పేరు కలిగివుండే హక్కు
పేరు కలిగివుండే హక్కు
ప్రతీ వ్యక్తికి పేరు కలిగివుండే హక్కు ఉంది. తాహితీలో తల్లిదండ్రుల జాడతెలియని, వదిలివేయబడిన పసిపిల్లలకు సహితం పేరు పెట్టబడుతుంది. వదిలివేయబడిన పిల్లలకు రిజిష్ట్రార్ ఆఫీసువారు ఒక ఇంటిపేరు, ఒక సొంత పేరు పెడతారు.
ఆ హక్కు దాదాపు మానవులందరికీ మంజూరు చేయబడినా, ఒక వ్యక్తికి మాత్రం ఆ ప్రాథమిక హక్కు నిరాకరించబడింది. ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి, “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో” ఆయనే! (ఎఫెసీయులు 3:14, 15) నిజానికి, అనేకమంది సృష్టికర్త నామాన్ని బైబిల్లో కనిపించే విధంగా ఉపయోగించడానికి నిరాకరిస్తున్నారు. వారు దాని స్థానంలో “దేవుడు,” “ప్రభువు” లేదా “నిత్యుడు” అనే బిరుదులను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఆయన నామమేమిటి? కీర్తనకర్త ఆ ప్రశ్నకు ఇలా జవాబిస్తున్నాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్తన 83:18.
19వ శతాబ్దపు మొదటి అర్థభాగంలో, లండన్ మిషనరీ సొసైటీనుండి మిషనరీలు తాహితీకి చేరుకునే సమయానికి పాలినేషియాలోని ప్రజలు ఎంతోమంది దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. ప్రతీ దేవునికి విశిష్ట నామం ఉండేది, వాటిలో ప్రముఖ దేవుళ్ళు ఓరో, టారోవా. బైబిల్లోని దేవుడిని ఇతర దేవుళ్ళనుండి వేరుపరచడానికి ఆ మిషనరీలు, తాహితీలోకి యెహోవా అని లిప్యంతరీకరించబడిన దైవిక నామాన్ని విస్తారంగా ఉపయోగించడానికి సంశయించలేదు.
ఆ నామం చాలా ప్రసిద్ధిచెంది, అనుదిన సంభాషణలో, ఉత్తరాల్లో ఉపయోగించబడేదిగా మారింది. తాహితీని 19వ శతాబ్ద ఆరంభంలో పరిపాలించిన రాజైన పోమారే II, తన వ్యక్తిగత ఉత్తరాల్లో ఆ నామాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించేవాడు. దానికి ఆధారం, ఇక్కడ చూపించబడిన ఉత్తరంలో కనిపిస్తుంది. ఇంగ్లీషులో వ్రాయబడిన ఈ ఉత్తరం ప్రస్తుతం తాహితీలోని, దాని ద్వీపదేశాల్లోని మ్యూజియమ్‌లో ప్రదర్శించబడుతోంది. ఆ కాలంలో దైవిక నామాన్ని ప్రజలు ఏ జంకూలేకుండా ఉపయోగించేవారు అనడానికి ఈ ఉత్తరం నిదర్శనంగా ఉంది. అంతేకాదు, 1835లో పూర్తి చేయబడిన మొదటి తాహితీ బైబిలు అనువాదంలో దేవుని వ్యక్తిగత నామం వేలసార్లు కనిపిస్తుంది.
[32వ పేజీలోని చిత్రం]
రాజైన పోమారే II
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
రాజు, ఉత్తరం: Collection du Musée de Tahiti et de ses Îles, Punaauia, Tahiti