“బధిరులు తప్పక వింటారు”
“బధిరులు తప్పక వింటారు”
“బధిరులు తప్పక వింటారు” అన్న మాటల్ని బధిరులు చదివినప్పుడు వారికి ఎలా అనిపిస్తుండవచ్చు? వారి హృదయాలు ఖచ్చితంగా కదిలించబడతాయి! పక్షుల కిలకిలలు, పిల్లల నవ్వులు, రాళ్ళకు తగిలే కెరటాల హోరు వంటివాటిని వినగలిగేవారు, వాటిని వినలేని పరిస్థితిని ఊహించుకోవడం కష్టం. అయినా, ప్రపంచంలో కోట్లాదిమంది పరిస్థితి అలాగే ఉంది. చెవిటివారు వినగలుగుతారన్న నిరీక్షణేదైనా నిజంగా ఉందా? చెవుడు గురించి, అది తీసివేయబడుతుందనే నిరీక్షణను గురించి బైబిలు ఏమి చెబుతోందో మనం చూద్దాం.
చెవుడు అనేది పరోక్షంగా లేదా పూర్తిగా వినలేకపోవడం. అది తరచూ అనారోగ్యం, దుర్ఘటన, ఊహించనివిధంగా తీవ్రమైన పెద్ద శబ్దం వినడం లేదా అధిక తీవ్రతగల శబ్దాలను తదేకంగా వినడంవల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరు పుట్టుకతోనే బధిరులుగా పుడతారు. బైబిల్లో ప్రస్తావించబడినట్లుగా చెవిటితనానికి మరొక కారణం దయ్యాలు ఆవరించడం. మార్కు 9:25-29లో యేసు, ఒక యౌవనస్థునికి పట్టిన దయ్యం గురించి మాట్లాడుతూ దానిని ‘మూగదైన చెవిటి దయ్యం’గా పేర్కొన్నాడు.
యెషయా 35:5లో ‘చెవిటివాడు’ అని అనువదించబడిన హీబ్రూ మూలపదమైన కెరెష్, మనిషి వినలేకపోవడాన్ని లేదా అతను మౌనంగా ఉండడాన్ని సూచించగలదు. కీర్తన 28:1లో (ఈజీ-టు-రీడ్ వర్షన్) ఉన్నట్లుగా “యెహోవా నీవే నా బండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీవు చెవులు మూసుకొనవద్దు” అన్నప్పుడు, కొన్నిసార్లు అది “వినకుండా ఉండటాన్ని” సూచించింది. మరి కొన్నిసార్లు కీర్తన 35:22లో ఉన్న విధంగా ‘మౌనముగా ఉండడం’ అని అనువదించబడింది. ఆ కీర్తన ఇలా చెబుతోంది: “యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము.”
యెహోవాయే చెవిని సృష్టించాడు. “వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.” (సామెతలు 20:12) బధిరులపట్ల శ్రద్ధ చూపించాలని యెహోవా తన ప్రజలను కోరాడు. బధిరులు తమకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యానాలను వినలేరు, తమను తాము సమర్థించుకోలేరు కనుక, ఇశ్రాయేలీయులు వారిని ఎగతాళి చేయడంకాని, దూషించడంకాని చేయకూడదు. దేవుని ధర్మశాస్త్రం వారినిలా ఉపదేశించింది: “చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.”—లేవీయకాండము 19:14. కీర్తన 38:13, 14ను పోల్చండి.
యెహోవాయే చెవిటివానిని చేశాడా’?
నిర్గమకాండము 4:11లో (ఈజీ-టు-రీడ్ వర్షన్) మనమిలా చదువుతాం: “యెహోవా—‘మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేట్టు చేయగలిగింది ఎవరు? వీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను.” ఇక్కడ యెహోవా ‘చెవిటివానిని చేసినది నేనే’ అన్నప్పుడు, అన్ని సందర్భాలలోనూ చెవిటితనానికి ఆయనే బాధ్యుడని దాని భావం కాదు. కానీ ఒక కారణంతో లేదా ఒక ఉద్దేశంతో యెహోవా అక్షరార్థంగా ఒక మనిషిని చెవిటివానిగా, మూగవానిగా లేక అంధునిగా చేయగలడు. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి, విశ్వాసం చూపించనందువల్ల తాత్కాలికంగా మూగవానిగా చేయబడ్డాడు.—లూకా 1:18-22, 62-64.
కొందరు ఆధ్యాత్మికంగా చెవిటివారిగా ఉండాలనుకున్నప్పుడు వారిని అదే స్థితిలో ఉండడానికి అనుమతించడం ద్వారా దేవుడు వారిని ‘చెవిటివారిగా చేయగలడు.’ అవిశ్వాస ఇశ్రాయేలు జనాంగానికి ఇలా చెప్పమని ప్రవక్తయైన యెషయా ఆజ్ఞాపించబడ్డాడు: “మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.” యెహోవా యెషయాను ఇంకా ఇలా ఆదేశించాడు: “వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము.”—యెషయా 6:9, 10.
నిర్దేశాన్ని వినడానికి ఇష్టపడని దుష్టులను కీర్తనకర్త, మంత్రించినవాని స్వరము వినబడకుండా చెవులు మూసుకునే నాగుపాముతో పోల్చాడు. (కీర్తన 58:3-5) అదేవిధంగా యెషయా కాలంలో ఇశ్రాయేలీయులు చెవులున్నప్పటికీ యెహోవా వాక్యం విని, దానికి ప్రతిస్పందించడంలో నిదానించడం ద్వారా వారు చెవిటివారిలా తయారయ్యారు. యెహోవా యెషయా ద్వారా ఇలా అన్నాడు: “కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి.” (యెషయా 43:8; 42:18-20) అయితే, ప్రవచించబడినట్టుగా దాసత్వం నుండి విడిపించబడి, పునఃస్థాపించబడ్డాక దేవుని ప్రజలు ఇక ఆధ్యాత్మికంగా చెవిటివారై ఉండరు. వారు యెహోవా వాక్యం వింటారు అంటే దానికి అవధానాన్నిస్తారు. ఈ ఆధ్యాత్మిక పునఃస్థాపననే వాగ్దానం చేస్తూ యెహోవా యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.” (యెషయా 29:18; 35:5)) అయితే చెవిటితనానికి కేవలం ఆధ్యాత్మిక స్వస్థతనే నిరీక్షించాలా?
బధిరులకున్న దివ్యమైన భవిష్యత్తుకు ముంగుర్తులు
యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, చాలామంది తాము విన్నవాటి ప్రకారంగా చర్య తీసుకునేందుకు, ఆయన గ్రహణశక్తిగల వారి చెవులను తెరిచాడు. తన సత్య బోధను విని, దానిని అంగీకరించిన వారితో ఆయన ఇలా అన్నాడు: “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.” (మత్తయి 13:16, 23) అయితే, యేసు కేవలం ఆధ్యాత్మిక చెవిటివారిని స్వస్థపరచడంకన్నా ఇంకా ఎక్కువే చేశాడు.
యేసు తన భూపరిచర్యలోని అనేక సందర్భాల్లో భౌతికంగా చెవిటితనం ఉన్నవారిని బాగుచేసి తన అద్భుతమైన స్వస్థపరచే శక్తిని ప్రదర్శించాడు. చెరసాలలో ఉన్న బాప్తిస్మమిచ్చు యోహానుకు ఆయన శిష్యులు ఈ వార్తను తీసుకెళ్ళారు: “గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.” (మత్తయి 11:5; లూకా 7:22) స్వస్థతచేయబడడం కోసం ఒక చెవిటివానిని యేసు దగ్గరకు తీసుకొచ్చినవారు ఎంత ఆనందించివుంటారో కదా! యేసు “తెరువబడమని” అనగానే “వాని చెవులు తెరవబడెను” అని సువార్త వృత్తాంతం మనకు తెలియజేస్తోంది. దీనిని చూసినవారి ప్రతిస్పందన అర్థం చేసుకోదగినదే. “‘ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని’ చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.”—మార్కు 7:32-37.
బాధను, దుఃఖాన్ని కలిగించే సమస్తాన్ని నిర్మూలించే దేవుని వాగ్దత్త రాజ్యం గురించిన సువార్తను యేసు ప్రకటించాడు. ఆయన పరిపాలనలో, చెవిటితనంతో సహా భూమిపైనున్న బాధలన్నీ నిర్మూలించబడతాయని అది రూఢీచేస్తోంది.