రెండవ దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
రెండవ దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు
ఇశ్రాయేలీయులపై సొలొమోను రాజు పరిపాలన గురించిన వర్ణనతో రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఆరంభమవుతుంది. బబులోను చెరలోవున్న యూదులతో పారసీక రాజైన కోరెషు పలికిన ఈ మాటలతో ఆ గ్రంథం ముగుస్తుంది: “ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు [యెరూషలేముకు] బయలుదేరవచ్చును.” (2 దినవృత్తాంతములు 36:23) సా.శ.పూ. 460లో యాజకుడైన ఎజ్రా పూర్తిచేసిన ఈ గ్రంథం, 500 సంవత్సరాల చరిత్రను అంటే సా.శ.పూ. 1037 నుండి సా.శ.పూ. 537 వరకు జరిగిన సంఘటనలను వివరిస్తోంది.
కోరెషు ఇచ్చిన ఆజ్ఞతో యూదులు యెరూషలేముకు తిరిగివచ్చి అక్కడ యెహోవా ఆరాధనను పునఃస్థాపించడం సాధ్యమైంది. అయితే, బబులోను చెరలో ఎక్కువకాలం ఉండడం వారిపై తీవ్ర ప్రభావం చూపించింది. తిరిగివచ్చిన నిర్వాసితులకు తమ జనాంగపు చరిత్ర తెలియదు. రెండవ దినవృత్తాంతములు దావీదు రాజవంశపు రాజుల పాలనలో జరిగిన సంఘటనలను క్లుప్తంగా వివరిస్తోంది. ఆ కథనం మనకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే, అది సత్యదేవునికి విధేయత చూపించడంవల్ల కలిగే ఆశీర్వాదాలను, అవిధేయత చూపించడంవల్ల కలిగే పర్యవసానాలను నొక్కి చెబుతోంది.
ఒక రాజు యెహోవాకు ఆలయం నిర్మించడం
యెహోవా సొలొమోను రాజు హృదయ విన్నపాన్ని మన్నించి ఆయనకు జ్ఞానమును, తెలివినే కాక, ఐశ్వర్యమును, ఘనతను కూడా అనుగ్రహించాడు. రాజు యెరూషలేములో యెహోవాకు మహాద్భుతమైన మందిరం నిర్మించగా ప్రజలు ‘సంతోషించి మనోత్సాహం’ పొందారు. (2 దినవృత్తాంతములు 7:10) “రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.”—2 దినవృత్తాంతములు 9:22.
ఇశ్రాయేలుపై 40 సంవత్సరాలు పాలించిన తర్వాత, ‘సొలొమోను తన పితరులతోకూడా నిద్రించగా అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము 2 దినవృత్తాంతములు 9:31) సొలొమోను సత్యారాధన నుండి వైదొలగడం గురించి ఎజ్రా వ్రాయలేదు. రాజుకు సంబంధించిన ప్రతికూల అంశాల్లో, అవివేకంగా ఐగుప్తు నుండి అనేక గుర్రాలను సమకూర్చుకోవడం, ఫరో కుమార్తెను వివాహం చేసుకోవడం మాత్రమే ప్రస్తావించబడ్డాయి. ఆ విధంగా దినవృత్తాంతములు వ్రాసిన ఎజ్రా, నిర్మాణాత్మక కోణం నుండే విషయాలను వివరించాడు.
రాజయ్యాడు.’ (లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
2:14—ఇక్కడ వివరించబడిన పనివాని వంశావళి, 1 రాజులు 7:14లో ఉన్నదానికి ఎందుకు భిన్నంగా ఉంది? మొదటి రాజులు ఆ పనివాని తల్లి “నఫ్తాలిగోత్రపు విధవరాలు” అని సూచిస్తోంది, ఎందుకంటే ఆమె ఆ గోత్రపు వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఆమె దాను గోత్రం నుండి వచ్చింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత, ఆమె తూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది, ఆ పనివాడు ఈ వివాహంవల్ల కలిగిన సంతానమే.
2:18; 8:10—ఈ వచనాలు 3,600తోపాటు 250 మంది పనివారిపై అధిపతులుగా నియమించబడ్డారు అని చెబుతుండగా, 1 రాజులు 5:16; 9:23 3,300తోపాటు 550 మంది నియమించబడ్డారు అని చెబుతోంది. ఈ సంఖ్య ఎందుకు భిన్నంగా ఉంది? ఆ అధిపతులు వర్గీకరించబడిన విధానం కారణంగా ఆ భేదమున్నట్లు కనిపిస్తోంది. రెండవ దినవృత్తాంతములు 3,600 మంది ఇశ్రాయేలేతర అధిపతుల్ని, 250 మంది ఇశ్రాయేలీయ అధిపతుల్ని విడివిడిగా సూచిస్తుండగా, మొదటి రాజులు 3,300 మంది పర్యవేక్షకులను, 550 మంది ఉన్నత శ్రేణి ప్రధాన పర్యవేక్షకులను సూచిస్తుండవచ్చు. ఏదేమైనా, అధిపతులుగా పనిచేసినవారి మొత్తం సంఖ్య 3,850.
4:2-4—పోతపోసిన సముద్రపు తొట్టి అడుగున ఎద్దుల రూపాలు ఎందుకు ఉంచబడ్డాయి? లేఖనాల్లో ఎద్దులు బలానికి సూచనగా ఉన్నాయి. (యెహెజ్కేలు 1:10; ప్రకటన 4:6, 7) ఎద్దుల రూపాలు ఉంచడం సరైనదే, ఎందుకంటే ఆ 12 ఇత్తడి ఎద్దులు దాదాపు 30 టన్నుల బరువున్న ఆ పెద్ద ‘సముద్రానికి’ ఆధారంగా నిలిచాయి. ఈ ఉద్దేశంతో చేయబడిన ఆ ఎద్దులు ఆరాధనా విగ్రహాలను నిషేధించిన రెండవ ఆజ్ఞను ఏ మాత్రం ఉల్లంఘించలేదు.—నిర్గమకాండము 20:4, 5.
4:5—పోతపోసిన ఆ సముద్రంలో ఎంత నీరు నిల్వ చేయవచ్చు? ఆ సముద్రంలో నీళ్ళు పూర్తిగా నింపితే ముప్పది పుట్లు లేదా దాదాపు 66,000 లీటర్ల నీరు నిల్వ చేయవచ్చు. అయితే దాని సాధారణ నీటి స్థాయి బహుశా దాని సామర్థ్యంలో మూడింట రెండువంతులు ఉండవచ్చు. మొదటి రాజులు 7:26 ఇలా చెబుతోంది: “అది [ఆ సముద్రములో] తొమ్మిది గరిసెలు [44,000 లీటర్లు] పట్టును.”
5:4, 5, 10—తొలి ఆలయగుడారపు ఏ సామగ్రి సొలొమోను దేవాలయంలో భాగమయ్యాయి? తొలి గుడారపు వస్తువుల్లో ఒక్క మందసం మాత్రమే సొలొమోను ఆలయంలో ఉంచబడింది. దేవాలయ నిర్మాణం తర్వాత, ఆలయగుడారం గిబియోను నుండి యెరూషలేముకు తరలించబడి బహుశా అక్కడే ఉంచబడింది.—2 దినవృత్తాంతములు 1:3, 4.
మనకు పాఠాలు:
1:11, 12. సొలొమోను చేసిన విన్నపం జ్ఞానం, తెలివి సంపాదించుకోవడమే ఆ రాజు హృదయపూర్వక కోరిక అని యెహోవాకు చూపించింది. దేవునికి మనం చేసే ప్రార్థనలు నిజానికి మన హృదయపూర్వక కోరిక ఏమిటో వెల్లడిస్తాయి. మన ప్రార్థనాంశాలు ఏమిటో విశ్లేషించుకోవడం జ్ఞానయుక్తం.
6:4. యెహోవా ప్రేమపూర్వక దయ, మంచితనంపట్ల మన హృదయపూర్వక కృతజ్ఞత యెహోవాను సన్నుతించడానికి అంటే ప్రేమతో, కృతజ్ఞతా భావంతో ఆయనను స్తుతించేలా మనల్ని ప్రేరేపించాలి.
6:18-21. దేవుడు ఏ భవనంలోనూ నివసించకపోయినా, ఆ దేవాలయం యెహోవా ఆరాధనా కేంద్రంగా పనిచేసింది. నేడు యెహోవాసాక్షుల రాజ్య మందిరాలు సమాజపు సత్యారాధనా కేంద్రాలుగా ఉన్నాయి.
6:19, 22, 32. యెహోవా తనకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వారందరి ప్రార్థనలను అంటే రాజు మొదలుకొని ఆ జనాంగంలోని అల్పుడు చేసే ప్రార్థనల వరకు, చివరికి పరదేశి చేసే ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. *—కీర్తన 65:2.
దావీదు రాజవంశంలో వరసగా వచ్చిన రాజులు
(2 దినవృత్తాంతములు 10:1-36:23)
ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యం రెండుగా అంటే పది గోత్రాల ఉత్తర రాజ్యంగా, దక్షిణాన యూదా, బెన్యామీను గోత్రాలతో రెండు గోత్రాల రాజ్యంగా విడిపోయింది.
ఇశ్రాయేలు దేశమంతటి యాజకులు, లేవీయులు జాతీయ యథార్థతకన్నా రాజ్య నిబంధనకు కట్టుబడి సొలొమోను కుమారుడైన రెహబాము పక్షం వహిస్తారు. దేవాలయ నిర్మాణం పూర్తై 30 సంవత్సరాల కొద్దికాలం తర్వాత, ఆలయ ఖజానా దోపిడీకి గురయ్యింది.రెహబాము తర్వాత పరిపాలించిన 19 మంది రాజుల్లో ఐదుగురు నమ్మకస్థులుగా ఉన్నారు, ముగ్గురు ఆరంభంలో నమ్మకంగావున్నా ఆ తర్వాత అవిశ్వాసులయ్యారు, ఒకరు తన తప్పుడు ప్రవర్తన మార్చుకున్నాడు. మిగతా పరిపాలకులు యెహోవా దృష్టిలో చెడ్డపనులే చేశారు. * యెహోవాపై నమ్మకముంచిన ఐదుగురు రాజుల కార్యకలాపాలు నొక్కిచెప్పబడ్డాయి. హిజ్కియా ఆలయ సేవలను పునరుద్ధరించడం గురించిన, యోషీయా భారీగా ఏర్పాటు చేసిన పస్కా గురించిన వృత్తాంతాలు యెరూషలేములో యెహోవా ఆరాధనను పునఃస్థాపించడంలో ఆసక్తి చూపిన యూదులను ఎంతో ప్రోత్సహించి ఉండవచ్చు.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
13:5, అధస్సూచి—“ఉప్పు నిబంధన” అనే మాటకు అర్థమేమిటి? పాడవకుండా ఉంచే దాని గుణాల కారణంగా ఉప్పు శాశ్వతత్వానికీ, మారని గుణానికి సూచనగా ఉంది. కాబట్టి “ఉప్పు నిబంధన” భంగము కాజాలని ఒప్పందాన్ని సూచిస్తోంది.
14:2-5; 15:17—రాజైన ఆసా “ఉన్నతస్థలములను” అన్నింటిని తొలగించాడా? ఆయన అలా తొలగించలేదని స్పష్టమవుతోంది. ఆసా అబద్ధ దేవతల ఆరాధనకు సంబంధించిన ఉన్నతస్థలాలను మాత్రమే తొలగించి ఉండవచ్చు, గానీ ప్రజలు యెహోవాను ఆరాధించిన ఉన్నతస్థలాలను తొలగించి ఉండకపోవచ్చు. ఆసా పరిపాలనలో ఆ తర్వాతి కాలాల్లో ఆ ఉన్నతస్థలాలు మళ్లీ నిర్మించబడి ఉండవచ్చు. వీటిని ఆయన కుమారుడైన యెహోషాపాతు తొలగించాడు. నిజానికి యెహోషాపాతు పరిపాలనలో కూడా ఆ ఉన్నతస్థలాలు పూర్తిగా నాశనం కాలేదు.—2 దినవృత్తాంతములు 17:5, 6; 20:31-33.
15:9; 34:6—ఇశ్రాయేలు రాజ్యపు విభజనకు సంబంధించి షిమ్యోను గోత్రపు స్థానమేమిటి? యూదాలో వివిధ ప్రాంతాలను స్వాస్థ్యంగా పొందిన కారణంగా షిమ్యోను గోత్రం భౌగోళికంగా యూదా, బెన్యామీను గోత్రాల రాజ్యంలో ఉంది. (యెహోషువ 19:1) అయితే మతపరంగా, రాజకీయపరంగా ఆ గోత్రం ఉత్తర రాజ్యంతోనే పొత్తుపెట్టుకుంది. (1 రాజులు 11:30-33; 12:20-24) కాబట్టి, షిమ్యోను పది గోత్రాల రాజ్యంతోనే లెక్కించబడింది.
16:13, 14—నూతనలోక అనువాదం ప్రకారం, ఆసా శవం దహించబడిందా? లేదు. నూతనలోక అనువాదం ప్రకారం ‘బహు విస్తారమైన దహన సంస్కారం’ అనే మాటలు ఆసా శవదహనాన్ని కాదు గానీ సుగంధ ద్రవ్యాలు దహించడాన్ని సూచిస్తున్నాయి.
35:3—యోషీయా పరిశుద్ధమైన మందసాన్ని ఎక్కడనుండి ఆలయంలోకి తెచ్చాడు? ఆ మందసాన్ని దుష్టుడైన రాజు ఎవరైనా తొలగించారా లేక ఆలయాన్ని విస్తృత మరమ్మతు చేసిన సమయంలో యోషీయా దానిని వేరే స్థలంలో ఉంచాడా అనే విషయం బైబిలు చెప్పడం లేదు. సొలొమోను కాలం తర్వాత, మందసానికి సంబంధించిన ఒకేఒక చారిత్రక ప్రస్తావన యోషీయా దానిని ఆలయంలోకి తెచ్చినప్పుడు మాత్రమే ఉంది.
మనకు పాఠాలు:
13:13-18; 14:11, 12; 32:9-23. యెహోవాపై ఆధారపడడానికున్న ప్రాముఖ్యత గురించి మనమెంత చక్కని పాఠం నేర్చుకోగలమో కదా!
16:1-5, 7; 18:1-3, 28-32; 21:4-6; 22:10-12; 28:16-22. పరదేశులతో లేదా అవిశ్వాసులతో బంధుత్వాలు ఏర్పరచుకోవడం విషాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. లోకంతో అనవసరమైన సంబంధాలన్నిటి నుండి మనం దూరంగా ఉండడం జ్ఞానయుక్తం.—యోహాను 17:14, 16; యాకోబు 4:4.
16:7-12; 26:16-21; 32:25, 26. ఆసా తన జీవిత చరమాంకంలో చెడుగా ప్రవర్తించేందుకు అహంకారమే కారణం. అహంకార స్వభావం ఉజ్జియా పతనానికి దారితీసింది. బబులోను దూతలకు తన ఖజానా చూపించి హిజ్కియా అజ్ఞానంగా బహుశా గర్వంగా ప్రవర్తించాడు. (యెషయా 39:1-7) “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని బైబిలు హెచ్చరిస్తోంది.—సామెతలు 16:18.
16:9. తనపట్ల సంపూర్ణ హృదయం గలవారికి యెహోవా సహాయం చేస్తాడు, వారిపక్షాన తన బలాన్ని ఉపయోగించడానికి ఆయన ఆతురతతో ఉన్నాడు.
18:12, 13, 23, 24, 27. మీకాయాలాగే మనమూ యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి నిర్భయంగా, ధైర్యంగా మాట్లాడాలి.
19:1-3. మనమాయనకు కోపం తెప్పించిన సమయాల్లో కూడా యెహోవా మనలోని మంచి కోసం చూస్తాడు.
20:1-28. నిర్దేశం కోసం మనం యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన తనకు తానుగా మనకు అందుబాటులో ఉంటాడనే దృఢనమ్మకంతో ఉండవచ్చు.—20:17. “యెహోవా దయచేయు రక్షణను” చూసేందుకు, దేవుని రాజ్యానికి మద్దతుగా మనం ‘నిలబడాలి.’ పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకునే బదులు యెహోవాపై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించాలి.
24:17-19; 25:14. యోవాషుకు ఆయన కుమారుడైన అమజ్యాకు విగ్రహారాధన ఒక ఉరిగా ఉన్నట్లు నిరూపించబడింది. నేడు కూడా, విగ్రహారాధన దురాశ లేదా జాతీయవాదం రూపంలో ఉన్నప్పుడు అది అంతే బలంగా తప్పుదోవ పట్టించవచ్చు.—కొలొస్సయులు 3:5; ప్రకటన 13:4.
32:6, 7. “దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొని” ఆధ్యాత్మిక యుద్ధం చేస్తుండగా మనం కూడా నిర్భయంగా, స్థిరంగా ఉండవచ్చు.—ఎఫెసీయులు 6:11-18.
33:2-9, 12, 13, 15, 16. చెడు మార్గాన్ని విసర్జించి, సరైనది చేయడానికి దృఢసంకల్పంతో ప్రయత్నించడం ద్వారా ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపిస్తాడు. మనష్షే రాజంత చెడ్డగా ప్రవర్తించిన వ్యక్తి సహితం నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించడంద్వారా యెహోవా కరుణను చవిచూడగలడు.
34:1-3. బాల్యదశలోని ప్రతికూల పరిస్థితులేవీ దేవుణ్ణి తెలుసుకొని, ఆయనను సేవించకుండా మనల్ని అడ్డగించనవసరం లేదు. యోషీయా బాల్యాన్ని పశ్చాత్తాపపడిన తన తాతయైన మనష్షే చూపిన అనుకూల స్వభావం ప్రభావితం చేసివుండవచ్చు. యోషీయాపై ప్రభావం చూపించిన అనుకూల స్వభావాలు ఏవైనప్పటికీ, అవి చివరకు సత్ఫలితాలిచ్చాయి. మన విషయంలోనూ అలాగే జరగవచ్చు.
36:15-17. యెహోవా కటాక్షముగలవాడు, సహనశీలి. అయితే ఆయన కరుణకు, సహనానికి హద్దుల్లేవని కాదు. యెహోవా ఈ దుష్ట విధానాన్ని అంతం చేసినప్పుడు ప్రజలు తమ ప్రాణాలు దక్కించుకోవాలంటే వారు రాజ్య ప్రకటనా పనికి అనుకూలంగా స్పందించాలి.
36:17, 22, 23. యెహోవా వాక్కు ఎల్లప్పుడూ నిజమవుతుంది.—1 రాజులు 9:7, 8; యిర్మీయా 25:9-11.
ఒక గ్రంథం క్రియాత్మక చర్య తీసుకునేలా ఆయనను ప్రేరేపించింది
“యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను” అని 2 దినవృత్తాంతములు 34:33 చెబుతోంది. యోషీయా ఇలా చేసేందుకు ఆయనను ప్రేరేపించిందేమిటి? శాస్త్రియగు షాఫాను క్రొత్తగా లభించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజైన యోషీయా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, రాజు దానిని బిగ్గరగా చదివే ఏర్పాటు చేశాడు. తాను విన్న విషయాలనుబట్టి యోషీయా ఎంతగా కదిలించబడ్డాడంటే, ఆయన ఆసక్తిగా తన జీవితమంతా స్వచ్ఛారాధనను పురోగమింపజేశాడు.
దేవుని వాక్యాన్ని చదవడం, చదివిన దానిని ధ్యానించడం మనపై ప్రగాఢమైన ప్రభావం చూపించగలదు. దావీదు రాజవంశపు రాజుల వృత్తాంతాలు ధ్యానించడం యెహోవాను ఆశ్రయించినవారి ఆదర్శాన్ని అనుకరిస్తూ, ఆయనను ఆశ్రయించని వారి ప్రవర్తనను విసర్జించేలా మనల్ని ప్రోత్సహించదా? సత్యదేవునిపట్ల సంపూర్ణ భక్తిని ప్రదర్శిస్తూ ఆయనపట్ల విశ్వసనీయంగా ఉండేందుకు రెండవ దినవృత్తాంతములు మనల్ని పురికొల్పుతుంది. దాని సందేశం నిశ్చయంగా సజీవమై బలముగలదై ఉంది.—హెబ్రీయులు 4:12.
[అధస్సూచీలు]
^ పేరా 19 దేవాలయ ప్రతిష్ఠాపనకు సంబంధించిన ప్రశ్నల కోసం, ఆ సందర్భంలో సొలొమోను చేసిన ప్రార్థన నుండి నేర్చుకోగల ఇతర పాఠాల కోసం కావలికోట, జూలై 1, 2005 28-31 పేజీలు చూడండి.
^ పేరా 23 యూదా రాజుల కాలవృత్తాంత పట్టిక కోసం కావలికోట ఆగస్టు 1, 2005 12వ పేజీ చూడండి.
[18వ పేజీలోని చిత్రం]
పోతపోసిన సముద్రపు అడుగునవున్న ఎద్దుల రూపాలు ఎందుకు సముచితమైనవో మీకు తెలుసా?
[21వ పేజీలోని చిత్రాలు]
బాల్యంలో యోషీయాకు పరిమిత సహాయమే లభించినప్పటికీ, ఆయన యెహోవాకు నమ్మకమైన వ్యక్తిగా ఎదిగాడు