కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘ఆదినుండి కలుగబోవువాటిని’ తెలియజేస్తున్నాడు

యెహోవా ‘ఆదినుండి కలుగబోవువాటిని’ తెలియజేస్తున్నాడు

యెహోవా ‘ఆదినుండి కలుగబోవువాటిని’ తెలియజేస్తున్నాడు

“ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.”​—⁠యెషయా 46:10.

రాత్రిపూట చీకటిమాటున శత్రు సైనికులు గుట్టుచప్పుడు కాకుండా యూఫ్రటీసు నదీగర్భంలో నడుచుకుంటూ తమ లక్ష్యంవైపు అంటే దుర్భేద్యమైన బబులోను నగరంవైపు ముందుకు సాగుతున్నారు. వారు ఆ నగర ముఖద్వారాన్ని సమీపిస్తుండగా తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. బబులోను ప్రాకారానికి బిగించివున్న భారీ తలుపులు తెరిచివున్నాయి! వారు నదీగర్భం నుండి పైకెక్కి నగరంలోకి ప్రవేశిస్తారు. సత్వరమే ఆ నగరం వారి చేతికిచిక్కింది. వారి నాయకుడైన కోరెషు, జయించబడిన ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని ఆ వెంటనే చెరలోవున్న ఇశ్రాయేలీయుల విడుదలను ఆదేశిస్తాడు. ఆ నిర్వాసితులు వేలసంఖ్యలో యెరూషలేములో యెహోవా ఆరాధనను పునరుద్ధరించేందుకు తమ స్వదేశానికి తిరిగివస్తారు.​—⁠2 దినవృత్తాంతములు 36:​22, 23; ఎజ్రా 1:​1-4.

2 ఆ సంఘటనలు సా.శ.పూ. 539-537 సంవత్సరాల్లో జరిగాయని చరిత్రకారులు బలంగా ధృవీకరిస్తున్నారు. ఇక్కడ అసాధారణ విషయమేమిటంటే, ఆ సంఘటనల వివరాలు అప్పటికి దాదాపు 200 సంవత్సరాల ముందే చెప్పబడ్డాయి. బబులోను నాశనం గురించి అంత ముందుగానే వర్ణించేందుకు యెహోవా తన ప్రవక్తయైన యెషయాను ప్రేరేపించాడు. (యెషయా 44:24-45:⁠7) బబులోను పతనానికి సంబంధించిన పరిస్థితులనే కాక, అలా జయించే అధిపతి పేరును కూడా దేవుడు వెల్లడించాడు. * ఆ కాలంలో తనకు సాక్షులుగావున్న ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఇలా చెప్పాడు: “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడును లేడు. . . . ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” (యెషయా 46:9, 10బి) నిజంగా యెహోవా భవిష్యత్తులో జరగబోయేవాటిని ముందుగానే తెలుసుకోగల దేవుడు.

3 దేవునికి భవిష్యత్తు ఎంతవరకు తెలుసు? మనలో ప్రతీ ఒక్కరం ఏమిచేస్తామో యెహోవాకు ముందుగానే తెలుసా? నిజానికి, మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా? వీటికి, వీటికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు బైబిలిచ్చే జవాబులను ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం పరిశీలిస్తాం.

యెహోవా​—⁠ప్రవచించే దేవుడు

4 భవిష్యత్తును ముందుగానే తెలుసుకోగల శక్తి యెహోవాకు ఉంది కాబట్టి, ఆయన అనేక ప్రవచనాలు వ్రాసేందుకు బైబిలు కాలాల్లోని తన సేవకులను ప్రేరేపించాడు. ఈ ప్రవచనాలు యెహోవా సంకల్పాలను మనం ముందుగా తెలుసుకొనేందుకు సహాయం చేస్తాయి. యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.” (యెషయా 42:⁠9) దేవుని ప్రజలెంత ఆధిక్యతగలవారో కదా!

5 ప్రవక్తయైన ఆమోసు మనకిలా అభయమిస్తున్నాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” విషయం ముందే తెలియడం, ఓ బాధ్యతను కూడా తెస్తుంది. ఆ తర్వాత ఆమోసు ఉపయోగిస్తున్న ఈ శక్తిమంతమైన దృష్టాంతాన్ని గమనించండి: “సింహము గర్జించెను, భయపడనివాడెవడు?” సింహగర్జన దగ్గర్లోవున్న మనిషినీ, జంతువునూ వెంటనే స్పందించేలా అప్రమత్తం చేసినట్లు, ఆమోసులాంటి ప్రవక్తలు యెహోవా వాక్కులను సత్వరమే ప్రకటించారు. “ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?”​—⁠ఆమోసు 3:​7, 8.

యెహోవా “వచనము” ‘కార్యాన్ని సఫలం చేస్తుంది’

6 యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఇలా అన్నాడు: “నా ఆలోచన నిలుచు[ను], నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదను.” (యెషయా 46:10ఎ) దేవుని “ఆలోచన”లో అంటే బబులోనుకు సంబంధించిన ఆయన చిత్తంలో లేదా సంకల్పంలో బబులోనును జయించి దాన్ని పతనావస్థకు తీసుకొచ్చేందుకు పారసీకదేశం నుండి కోరెషును పిలవడం ఇమిడివుంది. యెహోవా ఆ సంకల్పాన్ని చాలాకాలం ముందే ప్రకటించాడు. ముందే పేర్కొనబడినట్లుగా, అది సా.శ.పూ. 539లో ఖచ్చితంగా నెరవేరింది.

7 కోరెషు బబులోనును జయించడానికి దాదాపు నాలుగు శతాబ్దాల పూర్వం, యూదా రాజైన యెహోషాపాతు అమ్మోనీయుల, మోయాబీయుల సంకీర్ణ సేనల్ని ఎదుర్కొన్నాడు. ఆయన నమ్మకంగా ఇలా ప్రార్థించాడు: “మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవైయున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.” (2 దినవృత్తాంతములు 20:⁠6) యెషయా కూడా అలాంటి నమ్మకాన్నే వ్యక్తంచేస్తూ ఇలా అన్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు?” (యెషయా 14:​27) ఆ తర్వాత, బబులోను రాజైన నెబుకద్నెజరు పిచ్చివాడిగా తిరిగిన కాలం తీరిపోయి మళ్లీ మానవబుద్ధి పునరుద్ధరించబడినప్పుడు వినయంగా ఇలా అంగీకరించాడు: “ఆయన [దేవుని] చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.” (దానియేలు 4:​35) అవును, యెహోవా తన ప్రజలకిలా అభయమిస్తున్నాడు: “నా నోటనుండి వచ్చు వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:​10-11) యెహోవా “వచనము” ఎన్నడూ విఫలం కాదని మనం పూర్తిగా నమ్మవచ్చు. దేవుని సంకల్పం తప్పక నెరవేరుతుంది.

దేవుని “నిత్యసంకల్పము”

8 అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు తాను వ్రాసిన లేఖలో దేవునికి ఒక “నిత్యసంకల్పము” ఉందని సూచించాడు. (ఎఫెసీయులు 3:⁠8) దేవుడు తన పని విధానాన్ని ముందే వ్రాసిపెట్టుకోవాలన్నట్లు, అది కేవలం ఒక కార్య ప్రణాళిక కాదు. బదులుగా, అది యెహోవా తాను మానవాళిపట్ల, భూమిపట్ల మొదట ఉద్దేశించింది నెరవేర్చాలనే ఆయన దృఢనిశ్చయానికి సంబంధించింది. (ఆదికాండము 1:​28) ఆయన సంకల్పమెలా విజయవంతమైందో గ్రహించేందుకు, బైబిల్లో వ్రాయబడిన మొదటి ప్రవచనాన్ని పరిశీలించండి.

9 ఆదాము హవ్వలు పాపం చేసిన వెంటనే, యెహోవా తన సూచనార్థక స్త్రీ ఒక సంతానాన్ని లేదా కుమారుణ్ణి కనాలని నిర్ణయించినట్లు ఆదికాండము 3:⁠15లోని వాగ్దానం సూచిస్తోంది. అలాగే యెహోవా తన స్త్రీకి, సాతానుకు మధ్య, అలాగే ఆ ఇద్దరి సంతానాలకు మధ్య ఉండే శత్రుత్వపు ఫలితాన్ని ముందే గ్రహించాడు. దేవుని స్త్రీ సంతానం మడిమపై కొట్టబడేందుకు యెహోవా అనుమతించినా, దేవుని నిర్ణయకాలంలో ఆ సంతానం, సర్పం లేదా అపవాదియైన సాతాను తలను చితకకొడతాడు. ఈ మధ్యకాలంలో, యెహోవా సంకల్పం ఆయనెంచుకున్న వంశావళిలో వాగ్దత్త మెస్సీయగా యేసు ప్రత్యక్షమయ్యే వరకు నిరాటంకంగా పురోగమించింది.​—⁠లూకా 3:​15, 23-38; గలతీయులు 4:⁠4.

యెహోవా వేటిని ముందుగా నిర్ణయిస్తాడు?

10 దేవుని సంకల్పంలో యేసు వహించిన పాత్ర గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఆయన [యేసు] జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని . . . మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను.” (1 పేతురు 1:​20) అంటే ఆదాము హవ్వలు పాపం చేస్తారనీ, యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడే విమోచన క్రయధన బలి అవసరమవుతుందనీ యెహోవా ముందుగానే నిర్ణయించాడా? లేదు. “పునాది వేయబడడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “సంతానం పడవేయబడడం” అని అర్థం. ఆదాము హవ్వలు పాపం చేయకముందు, “సంతానం పడవేయబడడం” లేక మానవ సంతానం గర్భంలో పడడం జరిగిందా? లేదు. ఆదాము హవ్వలు అవిధేయత చూపించిన తర్వాతే వారు పిల్లల్ని కన్నారు. (ఆదికాండము 4:⁠1) కాబట్టి తిరుగుబాటుకు, ఆదాము హవ్వలు పిల్లల్ని కనక ముందున్న మధ్యకాలంలో, ‘సంతానం’ వస్తాడని యెహోవా ముందుగా నిర్ణయించాడు. యేసు మరణ పునరుత్థానాలు విమోచన క్రయధనమనే ప్రేమపూర్వక ఏర్పాటును అందజేశాయి, అందువల్ల వారసత్వ పాపం తొలగించబడి, సాతాను చేసే ప్రయత్నాలన్నీ నిరర్థకం చేయబడతాయి.​—⁠మత్తయి 20:​28; హెబ్రీయులు 2:​14; 1 యోహాను 3:⁠8.

11 యెహోవా తన సంకల్ప నెరవేర్పులో మరో పురోగతిని ముందుగా నిర్ణయించాడు. ఇది ఎఫెసీయులకు పౌలు వ్రాసిన దానిచే సూచించబడింది, అదేమిటంటే, దేవుడు “పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూ[రుస్తాడు].” ఆ తర్వాత ‘పరలోకములో ఉన్నవాటిని’ అంటే క్రీస్తుతోపాటు వారసులుగా ఎంచుకోబడినవారిని సూచిస్తూ పౌలు ఇలా వివరించాడు: ‘తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించే దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించెను.’ (ఎఫెసీయులు 1:​10, 11) అవును, దేవుని స్త్రీ సంతానంలో రెండవ భాగంగా పరిమిత సంఖ్యలో మానవులు సమకూర్చబడి, విమోచన క్రయధన ప్రయోజనాలను ఇతరులకు చేకూర్చడంలో క్రీస్తుతోపాటు భాగంవహిస్తారని యెహోవా ముందుగానే నిర్ణయించాడు. (రోమీయులు 8:​28-30) అపొస్తలుడైన పేతురు వీరిని “పరిశుద్ధజనము” అని సూచిస్తున్నాడు. (1 పేతురు 2:⁠9) క్రీస్తుతోడి వారసులుగా ఉండేవారి సంఖ్య 1,44,000 అని ఒక దర్శనంలో తెలుసుకునే ఆధిక్యత అపొస్తలుడైన యోహానుకు లభించింది. (ప్రకటన 7:​4-8; 14:​1, 3) రాజైన క్రీస్తుతో కలిసి వారు “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై” సేవ చేస్తారు.​—⁠ఎఫెసీయులు 1:​12-14.

12 దేవుడు 1,44,000 మందిని ముందే నిర్ణయించాడంటే దానర్థం ఫలాని వ్యక్తులు ఆయనకు నమ్మకంగా సేవచేస్తారని ముందుగా నిర్ణయించడం కాదు. నిజానికి, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ఉపదేశం అభిషిక్తులు తమ యథార్థతను కాపాడుకుంటూ, తమ పరలోక పిలుపుకు తగ్గట్టు ఉండాలని నిర్దేశిస్తూ వారిని బలపరిచేందుకే ప్రాథమికంగా వ్రాయబడింది. (ఫిలిప్పీయులు 2:​12; 2 థెస్సలొనీకయులు 1:​5, 11; 2 పేతురు 1:​10, 11) తన సంకల్పం నెరవేర్చేందుకు 1,44,000 మంది అర్హులవుతారని యెహోవాకు ముందే తెలుసు. అయితే ఎవరు అలా అర్హులుగా నిరూపించబడతారనేది, ఆహ్వానించబడిన వ్యక్తులు వ్యక్తిగతంగా ఎలా జీవించేందుకు ఎంచుకుంటారనే దానిమీద ఆధారపడి ఉంటుంది, ఆ నిర్ణయాన్ని వారిలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా తీసుకోవలసి ఉంటుంది.​—⁠మత్తయి 24:​13.

యెహోవాకు ఏ విషయాలు ముందే తెలుసు?

13 యెహోవా ప్రవచించే, సంకల్పించే దేవుడు కాబట్టి, విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని ఆయన ఎలా ఉపయోగిస్తాడు? మొదటగా, దేవుని మార్గాలన్నీ సత్యమైనవని, నీతియుక్తమైనవని, ప్రేమపూర్వకమైనవని మనకు హామీ ఇవ్వబడింది. అపొస్తలుడైన పౌలు సా.శ. మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులకు వ్రాస్తూ, దేవుడు “అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులు” ఏమిటంటే ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం అని స్థిరంగా చెప్పాడు. (హెబ్రీయులు 6:​17, 18) శిష్యుడైన తీతుకు తాను వ్రాసిన పత్రికలో కూడా పౌలు, “అబద్ధమాడనేరని దేవుడు” అని వ్రాసినప్పుడు ఈ ఆలోచననే వ్యక్తపరిచాడు.​—⁠తీతు 1:2.

14 అంతేగాక, యెహోవాకు అంతులేని శక్తి ఉన్నప్పటికీ, ఆయనెన్నడూ అన్యాయంగా ప్రవర్తించడు. యెహోవా “నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు” అని మోషే వర్ణించాడు. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) యెహోవా చేసేదంతా ఆయన అద్భుతమైన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఆయన చర్యలు, ఆయన ప్రధాన లక్షణాలైన ప్రేమ, జ్ఞానము, న్యాయము, శక్తి అనేవాటితో సంపూర్ణ పొందికను కనబరుస్తాయి.

15 ఆయనకున్న ఈ ప్రధాన లక్షణాలన్నీ ఏదెను తోటలో జరిగిన సంఘటనల్లో ఎలా వెల్లడయ్యాయో పరిశీలించండి. ప్రేమగల తండ్రిగా యెహోవా మానవులకు అవసరమైనవన్నీ దయచేశాడు. ఆయన ఆదాముకు ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కబద్ధంగా ఆలోచించి, ఒక నిర్ణయానికొచ్చే శక్తిని అనుగ్రహించాడు. ఎక్కువగా సహజ జ్ఞానంతో నిర్దేశించబడే జంతు సృష్టికి భిన్నంగా, ఆదాముకు ఎంపిక చేసుకోగల సామర్థ్యముంది. ఆదాము సృష్టించబడిన తర్వాత దేవుడు తన పరలోక సింహాసనం నుండి పరికిస్తూ “తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”​—⁠ఆదికాండము 1:​26-31; 2 పేతురు 2:​12.

16 యెహోవా ఆదాముకు, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తినకూడదనే ఆజ్ఞ ఇవ్వాలని ఎంచుకున్నప్పుడు, ఆదాము ఏమి చేయాలో నిర్ణయించుకోగలిగేలా ఆయన తగిన ఉపదేశమిచ్చాడు. ఒకేఒక వృక్ష ఫలాలను తప్ప, “ప్రతి వృక్ష ఫలములను” తినేందుకు ఆదామును అనుమతించడమే కాక, నిషేధిత వృక్ష ఫలాలను తినడంవల్ల కలిగే ప్రాణాపాయ ఫలితాల గురించి ఆయన హెచ్చరించాడు. (ఆదికాండము 2:​16, 17) ఆదాము క్రియల పర్యవసానాలను యెహోవా ఆయనకు వివరించాడు. ఆదాము ఏమిచేస్తాడు?

17 అన్నింటినీ ముందుగానే తెలుసుకోగల సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ ఆదాము, హవ్వ ఏంచేస్తారో ముందుగానే తెలుసుకునేందుకు యెహోవా ఎంచుకోలేదనేది స్పష్టం. కాబట్టి, యెహోవా భవిష్యత్తును ముందే తెలుసుకోగలడా లేదా అనేది కాదుగానీ, ఆయనలా తెలుసుకునేందుకు ఎంచుకుంటాడా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. అంతేకాక, యెహోవా ప్రేమగల దేవుడు కాబట్టి, ఆయన తీవ్ర పర్యవసానాలకు దారితీసే ఆ తిరుగుబాటు జరగాలని బుద్ధిపూర్వకంగా, క్రూరంగా ముందే నిర్ణయించడని మనం న్యాయంగా ఆలోచించవచ్చు. (మత్తయి 7:​10; 1 యోహాను 4:⁠8) కాబట్టి, విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా తాను ఎంచుకున్న వాటిని తెలుసుకునేందుకే ఉపయోగిస్తాడు.

18 విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా తాను ఎంచుకున్న వాటిని తెలుసుకునేందుకు ఉపయోగిస్తాడంటే, ఆయనలో ఏదో లోపం, అపరిపూర్ణత ఉన్నాయని దానర్థమా? కాదు. యెహోవాను వర్ణిస్తూ మోషే ఆయన “ఆశ్రయదుర్గముగా” ఉన్నాడని, ఆయన “కార్యము సంపూర్ణము” అని చెప్పాడు. మానవ పాపం మూలంగా కలిగిన పర్యవసానాలకు ఆయన బాధ్యుడు కాదు. నేడు మనమందరం అనుభవిస్తున్న విపత్కర ప్రభావాలు అవిధేయతకు సంబంధించిన ఆ అవినీతి క్రియనుండి పుట్టినవే. అపొస్తలుడైన పౌలు, “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని స్పష్టమైన రీతిలో సహేతుకంగా పేర్కొన్నాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 32:​4, 5; రోమీయులు 5:​12; యిర్మీయా 10:​23.

19 మన చర్చలో ఇప్పటివరకు, యెహోవాలో ఏ అన్యాయమూ లేదని చూశాం. (కీర్తన 33:5) బదులుగా, యెహోవా సామర్థ్యాలు, నైతిక లక్షణాలు, ప్రమాణాలు ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉపయోగించబడతాయి. (రోమీయులు 8:​28) ప్రవచించే దేవునిగా యెహోవా ఇలా అంటున్నాడు: “ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” (యెషయా 46:​9, 10) అలాగే విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని ఆయన తాను ఎంచుకున్న వాటినే తెలుసుకోవడానికి ఉపయోగిస్తాడని కూడా గ్రహించాం. కాబట్టి ఇదంతా మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? మన నిర్ణయాలు దేవుని ప్రేమపూర్వక సంకల్పానికి అనుగుణంగా ఉండేలా మనమెలా నిశ్చయపరచుకోగలం? అలా చేయడం మనకెలాంటి ఆశీర్వాదాలు తెస్తుంది? తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషుర్‌లో 28వ పేజీ చూడండి.

మీరు వివరించగలరా?

•దేవుని “వచనము” ఎల్లప్పుడూ ‘సఫలమవుతుంది’ అని ఏ ప్రాచీన రుజువులు సాక్ష్యమిస్తున్నాయి?

•యెహోవా తన “నిత్య సంకల్పము” సంబంధంగా దేనిని ముందే నిర్ణయించాడు?

•విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా ఏ విధంగా ఉపయోగిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. బబులోను పతనానికి సంబంధించిన సంఘటనల విషయంలో అసాధారణ విషయమేమిటి, ఈ వాస్తవం యెహోవా గురించి ఏమి తెలియజేస్తోంది?

3. మనమిప్పుడు ఏ ప్రశ్నలకు జవాబులను పరిశీలిస్తాం?

4. బైబిల్లో వ్రాయబడివున్న ప్రవచనాల మూలకర్త ఎవరు?

5. యెహోవా కార్యాల గురించి ముందే తెలియడం ఏ బాధ్యతను తెస్తుంది?

6. బబులోను పతనానికి సంబంధించి యెహోవా “ఆలోచన” ఎలా సఫలమైంది?

7. యెహోవా “నోటనుండి వచ్చు వచనము” ఎల్లప్పుడు సఫలమౌతుందని మనమెందుకు నమ్మవచ్చు?

8. దేవుని “నిత్యసంకల్పము” ఏమిటి?

9. ఆదికాండము 3:⁠15 దేవుని సంకల్పంతో ఎలా సంబంధం కలిగివుంది?

10. ఆదాము హవ్వలు పాపం చేస్తారని ప్రారంభంలోనే యెహోవా ముందుగా నిర్ణయించాడా? వివరించండి.

11. యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ఏ పురోగతిని ముందే నిర్ణయించాడు?

12. లక్షా నలభై నాలుగు వేలమందిలోని ఆయా వ్యక్తులు ముందే నిర్ణయించబడినవారు కాదని మనకెలా తెలుసు?

13, 14. విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా ఉపయోగించే విధానం దేనికి అనుగుణంగా ఉంటుంది, ఎందుకు?

15, 16. ఏదెను తోటలో ఆదాము ఎదుట యెహోవా ఏ ఎంపికలు ఉంచాడు?

17. విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా తాను ఎంచుకున్న వాటినే తెలుసుకునేందుకు ఉపయోగిస్తాడని మనమెందుకు చెప్పవచ్చు?

18. విషయాలను ముందుగా తెలుసుకునేందుకు తనకున్న సామర్థ్యాన్ని యెహోవా తాను ఎంచుకున్న వాటిని తెలుసుకునేందుకు ఉపయోగించడం ఆయనలో అపరిపూర్ణత ఉందని ఎందుకు సూచించదు?

19. తర్వాతి ఆర్టికల్‌లో మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?

[22వ పేజీలోని చిత్రం]

యెహోషాపాతుకు యెహోవాపై నమ్మకముంది

[23వ పేజీలోని చిత్రం]

యేసు మరణ, పునరుత్థానాల గురించి దేవుడు ముందేచెప్పాడు

[24వ పేజీలోని చిత్రం]

ఆదాము హవ్వలు ఏమి చేస్తారనేది యెహోవా ముందుగానే నిర్ణయించాడా?