కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ధైర్యముతో’ సమగ్రంగా సాక్ష్యమివ్వడం

‘ధైర్యముతో’ సమగ్రంగా సాక్ష్యమివ్వడం

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

‘ధైర్యముతో’ సమగ్రంగా సాక్ష్యమివ్వడం

దేవునికి విధేయుడైన ఒక సేవకుణ్ణి కోపోద్రిక్తులైన మూక కొట్టి చంపడానికి సిద్ధంగా ఉంది. కానీ, ఆఖరి క్షణంలో ఆయనను రోమా సైనికులు ఆ దుండుగుల నుండి తప్పించి నిర్బంధిస్తారు. ఆ ఘటనతో దాదాపు ఐదు సంవత్సరాలు కొనసాగిన సంఘటనల పరంపర మొదలైంది. తత్ఫలితంగా ఉన్నత పదవుల్లో ఉన్న అనేకమంది రోమా అధికారులు యేసుక్రీస్తు గురించి వింటారు.

ఆ బాధననుభవించిన వ్యక్తి అపొస్తలుడైన పౌలు. దాదాపు సా.శ. 34వ సంవత్సరంలో పౌలు (సౌలు) “రాజుల” ముందు తన గురించి సాక్ష్యమిస్తాడని యేసు వెల్లడిచేశాడు. (అపొస్తలుల కార్యములు 9:​15) సా.శ. 56వ సంవత్సరంనాటికి ఇంకా అలా జరగలేదు. అయితే, ఆ అపొస్తలుడు తన మూడవ మిషనరీ యాత్రను పూర్తిచేస్తుండగా పరిస్థితుల్లో మార్పులు సంభవించనున్నాయి.

దాడిచేసినా నిరుత్సాహపడలేదు

పౌలు యెరూషలేమువైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆయన ఆ పట్టణంలో తీవ్రంగా హింసించబడతాడని కొందరు క్రైస్తవులు “ఆత్మ ద్వారా” ఆయనను హెచ్చరించారు. కానీ పౌలు ధైర్యంగా వారికిలా జవాబిచ్చాడు: “నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను.” (అపొస్తలుల కార్యములు 21:​4-14) పౌలు యెరూషలేములోని దేవాలయానికి వెళ్ళగానే, ఆయన ఆసియాలో సువార్త ప్రకటించడంలో సాధించిన విజయం గురించి తెలిసిన ఆసియాలోని యూదులు ఆయనను చంపడానికి మూకను ఉసిగొల్పారు. రోమా సైనికులు ఆయనను సరైన సమయంలో ఆదుకున్నారు. (అపొస్తలుల కార్యములు 21:​27-32) అలా రక్షించబడడంవల్ల కోపోద్రిక్తులైన వ్యక్తులకు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి క్రీస్తు గురించిన సత్యాన్ని ప్రకటించేందుకు ఆయనకు అరుదైన అవకాశాలు లభించాయి.

చేరుకోవడానికి సాధ్యంకాని వారికి ప్రకటించడం

ఆంటోనియా కోట మెట్లమీదుగా పౌలు సురక్షిత స్థలానికి తీసుకెళ్ళబడతాడు. * మతాసక్తిపరులైన ఆ మూకకు అపొస్తలుడు మెట్లపైనుండి శక్తివంతమైన సాక్ష్యమిస్తాడు. (అపొస్తలుల కార్యములు 21:⁠33-22:​21) కానీ అన్యులకు ప్రకటించాలని తనకివ్వబడిన నియామకం గురించి ఆయన ప్రస్తావించగానే మళ్ళీ హింస చెలరేగింది. యూదులు పౌలుపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవడానికి పౌలును కొరడాలతో కొట్టి విచారణ చేయాలని సహస్రాధిపతి లూసియ ఆజ్ఞాపిస్తాడు. అయితే, పౌలు తాను రోమా పౌరుణ్ణని చెప్పగానే ఆ శిక్ష నిలిపివేయబడుతుంది. యూదులు పౌలుపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవడానికి మరుసటి రోజు లూసియ ఆయనను మహాసభ దగ్గరికి తీసుకువెళ్ళాడు.​—⁠అపొస్తలుల కార్యములు 22:​22-30.

ఆ ఉన్నత న్యాయస్థానంలో తన తోటి యూదులకు సాక్ష్యమిచ్చేందుకు పౌలుకు మరో మంచి అవకాశం లభిస్తుంది. ధైర్యస్థుడైన ఆ సువార్తికుడు పునరుత్థానంపట్ల తనకున్న నమ్మకాన్ని గురించి అక్కడ సాక్ష్యమిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 23:​1-8) ఆయనను చంపాలనుకున్న యూదుల పగ ఇంకా చల్లారలేదు కాబట్టి పౌలును కోటలోనికి లేదా సైనికుల స్థావరానికి తీసుకెళ్తారు. మరుసటి రాత్రి ఆయనకు బలపర్చే ఈ హామీని ప్రభువు ఇస్తాడు: “ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్యవలసియున్నది.”​—⁠అపొస్తలుల కార్యములు 23:​9-11.

యూదయకు రోమా పరిపాలక రాజధానియైన కైసరయకు పౌలు రహస్యంగా తరలించబడడంతో ఆయనను చంపాలని చేసిన పన్నాగం భగ్నమైంది. (అపొస్తలుల కార్యములు 23:​12-24) కైసరయలో, పౌలుకు మరిన్ని సువర్ణావకాశాలు లభించి, ఆయన “రాజుల”కు సాక్ష్యమిస్తాడు. కానీ, పౌలు తన మీద మోపబడిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అధిపతియైన ఫేలిక్సుకు ముందుగా నిరూపిస్తాడు. ఆ తర్వాత, పౌలు అతనికి అతని భార్య ద్రుసిల్లాకు యేసు గురించి, ఆశానిగ్రహం, నీతి, రాబోయే తీర్పు వంటివాటి గురించి బోధిస్తాడు. కానీ, ఫేలిక్సుకు తాను ఆశించిన లంచం దొరక్కపోయేసరికి అతడు పౌలును రెండు సంవత్సరాలు చెరసాలలో ఉంచుతాడు.​—⁠అపొస్తలుల కార్యములు 23:33-24:​27.

ఫేలిక్సు స్థానంలోకి ఫేస్తు వచ్చినప్పుడు పౌలుకు మరణదండన విధించబడి, చంపబడేలా యూదులు తమ ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించారు. కైసరయలో రెండవసారి ఆయన విషయం విచారణకు వచ్చినప్పుడు, విచారణ యెరూషలేముకు తరలించబడకుండా ఉండడానికి పౌలు, “[నేను] కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; . . . కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.” (అపొస్తలుల కార్యములు 25:​1-11, 20, 21) కొన్నిరోజుల తర్వాత, పౌలు రాజైన హేరోదు అగ్రిప్ప II ముందు తన వాదనను చెప్పుకున్నప్పుడు, రాజు ఇలా అన్నాడు: “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే.” (అపొస్తలుల కార్యములు 26:​1-28) దాదాపు సా.శ. 58లో పౌలు రోముకు పంపించబడతాడు. అక్కడ రెండు సంవత్సరాలకన్నా ఎక్కువకాలం ఖైదీగా ఉన్న సమర్థుడైన ఆ అపొస్తలుడు క్రీస్తు గురించి ప్రకటించే మార్గాలను కనుగొనడంలో కొనసాగాడు. (అపొస్తలుల కార్యములు 28:​16-31) చివరకు నీరో చక్రవర్తిని కలుసుకొనే అవకాశం పౌలుకు లభించినట్లు కనిపిస్తోంది. ఆయన, పౌలు నిరపరాధి అని ప్రకటించడంతో స్వేచ్ఛగల వ్యక్తిగా ఆయన తన మిషనరీ సేవను పునఃప్రారంభించగలిగాడు. అలాంటి ప్రముఖులకు సువార్త ప్రకటించే అవకాశాలు ఇతర అపొస్తలులకు దొరికినట్లు ఎక్కడా వ్రాయబడలేదు.

పైవివరాలు చూపిస్తున్నట్లుగా, అపొస్తలుడైన పౌలు, యూదా న్యాయస్థానం ముందు తన తోటి క్రైస్తవులు ఇంతకుముందు చెప్పిన, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అనే ప్రాముఖ్యమైన సూత్రానికి అనుగుణంగా జీవించాడని స్పష్టమౌతోంది. (అపొస్తలుల కార్యములు 5:​29) ఆయన మనకోసం ఎంత చక్కని మాదిరినుంచాడో కదా! మానవులు ఆయనను ఆపడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించినా, ఆ అపొస్తలుడు సమగ్ర సాక్ష్యమివ్వాలనే ఆజ్ఞకు పూర్తిగా లోబడ్డాడు. తాను దేవునిపట్ల చూపించిన అచంచలమైన విధేయత కారణంగా పౌలు “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను” యేసు నామము భరించడానికి “ఏర్పరచుకొనిన సాధనము”గా తన నియామకాన్ని నెరవేర్చాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:​15.

[అధస్సూచి]

^ పేరా 8 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2006 (ఆంగ్లం)లో నవంబరు/డిసెంబరు చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పౌలు తననుతాను సమర్థించుకోవడంపట్లే శ్రద్ధ చూపించాడా?

ఆ ప్రశ్న గురించి వ్యాఖ్యానిస్తూ రచయిత బెన్‌ విథరింగ్‌టన్‌ III ఇలా వ్రాశాడు: “పౌలు . . . దృక్కోణం నుండి చూస్తే, ఆయనకు తననుతాను సమర్థించుకోవడంకన్నా యూదా అధికారులకు, అన్యులైన అధికారులకు సువార్త గురించి సాక్ష్యమివ్వాలనేదే ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. . . . నిజానికి, పౌలు కాదుగానీ సువార్తే విచారణకు తేబడింది.”