కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ బాప్తిస్మానికి అర్హులవడం

క్రైస్తవ బాప్తిస్మానికి అర్హులవడం

క్రైస్తవ బాప్తిస్మానికి అర్హులవడం

‘నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమిటి?’​—⁠అపొస్తలుల కార్యములు 8:​36.

యేసు మరణించిన ఒకటి రెండు సంవత్సరాల తర్వాత, ఒక ప్రభుత్వాధికారి యెరూషలేము నుండి గాజాకువెళ్లే దారిలో దక్షిణదిశగా ప్రయాణిస్తున్నాడు. అలసట కలిగించే రథ ప్రయాణంలో ఆయనింకా దాదాపు 1,500 కిలోమీటర్లు వెళ్లాలి. ఆ భక్తిపరుడు యెహోవాను ఆరాధించేందుకు ఐతియోపీయ నుండి అంత దూరం ప్రయాణించి యెరూషలేముకు వచ్చాడు. సుదీర్ఘమైన తిరుగు ప్రయాణంలో ఆయన దేవుని వాక్యం చదువుతూ తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, అది ఆయనకున్న విశ్వాసానికి అద్దంపడుతోంది. ఆ యథార్థపరుణ్ణి యెహోవా గమనించి, ఆయనకు ప్రకటించమని, ఒక దేవదూత ద్వారా శిష్యుడైన ఫిలిప్పును నిర్దేశించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26-28.

2 ఫిలిప్పు సులభంగానే సంభాషణ ఆరంభించాడు, ఎందుకంటే ఆ కాలంలోని వాడుక ప్రకారం ఐతియోపీయుడైన ఆ అధికారి బిగ్గరగా చదువుతున్నాడు. కాబట్టి, ఆయన యెషయా గ్రంథం నుండి చదవడాన్ని ఫిలిప్పు వినగలిగాడు. ఫిలిప్పు అడిగిన ఈ తేలికపాటి ప్రశ్న ఆ అధికారి ఆసక్తిని రేకెత్తించింది: “నీవు చదువునది గ్రహించుచున్నావా?” ఇది యెషయా 53:​7, 8ని చర్చించేందుకు నడిపించింది. చివర్లో, ఫిలిప్పు “అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.”​—⁠అపొస్తలుల కార్యములు 8:​29-35.

3 కొద్దిసేపట్లోనే ఆ ఐతియోపీయుడు దేవుని సంకల్పంలో యేసు పాత్రనే కాక, బాప్తిస్మం తీసుకుని క్రీస్తు శిష్యుడు కావలసిన అవసరతనూ అర్థం చేసుకున్నాడు. దగ్గర్లోనే అనుకూలంగావున్న నీటిమడుగును చూసిన వెంటనే ఆయన ‘నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమిటి’ అని ఫిలిప్పును అడిగాడు. నిజమే, అవి ప్రత్యేకమైన పరిస్థితులు. యూదామత ప్రవిష్టునిగా ఆ విశ్వాసి అప్పటికే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. బహుశా చాలాకాలం వరకు బాప్తిస్మం తీసుకునే అవకాశం ఆయనకు దొరకకపోవచ్చు. మరిముఖ్యంగా ఆయన, దేవుడు తననుండి ఏమి కోరుతున్నాడో అర్థం చేసుకుని, దానికి బేషరతుగా స్పందించేందుకు ఇష్టపడ్డాడు. ఫిలిప్పు ఆనందంగా ఆయన విన్నపానికి ఒప్పుకున్నాడు, ఆ ఐతియోపీయుడు బాప్తిస్మం తీసుకుని “సంతోషించుచు తన త్రోవను వెళ్లెను.” ఆయన నిస్సందేహంగా, తన దేశంలో ఉత్సాహంగా సువార్త ప్రకటించి ఉంటాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​36-39.

4 సమర్పణ, బాప్తిస్మం అనేవి తేలికగా, తొందరపడి తీసుకొనే చర్యలు కాకపోయినా, దేవుని వాక్య సత్యాన్ని విన్న అనతికాలంలోనే ఆయా వ్యక్తులు బాప్తిస్మం తీసుకున్న సందర్భాలున్నాయని ఐతియోపీయుడైన అధికారి ఉదాహరణ చూపిస్తోంది. * కాబట్టి ఈ క్రింది ప్రశ్నల్ని పరిశీలించడం సముచితం: బాప్తిస్మానికి ముందు ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? వయసును ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి? ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి స్పష్టంగా కనబడాలి? అన్నింటికన్నా మిన్నగా, తన సేవకులు ఈ చర్య తీసుకోవాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడు?

ఒక పవిత్రమైన ఒడంబడిక

5 ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత, యెహోవా వారిని తన “స్వకీయ సంపాద్య[ముగా]” స్వీకరించి, వారిని ప్రేమించి, కాపాడి “పరిశుద్ధమైన జనముగా” సంఘటితం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే అలాంటి ఆశీర్వాదాలు పొందడానికి ఆ ప్రజలు ఖచ్చితమైన రీతిలో దేవుని ప్రేమకు స్పందించాలి. ‘యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీ’ పాటిస్తామని ఒప్పుకుని, ఆయనతో ఒక నిబంధనలో ప్రవేశించడం ద్వారా వారలా స్పందించారు. (నిర్గమకాండము 19:​4-9) సమస్త జనులను శిష్యులుగా చేయమని యేసు మొదటి శతాబ్దంలో తన అనుచరులకు ఆజ్ఞాపించాడు, ఆయన బోధను అంగీకరించినవారు బాప్తిస్మం తీసుకున్నారు. దేవునితో మంచి సంబంధమనేది, యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిస్మం తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.​—⁠మత్తయి 28:​19, 20; అపొస్తలుల కార్యములు 2:​38, 41.

6 యెహోవా, తనను సేవిస్తానని పవిత్ర ఒప్పందం చేసుకొని, దానిని కాపాడుకునే వారిని ఆశీర్వదిస్తాడని ఈ లేఖన వృత్తాంతాలు చూపిస్తున్నాయి. యెహోవా ఆశీర్వాదానికి నడిపించే సమర్పణ, బాప్తిస్మం అనేవి క్రైస్తవులు తీసుకోవాల్సిన చర్యలు. మనమాయన మార్గాల్ని అనుసరిస్తూ, ఆయన మార్గనిర్దేశాన్ని వెదకాలని తీర్మానించుకున్నాం. (కీర్తన 48:​14) దానికి ఫలితంగా యెహోవా అలంకారార్థంగా మన చెయ్యి పట్టుకుని మనం నడవాల్సిన త్రోవలో మనల్ని నడిపిస్తాడు.​—⁠కీర్తన 73:​23; యెషయా 30:​21; 41:​10, 13.

7 ఈ చర్యలు తీసుకునేందుకు యెహోవాపట్ల ప్రేమ, ఆయనను సేవించాలనే కోరిక మనల్ని పురికొల్పాలి. తగినంతకాలం అధ్యయనం చేశావని తనకెవరో చెప్పారని లేక తన స్నేహితులు బాప్తిస్మం తీసుకుంటున్నారని ఎవరూ బాప్తిస్మం తీసుకోకూడదు. అయితే, తల్లిదండ్రులు, ఇతర పరిణతిగల క్రైస్తవులు సమర్పణ, బాప్తిస్మం గురించి ఆలోచించమని ఒకవ్యక్తిని ప్రోత్సహించవచ్చు. పెంతెకొస్తునాడు తన మాటలు విన్నవారికి “బాప్తిస్మం పొందుడి” అని అపొస్తలుడైన పేతురు ఉద్బోధించాడు. (అపొస్తలుల కార్యములు 2:​38) ఏదేమైనా, మన సమర్పణ మన వ్యక్తిగత విషయం, దాని విషయంలో మనకోసం వేరెవ్వరూ నిర్ణయం తీసుకోలేరు. దేవుని చిత్తం చేయాలనేది మన సొంత నిర్ణయమైవుండాలి.​—⁠కీర్తన 40:⁠8.

బాప్తిస్మానికి తగినరీతిలో సిద్ధపడడం

8 పిల్లలు బుద్ధిసూక్ష్మత కలిగి సమర్పించుకోవాలని నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటారా? బాప్తిస్మం కోసం లేఖనాలు ఎలాంటి వయోపరిమితిని విధించడం లేదు. అయితే, పసివారు తమ పసితనంలోనే విశ్వాసులుగా మారి, విశ్వాసంపై ఆధారపడిన నిర్ణయాలు తీసుకోలేరు లేదా దేవునికి సమర్పించుకోలేరు. (అపొస్తలుల కార్యములు 8:​12) మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి చరిత్రకారుడైన అగస్టస్‌ నియాండర్‌ తన పుస్తకమైన జనరల్‌ హిస్టరీ ఆఫ్‌ ద క్రిస్టియన్‌ రెలిజియన్‌ అండ్‌ చర్చ్‌లో ఇలా చెబుతున్నాడు: “బాప్తిస్మానికీ, విశ్వాసానికీ ఉన్న దగ్గరి సంబంధాన్ని పురుషులు గ్రహించగలరు కాబట్టి, బాప్తిస్మం మొదట వయోజనులకు మాత్రమే ఇవ్వబడేది.”

9 పిల్లల విషయానికొస్తే, కొంతమంది పిన్న వయస్సులోనే దేవుని గురించిన ప్రాథమిక విషయాల్ని అర్థం చేసుకోగలిగితే, మరికొంతమంది ఇంకాస్త ఎదిగిన తర్వాతే అర్థం చేసుకోగలుగుతారు. అయితే బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, వయోజనుల్లాగే పిల్లలకు కూడా యెహోవాతో వ్యక్తిగత సంబంధం ఉండడమే కాక, లేఖనాల్లోని ప్రాథమిక విషయాల గురించిన ఖచ్చితమైన అవగాహన, సమర్పణలో ఏమి ఇమిడివుందనే స్పష్టమైన గ్రహింపు కూడా ఉండాలి.

10 క్రొత్తవారికి తాను ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ బోధించాలని యేసు తన శిష్యులను ఆదేశించాడు. (మత్తయి 28:​20) కాబట్టి క్రొత్తవారు మొట్టమొదట సత్యాన్ని గురించిన ప్రామాణిక జ్ఞానం పొందితే, ఆ జ్ఞానం యెహోవాపై, ఆయన వాక్యంపై విశ్వాసాన్ని వృద్ధి చేసుకునేలా వారికి సహాయం చేస్తుంది. (రోమీయులు 10:​17; 1 తిమోతి 2:⁠4; హెబ్రీయులు 11:⁠6) ఆ తర్వాత, లేఖన సత్యం ఆ వ్యక్తి హృదయాన్ని స్పర్శించినప్పుడు, అది ఆ వ్యక్తి తన గతజీవిత విధానం విషయంలో మారుమనస్సు పొంది మార్పులు చేసుకొనేలా పురికొల్పుతుంది. (అపొస్తలుల కార్యములు 3:​20) చివరకు ఆ వ్యక్తి తనను తాను యెహోవాకు సమర్పించుకోవాలని కోరుకునే స్థితికి చేరుకుని యేసు ఆజ్ఞాపించినట్లుగా బాప్తిస్మం తీసుకుంటాడు.

11 బాప్తిస్మంవైపు పురోగమించడంలో అవసరమైన మరో ప్రాముఖ్యమైన చర్య రాజ్యసువార్త ప్రకటించడంలో భాగం వహించడం. ఇది ఈ అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలకు అప్పగించిన అత్యంత ప్రాముఖ్యమైన పని. (మత్తయి 24:​14) కాబట్టి, బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు తమ విశ్వాసాన్ని గురించి ఇతరులతో పంచుకొనే ఆధిక్యతను పొందవచ్చు. ఈ పనిలో భాగం వహించడం, బాప్తిస్మం తర్వాత క్షేత్ర పరిచర్యలో క్రమంగా, ఉత్సాహంగా పాల్గొనేందుకు వారిని సంసిద్ధులను చేస్తుంది.​—⁠రోమీయులు 10:9, 10, 14, 15.

బాప్తిస్మం తీసుకునేందుకు మిమ్మల్ని ఏదైనా ఆటంకపరుస్తోందా?

12 బాప్తిస్మం తీసుకోవడంవల్ల వచ్చే బాధ్యతల్ని అంగీకరించేందుకు ఇష్టపడని కొందరు బాప్తిస్మం తీసుకునేందుకు వెనుకంజవేస్తారు. యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు నడవాలంటే, తమ జీవితాల్లో గమనార్హమైన మార్పులు చేసుకోవాలని వారికి తెలుసు. లేదా బాప్తిస్మం తర్వాత దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం కష్టమని వారికి అనిపించవచ్చు. “ఏదో ఒకరోజు నేను ఏదైనా తప్పుచేసి, సంఘం నుండి బహిష్కరించబడతానేమో” అని కూడా కొందరు తర్కించవచ్చు.

13 యేసు కాలంలో, కొందరు వ్యక్తిగత విషయాలు, కుటుంబ బాంధవ్యాలు తమను ఆయన శిష్యులు కాకుండా ఆటంకపరిచేందుకు అనుమతించారు. ఒకసారి ఒకశాస్త్రి యేసు ఎక్కడికి వెళ్తే తానక్కడకు వెళ్తానని ప్రకటించాడు. అయితే యేసు తనకు చాలా సందర్భాల్లో రాత్రిపూట తలవాల్చుకునేందుకు కాస్త స్థలమైనా లభించలేదని చెప్పాడు. యేసు తనను అనుసరించమని ఒక శ్రోతను ఆహ్వానించినప్పుడు, ఆ వ్యక్తి మొదట తన తండ్రిని “పాతిపెట్టి” వస్తానని బదులిచ్చాడు. అతను యేసును అనుసరిస్తూ కుటుంబపరమైన ఆ బాధ్యత తలెత్తినప్పుడు దాన్ని నిర్వర్తించడానికి బదులు బహుశా ఇంటి దగ్గరేవుండి, తన తండ్రి చనిపోయేవరకు వేచివుండడానికి ఇష్టపడ్డాడు. చివరగా, మూడవ వ్యక్తి తాను యేసును అనుసరించడానికి ముందు తన కుటుంబం దగ్గర “సెలవు తీసుకొని” రావాలని అన్నాడు. అలా జాప్యం చేయడాన్ని యేసు ‘వెనుకతట్టు చూడడంగా’ వర్ణించాడు. కాబట్టి అలా జాప్యం చేయాలనుకునే వారికి తమ క్రైస్తవ బాధ్యతను తప్పించుకునేందుకు ఎప్పడూ ఏదోక సాకు దొరుకుతూనే ఉంటుంది.​—⁠లూకా 9:​57-62.

14 పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానుల మాదిరి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తనను వెంబడించి మనుష్యులను పట్టే జాలరులవమని యేసు వారిని ఆహ్వానించినప్పుడు ఏమి జరిగిందో బైబిలు ఇలా చెబుతోంది: “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” (మత్తయి 4:​19-22) ఆ నిర్ణయం తక్షణమే తీసుకోవడం ద్వారా, యేసు ఆ తర్వాత వారితో చెప్పిన దానిని వారు వ్యక్తిగతంగా చవిచూశారు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:​29, 30) బాప్తిస్మం, బాధ్యత అనే కాడిని తీసుకొచ్చినా, మనకెంతో విశ్రాంతి కలిగించేలా అది సుళువుగానూ, మోయగలిగేదిగానూ ఉంటుందని యేసు మనకు హామీ ఇస్తున్నాడు.

15 నిజమే, ఆ బాధ్యతా బరువును మోయలేమోననే భావాలు కలగడం సాధారణమే. మోషే, యిర్మీయా కూడా యెహోవా వారికి అప్పగించిన పనిని చేయలేమని మొదట భావించారు. (నిర్గమకాండము 3:​11; యిర్మీయా 1:⁠6) అయితే దేవుడు వారికెలాంటి హామీ ఇచ్చాడు? ఆయన “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును” అని మోషేకు, “నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను” అని యిర్మీయాకు చెప్పాడు. (నిర్గమకాండము 3:​12; యిర్మీయా 1:⁠8) దేవుడిచ్చే మద్దతు విషయంలో మనం కూడా గట్టి నమ్మకం కలిగివుండవచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనను విశ్వసించడం, మన సమర్పణకు తగ్గట్టు జీవించగలమా లేదా అని పదేపదే కలిగే సందేహాలను అధిగమించేందుకు మనకు సహాయం చేయగలదు. “ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 4:​18) ఒక చిన్నపిల్లవాడు తాను ఒంటరిగా నడవవలసివస్తే భయపడవచ్చు, కానీ తన తండ్రి చెయ్యి పట్టుకుని నడిచేటప్పుడు మాత్రం ఆ పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. అదేవిధంగా, మనం హృదయపూర్వకంగా యెహోవాను విశ్వసిస్తూ, ఆయనతో నడిస్తే, మన ‘త్రోవలను సరాళం’ చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.​—⁠సామెతలు 3:​5, 6.

గౌరవప్రదమైన సందర్భం

16 సాధారణంగా బాప్తిస్మానికి ముందు క్రైస్తవ బాప్తిస్మపు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక లేఖనాధారిత ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగ ముగింపులో బాప్తిస్మానికి సంబంధించిన రెండు ప్రశ్నలకు జవాబివ్వడం ద్వారా తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాలని అభ్యర్థులు అడగబడతారు. (రోమీయులు 10:​10; 22వ పేజీలోని బాక్సు చూడండి.) ఆ తర్వాత, అభ్యర్థులు యేసు ఉంచిన మాదిరి ప్రకారం నీటిలో ముంచబడతారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు “నీళ్లలోనుండి ఒడ్డునకు” వచ్చాడని బైబిలు వివరిస్తోంది. (మత్తయి 3:​16; మార్కు 1:​10) కాబట్టి, బాప్తిస్మమిచ్చు యోహాను యేసును పూర్తిగా నీటిలో ముంచాడని స్పష్టమౌతోంది. * నీటిలో పూర్తిగా ముంచబడడం సముచితంగానే, మన జీవితంలో మనం చేసుకున్న గమనార్హమైన మార్పును, అంటే మన గతజీవన విధానం విషయంలో అలంకారార్థంగా మరణించి దేవుని సేవలో ఆరంభించిన ఓ క్రొత్త జీవితాన్ని సూచిస్తుంది.

17 బాప్తిస్మం గంభీరమైనదే కాక, ఆనందకరమైన సందర్భం కూడా. యొర్దాను నదిలో యోహాను యేసుకు బాప్తిస్మమిస్తున్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడని బైబిలు సూచిస్తోంది. (లూకా 3:​21, 22) ఈ ఉదాహరణకు అనుగుణంగా, బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులు గౌరవనీయంగా ప్రవర్తించాలి. దైనందిన జీవితంలో మనం తగిన దుస్తులు ధరించాలని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది కాబట్టి, బాప్తిస్మం తీసుకునే రోజున ఆ ఉపదేశాన్ని మనం లక్ష్యపెట్టడం మరెంత ప్రాముఖ్యమో కదా! (1 తిమోతి 2:⁠9) ప్రేక్షకులు కూడా బాప్తిస్మ ప్రసంగాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా, ఇతరులు బాప్తిస్మం తీసుకోవడాన్ని మర్యాదపూర్వకంగా చూడడం ద్వారా తగిన గౌరవాన్ని ప్రదర్శించవచ్చు.​—⁠1 కొరింథీయులు 14:​39.

బాప్తిస్మం తీసుకున్న శిష్యులు అనుభవించే ఆశీర్వాదాలు

18 మనం దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనమొక ప్రత్యేక కుటుంబంలో భాగమవుతాం. అన్నింటికన్నా మిన్నగా, యెహోవా మనకు తండ్రీ, స్నేహితుడూ అవుతాడు. బాప్తిస్మానికి ముందు మనం దేవునికి దూరంగా ఉన్నాం; ఇప్పుడు దేవునితో సమాధానపడతాం. (2 కొరింథీయులు 5:19; కొలొస్సయులు 1:​20) క్రీస్తు బలిద్వారా, మనం దేవునికి దగ్గరయ్యాం, ఆయన మనకు దగ్గరవుతాడు. (యాకోబు 4:⁠8) యెహోవా, తన నామం ధరించుకొని దానిని ఉపయోగించేవారి విన్నపాలను ఎలా చెవియొగ్గి ఆలకిస్తాడో మలాకీ ప్రవక్త వర్ణిస్తున్నాడు. మరియు ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లను చేరుస్తాడు. “వారు నావారై . . . యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతును” అని దేవుడు చెబుతున్నాడు.​—⁠మలాకీ 3:​16-18.

19 బాప్తిస్మం, మనం ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగస్థులమయ్యేందుకు కూడా సహాయం చేస్తుంది. క్రీస్తు శిష్యులు తాము చేసిన త్యాగాలకు ఎలాంటి ఆశీర్వాదాలను పొందుతారని అపొస్తలుడైన పేతురు అడిగినప్పుడు, యేసు ఇలా వాగ్దానం చేశాడు: “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.” (మత్తయి 19:​29) చాలా సంవత్సరాల తర్వాత, “లోకమందు” వృద్ధియైన ‘సహోదరత్వం’ గురించి పేతురు వ్రాశాడు. ప్రేమగల సహోదరత్వపు మద్దతును, ఆశీర్వాదాలను పేతురు వ్యక్తిగతంగా చవిచూశాడు, మనమూ చవిచూడగలం.​—⁠1 పేతురు 2:​17; 5:⁠9.

20 అంతేకాక, తనను అనుసరించేవారు ‘నిత్యజీవమును స్వతంత్రించుకొంటారు’ అని యేసు సూచించాడు. అవును, సమర్పణ, బాప్తిస్మం “వాస్తవమైన జీవమును” అంటే దేవుని నూతనలోకంలో నిత్యజీవాన్ని పొందే భావి నిరీక్షణను అందిస్తాయి. (1 తిమోతి 6:​18-19) మనకోసం, మన కుటుంబాల కోసం భవిష్యత్తు విషయంలో ఇంతకన్నా మెరుగైన పునాది ఏముంటుంది? ఈ దీవెనకర భావి నిరీక్షణ “మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరి[స్తూ]” నడుచుకునేలా చేస్తుంది.​—⁠మీకా 4:⁠5.

[అధస్సూచీలు]

^ పేరా 6 అదేవిధంగా, పేతురు ప్రసంగాన్ని విన్న మూడువేలమంది యూదులు, యూదామత ప్రవిష్టులు కూడా తడవు చేయకుండా బాప్తిస్మం తీసుకున్నారు. నిజానికి, వారికి కూడా ఐతియోపీయుడైన నపుంసకునిలాగే దేవుని వాక్యపు ప్రాథమిక బోధలు, సూత్రాలు తెలుసు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​37-41.

^ పేరా 22 వైన్‌ వ్రాసిన ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ప్రకారం బాప్టిస్మ (బాప్తిస్మం) అనే గ్రీకు పదం “నీటిలో ముంచబడే ప్రక్రియను, నీటి క్రిందకువెళ్లి పైకిరావడాన్ని” సూచిస్తుంది.

మీరు వివరించగలరా?

•యెహోవా ప్రేమకు మనమెలా స్పందించాలి, అలా ఎందుకు స్పందించాలి?

•బాప్తిస్మానికి ముందు ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి?

•విఫలమౌతామనే భయం లేదా బాధ్యతను అంగీకరించేందుకు అయిష్టత, బాప్తిస్మం తీసుకోకుండా మనల్ని ఆటంకపరచడానికి మనమెందుకు అనుమతించకూడదు?

•బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు శిష్యులు ఎలాంటి సాటిలేని ఆశీర్వాదాలు అనుభవించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఐతియోపీయుడైన అధికారితో ఫిలిప్పు ఎలా సంభాషణ ఆరంభించగలిగాడు, ఈ అధికారికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉందని ఏది ధృవీకరిస్తోంది?

3, 4. (ఎ) తడవు చేయకుండా ఫిలిప్పు ఐతియోపీయునికి ఎందుకు బాప్తిస్మమిచ్చాడు? (బి) మనమిప్పుడు ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

5, 6. (ఎ) గతంలో దేవుని ప్రజలు యెహోవా ప్రేమకు ఎలా స్పందించారు? (బి) బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునితో మనమెలాంటి సన్నిహిత సంబంధాన్ని ఆనందించవచ్చు?

7. సమర్పణ, బాప్తిస్మం అనేవి ఎందుకు వ్యక్తిగత నిర్ణయాలైవుండాలి?

8, 9. (ఎ) పసిపిల్లల బాప్తిస్మం లేఖనానుసారంగా ఎందుకు అనంగీకృతం? (బి) బాప్తిస్మానికి ముందు పిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి?

10. సమర్పణ, బాప్తిస్మాలకు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవడం అవసరం?

11. బాప్తిస్మానికి ముందు మనం ప్రకటనా పనిలో క్రమంగా భాగం వహించడం ఎందుకు ప్రాముఖ్యం?

12. బాప్తిస్మం తీసుకునేందుకు కొందరెందుకు వెనుకంజవేయవచ్చు?

13. యేసు కాలంలో, యేసు అనుచరులు అవకుండా కొందరిని ఏది ఆపుజేసింది?

14. (ఎ) మనుష్యులను పట్టే జాలరులవమని యేసు ఆహ్వానించినప్పుడు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులు ఎలా స్పందించారు? (బి) యేసు కాడిని అంగీకరించేందుకు మనమెందుకు వెనుకంజవేయకూడదు?

15. మనం దేవుని మద్దతుపై ఆధారపడవచ్చని మోషే, యిర్మీయాల ఉదాహరణలు ఎలా చూపిస్తున్నాయి?

16. బాప్తిస్మంలో నీళ్లలో పూర్తిగా ముంచబడడం ఎందుకు ఇమిడివుంది?

17. బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులు, ప్రేక్షకులు ఆ సందర్భపు మర్యాదకు ఎలా తోడ్పడవచ్చు?

18, 19. బాప్తిస్మం ఎలాంటి ఆధిక్యతలను, ఆశీర్వాదాలను తెస్తుంది?

20. బాప్తిస్మం ఏ దీవెనకర భావి నిరీక్షణను అందిస్తుంది?

[26వ పేజీలోని చిత్రం]

‘నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమిటి?’

[29వ పేజీలోని చిత్రాలు]

బాప్తిస్మం గంభీరమైనదే కాక, ఆనందకరమైన సందర్భం కూడా