యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు—I
యెహోవా వాక్యము సజీవమైనది
యెషయా గ్రంథములోని ముఖ్యాంశాలు—I
“నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును?” యెహోవా దేవుని నుండి వచ్చిన ఈ ఆహ్వానానికి ఆమోజు కుమారుడైన యెషయా ఇలా సమాధానమిచ్చాడు: “చిత్తగించుము నేనున్నాను! నన్ను పంపుము!” (యెషయా 1:1; 6:8) ఆ సమయంలోనే, ఆయన ప్రవక్తగా తన నియామకాన్ని అందుకున్నాడు. యెషయా ప్రవచన కార్యకలాపాలు ఆయన పేరుగల బైబిలు పుస్తకంలో వ్రాయబడ్డాయి.
ప్రవక్త స్వయంగా వ్రాసిన యెషయా గ్రంథము సా.శ.పూ. 778 నుండి సా.శ.పూ. 732 తర్వాత కొంతకాలం వరకు, అంటే 46 సంవత్సరాల కాలనిడివిలో జరిగిన విషయాలను తెలియజేస్తుంది. ఈ గ్రంథములో యూదాకు, ఇశ్రాయేలుకు వాటి చుట్టుప్రక్కల దేశాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఉన్నప్పటికీ దాని ప్రధానాంశం తీర్పుకు సంబంధించినది కాదు. బదులుగా, అది ‘యెహోవా దేవుడు అనుగ్రహించే రక్షణకు’ సంబంధించినది. (యెషయా 25:9) వాస్తవానికి, యెషయా అనే పేరుకు అర్థం “యెహోవా ఇచ్చే రక్షణ.” ఈ ఆర్టికల్లో యెషయా 1:1–35:10 వచనాల ముఖ్యాంశాలు చర్చించబడతాయి.
‘శేషము మాత్రమే తిరిగివచ్చును’
యెషయా గ్రంథములోని మొదటి ఐదు అధ్యాయాల్లో వ్రాయబడివున్న ప్రవచనార్థక సందేశం, ఆయన ప్రవక్తగా నియమించబడక ముందు అందజేయబడిందో లేక ఆ తర్వాత అందజేయబడిందో బైబిలు చెప్పడంలేదు. (యెషయా 6:6-9) అయితే, యూదా యెరూషలేములు “అరకాలు మొదలుకొని తలవరకు” ఆధ్యాత్మికంగా రోగగ్రస్థమై ఉన్నాయన్నది మాత్రం స్పష్టం. (యెషయా 1:6) విగ్రహారాధన విస్తృతంగా వ్యాపించింది. నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. స్త్రీలు అహంకారులయ్యారు. ప్రజలు సత్యదేవునికి అంగీకారమైన విధంగా సేవించడం లేదు. వివేచనలేని, గ్రహించడం ఇష్టంలేని వారికి పదే పదే వెళ్ళి చెప్పే పని యెషయాకు అప్పగించబడింది.
ఇశ్రాయేలు సిరియాల సంకీర్ణ సైన్యాలవల్ల యూదాకు ముప్పు పొంచివుంది. యెహోవా యెషయాను, ఆయన పిల్లలను “సూచనలుగాను, మహత్కార్యములుగాను” ఉపయోగిస్తూ సిరియా ఇశ్రాయేలు కూటమి విజయం సాధించదని యూదాకు హామీ ఇస్తాడు. (యెషయా 8:18) అయితే, “సమాధానకర్తయగు అధిపతి” పరిపాలన ద్వారా మాత్రమే శాశ్వత సమాధానం వస్తుంది. (యెషయా 9:6, 7) యెహోవా, తన “కోపమునకు సాధనమైన దండము”గా ఉపయోగించుకుంటున్న అష్షూరు దేశానికి కూడా తీర్పు తీరుస్తాడు. యూదా చివరకు చెరపట్టబడుతుంది, కానీ ‘శేషము మాత్రమే తిరిగివచ్చును.’ (యెషయా 10:5, 21, 22) ‘యెష్షయి మొద్దునుండి పుట్టిన’ సూచనార్థకమైన “చిగురు” పరిపాలన క్రింద నిజమైన న్యాయం వాస్తవంగా ఉంటుంది.—యెషయా 11:1.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
1:8, 9—సీయోను కుమార్తె “ద్రాక్షతోటలోని గుడిసెవలెను [‘పందిరివలే,’ NW] దోసపాదులలోని పాకవలెను” ఎలా విడువబడుతుంది? అంటే అది అష్షూరీయుల దాడి సమయంలో, యెరూషలేము ద్రాక్షతోటలోని గుడిసెలా లేక దోసపాదులలోని సులభంగా కూలిపోయే పాకలా ఎంతో బలహీనంగా కనిపిస్తుంది. కానీ యెహోవా దానికి సహాయంచేసి,
అది సొదొమ గొమొఱ్ఱాల్లా కాకుండా కాపాడతాడు.1:18—“రండి మన వివాదము తీర్చుకొందము” అనే మాటల భావమేమిటి? ఇది, పరస్పర చర్చల ద్వారా ఒక ఒప్పందానికి రావడానికి ఇవ్వబడిన ఆహ్వానం కాదు. బదులుగా, నీతిగల న్యాయాధిపతియైన యెహోవా ఇశ్రాయేలు మార్పుచేసుకుని, తనను తాను శుద్ధి చేసుకునేందుకు అవకాశమిస్తూ ఒక న్యాయపీఠాన్ని సిద్ధం చేయడాన్ని సూచిస్తుంది.
6:8ఎ—ఇక్కడ “నేను,” “మా” అనే సర్వనామములు ఎందుకు ఉపయోగించబడ్డాయి? “నేను” అనే సర్వనామము యెహోవా దేవునికి వర్తిస్తుంది. “మా” అనే బహువచన సర్వనామము యెహోవాతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సూచిస్తుంది. అది మరెవరో కాదు ఆయన “అద్వితీయ కుమారు[డే].”—యోహాను 1:14; 3:16.
6:11—“ప్రభువా ఎన్నాళ్ల వరకు” అని అడిగినప్పుడు యెషయా ఉద్దేశమేమిటి? ప్రతిస్పందించని ప్రజలకు ఎన్నాళ్ల వరకు యెహోవా సందేశాన్ని ప్రకటించాలని యెషయా అడగడం లేదు. బదులుగా, ప్రజల ఆధ్యాత్మిక రోగగ్రస్థ స్థితి ఎన్నాళ్ల వరకు దేవుని నామానికి అపకీర్తి తెస్తూ ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు.
7:3, 4—దుష్టరాజైన ఆహాజుకు యెహోవా ఎందుకు రక్షణను అనుగ్రహించాడు? సిరియా, ఇశ్రాయేలు రాజులు యూదా రాజైన ఆహాజును సింహాసనం నుండి తొలగించి, ఆయన స్థానంలో దావీదు వంశపువాడు కాని టాబెయేలు కుమారుణ్ణి కీలుబొమ్మలాంటి పాలకునిగా నియమించాలని పథకం వేశారు. అపవాదియైన సాతాను పన్నిన ఈ పన్నాగం దావీదుతో చేయబడిన రాజ్య నిబంధన కార్యాచరణకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. వాగ్దానం చేయబడిన “సమాధానకర్తయగు అధిపతి” వచ్చే వంశాన్ని కాపాడడానికి యెహోవా ఆహాజుకు ఆ రక్షణ అనుగ్రహించాడు.—యెషయా 9:6.
7:8—ఎఫ్రాయిము 65 సంవత్సరాల్లో ఎలా ‘నాశనమైంది’? యెషయా ఈ ప్రవచనం పలికిన కొద్దికాలానికే, అంటే “ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో” పది గోత్రాల రాజ్యం నుండి ప్రజలు వెళ్ళిపోవడం, పరదేశులు వచ్చి దేశంలో నివాసం ఏర్పర్చుకోవడం ప్రారంభమైంది. (2 రాజులు 15:29) అది ఆ తర్వాత చాలాకాలంపాటు సన్హెరీబు కుమారుడు, రాజ్యవారసుడు, అష్షూరు రాజైన ఏసర్హద్దోను కాలంవరకు కొనసాగింది. (2 రాజులు 17:6; ఎజ్రా 4:1, 2; యెషయా 37:37, 38) ఇలా అష్షూరు ప్రజలు సమరయ నుండి రావడం, సమరయకు వెళ్ళడం యెషయా 7:8లో ప్రస్తావించబడినట్లు 65 సంవత్సరాలపాటు కొనసాగింది.
11:1, 10—యేసుక్రీస్తు ఏ విధంగా, “యెష్షయి మొద్దునుండి చిగురు,” అలాగే “యెష్షయి వేరు” అవుతాడు? (రోమీయులు 15:12) యేసు మానవ వంశానుక్రమంగా చూస్తే “యెష్షయి మొద్దునుండి” వచ్చాడు. ఆయన యెష్షయి కుమారుడైన దావీదు ద్వారా యెష్షయి సంతానపువాడు. (మత్తయి 1:1-6; లూకా 3:23-32) అయితే, యేసు రాజ్యాధికారాన్ని పొందడం ఆయన పూర్వీకులతో ఆయన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. విధేయులైన మానవులకు భూమ్మీద నిత్యజీవం అనుగ్రహించే అధికారం, శక్తి ఆయనకు ఇవ్వబడ్డాయి కాబట్టి, ఆయన వారికి “నిత్యుడగు తండ్రి” అవుతాడు. (యెషయా 9:6) ఆ విధంగా ఆయన, యెష్షయితో సహా తన పూర్వీకులకు “వేరు” కూడా అవుతాడు.
మనకు పాఠాలు:
1:3. మన సృష్టికర్త కోరుతున్న దానికి అనుగుణంగా జీవించడానికి నిరాకరించడమంటే ఒక ఎద్దుకు లేదా గాడిదకు ఉన్నపాటి జ్ఞానం కూడా లేకపోవడంతో సమానం. మరోవైపు, యెహోవా మన కోసం చేసినదానంతటిపట్ల
కృతజ్ఞతను పెంచుకోవడం, అవివేకంగా ప్రవర్తించకుండా, ఆయనను విడిచిపెట్టకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది.1:11-13. వేషధారణతో కూడిన మతాచారాలు, నామకార్థంగా చేసే ప్రార్థనలు యెహోవాకు విసుగు తెప్పిస్తాయి. మన చర్యలు, ప్రార్థనలు సరైన హృదయ దృక్పథం నుండి ఉత్పన్నమవ్వాలి.
1:25-27; 2:2; 4:2, 3. పశ్చాత్తాపపడిన శేషము యెరూషలేముకు తిరిగి వచ్చి, సత్యారాధన పునరుద్ధరించబడడంతో యూదా బానిసత్వం, నిస్సహాయస్థితి అంతమవుతాయి. యెహోవా పశ్చాత్తాపపడే తప్పిదస్థులపట్ల కనికరం చూపిస్తాడు.
2:2-4. రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసే పనిలో మనం ఉత్సాహంగా భాగం వహించడం, అనేక దేశాలకు చెందిన వ్యక్తులు సమాధాన మార్గాలను తెలుసుకుని, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి సహాయం చేస్తుంది.
4:4. యెహోవా నైతిక అపరిశుభ్రతను, రక్తాపరాధాన్ని తొలగిస్తాడు లేక కడిగివేస్తాడు.
5:11-13. వినోదాన్ని ఎంపిక చేసుకోవడంలో నియంత్రణను, సమతుల్యాన్ని పాటించకపోవడమంటే జ్ఞానం ప్రకారం నడుచుకోవడానికి నిరాకరించడమే.—రోమీయులు 13:13.
5:21-23. క్రైస్తవ పెద్దలు లేక పైవిచారణకర్తలు “తమ దృష్టికి తాము జ్ఞానుల[మ]ని” అనుకోకూడదు. అంతేగాక వాళ్లు “ద్రాక్షారసము త్రాగుటలో” మితాన్ని పాటించాలి, పక్షపాతం చూపించకూడదు.
11:3ఎ. యేసు ఉంచిన మాదిరి, ఆయన బోధలు యెహోవాకు భయపడడంలో ఆనందం ఉందని చూపిస్తున్నాయి.
“యెహోవా యాకోబునందు జాలిపడును”
13 నుండి 23 అధ్యాయాలు జనాంగాలకు వ్యతిరేకంగా చేయబడిన ప్రకటనలు. అయితే, ఇశ్రాయేలు గోత్రాలన్నీ తిరిగి రావడానికి అనుమతించడం ద్వారా “యెహోవా యాకోబునందు జాలిపడును.” (యెషయా 14:1) 24 నుండి 27 అధ్యాయాల్లో యూదా కోసం వ్రాయబడివున్న నాశన సందేశంతోపాటు పునఃస్థాపన వాగ్దానం కూడా ఉంది. “త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయులు [ఇశ్రాయేలీయులు]” సిరియాతో పొత్తు పెట్టుకున్నందుకు, యూదా “యాజకులేమి ప్రవక్తలేమి” అష్షూరుతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు యెహోవా తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. (యెషయా 28:1, 7) రక్షణ కోసం “ఐగుప్తునకు ప్రయాణము” చేసినందుకు “అరీయేలు [యెరూషలేము]” మీద శ్రమ ప్రకటించబడింది. (యెషయా 29:1; 30:1, 2) అయినప్పటికీ, యెహోవాయందు విశ్వాసం ఉంచే ఆయా వ్యక్తులకు రక్షణ లభిస్తుందని ముందే తెలియజేయబడింది.
‘కొదమ సింహము తనకు దొరికినదానిమీద గర్జించునట్లు’ యెహోవా “సీయోను పర్వతము”ను కాపాడతాడు. (యెషయా 31:4) అంతేగాక, ఇలా వాగ్దానం చేయబడింది: “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును.” (యెషయా 32:1) అష్షూరీయుల మూలంగా యూదాకు వచ్చిన ముప్పు “సమాధాన రాయబారులు” సహితం ఘోరంగా ఏడ్చేలా చేస్తుంటే, యెహోవా తన ప్రజలు స్వస్థత పొందుతారని, వారి “దోషము పరిహరింపబడును” అని వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 33:7, 22-24) “యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది. వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది.” (యెషయా 34:2) యూదా నిర్జనముగా విడువబడదు. “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును.”—యెషయా 35:1.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
13:17—మాదీయులు ఏ విధంగా వెండిని లక్ష్యము చేయరు, సువర్ణమును రమ్యమైనదిగా ఎంచరు? మాదీయులు, పారసీకులు విజయం ద్వారా వచ్చిన మహిమను, యుద్ధంవల్ల లభించే దోపుడుసొమ్ము కంటే విలువైనదిగా పరిగణిస్తారు. కోరెషు అలాగే చేశాడు, ఆయన నెబుకద్నెజరు యెహోవా ఆలయం నుండి దోచుకున్న బంగారు, వెండి పాత్రలను చెరనుండి తిరిగివస్తున్న వారికి ఇచ్చేశాడు.
14:1, 2—యెహోవా ప్రజలు ఏ విధంగా “తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి తమ్మును బాధించినవారిని ఏలుదురు”? మాదీయుల, పారసీకుల ఆధీనంలోగల బబులోనులో ఉన్నతస్థానంలోవున్న దానియేలు; పారసీక రాణియైన ఎస్తేరు; పారసీక సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా నియమితుడైన మొర్దెకై వంటివారి విషయంలో ఇది నెరవేరింది.
20:2-5—యెషయా నిజంగానే మూడు సంవత్సరాలపాటు పూర్తిగా దిగంబరుడిగా తిరిగాడా? యెషయా బహుశా తన పైవస్త్రములు మాత్రమే తీసివేసి, “పైబట్టలేనివాడై” సంచరించి ఉండవచ్చు.—1 సమూయేలు 19:24.
21:1—ఏ ప్రదేశము “సముద్రతీరముననున్న అడవిదేశము” అని పిలువబడుతోంది? బబులోను అసలైన సముద్రానికి ఏ మాత్రం దగ్గరలో లేకపోయినా, అది ఇలాగే పిలువబడుతోంది. దానికి కారణమేమిటంటే, ప్రతీ సంవత్సరం యూఫ్రటీసు, టైగ్రీస్ నదుల్లోని పొర్లిపారుతున్న నీరు అక్కడున్న ప్రాంతాన్ని వరదకు గురిచేయడంవల్ల బురదతో కూడిన “సముద్రము” ఏర్పడుతుంది.
24:13-16—యూదులు “ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్షఫలములకోత తీరినతరువాత, పరిగె పండ్ల” వలే ఎలా అవుతారు? కోతకోసిన తర్వాత ఎలాగైతే చెట్టుమీద కొన్ని పండ్లు మిగిలివుంటాయో అలాగే యెరూషలేము యూదాల నాశనం తర్వాత కేవలం కొంతమంది మాత్రమే మిగిలివుంటారు. తప్పించుకుని బ్రతికినవారు, ‘తూర్పుదిశ [బబులోను]కు,’ తీసుకువెళ్ళబడినా లేక ‘[మధ్యధరా] సముద్ర ద్వీపములకు’ తీసుకువెళ్ళబడినా వారు యెహోవాను మహిమపరుస్తారు.
24:21—“ఉన్నత స్థల సమూహము,” “భూరాజులు” ఎవరు? “ఉన్నత స్థల సమూహము” దుష్టాత్మల సమూహములను సూచిస్తుండవచ్చు. కాబట్టి, దయ్యాలు ఎవరిమీదైతే శక్తివంతమైన ప్రభావం చూపిస్తాయో ఆ భూ పరిపాలకులే “భూరాజులు.”—1 యోహాను 5:19.
25:7—“సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకు, సమస్త జనములమీద పరచబడిన తెర” అంటే ఏమిటి? ఈ పోలిక మానవజాతి యొక్క రెండు పెద్ద శత్రువులను సూచిస్తుంది: అవి పాపము, మరణము.
మనకు పాఠాలు:
13:20-22; 14:22, 23; 21:1-9. బబులోను విషయంలో నెరవేరినట్టే, యెహోవా ప్రవచన వాక్యం ఎప్పుడూ నిజమవుతుంది.
17:7, 8. ఇశ్రాయేలులో చాలామంది వినకపోయినా, కొంతమంది వ్యక్తులు యెహోవా నడిపింపు కోసం చూశారు. అలాగే, క్రైస్తవమత సామ్రాజ్యంలో కొందరు రాజ్య సందేశానికి ప్రతిస్పందిస్తారు.
28:1-6. ఇశ్రాయేలు అష్షూరు చేతికి చిక్కుతుంది, కానీ నమ్మకమైన వ్యక్తులు తప్పించుకునేలా యెహోవా చూస్తాడు. యెహోవా తీర్పులు నీతిమంతులను నిరీక్షణ లేకుండా విడిచిపెట్టవు.
28:23-29. యెహోవా యథార్థవంతులను వారి నిర్దిష్టమైన అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా సరిదిద్దుతాడు.
30:15. యెహోవా అనుగ్రహించే రక్షణను పొందాలంటే మనం “ఊరకుండుట” ద్వారా లేక మానవ పథకాల ద్వారా రక్షణ పొందడానికి ప్రయత్నించకుండా ఉండడం ద్వారా విశ్వాసాన్ని చూపిస్తాము. “ఊరకుండి” లేక భయపడకుండా ఉండడం ద్వారా మనల్ని కాపాడడానికి యెహోవాకున్న సామర్థ్యంపై మన నమ్మకాన్ని కూడా చూపిస్తాము.
30:20, 21. యెహోవా తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా చెబుతున్న దాన్ని వినడం ద్వారా మనం ఆయనను ‘చూస్తాము’ ఆయన రక్షణ స్వరాన్ని ‘వింటాము.’—మత్తయి 24:45.
యెషయా ప్రవచనం దేవుని వాక్యంలో మన నమ్మకాన్ని బలపరుస్తుంది
యెషయా గ్రంథములో ఉన్న దేవుని సందేశానికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండవచ్చో కదా! ఇప్పటికే నెరవేరిన ప్రవచనాలు, ‘యెహోవా నోటనుండి వచ్చు వచనము నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలదు’ అనే మన నమ్మకాన్ని బలపరుస్తాయి.—యెషయా 55:10-11.
యెషయా 9:7 మరియు 11:1-5, 10 వచనాల్లో కనిపించే మెస్సీయ సంబంధిత ప్రవచనాల మాటేమిటి? అవి, మన రక్షణ కోసం యెహోవా చేసిన ఏర్పాటులో మన విశ్వాసాన్ని బలపర్చవా? ఈ గ్రంథములో, మన కాలంలో ప్రధానంగా నెరవేరుతున్న లేక ఇంకా నెరవేరనైయున్న ప్రవచనాలు కూడా ఉన్నాయి. (యెషయా 2:2-4; 11:6-9; 25:6-8; 32:1, 2) నిజంగా, యెషయా గ్రంథము “దేవుని వాక్యము సజీవమైనది” అనడానికి మరింత సాక్ష్యాధారాన్నిస్తుంది!—హెబ్రీయులు 4:12.
[8వ పేజీలోని చిత్రం]
యెషయా, ఆయన పిల్లలు ‘ఇశ్రాయేలీయుల మధ్య సూచనలుగాను, మహత్కార్యములుగాను’ ఉన్నారు
[8, 9వ పేజీలోని చిత్రం]
యెరూషలేము ‘ద్రాక్షతోటలోని పందిరివలే’ అవుతుంది
[10వ పేజీలోని చిత్రం]
జనములు ‘తమ ఖడ్గములను మచ్చుకత్తులుగా సాగగొట్టుకునేందుకు’ సహాయం ఎలా అందించబడుతోంది?