ఆయన యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించాడు
ఆయన యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించాడు
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్ డి. ష్రోడర్, మార్చి 8 2006, బుధవారం తన భూజీవితాన్ని ముగించారు. ఆయనకు 94 ఏళ్లు, ఆయన పూర్తికాల పరిచర్యలో 73 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిపాడు.
సహోదరుడు ష్రోడర్ 1911లో, అమెరికాలోని మిచిగాన్‌లో ఉన్న సాగానోలో జన్మించాడు. * వాళ్ళ అమ్మమ్మ ఆయనకు చిన్నతనంలో బైబిలు గురించి ఎన్నో విషయాలు నేర్పించడమే కాక, యెహోవా వాక్యాన్ని చదివే అభిలాషను కూడా పెంచింది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయంలో లాటిన్, జర్మన్ భాషలను నేర్చుకున్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను చదివాడు. అయితే, లేఖనాల గురించిన అవగాహన పెరిగినప్పుడు, ఆయన పూర్తికాల రాజ్య ప్రకటనా పనిని చేపట్టేందుకు తన చదువు ఆపేశాడు. 1932లో ఆయన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బెతెల్ కుటుంబ సభ్యుడయ్యాడు.
సహోదరుడు ష్రోడర్ 1937లో తన 26వ ఏట బ్రిటన్‌లోని యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షించేందుకు నియమించబడ్డాడు. ప్రకటనా పనిపట్ల ఆయన చూపించిన ఉత్సాహం అక్కడున్న చాలామంది పూర్తికాల పరిచర్యను చేపట్టేందుకు ప్రోత్సహించింది. లండన్ బెతెల్‌లో ఆయనతో సహవసించిన వారిలో జాన్ ఇ. బార్ అనే యువకుడు ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ కలిసి పరిపాలక సభలో అనేక సంవత్సరాలు సేవచేశారు.
యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో యెహోవాసాక్షుల కోసం సహోదరుడు ష్రోడర్ చేస్తున్న పని అధికారుల దృష్టిలో పడింది. 1942 ఆగస్టులో ఆయన బ్రిటన్ నుండి బహిష్కరించబడ్డాడు. యుద్ధం జరుగుతుండగా ఆయన అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత కష్టభరితమైన ప్రయాణం చేసి చివరకు సెప్టెంబరులో బ్రూక్లిన్‌కు చేరుకున్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఎంతో విస్తృతమైన పని చేయాల్సివుంటుందని యెహోవా సేవకులు అప్పటికే ఎదురుచూస్తున్నారు. వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు సంబంధించిన అధ్యయన కోర్సును తయారుచేసేందుకు సహాయం చేయడమనే తర్వాతి నియామకాన్ని పొందినప్పుడు ఆయన ఆశ్చర్యపోవడమే కాక సంతోషించాడు కూడా. ఆయన అక్కడ మిషనరీలకు శిక్షణ ఇవ్వడంలో సహాయం చేస్తూ కొన్ని సంవత్సరాలు ఉపదేశకునిగా సేవ చేశాడు. గిలియడ్‌లో, ఆ తర్వాత రాజ్య పరిచర్య పాఠశాలలో ఆయన ఉపదేశించిన విద్యార్థులకు ఆయన నిర్వహించిన తరగతుల గురించి ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి. ఆయన తన విద్యార్థుల్లో దేవుని నియమాలపట్ల ప్రేమను పెంపొందించడంలో ఆనందించాడు, యెహోవాను తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆయన నొక్కిచెప్పాడు.
సహోదరుడు ష్రోడర్ 1956లో షార్లట్ బొవాన్‌ను పెళ్ళి చేసుకున్నాడు, వారికి 1958లో జూడా బెన్ జన్మించాడు. సహోదరుడు ష్రోడర్ మాదిరికరమైన క్రైస్తవ భర్త, తండ్రి. ఆయన 1974లో పరిపాలక సభలో సేవచేయడం ప్రారంభించాడు, ఆయన అంతర్దృష్టి ఎంతో విలువైనదిగా పరిగణించబడేది. ఆయన దయ, వినయం కలిగినవాడు, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఆయన దేవుని గొప్ప నామాన్ని ఘనపర్చాలనుకునేవాడు. ‘యెహోవా ధర్మశాస్త్రంలో’ నిజంగా ‘ఆనందించిన’ అభిషిక్త క్రైస్తవునిగా ఆయనకు పరలోక నిరీక్షణ లభించిందని మేము నమ్ముతున్నాం.—కీర్తన 1:2.
[అధస్సూచి]
^ పేరా 3 సహోదరుడు ష్రోడర్ జీవిత కథ కావలికోట (ఆంగ్లం), మార్చి 1, 1988 సంచికలో ప్రచురించబడింది.