ఎనిమిదిమంది పిల్లలను యెహోవా మార్గాల్లో పెంచడం కష్టమైనా ఆనందదాయకం
జీవిత కథ
ఎనిమిదిమంది పిల్లలను యెహోవా మార్గాల్లో పెంచడం కష్టమైనా ఆనందదాయకం
జాసిలిన్ వాలెంటిన్ చెప్పినది
నా భర్త 1989లో ఉద్యోగరీత్యా వేరే దేశానికి వెళ్లాడు. మా ఎనిమిదిమంది పిల్లలను చూసుకోవడానికి ఇంటికి డబ్బు పంపిస్తానని వాగ్దానం చేశాడు. వారాలు గడిచిపోతున్నాయి, ఆయన దగ్గర నుండి ఏ సమాచారమూ లేదు. నెలలు గడిచిపోయాయి, అయినా నా భర్తనుండి సమాచారమేమీ అందలేదు. ‘పరిస్థితి మెరుగైనవెంటనే ఇంటికి వచ్చేస్తాడని’ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను.
కుటుంబాన్ని పోషించకోవడానికి డబ్బు లేకపోవడంతో నేను చాలా నిరాశకు లోనయ్యాను. నిద్రపట్టని అనేక రాత్రులు ‘ఆయన తన కుటుంబంపట్ల ఇలా ఎలా చేయగలడు?’ అని అపనమ్మకంతో నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చివరకు, నా భర్త మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడనే కఠోర వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లి ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలైంది, ఆయనింకా తిరిగిరాలేదు. ఫలితంగా, భాగస్వామి లేకుండానే నేను నా పిల్లల్ని పెంచాను. ఇది కష్టమైన పనే, కానీ నా పిల్లలు యెహోవా మార్గాలకు హత్తుకోవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అయితే ఒక కుటుంబంగా మేమెలా గడిపామో వివరించడానికి ముందు, నేను పెరిగిన తీరును ముందుగా నన్ను మీకు చెప్పనివ్వండి.
బైబిలు నిర్దేశం కోసం అన్వేషించడం
నేను 1938లో కరీబియన్ ద్వీపమైన జమైకాలో జన్మించాను. మా నాన్న చర్చి సభ్యునిగా లేకపోయినా, తాను భక్తిపరుడనని ఆయన తలంచేవాడు. ఆయన రాత్రిపూట తరచూ కీర్తనల గ్రంథము నుండి చదివి వినిపించమని
నన్ను కోరేవాడు. అలా నాకు అనతికాలంలోనే వాటిలోని చాలా కీర్తనలు కంఠస్థం వచ్చేశాయి. అమ్మ స్థానిక చర్చిలో సభ్యురాలిగా ఉండి అప్పుడప్పుడు నన్ను చర్చికి తీసుకెళ్లేది.దేవుడు మంచివాళ్లను పరలోకానికి తీసుకెళ్లి చెడ్డవాళ్లను నరకంలో నిత్యం బాధిస్తాడని అక్కడ మాకు చెప్పబడేది. యేసు దేవుడనీ, పిల్లలను ఆయన ప్రేమిస్తాడని కూడా మాకు చెప్పబడేది. నాకు చాలా తికమకగా ఉండి దేవుడంటే భయమేసేది. ‘మనల్ని ప్రేమించే దేవుడు ప్రజల్ని అగ్నిలో ఎలా బాధిస్తాడు?’ అని ఆలోచించాను.
నరకాగ్ని అనే ఆలోచనే నన్ను భయకంపితురాల్ని చేసేది. త్వరలోనే నేను సెవెంత్డే అడ్వెంటిస్ట్ చర్చివాళ్లు నిర్వహిస్తున్న బైబిలు కరస్పాండెంట్ కోర్సు తీసుకున్నాను. దుష్టులు నిత్యమూ బాధించబడరు గానీ, అగ్నిలో బూడిదయ్యేంతగా కాల్చబడతారని వారు బోధించారు. ఇది సహేతుకంగా అనిపించి నేను వారి కూటాలకు హాజరవడం ప్రారంభించాను. అయితే వారి బోధలు తికమకపెట్టడమే కాక, నేను నేర్చుకున్నవి నైతికత్వం విషయంలో నా తప్పుడు దృక్కోణాన్ని సరిదిద్దలేదు.
అప్పట్లో, ప్రజలు సాధారణంగా జారత్వం తప్పు అని అంగీకరించేవారు. కానీ నేను, ఇంకా చాలామంది, అనేకులతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు మాత్రమే వ్యభిచారులని నమ్మేవాళ్లం. కాబట్టి, లైంగిక చర్యలను తమకు మాత్రమే పరిమితం చేసుకునే ఇద్దరు అవివాహితులు పాపం చేయడం లేదని అనుకునేవాళ్లం. (1 కొరింథీయులు 6:9, 10; హెబ్రీయులు 13:4) ఆ నమ్మకమే నన్ను అవివాహితగా ఉండగానే ఆరుగురు పిల్లల తల్లినయ్యేలా చేసింది.
అధ్యాత్మిక పురోగతి సాధించడం
వాసిలిన్ గుడిసెన్, ఈథెల్ ఛాంబర్స్ 1965లో బాత్కు సమీపంగావున్న సమాజంలో నివసించడానికి వచ్చారు. వారు పయినీర్లు లేదా యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులు, వాళ్లు ఒకరోజు మా నాన్నతో మాట్లాడారు. వాళ్లు ప్రతిపాదించిన గృహ బైబిలు అధ్యయనానికి ఆయన ఒప్పుకున్నారు. వాళ్లు సందర్శించినప్పుడు నేను ఇంటిదగ్గర ఉంటే, వాళ్లు నాతోకూడా మాట్లాడేవారు. నేను యెహోవాసాక్షులను ఎక్కువగా అనుమానించినా, వారు తప్పని నిరూపించాలని వారితో బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను.
అధ్యయన సమయంలో నేను చాలా ప్రశ్నలు అడిగాను, వాటన్నిటికీ ఆ సాక్షులు బైబిలును ఉపయోగిస్తూ జవాబు చెప్పారు. వారి సహాయంతో నేను, చనిపోయినవారు స్పృహలో ఉండరనీ, నరకంలో బాధించబడరనీ కనుగొన్నాను. (ప్రసంగి 9:5, 10) పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణ గురించి కూడా నేను తెలుసుకున్నాను. (కీర్తన 37:11, 29; ప్రకటన 21:3, 4) మా నాన్న బైబిలు అధ్యయనం చేయడం మానేసినప్పటికీ, నేను యెహోవాసాక్షుల స్థానిక సంఘ కూటాలకు హాజరవడం ఆరంభించాను. ప్రశాంతంగా, క్రమపద్ధతిలో నిర్వహించబడే ఆ కూటాలు యెహోవా గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకునేలా చేశాయి. సాక్షులు నిర్వహించే పెద్ద కూటాలైన ప్రాంతీయ, జిల్లా సమావేశాలకు కూడా హాజరయ్యాను. బైబిలును ఈ విధంగా తెలుసుకోవడం యెహోవాను ఆమోదయోగ్యంగా ఆరాధించాలనే బలమైన కోరికను నాలో వృద్ధిచేసింది. అయితే నాకొక ఆటంకముంది.
ఆ సమయంలో నేను నా ఆరుగురి పిల్లల్లో ముగ్గురికి తండ్రిగావున్న వ్యక్తితో వివాహేతర జీవితం గడుపుతున్నాను. వివాహేతర లైంగిక సంబంధాలను దేవుడు ఖండిస్తున్నాడని బైబిలు నుండి తెలుసుకోవడంతో నా మనస్సాక్షి బాధించడం మొదలుపెట్టింది. (సామెతలు 5:15-20; గలతీయులు 5:19) సత్యంపట్ల నా ప్రేమ ప్రగాఢమవుతున్నకొద్దీ, దేవుని నియమానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డాను. చివరకు నేను నిర్ణయించుకొని, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడమో లేదా సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడమో చేయాలని నేను కలిసి జీవిస్తున్న సహవాసికి చెప్పాను. నా సహవాసి నా నమ్మకాలు పంచుకోకపోయినా, 1970 ఆగస్టు 15న అంటే సాక్షులు మొదట నాతో మాట్లాడిన ఐదు సంవత్సరాల తర్వాత, మేము అధికారికంగా పెళ్లిచేసుకున్నాం. నా సమర్పణకు సూచనగా నేను 1970 డిసెంబరులో బాప్తిస్మం తీసుకున్నాను.
పరిచర్య విషయానికొస్తే, ప్రకటనా పనిలో నేను భాగం వహించిన మొదటి రోజును నేనెన్నటికీ మర్చిపోను. నాకు చాలా భయమేసింది, బైబిలు సంభాషణ ఎలా ఆరంభించాలో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే, మొదటి గృహస్థుడు మా సంభాషణకు త్వరగా అడ్డుకట్ట వేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. అయితే కాసేపట్లోనే నా పిరికితనం తొలగిపోయింది. బైబిలు గురించి చాలామందితో క్లుప్తంగా మాట్లాడి, వారికి మన బైబిలు సాహిత్యాల్లో కొన్ని ఇవ్వగలిగినందుకు ఆ రోజు సాయంకాలం నేనెంతో ఆనందించాను.
కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచడం
మా కుటుంబంలో 1977 నాటికి ఎనిమిదిమంది పిల్లలు తయారయ్యారు. మా కుటుంబం యెహోవాను సేవించేలా సహాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. (యెహోషువ 24:15) అందుకోసం నేను క్రమంగా కుటుంబ బైబిలు అధ్యయనం నిర్వహించేందుకు ఎంతో కృషి చేశాను. కొన్నిసార్లు పిల్లలు బిగ్గరగా పేరా చదువుతున్న సమయంలో, అలసట కారణంగా నిద్రపోయేదాన్ని, పిల్లలు నన్ను లేపేవారు. అయితే శారీరక అలసట మా కుటుంబ అధ్యయనాన్ని ఎన్నడూ అడ్డుకోలేదు.
నేను తరచూ పిల్లలతో కలిసి ప్రార్థించేదాన్ని. వారు కాస్త పెద్దవారైనప్పుడు, సొంతగా యెహోవాకు ప్రార్థించడం వారికి నేర్పించాను. రాత్రి పడుకునేటప్పుడు వారు తప్పక వ్యక్తిగత ప్రార్థన చేసుకునేలా చూసేదాన్ని. ప్రార్థన చేయలేనంత చిన్నగావున్న పిల్లలతో నేను విడివిడిగా ఒక్కొక్కరితో ప్రార్థించేదాన్ని.
పిల్లలను కూటాలకు తీసుకెళ్లడాన్ని మొదట నా భర్త వ్యతిరేకించాడు. అయితే నేను కూటాలకు వెళ్లినప్పుడు పిల్లలను తనే చూసుకోవాలనే ఆలోచన అతని వ్యతిరేకతను తగ్గించింది. పొద్దుపోయిన తర్వాత బయటకువెళ్లి, తన స్నేహితులను చూసి రావడాన్ని ఆయన ఇష్టపడేవారు, అయితే ఎనిమిదిమంది పిల్లలతో అలావెళ్లడం ఆయనకు ఇష్టమయ్యేది కాదు. ఆ తర్వాత, రాజ్యమందిరానికి వెళ్లేందుకు పిల్లలను తయారు చేయడంలో ఆయన నాకు సాయపడడం కూడా మొదలుపెట్టారు.
అనతికాలంలోనే పిల్లలకు సంఘ కూటాలన్నింటికీ హాజరవడం, బహిరంగ పరిచర్యలో భాగం వహించడం అలవాటయ్యింది. వేసవి సెలవుల్లో వారు తరచూ సంఘంలోని పయినీర్లతో లేదా పూర్తికాల పరిచారకులతో కలిసి ప్రకటనా పనికి వెళ్లేవారు. ఇది సంఘంపట్ల, ప్రకటనా పనిపట్ల నా పిల్లలు హృదయపూర్వక ప్రేమను వృద్ధి చేసుకోవడానికి దోహదపడింది.—మత్తయి 24:14.
పరీక్షా సమయాలు
కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, నా భర్త ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఆరంభించాడు. ఆయన దీర్ఘకాలాలపాటు కుటుంబానికి దూరంగా ఉండేవాడు, కానీ ఆయా సందర్భాల్లో క్రమంగా ఇంటికి వచ్చేవాడు. అయితే 1989లో ఆయన వెళ్లి, మళ్లీ తిరిగిరాలేదు. నేను ముందు చెప్పినట్లుగా, భర్తలేని లోటు నన్ను బాగా కృంగదీసింది. చాలా రాత్రులు నేను కన్నీరుమున్నీరుగా ఏడ్చి, ఓదార్పుకోసం, ఓర్పుకోసం యెహోవాకు తీవ్రంగా మొరపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థనలు ఆలకించాడనే భావన నాలో కలిగింది. యెషయా 54:4; వంటి లేఖనాలు నాకు మనశ్శాంతినీ, జీవితంలో ముందుకువెళ్లే శక్తినీ ఇచ్చాయి. అంతేకాక, క్రైస్తవ సంఘంలోని బంధువులు, స్నేహితులు కూడా నాకు మానసికంగా, వస్తుపరంగా చేయూతనిచ్చారు. చేసిన సహాయానికి నేను యెహోవాకు, ఆయన ప్రజలకు ఎంతో కృతజ్ఞురాలిని. 1 కొరింథీయులు 7:15
మాకు ఇతర పరీక్షలు కూడా ఎదురయ్యాయి. ఒకసారి మా అమ్మాయిల్లో ఒకరు లేఖనరహిత ప్రవర్తన కారణంగా సంఘం నుండి తొలగించబడింది. నేను నా పిల్లలందరినీ ఎంతో ప్రేమిస్తాను, అయితే యెహోవాపట్ల విశ్వసనీయతే నాకు ప్రథమం. కాబట్టి ఆ సమయంలో, నేనూ, ఇతర పిల్లలూ బహిష్కృత వ్యక్తులతో వ్యవహరించే విషయంలో బైబిలు నిర్దేశాన్ని ఖచ్చితంగా పాటించాం. (1 కొరింథీయులు 5:11, 13) మా స్థానాన్ని అర్థం చేసుకోని ప్రజలనుండి మేము తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాం. అయితే మా అమ్మాయి సంఘంతో తిరిగి చేర్చుకోబడిన తర్వాత, బైబిలు సూత్రాల విషయంలో మేము స్థిరంగా నిలబడడం తనను ముగ్ధుణ్ణి చేసిందని ఆమె భర్త నాతో అన్నాడు. ఆయనిప్పుడు తన కుటుంబంతో కలిసి యెహోవాను సేవిస్తున్నాడు.
ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవడం
నా భర్త మమ్మల్ని వదిలి వెళ్లినప్పుడు, నాకు స్థిరమైన ఆదాయం లేదు, కుటుంబం ఆయన నుండి ఆర్థిక మద్దతు పొందడంలేదు. ఈ పరిస్థితి నిరాడంబర జీవితంతో సంతృప్తి పొందడాన్నీ, భౌతిక ధనంకన్నా ఆధ్యాత్మిక ధనాన్నే విలువైనదిగా పరిగణించడాన్నీ నేర్పింది. పిల్లలు పరస్పరం ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకుంటుండగా, వారు మరింత సన్నిహితమయ్యారు. పెద్దవాళ్లు పనిచేయడం ఆరంభించినప్పుడు, చిన్నవారైన తమ తోబుట్టువులకు ఇష్టపూర్వకంగా మద్దతిచ్చారు. మా పెద్దమ్మాయి మార్సిరి తన ఆఖరు చెల్లెలైన నికోల్ ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేయడానికి సహాయం చేసింది. దానికితోడు నేను ఓ చిన్న కిరాణా దుకాణం నడిపేదాన్ని. కొద్దిపాటి ఆదాయం మా భౌతికావసరాలు తీర్చుకోవడానికి నాకు సహాయం చేసింది.
యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒకసారి మా ఆర్థిక పరిస్థితులనుబట్టి మేము జిల్లా సమావేశానికి హాజరవడం కుదరకపోవచ్చని ఒక క్రైస్తవ సహోదరితో అన్నాను. అందుకామే “సిస్టర్ వాల్, సమావేశం గురించి విన్నప్పుడు మీరు ప్రయాణానికి సిద్ధపడడం ఆరంభించాలి! యెహోవా సహాయం చేస్తాడు” అని బదులిచ్చింది. నేనామె సలహా అనుసరించాను. యెహోవా సహాయం చేశాడు, ఆయనింకా సహాయం చేస్తూనే ఉన్నాడు. డబ్బు సరిపడని కారణంగా మేమెప్పుడూ ఏ సమావేశానికీ వెళ్ళకుండా ఉండలేదు.
గిల్బర్ట్ తుఫాను 1988లో జమైకాను కుదిపేయడంతో మేము మా ఇల్లువదలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాం. తుఫాను తగ్గుముఖం పట్టినప్పుడు నేనూ, మా అబ్బాయి ఆ సురక్షిత ప్రాంతం నుండి కూలిపోయిన మా ఇంటిని చూద్దామని అక్కడికొచ్చాం. చుట్టూ కలియజూస్తుండగా నేను జాగ్రత్తగా దాచుకోవాలని ఇష్టపడిన వస్తువు ఒకటి కనిపించింది. మళ్లీ అకస్మాత్తుగా పెనుగాలులు వీచడం ఆరంభించాయి, నేను దాచుకోవాలనుకున్న ఆ వస్తువునే ఇంకా పట్టుకుని ఉన్నాను. “మమ్మీ నువ్వు లోతు భార్యవా? ఆ టీవీని అక్కడే వదిలేయ్.” (లూకా 17:31, 32) నా కుమారుడు అన్న ఆ మాటలతో నాకు తెలివచ్చినట్లయింది. దానితో, తడిసి ముద్దయిన ఆ టీవీని అక్కడే పడేసి, మేమిద్దరం సురక్షిత ప్రాంతానికి పరుగెత్తాం.
ఒక టీవీ కోసం నా ప్రాణాన్నే ప్రమాదంలో పడేసుకున్న ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటే నాకిప్పటికీ వణుకుపుడుతుంది. అయితే ఆ సందర్భంలో, ఆధ్యాత్మిక అప్రమత్తతతో మా అబ్బాయి పలికిన ఆ మాటల గురించి ఆలోచించినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. క్రైస్తవ సంఘం నుండి ఆయన పొందిన బైబిలు శిక్షణ కారణంగానే ఆయన, ప్రమాదకరమైన శారీరక బహుశా ఆధ్యాత్మిక హానికి దూరంగా ఉండేందుకు నాకు సహాయం చేయగలిగాడు.
ఆ తుఫాను మా ఇంటిని, వస్తువుల్ని నాశనం చేయడమే కాక, మమ్మల్నీ కృంగదీసింది. అప్పుడే మా క్రైస్తవ సహోదరులు వచ్చారు. యెహోవామీది నమ్మకంతో ఆ నష్టాన్ని తాళుకుని, పరిచర్యలో కొనసాగమని ప్రోత్సహించి, మా ఇంటిని తిరిగి నిర్మించుకునేందుకు సహాయం చేశారు. జమైకా నుండి, మరితర దేశాలనుండి వచ్చిన సాక్షులైన స్వచ్ఛంద సేవకుల ప్రేమపూర్వక స్వయంత్యాగ సేవ మాపై ప్రగాఢమైన ముద్రవేసింది.
యెహోవాకు ప్రథమ స్థానమివ్వడం
మా రెండవ అమ్మాయి మెలాన్ తన విద్య పూర్తయిన తర్వాత, పయినీరు పరిచారకురాలిగా సేవచేసింది. ఆ తర్వాత, ఆమె తన ఉద్యోగం మానేసి, మరో సంఘంలో పయినీరుగా సేవ చేసేందుకు లభించిన ఆహ్వానాన్ని అంగీకరించింది. ఆ ఉద్యోగం మా కుటుంబానికి తగిన ఆర్థిక మద్దతు ఇచ్చేదైనా, మాలో ప్రతీ ఒక్కరూ రాజ్యాసక్తికి ప్రథమస్థానమిస్తే యెహోవా మాపట్ల శ్రద్ధ చూపిస్తాడని గట్టిగా నమ్మాం. (మత్తయి 6:33) ఆ తర్వాత మా అబ్బాయి యూయెన్ కూడా పయినీరుగా సేవచేసే ఆహ్వానం అందుకున్నాడు. ఆయన కుటుంబానికి ఆర్థిక మద్దతునిస్తున్నాడు, అయినా ఆ ఆహ్వానం అందుకొమ్మని మేమే ఆయనను పురికొల్పి, యెహోవా ఆశీర్వాదం ఉండాలనే శుభాకాంక్షలు తెలిపాం. నా పిల్లలు రాజ్యసేవను విస్తృతంగా చేసే విషయంలో నేనెప్పుడూ వారిని నిరుత్సాహపరచలేదు, అలాగని ఇంటిదగ్గరుండిపోయిన మేము ఏ కొదువా అనుభవించలేదు. బదులుగా, మా ఆనందం రెట్టింపు కావడమే కాక, కొన్నిసార్లు ఇతరులకు వారి అవసరాల్లో సహాయం కూడా చేయగలిగాం.
నేడు నా పిల్లలు ‘సత్యాన్ని అనుసరించి నడుచుకోవడాన్ని’ చూడడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. (3 యోహాను 4) మా అమ్మాయి మెలాన్, ప్రయాణ పైవిచారణకర్తగా ఉన్న తన భర్తతోపాటు ప్రయాణ పరిచర్యలో పాల్గొంటోంది. ఇంకో అమ్మాయి ఆండ్రియె, ఆమె భర్త ప్రత్యేక పయినీర్లుగా పనిచేస్తూ, ఆయన ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా సంఘాలను సందర్శించేటప్పుడు ఆయనతోపాటు వెళ్తుంటుంది. మా అబ్బాయి యూయెన్ ఆయన భార్య ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నారు, ఆయన ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. మరో అమ్మాయి ఎవెగా, తన భర్తతోపాటు జమైకా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తోంది. జెనీఫర్, జెనీవ్, నికోల్ తమ భర్తలు, పిల్లలతోపాటు సేవచేస్తూ వారివారి సంఘాల్లో క్రియాశీలంగా ఉన్నారు. మార్సెరీ ఇప్పుడు నాతో ఉంది, మేమిద్దరం పోర్ట్ మెరెంట్ సంఘానికి హాజరవుతున్నాం. నాకు లభించిన ఆశీర్వాదాలు గొప్పవి, ఎందుకంటే నా ఎనిమిదిమంది పిల్లలూ యెహోవాను ఆరాధిస్తున్నారు.
గడిచేకాలం నాకు ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టింది. నేనిప్పుడు కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను, అయినా పయినీరుగా సేవ చేయడంలో ఇంకా ఆనందిస్తున్నాను. అయితే కొద్దికాలం క్రితం, మేము నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని గుట్టల్లో నడవడం నాకు చాలా కష్టమైంది. పరిచర్యకు వెళ్లడం నాకు కష్టమైంది. సైకిల్ ఉపయోగించాను, అది నడవడంకన్నా సులభంగా ఉన్నట్లు నాకు తోచింది. దానితో నేను ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని దానిని ఉపయోగించడం ప్రారంభించాను. మొదట్లో నా పిల్లలు కీళ్లనొప్పులతో వాళ్లమ్మ సైకిల్ త్రొక్కడం చూసి బాధపడ్డారు. అయితే నేను కోరుకున్నట్లుగా, ప్రకటనా పనిలో కొనసాగడం చూసి వారెంతో సంతోషించారు.
నేను అధ్యయనం చేసిన ప్రజలు బైబిలు సత్యాన్ని హత్తుకోవడాన్ని చూడడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. నా కుటుంబంలోని వారందరూ ఈ అంత్యకాలంలోనే కాక, నిరంతరం నమ్మకంగా ఉండేలా వారికి సహాయం చేయమని నేను యెహోవాను ప్రార్థిస్తున్నాను. నా ఎనిమిదిమంది పిల్లలను ఆయన మార్గాల్లో పెంచే సవాలును ఎదుర్కొనే శక్తినిచ్చినందుకు “ప్రార్థన ఆలకించే” మహాగొప్ప యెహోవాకు నా స్తుతులు, కృతజ్ఞతలు.—కీర్తన 65:2.
[10వ పేజీలోని చిత్రం]
నా పిల్లలు వారి భాగస్వాములు, మనవలు మనవరాళ్లు
[12వ పేజీలోని చిత్రం]
నా పరిచర్య కొనసాగించడానికి నేనిప్పుడు సైకిలు ఉపయోగిస్తున్నాను