పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
వాహనం నడుపుతున్న క్రైస్తవుడు చేసిన ఆక్సిడెంట్వల్ల ఇతరులెవరైనా మరణిస్తే, సంఘం ఏమిచేయాలి?
ఆ క్రైస్తవుడు రక్తాపరాధి అవునో కాదో సంఘం పరిశీలించాలి, ఎందుకంటే ఆ రక్తాపరాధం కారణంగా సామాజిక దోషం సంఘం మీదికి రాకుండా చూసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 21:1-9; 22:8) ప్రాణాలు తీసిన ఆ ప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినా లేక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ భద్రతా నియమాలను లేక రహదారి నియమాలను ఉల్లంఘించినా ఆయన రక్తాపరాధి కావచ్చు. (మార్కు 12:14) అయితే, ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఒక నరహంతకుడు ఇశ్రాయేలీయుల ఆశ్రయపురాలలో ఒకదానికి పారిపోయినప్పుడు అతడు అక్కడ తీర్పు కోసం వేచివుండాలి. అతడు పొరపాటున ఒక వ్యక్తిని చంపాడని రుజువైతే, అతడు ప్రతిహత్య చేసే వ్యక్తి చేతిలో మరణించకుండా అక్కడే ఉండడానికి అనుమతించబడేవాడు. (సంఖ్యాకాండము 35:6-25) కాబట్టి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణానికి క్రైస్తవుడు బాధ్యుడైతే, ఆయన రక్తాపరాధి అవునో కాదో నిర్ధారించేందుకు పెద్దలు పరిశోధించాలి. ప్రభుత్వ అభిప్రాయం లేక కోర్టు ఇచ్చే తీర్పు సంఘం తీసుకునే చర్యను ఏ మాత్రం తీర్మానించదు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి కొన్ని ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టు ఆయనను అపరాధిగా నిర్ణయించవచ్చు, కానీ ఈ విషయాన్ని పరిశోధిస్తున్న పెద్దలు, ప్రాణహానికి దారితీసిన పరిస్థితులు ఆ వాహనం నడిపిస్తున్న వ్యక్తి అదుపులో లేని కారణాన్నిబట్టి ఆయన రక్తాపరాధికాదని నిర్ధారించవచ్చు. ఒకవేళ కోర్టు ఆ కేసును కొట్టిపారేసినప్పటికీ, పెద్దలు అతడు రక్తాపరాధి అని నిర్ధారించవచ్చు.
ఆ విషయాన్ని పరిశోధిస్తున్న పెద్దలు మాత్రం, లేఖనాల ఆధారంగా, స్పష్టంగా రుజువుచేయబడిన వాస్తవాల ఆధారంగా అంటే వాహనం నడిపిస్తున్న వ్యక్తి తప్పు ఒప్పుకోవడం మరియు/లేక నమ్మదగిన ఇద్దరు ముగ్గురు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 17:6; మత్తయి 18:15, 16) ఆ వ్యక్తి రక్తాపరాధి అని రుజువైతే, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటుచేయాలి. రక్తాపరాధి అయిన వ్యక్తి పశ్చాత్తాపపడినట్లు కమిటీ నిర్ధారిస్తే, ఆయనకు సముచితమైన లేఖనాల నుండి గద్దింపు ఇవ్వడమే కాక, ఆయనకు సంఘంలో ఆధిక్యతల విషయంలో ఆంక్షలు విధించబడతాయి. ఆయన పెద్దగా లేక పరిచర్య సేవకునిగా కొనసాగలేడు. ఇతర ఆంక్షలు కూడా విధించబడతాయి. ఆయన చూపించిన నిర్లక్ష్యం, అశ్రద్ధ లేక అజాగ్రత్తవల్ల కలిగిన ప్రమాదం ప్రాణహానికి దారితీసినందుకు ఆయన దేవునికి జవాబుదారిగా ఉంటాడు.—గలతీయులు 6:5, 7.
ఉదాహరణకు, ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం సరిగాలేనప్పుడు వాహనం నడిపే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. నిద్రవస్తున్నట్లు అనిపిస్తే, వాహనం ఆపుచేసి నిద్ర తీరేవరకు నిద్రపోవడమో లేదా వాహనాన్ని మరొక వ్యక్తి నడపడానికో ఇవ్వాల్సింది.
ఒకవేళ వాహనాన్ని నడిపేవ్యక్తి వేగపరిమితిని మించి నడిపిస్తే అప్పుడేమిటి? ఏ క్రైస్తవుడైనా వేగపరిమితిని మించి నడిపితే, ఆయన “కైసరువి కైసరునకు” ఇవ్వడంలో విఫలమయ్యాడు. అలా నడపడం ప్రాణాపాయ పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి, జీవానికున్న పవిత్రత విషయంలో అతనికి గౌరవంలేదని కూడా అది చూపిస్తుంది. (మత్తయి 22:21) దీనికి సంబంధించి, మరిన్ని విషయాలు పరిశీలించండి. కైసరు విధించిన ట్రాఫిక్ నియమాలపట్ల ఒక పెద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లేదా ఉద్దేశపూర్వకంగా వాటికి లోబడకపోతే ఆయన మందకు ఎలాంటి మాదిరిని ఉంచగలడు?—1 పేతురు 5:3.
వేగ పరిమితిని మించి ప్రయాణిస్తే తప్ప ఒక స్థలానికి సకాలంలో చేరుకోవడం పూర్తిగా అసాధ్యమయ్యే పరిస్థితిని క్రైస్తవులు తమ తోటి క్రైస్తవులకు కల్పించకూడదు. అయితే, చాలా సందర్భాల్లో, ముందుగానే ప్రయాణం ప్రారంభిస్తే లేక ప్రయాణానికి సమయం సరిపోయేలా ఒక వ్యక్తి తన కాలపట్టికను మార్చుకుంటే సరిపోతుంది. అలా చేస్తే, ఆ క్రైస్తవుడు వేగ పరిమితిని మించి నడిపే శోధనకు గురవకుండా ప్రభుత్వ “పై అధికారుల” ట్రాఫిక్ నియమాలకు లోబడే వాహనాన్ని నడపగలుగుతాడు. (రోమీయులు 13:1, 5) రక్తాపరాధానికి దారితీయగల ప్రాణాపాయ ప్రమాదాలు చేయకుండా ఉండేలా అది వాహనం నడిపే వ్యక్తికి సహాయం చేస్తుంది. సరైన మాదిరి ఉంచడానికి, మంచి మనస్సాక్షితో ఉండడానికి కూడా అది ఆయనకు సహాయం చేస్తుంది.—1 పేతురు 3:15.