పరిపాలక సభ యొక్క క్రొత్త సభ్యులు
పరిపాలక సభ యొక్క క్రొత్త సభ్యులు
రెండువేల ఐదు ఆగస్టు 24, బుధవారం ఉదయం వీడియో ద్వారా కనెక్ట్ చేయబడిన అమెరికా, కెనడాల్లోని బెతెల్ కుటుంబాలు ఉత్తేజకరమైన ఓ ప్రకటనను విన్నాయి. 2005 సెప్టెంబరు 1 నుండి ఇద్దరు క్రొత్త సభ్యులు—జెఫ్రీ డబ్ల్యు. జాక్సన్, ఆంథనీ మారిస్ III యెహోవాసాక్షుల పరిపాలక సభలో చేర్చుకోబడ్డారు.
సహోదరుడు జాక్సన్ 1971 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాకు చెందిన ద్వీప రాష్ట్రమైన టాస్మేనియాలో పయినీరు సేవ ఆరంభించాడు. ఆయన 1974 జూన్‌లో జానెట్‌ను (జెన్నీ) వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికే, వారిద్దరూ ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డారు. వారు 1979 నుండి 2003 వరకు దక్షిణ పసిఫిక్‌లో ఉన్న తువాలు, సమోవ, ఫిజీ ద్వీపదేశాల్లో మిషనరీలుగా సేవచేశారు. ఆ ద్వీపాల్లో ఉన్నప్పుడు సహోదరుడు, సహోదరి జాక్సన్ బైబిలు సాహిత్యాల అనువాదానికి కూడా ఎంతగానో దోహదపడ్డారు. సహోదరుడు జాక్సన్ 1992 నుండి ఆరంభించి సమోవలోని బ్రాంచి కమిటీలో, 1996 నుండి ఫిజీలోని బ్రాంచి కమిటీలో సేవచేశారు. 2003 ఏప్రిల్‌లో ఆయన, జెన్నీ అమెరికా బెతెల్ కుటుంబంలో భాగమై, అనువాద సేవల విభాగంలో పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దికాలానికే సహోదరుడు జాక్సన్ పరిపాలక సభ బోధనా కమిటీకి సహాయకునిగా నియమించబడ్డాడు.
సహోదరుడు మారిస్ కూడా 1971లో అమెరికాలో పయినీరు సేవలో ప్రవేశించారు. ఆ సంవత్సరం డిసెంబరులో ఆయన సూజెన్ను వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ తమ మొదటి కుమారుడు జెస్సీ జన్మించేవరకు, దాదాపు నాలుగు సంవత్సరాలపాటు పయినీరు సేవలో కొనసాగారు. కొంతకాలానికి వారికి మరో కుమారుడు పాల్ జన్మించాడు. సహోదరుడు మారిస్ 1979లో క్రమ పయినీరుగా మళ్లీ పూర్తికాల సేవలో ప్రవేశించాడు. పిల్లల్ని పాఠశాలలో చేర్పించిన తర్వాత ఆయన భార్యకూడా ఆయనతోపాటు పయినీరు సేవలో ప్రవేశించింది. అవసరత ఎక్కువగావున్న రోడ్ ద్వీపంలో, అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఆ కుటుంబం సేవ చేసింది. ఉత్తర కరోలినాలో సహోదరుడు మారిస్ ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవచేయగా, ఆయన కుమారులు క్రమ పయినీరు సేవ చేపట్టారు. జెస్సీ, పాల్ 19 సంవత్సరాల వయస్సులో అమెరికా బ్రాంచికి ఆహ్వానించబడ్డారు. ఈ మధ్యకాలంలో సహోదరుడు మారిస్ ప్రాంతీయ సేవ ఆరంభించాడు. ఆ తర్వాత, 2002 ఆగస్టు 1 నుండి క్రొత్త నియామకాన్ని చేపట్టేందుకు ఆయన, సూజెన్ బెతెల్‌కు ఆహ్వానించబడ్డారు. సహోదరుడు మారిస్, ప్యాటర్సన్లో సేవా విభాగంలో పనిచేయడమే కాక, ఆ తర్వాత పరిపాలక సభ సేవా కమిటీ సహాయకునిగా కూడా పనిచేశారు.
ఈ ఇద్దరు క్రొత్త సభ్యులతోపాటు పరిపాలక సభలో సి. డబ్ల్యు. బార్బర్; జె. ఇ. బార్; ఎస్. ఎఫ్. హెర్డ్; ఎమ్. ఎస్. లెట్; జి. లోష్; టి. జారస్; జి. హెచ్. పియర్స్; ఎ. డి. ష్రోడర్; డి. హెచ్. స్ప్లేన్; డి. సిడ్లిక్ ఉన్నారు. పరిపాలక సభలోని సభ్యులందరూ అభిషిక్త క్రైస్తవులే.