పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఒక వ్యక్తి జారత్వం లేదా కాముకత్వం (దుష్కామ ప్రవర్తన) వంటి కారణాలనుబట్టి బహిష్కరించబడినట్లే, అపవిత్రత కారణంగా కూడా క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడే అవకాశముందా?
ఉంది, ఒక వ్యక్తి పశ్చాత్తాపం కనబరచకుండా జారత్వానికి, కొన్ని రకాల అపవిత్రతకు, లేదా దుష్కామ ప్రవర్తనకు పాల్పడితే అతడు బహిష్కరించబడే అవకాశముంది. అపొస్తలుడైన పౌలు, బహిష్కరించేందుకు కారణమయ్యే ఇతర అపరాధాలతోపాటు ఈ మూడు పాపాలను పేర్కొన్నాడు: “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము . . . వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము . . . వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.”—గలతీయులు 5:19-21.
జారత్వము (గ్రీకులో, పోర్నియా) లేఖనాధారిత వివాహానికి వెలుపల అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడాన్ని సూచిస్తుంది. దీనిలో వ్యభిచారం, జారత్వం, అవివాహితుల మధ్య లైంగిక సంబంధాలు, ముఖ రతి, ఆసన సంభోగము, తన వివాహజత కాని వ్యక్తి మర్మాంగాలను స్పర్శిస్తూ
లైంగికంగా ఉద్రేకపరిచి తృప్తి పొందడం వంటివి ఇమిడివున్నాయి. ఒక వ్యక్తి పశ్చాత్తాపం చూపకుండా జారత్వానికి పాల్పడుతూవుంటే, అలాంటి వ్యక్తి క్రైస్తవ సంఘంలో సభ్యునిగా కొనసాగలేడు.దుష్కామ ప్రవర్తన (గ్రీకులో, ఎసెల్జియా) “నీతిబాహ్యతను; నికృష్టతను, పశుప్రవృత్తిని, కామోద్రేకాన్ని” సూచిస్తుంది. న్యూ థేయర్స్ గ్రీక్ ఇంగ్లీష్ లెక్సికన్ దానికి, “అదుపులేని లైంగికవాంఛ, విశృంఖలత, నిర్లజ్జతోకూడిన, అవాచ్యమైన” అనే మరితర పదాలను చేరుస్తోంది. మరో నిఘంటువు ప్రకారం దుష్కామ ప్రవర్తన అనేది “సామాజికంగా అంగీకరింబడే అన్ని హద్దుల్నీ ఉల్లంఘించే ప్రవర్తనను” సూచిస్తోంది.
పై నిర్వచనాలు చూపిస్తున్నట్లుగా, “దుష్కామ ప్రవర్తనలో” రెండు మూలాంశాలు చేరివున్నాయని తేల్చిచెప్పవచ్చు: (1) యెహోవా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించే ప్రవర్తన; (2) తప్పిదస్థుని అమర్యాదకరమైన, లెక్కలేని స్వభావం.
కాబట్టి, “దుష్కామ ప్రవర్తన” ఏదో అల్పమైన చెడు ప్రవర్తనను సూచించడం లేదు. అది దేవుని నియమాలను గంభీరంగా ఉల్లంఘించే క్రియలతోపాటు, విచ్చలవిడితనాన్ని, లెక్కలేనితనాన్ని, ప్రమాణాలపట్ల, నియమాలపట్ల, అధికారంపట్ల అమర్యాదకరమైన, ఉదాసీనమైన లేదా ధిక్కార స్వభావాన్ని ప్రతిబింబించే కృత్యాలను సూచిస్తోంది. పౌలు దుష్కామ ప్రవర్తనను కామవిలాసానికి ముడిపెడుతున్నాడు. (రోమీయులు 13:13, 14) గలతీయులు 5:19-21లో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఒక వ్యక్తిని అనర్హుణ్ణి చేసే అనేక పాపకార్యాల జాబితాలో దుష్కామ ప్రవర్తన పేర్కొనబడింది కాబట్టి, ఇది గద్దింపుకు, క్రైస్తవ సంఘం నుండి బహుశా బహిష్కరించేందుకు ఆధారాన్నిస్తుంది.
అపవిత్రత (గ్రీకులో, అకతార్సియా) అనేది “జారత్వం,” “అపవిత్రత,” “దుష్కామ ప్రవర్తన,” అనే ఈ మూడు పదాల కంటే మరింత విస్తృతమైన భావాన్ని కలిగివుంది. దీనిలో లైంగిక విషయాలకు, మాటలకు, చేతలకు, అపవిత్రమైన మతాచారాలు, నమ్మకాలకు సంబంధించిన అశుద్ధమైన ప్రతీది ఇమిడివుంది. “అపవిత్రత” అనేది వివిధ రకాల గంభీరమైన పాపాలకు వర్తిస్తుంది.
రెండవ కొరింథీయులు 12:21లో వ్రాయబడినట్లుగా, పౌలు “మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల (దుష్కామ ప్రవర్తన) నిమిత్తము మారుమనస్సు పొందని” వ్యక్తులను సూచిస్తున్నాడు. జారత్వం, దుష్కామ ప్రవర్తనతోపాటు “అపవిత్రత” కూడా పేర్కొనబడింది కాబట్టి, కొన్నిరకాల అపవిత్రత న్యాయపరమైన చర్య తీసుకునేందుకు ఆధారాన్నిస్తుంది. అయితే అపవిత్రత అనేది న్యాయపరమైన భావంలేని అనేక విషయాలు ఇమిడివున్న సాధారణ పదం. కాస్త మురికిగా లేదా బొత్తిగా రోతపుట్టించే ఇంటిలాగే అపవిత్రతలో వివిధ స్థాయిలున్నాయి.
ఎఫెసీయులు 4:19లో పౌలు, కొందరు ‘సిగ్గులేనివారై నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు (దుష్కామ ప్రవర్తనకు) అప్పగించుకొన్నారని’ చెప్పాడు. ఆ విధంగా పౌలు “అపవిత్రతను అత్యాశతో” చేయడాన్ని దుష్కామ ప్రవర్తనగానే పేర్కొంటున్నాడు. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి పశ్చాత్తాపం చూపించకుండా “అపవిత్రతను . . . అత్యాశతో” చేస్తూవుంటే, ఘోరమైన అపవిత్రత ఆధారంగా ఆయనను బహిష్కరించే అవకాశముంది.
ప్రధానం చేసుకున్న ఒక జంట చాలా సందర్భాల్లో కామోద్రేకంతో అదేపనిగా ముద్దులు పెట్టుకున్నారని అనుకుందాం. వీరు అపవిత్రతతో కూడిన లెక్కలేని స్వభావాన్ని కనబరచకపోయినా, వారి ప్రవర్తనలో కొంతమేరకు “అత్యాశ” ఉన్నట్లు పెద్దలు నిర్ణయించవచ్చు. కాబట్టి, ఘోరమైన అపవిత్రత చోటుచేసుకున్న కారణంగా పెద్దలు వారిపై న్యాయపరమైన చర్య తీసుకోవచ్చు. కేవలం లైంగిక విషయాలే మాట్లాడేందుకు మరొకరికి అదేపనిగా ఫోను చేస్తున్న వ్యక్తికి సంబంధించి, ముఖ్యంగా ఆ వ్యక్తిని అంతకుముందు మందలించివుంటే, అతని కేసు విచారణకు ఘోరమైన అపవిత్రత సముచితమైన ఆధారంగా ఉండవచ్చు.
అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలకు వివేచన అవసరం. న్యాయపరమైన చర్య తీసుకోవడం అవసరమా లేదా అని నిర్ణయించేటప్పుడు అసలు ఏమి జరిగింది, ఎంత విస్తృతంగా జరిగింది అనేవాటిని వారు జాగ్రత్తగా పరిశీలించాలి. లేఖనాధారిత ఉపదేశాన్ని అంగీకరించని వ్యక్తి దుష్కామ ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపణ చేయడం లేదా న్యాయపరమైన చర్య తీసుకునేందుకు ముందు ఒక వ్యక్తి ఫలాని తప్పును ఎన్నిసార్లు చేయవచ్చో లెక్కగట్టి నిర్ణయించడమో కాదు. పెద్దలు ప్రతి పరిస్థితిని, సందర్భాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి, ఏమి జరిగింది, ఎంత తరచుగా జరిగింది, ఆ దుష్ప్రవర్తనా స్వభావాన్ని, విస్తృతిని, వాంఛను, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఘోరమైన అపవిత్రత లైంగిక అపరాధాలకు మాత్రమే పరిమితం కాదు. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకున్న బాలుడు కొన్నిరోజుల వ్యవధిలో కొన్ని సిగరెట్లు త్రాగాడు. అయితే అతను తన తల్లిదండ్రుల ఎదుట ఆ విషయాన్ని 2 కొరింథీయులు 7:1) ఆ బాలుడు పశ్చాత్తాపం చూపించకపోతే, అతడు బహిష్కరించబడతాడు.
ఒప్పుకున్నాడు. అతను మళ్లీ సిగరెట్లు త్రాగకూడదని నిశ్చయించుకున్నాడు. ఇది అపవిత్రతే, కానీ అది ఘోరమైన అపవిత్రత కాదు లేదా ‘అత్యాశతోకూడిన . . . అపవిత్రత’ అంత స్థాయికి చేరుకోలేదు. ఆ అబ్బాయి తల్లిదండ్రుల తోడ్పాటుతో ఒకరు లేదా ఇద్దరు పెద్దలిచ్చే లేఖనాధారిత హితవు సరిపోతుంది. అయితే ఆ అబ్బాయి తరచూ పొగాకు ఉపయోగించేవాడైతే, అది శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా కల్మషం చేసుకున్నట్లవుతుంది, కాబట్టి ఘోరమైన అపవిత్రతకు సంబంధించిన ఈ కేసును విచారించేందుకు న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. (కొందరు క్రైస్తవులు అశ్లీల చిత్రాలు చూడడంలో చిక్కుకున్నారు. దేవుని దృష్టికి అది అసహ్యం, తోటి విశ్వాసి ఈ పని చేయడం చూసి పెద్దలు దిగ్భ్రాంతి చెందవచ్చు. అశ్లీలతను చూడడమే న్యాయనిర్ణయ కమిటీకి ఆధారాన్నివ్వదు. ఉదాహరణకు, ఒక సహోదరుడు “సాఫ్ట్కోర్” అని పిలువబడే అశ్లీలతను చాలా సందర్భాల్లో చూశాడు. ఆయన అవమానంతో ఒక పెద్ద ఎదుట తన తప్పును ఒప్పుకుని, మళ్లీ అలాంటి పాపం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ సహోదరుని ప్రవర్తన “ప్రతివిధమైన అత్యాశతోకూడిన అపవిత్రతగా” ఎంచదగిన స్థాయిలో లేదని ఆ పెద్ద నిర్ణయించవచ్చు. లేక అతడు దుష్కామ ప్రవర్తనను సూచించే లెక్కలేని స్వభావాన్ని కనబరచలేదు. న్యాయపరమైన చర్య అవసరం లేకపోయినా, ఈ విధమైన అపవిత్రతకు యోగ్యమైన లేఖన మందలింపుతోపాటు, ఆ తర్వాత పెద్దల సహాయం కూడా అవసరమౌతుంది.
ఒక క్రైస్తవుడు చాలా సంవత్సరాలుగా రహస్యంగా జుగుప్సాకరమైన, విశృంఖలమైన లైంగిక అశ్లీలతను చూస్తూ, తాను చేస్తున్న పనిని దాచిపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అలాంటి అశ్లీలతలో సామూహిక అత్యాచారం, నిర్భందం, పాశవిక చిత్రహింస, క్రూరంగా స్త్రీలను హింసించడం లేదా చిన్నపిల్లల అశ్లీలత ఉండవచ్చు. తన ప్రవర్తన ఇతరులకు తెలిసినప్పుడు, ఆయన చాలా సిగ్గుపడ్డాడు. ఆయన దృక్పథం లెక్కలేని స్వభావంతో కూడుకున్నది కాకపోయినా, ఆయన ఈ చెడు అలవాటుకు ‘తననుతాను అప్పగించుకొని,’ ‘అత్యాశతతో కాముకత్వాన్ని’ లేదా దుష్కామ ప్రవర్తనను అభ్యసించడం ఆరంభించాడు, ఇది ఘోరమైన అపవిత్రత అని పెద్దలు తీర్మానించవచ్చు. ఘోరమైన అపవిత్రత ఇమిడివున్న కారణంగా న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అశ్లీలతను మరెన్నటికీ చూడకూడదనే దృఢ నిశ్చయంతోపాటు ఆ తప్పిదస్థుడు దైవిక పశ్చాత్తాపాన్ని కనబరచకపోతే, అతను బహిష్కరించబడతాడు. అతను అశ్లీలతను చూసేందుకు ఇతరులను తన ఇంటికి ఆహ్వానిస్తుంటే, అలా అశ్లీలతను ప్రోత్సహిస్తుంటే, అతను లెక్కలేని స్వభావంతో కూడిన దుష్కామ ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిగా ఉంటాడు.
లేఖనాధార పదమైన దుష్కామ ప్రవర్తనలో ఎల్లప్పుడూ గంభీరమైన పాపం, తరచూ లైంగిక పాపం ఇమిడివుంటుంది. ఆ దుష్కామ ప్రవర్తనను గుర్తించడానికి ప్రయత్నించేటప్పుడు, పెద్దలు అది లెక్కలేనితనాన్ని, పశుప్రవృత్తిని, నికృష్టతను, నిర్లజ్జతను ప్రదర్శించేదిగా, ప్రజా మర్యాదకు దిగ్భ్రాంతిని కలిగించేదిగా ఉందోలేదో చూడాలి. మరో వైపు, లెక్కలేని స్వభావాన్ని కనబరచని వ్యక్తి యెహోవా నియమానికి వ్యతిరేకంగా చేసిన గంభీరమైన అపరాధాల్లో “అత్యాశ” ఇమిడి ఉండవచ్చు. అలాంటివాటిలో ఇమిడివుండే వారి కేసులను ఘోరమైన అపవిత్రత ఆధారంగా విచారించాలి.
ఒక వ్యక్తి ఘోరమైన అపవిత్రత లేదా దుష్కామ ప్రవర్తన విషయంలో దోషిగా ఉన్నాడా లేదా అని తీర్మానించడం ఒక గంభీరమైన బాధ్యత, ఎందుకంటే దానిలో జీవితాలు ఇమిడివున్నాయి. కాబట్టి, అలాంటి విషయాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు దేవుని పరిశుద్ధాత్మ, వివేచన, అవగాహన కోసం వేడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వ్యవహరించాలి. పెద్దలు సంఘ పవిత్రతను కాపాడుతూ, తమ తీర్పుకు యెహోవా వాక్యాన్ని, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించిన నిర్దేశాన్ని ఆధారం చేసుకోవాలి. (మత్తయి 18:18; మత్తయి 24:45) ఈ చెడు దినాల్లో పెద్దలు క్రితమెన్నటికన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఈ మాటల్ని గుర్తుంచుకోవాలి: ‘మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు, గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.’—2 దినవృత్తాంతములు 19:6.