేలా వారికి మార్గనిర్దేశాలు ఇస్తున్నట్లు వర్ణించబడ్డాడు. గొర్రెలకాపరి కొన్నిసార్లు మంద వెనుక నడుస్తూ అవి దారి తప్పకుండా ఉండేలా బిగ్గరగా అదిలించడం మీద ఈ మాటలు ఆధారపడి ఉండవచ్చని బైబిలు విద్వాంసులు వ్యాఖ్యానించారు. ఈ వర్ణన మనకు ఎలా అన్వయిస్తుంది? మనం మార్గనిర్దేశం కోసం దేవునివాక్యంవైపు తిరిగినప్పుడు మనం వేలాది సంవత్సరాల పూర్వం నమోదు చేయబడిన మాటలను చదువుతాం. అవి మనకు కాలప్రవాహంలో వెనుకనుండి వస్తున్నట్లుగా ఉంటాయి. అయినా అవి వ్రాయబడినప్పుడు ఎంత సముచితంగా ఉన్నాయో నేడూ అంతే సముచితంగా ఉన్నాయి. బైబిలు ఉపదేశం మన దైనందిన నిర్ణయాల్లో మార్గనిర్దేశమిస్తూ, భవిష్యత్తులో మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేయగలదు. (కీర్తన 119:105) అలాంటి ఉపదేశాన్ని మనం హృదయపూర్వకంగా వెదికి, అన్వయించుకున్నప్పుడు, యెహోవా మన మార్గనిర్దేశకునిగా ఉంటాడు. మనం దేవునితో నడిచిన వారమవుతాం.

11 మరి మనం అంత సన్నిహితంగా మార్గనిర్దేశం ఇవ్వడానికి దేవుని వాక్యాన్ని అనుమతిస్తున్నామా? కొన్నిసార్లు ఆగి మనల్ని మనం నిజాయితీగా పరీక్షించుకోవడం మంచిది. మనమలా చేయడానికి సహాయం చేసే ఈ వచనాన్ని పరిశీలించండి: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.” (యిర్మీయా 6:16) ఈ మాటలు కూడలి దగ్గర ఆగి ఎటువెళ్లాలో అడిగి తెలుసుకొనే ఒక ప్రయాణికుణ్ణి మనకు గుర్తుచేయవచ్చు. ఆధ్యాత్మిక భావంలో, ఇశ్రాయేలులోని యెహోవా తిరుగుబాటు ప్రజలు అలాంటిదే చేయవలసి ఉంది. వారు తమ “పురాతన మార్గములను” తెలుసుకోవాలి. ‘మేలు కలిగించే ఆ మార్గంలో’ నమ్మకస్థులైన వారి పితరులు నడిచారు, ఆ మార్గం నుండి ఆ తెలివితక్కువ జనాంగం దారితప్పింది. విచారకరంగా, యెహోవా ఇచ్చిన ఈ ప్రేమపూర్వక జ్ఞాపికకు ఇశ్రాయేలీయులు మూర్ఖంగా స్పందించారు. ఆ వచనం ఇంకా ఇలా చెబుతోంది: “అయితే వారు​—⁠మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.” కానీ ఆధునిక కాలాల్లో దేవుని ప్రజలు అలాంటి ఉపదేశానికి మరోవిధంగా స్పందించారు.

12 పందొమ్మిదవ శతాబ్దపు చివరి నుండి క్రీస్తు అభిషిక్త అనుచరులు యిర్మీయా 6:16లోని ఉపదేశాన్ని తమకు అన్వయించుకున్నారు. ఒక తరగతిగా వారు, “పురాతన మార్గములకు” హృదయపూర్వకంగా తిరిగి రావడంలో సారథ్యం వహించారు. మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యానికి భిన్నంగా వారు యేసుక్రీస్తు స్థాపించిన, సా.శ. మొదటి శతాబ్దంలో ఆయన నమ్మకమైన అనుచరులు సమర్థించిన, ‘హితవాక్యప్రమాణానికి’ విశ్వసనీయంగా హత్తుకున్నారు. (2 తిమోతి 1:​13) నేటికీ, ఈ అభిషిక్తులు క్రైస్తవమత సామ్రాజ్యం విడిచిపెట్టిన మేలైన, సంతోషభరితమైన జీవన విధానాన్ని అనుసరించేందుకు తాము ఒకరికొకరే కాక, తమ సహవాసులైన ‘వేరే గొఱ్ఱెలకు’ కూడా తోడ్పడుతున్నారు.​—⁠యోహాను 10:16.

13 నమ్మకమైన దాసుడు ఆధ్యాత్మిక ఆహారాన్ని తగినవేళ అందిస్తూ లక్షలాదిమంది “పురాతన మార్గములు” తెలుసుకొని దేవునితో నడిచేందుకు సహాయం చేశాడు. (మత్తయి 24:45-47) ఆ లక్షలాదిమందిలో మీరూ ఉన్నారా? అట్లయితే, మీరు కొట్టుకుపోయి మీ సొంత విధానం అనుసరించేందుకు మరలకుండా ఉండడానికి మీరేమి చేయవచ్చు? అప్పుడప్పుడు ఆగి జీవితంలో మీరెలా నడుస్తున్నారో పరీక్షించుకోవడం జ్ఞానయుక్తం. మీరు బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను నమ్మకంగా చదువుతూ, నేటి అభిషిక్తులు మద్దతిస్తున్న ఉపదేశ కార్యక్రమాలకు హాజరవుతుంటే, దేవునితో నడిచేందుకు మీరు శిక్షణ పొందుతున్నవారిగా ఉంటారు. ఆ తర్వాత మీకు ఇవ్వబడుతున్న ఉపదేశాన్ని వినయంతో అన్వయించుకున్నప్పుడు, మీరు నిజంగా “పురాతన మార్గములు” అనుసరిస్తూ దేవునితో నడుస్తున్నవారిగా ఉంటారు.

“అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు” నడుచుకోండి

14 మనం యెహోవాతో నడవాలంటే ఆయన మనకు వాస్తవమైన వ్యక్తిగా ఉండాలి. యెహోవా తాను దాగిలేనని నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులకు హామీ ఇచ్చాడని గుర్తుంచుకోండి. నేడు, ఆయన అదే విధంగా తన ప్రజలకు మహోపదేశకునిగా తననుతాను వెల్లడి చేసుకుంటున్నాడు. మీకు ఉపదేశమిచ్చేందుకు మీ ఎదుటే నిలబడి ఉన్నట్లు యెహోవా మీకు వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడా? మనం దేవునితో నడవాలంటే అలాంటి విశ్వాసమే మనకుండాలి. మోషేకు అలాంటి విశ్వాసం ఉంది, ఎందుకంటే “అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” నడుచుకున్నాడు. (హెబ్రీయులు 11:27) యెహోవా మనకు వాస్తవమైన వ్యక్తిగా ఉంటే, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమాయన భావాలను పరిగణలోకి తీసుకుంటాం. ఉదాహరణకు, తప్పు చేసి ఆ తర్వాత మన పాపాలను క్రైస్తవ పెద్దలకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచేందుకు ప్రయత్నించాలని కూడా ఆలోచించం. బదులుగా, తోటివారెవరూ మనల్ని గమనించని సమయంలో కూడా దేవునితో నడిచేందుకు మనం కృషి చేస్తాం. పూర్వకాల రాజైన దావీదులాగే మనమూ ఇలా తీర్మానించుకుంటాం: “నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును.”​—⁠కీర్తన 101:⁠2.

15 మనం అపరిపూర్ణ మానవులమనీ, శరీరులమనీ, చూడలేనివాటిని నమ్మడం మనకు కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చనీ యెహోవా అర్థం చేసుకుంటాడు. (కీర్తన 103:14) అలాంటి బలహీనతల్ని అధిగమించేలా మనకు సహాయం చేయడానికి ఆయనెంతో చేస్తున్నాడు. ఉదాహరణకు, ఆయన భూమ్మీది సమస్త దేశాలనుండి “తన నామముకొరకు ఒక జనమును” సమకూర్చుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 15:14) మనం ఐకమత్యంతో కలిసి సేవ చేస్తుండగా, పరస్పరం బలం పుంజుకుంటాం. ఏదైనా ఒక బలహీనతను అధిగమించేందుకు లేదా ఏదైనా కష్టమైన పరీక్షను తట్టుకునేందుకు ఎవరైనా ఆధ్యాత్మిక సహోదరునికి లేదా సహోదరికి యెహోవా ఎలా సహాయం చేశాడో విన్నప్పుడు, దేవుడు మనకు మరింత వాస్తవమైన వ్యక్తిగా ఉంటాడు.​—⁠1 పేతురు 5:9.

16 అన్నింటికంటే మిన్నగా యెహోవా తన కుమారుణ్ణి మనకు మాదిరిగా పంపించాడు. యేసు ఇలా అన్నాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” (యోహాను 14:6) యేసు భూమ్మీది జీవన విధానాన్ని అధ్యయనం చేయడం యెహోవాను వాస్తవమైన వ్యక్తిగా చేసే అత్యుత్తమ మార్గాల్లో ఒకటి. యేసు చెప్పిన, చేసిన ప్రతీది ఆయన పరలోక తండ్రి వ్యక్తిత్వాన్ని, మార్గాల్ని పరిపూర్ణంగా ప్రతిబింబించింది. (యోహాను 14:9) మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అలాంటి వాటితో యేసు ఎలా వ్యవహరించి ఉండేవాడని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన నిర్ణయాలు అలాంటి సునిశిత ప్రార్థనాపూర్వక ఆలోచనను ప్రతిబింబించినప్పుడు మనం క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నవారిగా ఉంటాం. (1 పేతురు 2:​21) ఫలితంగా మనం దేవునితో నడుస్తాం.

ఫలితంగా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

17 యెహోవా దేవునితో నడవడమంటే సంతృప్తికరమైన జీవితం గడపడమే. ‘మేలు కలిగే మార్గాన్ని’ వెదకడం గురించి యెహోవా తన ప్రజలకు ఏమి వాగ్దానం చేశాడో గుర్తుచేసుకోండి. ఆయనిలా అన్నాడు: “అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.” (యిర్మీయా 6:16) “నెమ్మది” అంటే సుఖభోగాలతో నిండిన జీవితమని అర్థమా? కాదు. దానికన్నా మరెంతో శ్రేష్ఠమైనది, మానవుల్లో అత్యధిక సంపన్నులకు చాలా అరుదుగా లభించేది యెహోవా మనకు దయచేస్తాడు. నెమ్మది పొందడం అంటే మనశ్శాంతి, ఆనందం, సంతృప్తి, ఆధ్యాత్మిక సాఫల్యం పొందడమే. అలాంటి నెమ్మది కారణంగా మీరు జీవితంలో అత్యుత్తమ జీవన మార్గాన్ని ఎంచుకున్నారనే నమ్మకంతో ఉండవచ్చు. అలాంటి ప్రశాంత మనస్సు సమస్యాత్మకమైన ఈ లోకంలో అరుదుగా లభించే ఆశీర్వాదం.

18 నిజానికి, జీవితమే ఓ గొప్ప ఆశీర్వాదం. అసలు జీవితమే లేని పరిస్థితికన్నా, కొంత జీవితమైనా ఉండడం మేలు. అయితే మీ జీవనయాత్ర కేవలం ఉరకలువేసే యౌవనం నుండి వృద్ధాప్యం వరకు మాత్రమే సాగే స్వల్పకాల ప్రయాణమై ఉండాలని యెహోవా ఎన్నడూ ఉద్దేశించలేదు. మీకు అత్యుత్తమ ఆశీర్వాదం లభించాలని యెహోవా కోరుతున్నాడు. మీరు నిత్యమూ తనతో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు! ఇది మీకా 4:5లో చక్కగా ఇలా వ్యక్తపరచబడింది: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” అలాంటి ఆశీర్వాదం మీకు దక్కాలని మీరు కోరుకుంటారా? యెహోవా “వాస్తవమైన జీవము” అని ఆకర్షణీయంగా పిలుస్తున్న దాన్ని పొందాలని మీరు కోరుకుంటారా? (1 తిమోతి 6:​18) అట్లయితే నేడు, రేపు, ఆ తర్వాత యుగయుగములు ప్రతీరోజు యెహోవాతో నడిచేందుకు దృఢంగా తీర్మానించుకోండి!

[అధస్సూచి]

^ పేరా 8 కొన్ని బైబిలు అనువాదాలు ఈ వచనంలోని “మూర”ను కాలాన్ని కొలిచే “ఘడియ”గా (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) లేదా “ఒక నిమిషము”గా (ఛార్లెస్‌ బి. విలియమ్స్‌ అనువదించిన ఎ ట్రాన్స్‌లేషన్‌ ఇన్‌ ద లాంగ్వేజ్‌ ఆఫ్‌ ద పీపుల్‌) మార్చాయి. అయితే మూలగ్రంథంలో ఉపయోగించబడిన పదానికి ఖచ్చితంగా, దాదాపు 45 సెంటీ మీటర్ల పొడవుండే మూర అనే అర్థం.

మీరెలా జవాబిస్తారు?

దేవునితో నడవడమంటే అర్థమేమిటి?

దేవునితో నడవాల్సిన అవసరముందని మీరెందుకు భావిస్తారు?

దేవునితో నడిచేందుకు మీకేది సహాయం చేస్తుంది?

దేవునితో నడిచేవారికి ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మనపట్ల యెహోవాకున్న భావాలను, పిల్లవానికి నడక నేర్పించే తండ్రి భావాలతో ఎలా పోల్చవచ్చు?

3, 4. (ఎ) దేవునితో నడవడాన్ని గురించిన వర్ణనలో గమనార్హమైన విషయమేమిటి? (బి) దేవునితో నడవడమంటే అర్థమేమిటి?

5. యేసు ఒక వ్యక్తి జీవితానికి మూరను చేర్చడం గురించి ఎందుకు మాట్లాడాడు?

6, 7. అపరిపూర్ణ మానవులకు తప్పకుండా అవసరమైనది ఏమిటి, ఆ అవసరం తీరేందుకు మనమెందుకు యెహోవా సహాయం కోసం చూడాలి?

8. పాప మరణాలు సహజంగానే మానవులను ఎక్కడికి నడిపిస్తాయి, అయినప్పటికీ యెహోవా మనం ఏమి పొందాలని కోరుకుంటున్నాడు?

9. యెహోవా కొన్నిసార్లు తన ప్రజలనుండి ఎందుకు దాగి ఉన్నాడు, అయినప్పటికీ యెషయా 30:⁠20 ప్రకారం ఆయన వారికి ఎలాంటి అభయమిస్తున్నాడు?

10. ఏ భావంలో మీరు మీ మహోపదేశకుని ద్వారా “వెనుకనుండి యొక శబ్దము” వింటారు?

11. యిర్మీయా 6:⁠16 ప్రకారం, యెహోవా తన ప్రజలకు ఎలాంటి ఆకర్షణీయమైన వర్ణన ఇచ్చాడు, అయితే వారు ఎలా స్పందించారు?

12, 13. (ఎ) యిర్మీయా 6:16లోని ఉపదేశానికి క్రీస్తు అభిషిక్త అనుచరులు ఎలా స్పందించారు? (బి) మనం నేడు నడుస్తున్న విధానం గురించి మనల్ని మనం ఎలా పరీక్షించుకోవచ్చు?

14. యెహోవా మనకు వాస్తవమైన వ్యక్తిగా ఉంటే, మనం తీసుకునే వ్యక్తిగత నిర్ణయాల్లో అదెలా ప్రతిబింబిస్తుంది?

15. మన క్రైస్తవ సహోదర సహోదరీలతో సహవసించడం యెహోవాను వాస్తవమైన వ్యక్తిగా దృష్టించేందుకు మనకెలా సహాయం చేస్తుంది?

16. యేసు గురించి తెలుసుకోవడం దేవునితో నడిచేందుకు మనకెలా సహాయం చేస్తుంది?

17. మనం యెహోవా మార్గంలో నడిచినప్పుడు మనకు ఎలాంటి “నెమ్మది” లభిస్తుంది?

18. మీకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు, మీ నిర్ణయం ఏమిటి?

[23వ పేజీలోని చిత్రాలు]

“ఇదే త్రోవ” అనే యెహోవా స్వరాన్ని బైబిలు పుటల ద్వారా మనం మన వెనుకనుండి వింటాం

[25వ పేజీలోని చిత్రం]

కూటాల్లో మనకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం లభిస్తుంది