“మనమిక్కడ ఎందుకున్నాం?”
“మనమిక్కడ ఎందుకున్నాం?”
నా జీ మారణహోమం నుండి సజీవంగా బయటపడిన నోబుల్ బహుమతి గ్రహీత ఎలీ వీజెల్, “మానవుడు ఆలోచించాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న” అని దాని గురించి ఒకప్పుడు అన్నాడు. ఆ ప్రశ్న ఏమిటి? “మనమిక్కడ ఎందుకున్నాం?” అనేదే ఆ ప్రశ్న.
ఆ ప్రశ్న గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఆ ప్రశ్న గురించి ఆలోచించారు గానీ వారికి జవాబు దొరకలేదు. జీవితానికున్న అర్థాన్ని కనుగొనే ప్రయత్నంలో, బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టోయెన్బీ ఇలా రాశాడు: “దేవుణ్ణి మహిమపరచి, ఆయన నుండి నిత్య సంతోషాన్ని పొందాలనేదే మానవుని లక్ష్యంగా ఉండాలి.”
ఆసక్తికరంగా, మూడు సహస్రాబ్దులకన్నా ఎక్కువకాలం క్రితం, జీవితాన్ని నిశితంగా పరిశీలించాడని పేరుగాంచిన మరో వ్యక్తి ఆ ప్రశ్నకు ప్రాథమిక జవాబును ఎప్పుడో కనుగొన్నాడు. జ్ఞానియైన సొలొమోను ఇలా చెప్పాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ ప్రాథమిక సూత్రాన్ని సమర్థించాడు. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు తన పరలోక తండ్రిని మహిమపరిచేందుకు ప్రతీ ప్రయత్నం చేశాడు. సృష్టికర్తను సేవించడం యేసు జీవితాన్ని సుసంపన్నం చేసింది. అది ఆయనను పోషించింది, ఆయనిలా అనేలా చేసింది: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుట . . . నాకు ఆహారమై యున్నది.”—యోహాను 4:34.
అయితే మనమిక్కడ ఎందుకున్నాం? యేసు, సొలొమోను, దేవుని ఇతర అనేక సేవకుల్లాగే, దేవుని చిత్తం చేయడం ద్వారా మనం జీవితానికున్న నిజమైన అర్థాన్ని, నిత్య సంతోషాలను కనుగొనగలం. దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఎలా ఆరాధించాలి అనే విషయం గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? (యోహాను 4:24) మనమిక్కడ ఎందుకున్నాము? అనే ప్రశ్నకు మీకు సమాధానం ఇచ్చేందుకు మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు.