“నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండండి
“నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండండి
“జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామెతలు 14:15.
ప్రాంతాన్ని ఎన్నుకునే అవకాశాన్ని అబ్రాహాము మొదట లోతుకు ఇచ్చినప్పుడు, లోతు దృష్టి నీటి పారుదలతో “యెహోవా తోటవలె” ఉన్న ప్రాంతంపై పడింది. “లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని” సొదొమ సమీపంలో తన గుడారము వేసుకున్నాడు కాబట్టి, తన కుటుంబం స్థిరపడేందుకు అది ఆయనకు అనువైన ప్రాంతంగా అనిపించి ఉండవచ్చు. అయితే పైకి ఆకర్షణీయంగా కనిపించినవి మోసకరమైనవని తేలింది, ఎందుకంటే అక్కడికి దగ్గరి ప్రాంతంలో నివసించిన “సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.” (ఆదికాండము 13:7-13) ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలవల్ల లోతు, ఆయన కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించింది. చివరకు, గతిలేక ఆయనా, ఆయన కుమార్తెలూ ఒక గుహలో నివసించాల్సివచ్చింది. (ఆదికాండము 19:17, 23-26, 30) మొదట్లో ఎంతో చక్కగా కనిపించిన పరిస్థితి చివరకు పూర్తి విరుద్ధంగా తయారైంది.
2 లోతుకు ఎదురైన పరిస్థితికి సంబంధించిన వృత్తాంతం నేటి దేవుని సేవకులకు ఒక పాఠాన్ని అందిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనకెదురవగల అపాయాల విషయంలో అప్రమత్తంగా ఉండడమే కాక, మనకు మొదట్లోనే కలిగే అభిప్రాయాలచేత మోసపోకుండా కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి, “నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండమని దేవుని వాక్యం మనల్ని పురికొల్పడం యుక్తమైనదే. (1 పేతురు 1:13) ఇక్కడ “నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండడమని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “జాగ్రత్తగా ఆలోచించండి” అని భావం. బైబిలు విద్వాంసుడైన ఆర్.సి.హెచ్. లెన్స్కీ చెబుతున్నదాని ప్రకారం, జాగ్రత్తగా ఆలోచించడమంటే, “విషయాలను సరైన రీతిలో ఆచితూచి, అంచనావేస్తూ మనం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడే నిశ్చలమైన, స్థిరమైన మనస్సు కలిగివుండడం.” మనమలా జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులను మనం పరిశీలిద్దాం.
వ్యాపార అవకాశాన్ని ఆచితూచి చూడడం
3 ఓ గౌరవప్రదమైన వ్యక్తి, బహుశా తోటి యెహోవా ఆరాధకుడు మీకొక వ్యాపార అవకాశాన్ని ప్రతిపాదించాడనుకుందాం. దాని విజయావకాశాల విషయంలో ఆయన మంచి ఉత్సాహం చూపిస్తూ, అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉండేందుకు వెంటనే ఏదో ఒకటి చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. మీకది ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయమిచ్చేందుకు సహాయపడుతుందని కూడా ఆలోచిస్తూ, అది బహుశా మీకు, మీ కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందిస్తుందని ఆశించడం ఆరంభించవచ్చు. అయితే సామెతలు 14:15 ఇలా హెచ్చరిస్తోంది: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” క్రొత్త వ్యాపారం ఆరంభిస్తున్నప్పుడు ఉండే ఉత్సాహంలో, పెట్టుబడులవల్ల కలిగే నష్టాల గురించి తక్కువగా అంచనావేయవచ్చు, ప్రమాదాలను పరిగణలోకి తీసుకోకపోవచ్చు, వ్యాపారంలో జరిగే నష్టాల గురించి పూర్తిగా ఆలోచించకపోవచ్చు. (యాకోబు 4:13, 14) అలాంటి పరిస్థితిలో మీరు నిబ్బరమైన బుద్ధిగలవారై ఉండడం ఎంత అవసరమో కదా!
4 జ్ఞానియైన వ్యక్తి ఓ నిర్ణయం తీసుకునేముందు ఆ వ్యాపార ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. (సామెతలు 21:5) అలాంటి పరిశీలన తరచూ దాగివున్న ప్రమాదాలను వెలికితీస్తుంది. ఈ క్రింది పరిస్థితిని ఆలోచించండి: ఒక వ్యక్తి తన వ్యాపార పథకానికి సంబంధించి మీ దగ్గర అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ, మీరు తనకు నిధులిస్తే మీకు భారీ లాభం ముట్టజెబుతానని ప్రతిపాదిస్తున్నాడు. ఆ ప్రతిపాదన ఆశాజనకంగా ఉండవచ్చు, కానీ ప్రమాదాల మాటేమిటి? అప్పుతీసుకున్న ఆ వ్యక్తి వ్యాపారం ఎలా నడిచినా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాడా లేక డబ్బు తిరిగి చెల్లించడం వ్యాపార విజయావకాశాలపై ఆధారపడివుందా? మరొక విధంగా చెప్పాలంటే, వ్యాపారం దివాలాతీస్తే మీరు డబ్బు పోగొట్టుకునే ప్రమాదముందా? మీరిలా కూడా ప్రశ్నించుకోవచ్చు: “ఆ వ్యక్తి వివిధ వ్యక్తుల నుండి డబ్బు తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? బ్యాంకులు ఆ వ్యాపారంలో పెట్టుబడిని ప్రమాదకరమైనదిగా దృష్టిస్తున్నాయా?” పెట్టుబడిలో ఉన్న ప్రమాదాలను పరిశీలించేందుకు సమయం తీసుకోవడం ఆ ప్రతిపాదనను వాస్తవిక దృక్పథంతో అంచనా వేసేందుకు మీకు సహాయం చేయగలదు.—సామెతలు 13:16; 22:3.
5 ప్రవక్తయైన యిర్మీయా తోటి యెహోవా ఆరాధకుడైన తన సమీపజ్ఞాతి నుండి పొలం కొంటున్నప్పుడు సాక్షుల ఎదుట క్రయపత్రం వ్రాయించాడు. (యిర్మీయా 32:9-12) నేడు కూడా జ్ఞానియైన వ్యక్తి, తన బంధువులతో, తోటి విశ్వాసులతో చేసే వ్యాపారాలతోపాటు తన ఇతర వ్యాపార వ్యవహారాలన్నింటినీ విస్పష్టమైన లిఖితపూర్వక ఒప్పందం రూపంలో ఉండేలా చూసుకుంటాడు. * స్పష్టంగా, సరిగా వ్రాసిన లిఖితపూర్వక దస్తావేజులను కలిగివుండడం అపార్థాలను నివారించి ఐక్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దానికి భిన్నంగా, యెహోవా సేవకుల మధ్య తలెత్తే వ్యాపార సమస్యలకు, లిఖితపూర్వక ఒప్పందం లేకపోవడమే కొంతమేరకు కారణమవుతోంది. అలాంటి సమస్యలు గుండెకోతకు, పగకు, చివరకు ఆధ్యాత్మికత కోల్పోవడానికి కారణమవడం శోచనీయం.
6 పేరాశ విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. (లూకా 12:15) భారీ లాభాల వాగ్దానం, అసురక్షిత వ్యాపార ప్రమాదాల విషయంలో గ్రుడ్డితనం కలుగజేస్తుంది. యెహోవా సేవలో చక్కని ఆధిక్యతలను ఆనందించిన కొందరు సహితం ఈ ఉరిలో చిక్కుకున్నారు. దేవుని వాక్యం మనల్నిలా హెచ్చరిస్తోంది: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.” (హెబ్రీయులు 13:5) ఏ వ్యాపార అవకాశం గురించైనా ఆలోచిస్తున్నప్పుడు, ఒక క్రైస్తవుడు ఇలా పరిశీలించుకోవాలి, ‘అందులో చేరడం నిజంగా అవసరమా?’ యెహోవా ఆరాధనే కేంద్రంగావున్న నిరాడంబర జీవితం గడపడం మనల్ని “సమస్తమైన కీడుల” నుండి కాపాడుతుంది.—1 తిమోతి 6:6-10.
అవివాహిత క్రైస్తవులకు ఎదురయ్యే సవాళ్లు
7 యెహోవా సేవకుల్లో చాలామంది పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అయితే వారికింకా సరైన జత లభించివుండకపోవచ్చు. కొన్ని దేశాల్లో, పెళ్లి చేసుకోవాలనే బలమైన సామాజిక ఒత్తిడివుంది. అయినా, తోటి విశ్వాసుల మధ్య తగిన జతను కనుగొనే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. (సామెతలు 13:12) అయితే, “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలనే బైబిలు ఆజ్ఞను లక్ష్యపెట్టడాన్ని యెహోవాపట్ల విశ్వసనీయతా అంశంగా క్రైస్తవులు గుర్తిస్తారు. (1 కొరింథీయులు 7:39) వారెదుర్కొనే ఒత్తిళ్లకు, శోధనలకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడేందుకు అవివాహిత క్రైస్తవులు నిబ్బరమైన బుద్ధిగలవారై ఉండాలి.
8 పరమగీతములో, షూలమ్మీతీ అనే సాధారణ పల్లెటూరి అమ్మాయి రాజు దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె అప్పటికే మరో యువకుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ, రాజు తన విస్తారమైన సంపద, హోదా, ఆభరణాల ఆశచూపిస్తూ ఆమె వెంటపడతాడు. (పరమగీతము 1:9-11; 3:7-10; 6:8-10, 13) మీరొక క్రైస్తవ స్త్రీ అయితే, మీకిష్టం లేకపోయినా ఇతరులు మీపై అనవసర శ్రద్ధ చూపించే అవకాశముంది. మీ ఉద్యోగస్థలంలో అధికార హోదాలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకుంటూ మాట్లాడడం, మీకు సహాయం చేయడం ఆరంభించి మీతో గడిపే అవకాశాల కోసం చూస్తుండవచ్చు. అలాంటి అనుచిత శ్రద్ధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తి ఉద్దేశాలు ఎల్లప్పుడూ కాకపోయినా చాలా సందర్భాల్లో ప్రణయాత్మకంగా లేక దుర్నీతికరంగా ఉండవచ్చు. కన్యయైన షూలమ్మీతీవలే ‘ప్రాకారంలా’ ఉండండి. (పరమగీతము 8:4, 10) ప్రణయాత్మక భావాలతో సమీపిస్తే దానిని స్థిరంగా తిరస్కరించండి. మీరొక యెహోవాసాక్షి అని ఆరంభం నుండే మీ తోటి ఉద్యోగస్థులకు తెలియజేయడమే కాక, వారికి సాక్ష్యమిచ్చేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీకు రక్షణగా ఉంటుంది.
9 అవివాహితులు తమకు వివాహ జతను కనుగొనేందుకు సహాయపడడానికి రూపొందించబడిన ఇంటర్నెట్ వెబ్‌సైట్లు ప్రజాదరణ పొందుతున్నాయి. తాము మరోవిధంగా కలుసుకోలేని ప్రజలను తెలుసుకునే మార్గంగా కొందరు వీటిని దృష్టిస్తున్నారు. అయితే, ఒక అపరిచిత వ్యక్తితో గ్రుడ్డిగా సంబంధమేర్పరచుకోవడంలో నిజమైన ప్రమాదాలు పొంచివున్నాయి. ఇంటర్నెట్‌లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం. (కీర్తన 26:4) యెహోవా సేవకుణ్ణని చెప్పుకునే ప్రతీ వ్యక్తి నిజానికి అలాంటివారు కాకపోవచ్చు. అంతేకాక, ఆన్‌లైన్ డేటింగ్‌తో బలమైన సంబంధం త్వరగా వృద్ధికావడమే కాక, అది ఒక వ్యక్తి విచక్షణా జ్ఞానాన్ని తీవ్రంగా ప్రభావితం కూడా చేయవచ్చు. (సామెతలు 28:26) ఇంటర్నెట్ ద్వారా గానీ, మరితర మాధ్యమాల ద్వారా గానీ తనకు బొత్తిగా పరిచయంలేని వ్యక్తితో సన్నిహిత సంబంధం పెంపొందించుకోవడం అవివేకం.—1 కొరింథీయులు 15:33.
10 యెహోవాకు తన సేవకులపట్ల ‘ఎంతో కనికరము’ ఉంది. (యాకోబు 5:11) పరిస్థితులనుబట్టి అవివాహితులుగానే ఉండిపోయిన క్రైస్తవులు ఎదుర్కొనే సవాళ్లు కొన్నిసార్లు వారికి నిరుత్సాహం కలిగిస్తాయని ఆయనకు తెలియడమే కాక, ఆయన వారి యథార్థతను విలువైనదిగా పరిగణిస్తాడు. ఇతరులు వారినెలా ప్రోత్సహించవచ్చు? వారి విధేయతనుబట్టి, స్వయంత్యాగ స్ఫూర్తినిబట్టి మనం వారిని ఎప్పటికప్పుడు మెచ్చుకోవాలి. (న్యాయాధిపతులు 11:39, 40) క్షేమాభివృద్ధికరమైన సహవాసం కోసం మనం చేసుకునే ఏర్పాట్లలో వారిని కూడా చేర్చుకోవచ్చు. మీరు ఈ మధ్య ఎప్పుడైనా అలా చేశారా? అంతేకాదు, వారు తమ ఆధ్యాత్మిక సమతూకాన్ని కాపాడుకుంటూ, ఆనందంగా ఆయన సేవ చేసేందుకు సహాయం చేయమని అర్థిస్తూ మనం యెహోవాకు ప్రార్థన చేయవచ్చు. మనమీ యథార్థపరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించడం ద్వారా యెహోవాలాగే మనమూ వారిని విలువైనవారిగా పరిగణించుదము గాక.—కీర్తన 37:28.
ఆరోగ్య సమస్యలతో వ్యవహరించడం
11 మనం లేదా మన ప్రియమైనవారు తీవ్ర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం ఎంత కృంగదీసేదిగా ఉంటుందో కదా! (యెషయా 38:1-3) సమర్థమైన చికిత్సకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, మనం లేఖన సూత్రాలకు హత్తుకొని ఉండడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు, రక్తాన్ని విసర్జించమనే బైబిలు ఆజ్ఞకు లోబడే విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండడమే కాక, అభిచార సంబంధమైన ఎలాంటి రోగనిర్ధారణా పద్ధతికైనా లేదా చికిత్సా విధానానికైనా దూరంగా ఉంటారు. (అపొస్తలుల కార్యములు 15:28, 29; గలతీయులు 5:19-21) అయితే వైద్య శిక్షణ లేనివారికి చికిత్సా విధానాల్ని ఎంపిక చేసుకోవడం కలవరపెట్టేదిగా, భయం కలిగించేదిగా ఉండగలదు. మనం నిబ్బరమైన బుద్ధిగలవారమై ఉండేందుకు మనకు ఏమి సహాయం చేయగలదు?
12 బైబిలును, క్రైస్తవ సాహిత్యాలను పరిశోధించడం ద్వారా “వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) వైద్యులు, ఆసుపత్రులు తక్కువగావున్న భూమ్మీది కొన్ని ప్రాంతాల్లో మూలికా వైద్యమే అందుబాటులోవున్న ఏకైక చికిత్సగా ఉండవచ్చు. అలాంటి చికిత్స గురించి మనమాలోచిస్తున్నప్పుడు, కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్ 15, 1987, 26-9 పేజీల్లో సహాయకరమైన సమాచారాన్ని కనుగొనవచ్చు. పొంచివున్న ప్రమాదాల విషయంలో అది మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. ఉదాహరణకు, మనమీ క్రింది విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది: సాంప్రదాయ వైద్యునికి అభిచారమభ్యసించే వ్యక్తిగా పేరుందా? రోగమరణాలు అభ్యంతరపడిన దేవతలవల్ల (లేదా పూర్వికుల ఆత్మలవల్ల) లేదా బాణామతి ప్రయోగించే శత్రువులవల్ల సంభవిస్తాయనే నమ్మకంపై ఆ చికిత్స ఆధారపడివుందా? మందు తయారీలో లేదా వాడకంలో బలులు అర్పించడం, మంత్రోచ్ఛారణ లేదా ఇతర అభిచార ఆచారాలు పాటించబడుతున్నాయా? (ద్వితీయోపదేశకాండము 18:10-12) అలాంటి పరిశోధన ఈ ప్రేరేపిత ఉపదేశాన్ని లక్ష్యపెట్టేందుకు మనకు సహాయం చేస్తుంది: “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.” * (1 థెస్సలొనీకయులు 5:21) అది మన సమతూకాన్ని కాపాడుకునేందుకు సహాయం చేస్తుంది.
13 మన శరీరారోగ్యంతోపాటు మన జీవితంలోని అన్ని రంగాల్లో సహేతుకత అవసరం. (ఫిలిప్పీయులు 4:5) మన ఆరోగ్యానికి సమతూకమైన శ్రద్ధనివ్వడం అమూల్యమైన జీవమనే బహుమానంపట్ల మనకున్న కృతజ్ఞతాభావాన్ని వెల్లడిస్తుంది. ఆరోగ్య సమస్యలు మనకు ఎదురైనప్పుడు, వాటిపట్ల మనం శ్రద్ధ చూపించాలి. అయితే, “జనములను స్వస్థపర[చే]” దేవుని సమయం వచ్చేంతవరకు మనం పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేము. (ప్రకటన 22:1, 2) మరి ప్రాముఖ్యమైన మన ఆధ్యాత్మిక అవసరాలు ప్రక్కకు నెట్టివేయబడేంతగా మన శరీరారోగ్యం విషయంలో తలమునకలవకుండా మనం జాగ్రత్తపడాలి.—మత్తయి 5:3; ఫిలిప్పీయులు 1:9-10.
14 ఆరోగ్య, వైద్య విషయాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం సమతూకాన్ని, సహేతుకతను ప్రదర్శించాలి. ఆధ్యాత్మిక సహవాసం కోసం క్రైస్తవ కూటాల్లో, సమావేశాల్లో కూడుకున్నప్పుడు మన సంభాషణల్లో ఈ అంశాలే ప్రధానంగా ఉండకూడదు. అంతేకాక, వైద్యపర నిర్ణయాల్లో తరచూ బైబిలు సూత్రాలు, ఒక వ్యక్తి మనస్సాక్షి, యెహోవాతో ఆయన సంబంధం ఇమిడివుంటాయి. కాబట్టి, మన అభిప్రాయాన్ని తోటి విశ్వాసిపై రుద్దడం లేదా తన మనస్సాక్షి చెప్పేది పట్టించుకోవద్దని ఒత్తిడి చేయడం ప్రేమరాహిత్యమే అవుతుంది. సహాయం కోసం సంఘంలోని పరిణతిగల వ్యక్తుల్ని సంప్రదించినా, నిర్ణయాలు తీసుకునే బాధ్యత విషయంలో ప్రతీ క్రైస్తవుడు “తన గలతీయులు 6:5; రోమీయులు 14:11-12, 22, 23.
బరువు తానే భరించుకొనవలెను,” “ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.”—మనం ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు
15 ఒత్తిడితో కూడిన పరిస్థితులు యెహోవా విశ్వసనీయ సేవకులను సహితం అవివేకంగా మాట్లాడేలా లేదా ప్రవర్తించేలా చేస్తాయి. (ప్రసంగి 7:7) తీవ్ర పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు, యోబు కొంతమేరకు సమతూకం కోల్పోయాడు, అప్పుడాయన ఆలోచనను సరిదిద్దాల్సి వచ్చింది. (యోబు 35:2, 3; 40:6-8) “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికు[నిగా]” ఉన్నప్పటికీ, ఒక సందర్భంలో ఆయన ఉద్రేకపడి కానివిధంగా అంటే అనాలోచితంగా మాట్లాడాడు. (సంఖ్యాకాండము 12:3; 20:7-12; కీర్తన 106:32, 33) రాజైన సౌలును సంహరించకుండా దావీదు ప్రశంసనీయమైన ఆశానిగ్రం చూపించాడు, అయితే నాబాలు ఆయనను అవమానించి, ఆయన మనుష్యులను తూలనాడినప్పుడు, దావీదుకు విపరీతమైన కోపంవచ్చి తన విచక్షణను కోల్పోయాడు. అబీగయీలు జోక్యం చేసుకొన్నప్పుడు మాత్రమే ఆయన మళ్లీ మామూలు మనిషై, ఘోర తప్పిదం చేయడం నుండి తృటిలో తప్పించుకున్నాడు.—1 సమూయేలు 24:2-7; 25:9-13, 32, 33.
16 మన విచక్షణను కోల్పోయేలా చేసే ఒత్తిడితోకూడిన పరిస్థితులను మనం కూడా ఎదుర్కోవచ్చు. దావీదులా ఇతరుల దృక్కోణాలను జాగ్రత్తగా పరిశీలించడం, మనం అనాలోచితంగా ప్రవర్తించి, త్వరపడి పాపానికి ఒడిగట్టకుండా ఉండేందుకు మనకు సహాయం చేయగలదు. (సామెతలు 19:2) అంతేకాక, దేవుని వాక్యం మనకిలా ఉద్బోధిస్తోంది: “భయమునొంది పాపముచేయకుడి. మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి.” (కీర్తన 4:4) చర్య తీసుకునే లేక నిర్ణయం తీసుకునేముందు సాధ్యమైనంత మేరకు మనం శాంతించేవరకు వేచివుండడం మంచిది. (సామెతలు 14:17, 29) మనం పట్టుదలతో యెహోవాకు ప్రార్థించవచ్చు, “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన [మన] హృదయములకును [మన] తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) దేవుడు అనుగ్రహించే ఈ ప్రశాంతత మనల్ని స్థిరపరచి, నిబ్బరమైన బుద్ధిగలవారమై ఉండేందుకు సహాయం చేస్తుంది.
17 ప్రమాదాలు తప్పించుకొని, జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు మనం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, మనమందరం తప్పులు చేస్తాం. (యాకోబు 3:2) మనకు ఏ మాత్రం తెలియకుండానే వినాశనకరమైన చర్యతీసుకునే అవకాశముంది. (కీర్తన 19:12, 13) అంతేకాక, మానవులుగా యెహోవాను విడిచిపెట్టి సొంతగా మార్గాన్ని ఏర్పర్చుకునే శక్తి గానీ, హక్కు గానీ మనకు లేవు. (యిర్మీయా 10:23) ఆయన ఇలా అభయమిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా: “నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” (కీర్తన 32:8) అవును, యెహోవా సహాయంతో మనం నిబ్బరమైన బుద్ధిగలవారిగా ఉండవచ్చు.
[అధస్సూచీలు]
^ పేరా 8 లిఖితపూర్వక వ్యాపార ఒప్పందాల గురించిన మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన కావలికోట ఆగస్టు 1, 1997, 30-1 పేజీలు; నవంబరు 15, 1986 (ఆంగ్లం) 16-17 పేజీలు; తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1983, 13-15 పేజీలు చూడండి.
^ పేరా 17 ఇలా పరిశోధించడం, ఒక నిర్దిష్ట వ్యాధికి చేయబడుతున్న వివాదాస్పద ప్రత్యమ్నాయ చికిత్సా పద్ధతుల గురించి ఆలోచిస్తున్నవారికి కూడా ప్రయోజనాన్నిస్తుంది.
మీరెలా జవాబిస్తారు?
ఈ క్రింది పరిస్థితుల్లో మనమెలా నిబ్బరమైన బుద్ధిగలవారమై ఉండవచ్చు:
•వ్యాపార అవకాశం ప్రతిపాదించబడినప్పుడు?
•వివాహ జత కోసం చూస్తున్నప్పుడు?
•ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు?
•ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) సొదొమలో లోతుకు ఎదురైన అనుభవం మనకేమి బోధిస్తోంది? (బి) “నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండడమంటే ఏమిటి?
3. వ్యాపార అవకాశం మనకు ప్రతిపాదించబడినప్పుడు, జాగ్రత్త వహించడం ఎందుకు అవసరం?
4. ఒక వ్యాపార ప్రతిపాదనను అంచనా వేసేటప్పుడు మనమెలా మన ‘నడతలను బాగుగా కనిపెట్టుకోవచ్చు’?
5. (ఎ) యిర్మీయా పొలం కొన్నప్పుడు, ఆయన ఎలాంటి జ్ఞానయుక్తమైన చర్య తీసుకున్నాడు? (బి) వ్యాపార ఏర్పాట్లన్నీ క్రమబద్ధమైన లిఖితపూర్వక ఒప్పందంలో ఉంచుకోవడం ఎందుకు ప్రయోజనకరం?
6. పేరాశ విషయంలో మనమెందుకు అప్రమత్తంగా ఉండాలి?
7. (ఎ) అనేకమంది అవివాహిత క్రైస్తవులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? (బి) వివాహజతను ఎంపిక చేసుకోవడంలో యెహోవాపట్ల విశ్వసనీయత ఎలా ఇమిడివుంది?
8. కన్యయైన షూలమ్మీతీ ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంది, నేటి క్రైస్తవ స్త్రీలు కూడా అలాంటి సవాలునే ఎలా ఎదుర్కోవచ్చు?
9. ఇంటర్నెట్‌లో ఒక అపరిచిత వ్యక్తితో సంబంధమేర్పర్చుకోవడంలో ఉన్న కొన్ని ప్రమాదాలేమిటి? (25వ పేజీలోని బాక్సు కూడా చూడండి.)
10. అవివాహిత క్రైస్తవులను తోటి విశ్వాసులు ఎలా ప్రోత్సహించవచ్చు?
11. తీవ్రమైన ఆరోగ్య సమస్యలవల్ల ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి?
12. చికిత్సా విధానాల ఎంపిక గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు తన సమతూకాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
13, 14. (ఎ) మన శరీరారోగ్యంపట్ల శ్రద్ధ వహించడంలో సహేతుకతను మనమెలా ప్రదర్శించవచ్చు? (బి) ఇతరులతో ఆరోగ్య, వైద్య విషయాల గురించి మాట్లాడేటప్పుడు సహేతుకత ఎందుకవసరం?
15. ఒత్తిడితో కూడిన పరిస్థితులు మనపై ఎలా ప్రభావం చూపించవచ్చు?
16. అనాలోచితంగా ప్రవర్తించకుండా ఏది మనకు సహాయపడగలదు?
17. నిబ్బరమైన బుద్ధిగలవారిగా ఉండేందుకు మనమెందుకు యెహోవాపై ఆధారపడాలి?
[25వ పేజీలోని బాక్సు]
మీరు దీనిని నమ్మగలరా?
బాధ్యతారహితమైన ఈ క్రింది వాక్యాలు అవివాహితుల కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లలో కనిపిస్తాయి:
“మేమెంత తీవ్రంగా కృషిచేసినా ఒక వ్యక్తి నిజ గుర్తింపు విషయంలో ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము.”
“దీనిలో అందజేయబడిన సమాచారానికి సంబంధించిన ప్రామాణికత్వానికి, సంపూర్ణతకు లేదా ప్రయోజనానికి మేము గ్యారంటీ ఇవ్వము.”
“ఈ సేవ ద్వారా లభ్యమయ్యే అభిప్రాయాలు, సలహాలు, వ్యాఖ్యానాలు, ప్రతిపాదనలు లేదా ఇతర సమాచారం లేదా విషయాలు ఆ యా రచయితలవే . . . వాటిని నమ్మాల్సిన అవసరం లేదు.”
[23వ పేజీలోని చిత్రం]
“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును”
[24, 25వ పేజీలోని చిత్రాలు]
క్రైస్తవ స్త్రీలు కన్యయైన షూలమ్మీతీ మాదిరిని ఎలా అనుకరించవచ్చు?
[26వ పేజీలోని చిత్రం]
“సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి”