కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రంగురంగుల హయిటీలో సువార్త ప్రకటించడం

రంగురంగుల హయిటీలో సువార్త ప్రకటించడం

రంగురంగుల హయిటీలో సువార్త ప్రకటించడం

క రీబియన్‌ ద్వీపాల్లోకెల్లా ఎత్తైన పర్వతాలు ఉన్న హిస్ఫానియోలా అనే ఉష్ణమండల ద్వీపంలో హయిటీ, డొమినికన్‌ రిపబ్లిక్‌లు నెలకొనివున్నాయి. అనేక పర్వత శిఖరాల ఎత్తు 2,400 మీటర్లకన్నా ఎక్కువే. “శీతా” కాలాల్లో పర్వత ప్రాంతాల్లో ఉన్న చిన్న చెరువుల్లో మంచుగడ్డలు, సన్నని మంచుపొరలు ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ హయిటీలోని పర్వతాలు, లోయలు పచ్చని ఉష్ణమండల అడవులతో నిండివున్నాయి. ఇతర ప్రాంతాల్లో అడవులు నరకబడ్డాయి కాబట్టి, పర్వతాలు చాలావరకు బోసిగా, అందవిహీనంగా, ఎగుడుదిగుడుగా చెక్కబడినట్లు కనిపిస్తాయి. మీరు ఉత్తరంవైపు లేక దక్షిణంవైపు ప్రయాణిస్తే హయిటీ రమణీయంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. పర్వతాల్లో వంపులు తిరుగుతూ ఇరుకుగా ఉన్న కొన్ని రోడ్లమీద మీరు ప్రయాణిస్తుంటే దూరంగా నేల, సముద్రం కనిపిస్తూ ఎన్నోరకాల అత్యద్భుత దృశ్యాలు మీకు కనువిందుచేస్తాయి. ఎంతో ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్న ఎన్నో రకాల పువ్వులను మీరు అన్నిచోట్లా చూడవచ్చు.

ఈ రంగురంగుల దేశంలో ఉన్న 83 లక్షలమంది ఎక్కువగా ఆఫ్రికా మూలాలకు చెందిన గ్రామీణ ప్రజలే. చాలామంది బీదవారైనప్పటికీ వారు దయగలవారు, ఆతిథ్యమిచ్చే గుణంగలవారు. దాదాపు 60 సంవత్సరాలుగా వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించడాన్ని యెహోవాసాక్షులు ఆనందించారు, ఆ ప్రాంత ప్రజలు వారిని స్నేహపూర్వకంగా ఆహ్వానించారు కూడా.​—⁠మత్తయి 24:​14.

మారుమూల పట్టణంలో ప్రకటించడం

దానికి ఒక ఉదాహరణ, ఒక మిషనరీ సహోదరి మారుమూల పట్టణానికి మొదటిసారి వెళ్లినప్పుడు ఆమెకు ఎదురైన అనుభవం. ఆమె ఇలా రాసింది:

“2003 మార్చిలో ఒకరోజు, కాజల్‌ అనే చిన్న పట్టణంలో ప్రకటనాపని చేయడానికి వెళ్లాం, ప్రస్తుత మిషనరీ గృహమున్న కాబరే ప్రాంతం నుండి అరగంటపాటు ప్రయాణిస్తే ఆ పట్టణానికి చేరుకోవచ్చు. కాబరే ప్రాంతం, రాజధాని అయిన పోర్ట్‌ అవో ప్రిన్స్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాక్షులు గతంలో 1999లో కాజల్‌ అనే పట్టణంలో ప్రకటించారు కాబట్టి, మేమెంతో ఉత్సాహంగా ఉదయం 7 గంటలకు మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఇరవై రెండుమందిమి అంటే దాదాపు మా సంఘమంతా రెండు వ్యానుల్లో ఇరుకిరుగ్గా కూర్చున్నాం. పల్లంగావున్న మట్టిరోడ్లమీద మేము ప్రయాణిస్తూ అనేక పెద్ద చెట్లున్న లోయకు చేరుకుంటుండగా మేమందరం ఉత్సాహంగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. మేము చేరుకున్న ఆ లోయలో ఒక నది ప్రవహిస్తోంది, ఆ నదికి ఇరుప్రక్కల కాజల్‌ పట్టణం నెలకొనివుంది.

“1800ల పడి ఆరంభంలో మునుపు బానిసలుగా ఉన్నవారికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిపెట్టేందుకు వచ్చిన కొందరు పోలిష్‌ సైనికులు ఈ సారవంతమైన లోయలో హయిటీవాసులైన తమ భార్యలతో స్థిరపడినప్పుడు ప్రశాంతంగావుండే ఈ పట్టణ చరిత్ర ప్రారంభమైంది. అలా స్థిరపడడంవల్ల అక్కడ అందమైన భిన్నజాతి ప్రజలు నివసించడం ఆరంభించారు. శ్వేత వర్ణం, గోధుమ వర్ణం, చామనఛాయ, ఆకుపచ్చని కళ్లు, ముదురు గోధుమ వర్ణపు కళ్లు ఇలా వివిధ రూపాలున్న గ్రామీణులు తారసపడడం చూడముచ్చటగా ఉంటుంది.

“మేము మొదటి ఇంట్లో కలిసిన వ్యక్తి ఆసక్తి చూపించలేదు. అయితే మేము ఆ ఇంటి నుండి బయటికి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మమ్మల్ని కలిసేందుకు మాకు ఎదురొచ్చాడు. యేసుకు, దేవునికి మధ్య తేడా ఉందని మేము నమ్ముతున్నామో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. తన సొంత బైబిలు తెచ్చుకోమని మేము చెప్పగానే ఆయన తెచ్చుకున్నాడు, ఆ తర్వాత జరిగిన లేఖనాధార చర్చ, యేసు దేవుని కుమారుడని, యెహోవా ‘అద్వితీయ సత్యదేవుడు’ అనే నమ్మకం ఆయనలో కలిగించింది. (యోహాను 17:⁠3) లోపలికి వచ్చి కూర్చొని తమతో మాట్లాడమని చాలామంది మమ్మల్ని ఆహ్వానించారు. ‘మీరు మళ్లీ ఎప్పుడు వచ్చి మాతో బైబిలు అధ్యయనం చేస్తారు’ అని కొందరు అడిగారు.

“మధ్యాహ్నం మేము చల్లని నీడ ఉన్న స్థలం చూసి, భోజనానికి ఉపక్రమించాం. ఇద్దరు సహోదరీలు ఒక పెద్ద పాత్రలో చేపల కూర వండి తెచ్చారు. అది చాలా రుచిగా ఉంది! మేము భోజనం చేస్తూ మరికొంతసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ, దార్లోవెళ్లేవారికి కూడా ప్రకటించాం. ఆ తర్వాత నది దాటి అవతలివైపున్న పట్టణానికి వెళ్లాం. అక్కడ నిరాడంబరమైన తమ ఇళ్ల దగ్గరున్న చెట్ల క్రింద కూర్చున్న ఆ స్నేహశీలురైన ప్రజలతో మాట్లాడడాన్ని మేము ఆనందించాం. ఆటలాడుతున్న పిల్లల కేరింతలు, స్త్రీలు నదిలో బట్టలు ఉతుకుతున్న శబ్దం, వృద్ధ స్త్రీలు కాఫీ గింజలను పొడిచేస్తున్నప్పుడు వస్తున్న శబ్దాలను వినడం ఎంత శ్రావ్యంగా ఉందో!

“కొద్దిసేపటికే నాలుగైంది, సంతోషంగా ఉన్న మా గుంపువారందరం కాబరేకు తిరిగి వెళ్లేందుకు వ్యానులున్నచోటికి వచ్చాం. అతిథులను ఆదరించే స్నేహపూరితులైన ప్రజలుగల కాజల్‌కు మేము చేసిన మొదటి సందర్శనాన్ని నేను, మావారు చాలా ఆనందించాం.”

హయిటీకి సాక్షులైన మిషనరీలు 1945లో మొదటిసారి వచ్చినప్పటి నుండి రాజ్య ప్రచారకుల సంఖ్య ఈ దేశంలో క్రమంగా పెరుగుతోంది, దాని ఫలితంగా ఇప్పుడు ప్రకటనాపనిలో, 22,000 కన్నా ఎక్కువ గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో దాదాపు 14,000 మంది నిమగ్నమైవున్నారు. వారు 2005 మార్చిలో జరిగిన జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన 59,372 మంది జీవితాలను ప్రభావితం చేశారు, దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా ప్రకటించారు. యెహోవాసాక్షుల పని ప్రజలను ప్రభావితం చేసిన అనేక మార్గాలను పరిశీలించండి.

రంగురంగుల చిత్రాల్లో సువార్త

చాలామంది హయిటీవాసులు రంగురంగుల వస్తువులను ఇష్టపడతారు. వారి దుస్తుల్లో, రకరకాల రంగులు వేయబడిన వారి గృహాల్లో, వారి తోటల్లోని వివిధ రకాల పువ్వుల్లో, వారి కళాకృతులల్లో దానిని గమనించవచ్చు. లార్‌ ఆయిస్యన్‌గా పేరుపొందిన స్థానిక పద్ధతిలో ప్రకాశవంతమైన రంగువేయబడిన చిత్ర పటాలు, పోర్ట్‌ అవో ప్రిన్స్‌లో ఉన్న వీధులన్నింటిలో ప్రదర్శించబడతాయి. ప్రపంచంలోని వివిధ భాగాలనుండి వాటి కొనుగోలుదారులు వస్తారు.

ప్రకాశవంతమైన రంగులు కనిపించేది కేవలం చిత్రపటాల మీద మాత్రమే కాదు. సృజనాత్మక డిజైన్లుగల అనేక చిత్రాలు వేయబడిన కామ్యోనెట్స్‌ లేక టాప్‌-టాప్స్‌ అనే ప్యాసింజర్‌ వాహనాలతో పోర్ట్‌ అవో ప్రిన్స్‌ వీధులు సందడిగా ఉంటాయి. అలా డిజైన్‌ చేయబడిన చిత్రాలు బైబిలు ఆధారంగా వేయబడినట్లు మీరు సాధారణంగా గమనిస్తారు.

మీరు వీధుల్లో నడుస్తుంటే మీకు బాగా పరిచయమున్న చిత్రాలే అంటే ఏదెను తోటలో ఆదాముహవ్వలున్న చిత్రంవంటి చిత్రాలు మీకు తారసపడవచ్చు. అవును, అప్పుడే అటుగా దాటివెళ్లిన కామ్యోనెట్‌ వెనక కిటికీమీద ఆ చిత్రం కనిపిస్తుంది. యెహోవా నామం ఉన్న లేఖనాలు లేక నినాదాలు చిత్రించబడిన ఆ వాహనాలు లేదా ఆయన నామం చేర్చబడిన వాణిజ్య సంస్థలను మనం ఎక్కువగా చూస్తాం.

పాఠశాలలో సువార్త ప్రకటించడం

తోటి విద్యార్థులు బైబిలు గురించి తెలుసుకోవడానికి సహాయం చేసేందుకు హయిటీలోని యౌవన సాక్షులకు చక్కని అవకాశాలు ఉన్నాయి. ఈ క్రింద ఇవ్వబడిన 17 ఏళ్ల యౌవన సాక్షి అనుభవం దానికి ఒక ఉదాహరణ.

“తోటి విద్యార్థి నా దగ్గరికి వచ్చి ‘జారత్వం’ అంటే ఏమిటి అని అడిగాడు. ఆయన నాతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నాడని అనుకొని నేను ఆయనను పట్టించుకోలేదు. అయితే ఆయన మరో అబ్బాయిని అదే ప్రశ్న అడిగినప్పుడు తరగతిలోని వారంతా దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. కాబట్టి, తర్వాతి వారం ఆ అంశంమీద కొంత పరిశోధన చేసిన తర్వాత నేను తరగతిలో దానిగురించి మాట్లాడుతూ యెహోవాసాక్షులు నైతికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా పరిశుభ్రంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తారో వివరించాను.

“విద్యార్థులు అనేక ప్రశ్నలు అడిగారు, నేను బైబిలు ఆధారంగా ఇచ్చిన జవాబులతో అంగీకరించారు. మొదట్లో సంకోచించిన హెడ్మాస్టర్‌ అనేక ప్రశ్నలు అడిగి, ఇతర తరగతుల్లో నేను మాట్లాడే ఏర్పాటు చేశాడు. నేను వారికి యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) * అనే పుస్తకాన్ని చూపించాను, చాలామంది దానిపట్ల ఆసక్తి చూపించారు. ఆ తర్వాతి రోజు నేను తోటి పాఠశాల విద్యార్థులకు 45 పుస్తకాలు ఇచ్చాను. చాలామంది తమకివ్వబడిన పుస్తకాన్ని పూర్తిగా చదివారు, కొందరు తమ ఇంటి దగ్గర నివసించే సాక్షులతో ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తున్నారు. మేముండే ప్రాంతంలోనే నివసించే ఒక విద్యార్థి ఇప్పుడు కూటాలన్నిటికీ హాజరౌతున్నాడు.”

క్రియోల్‌ భాష వాడుక

ఆ దేశం, దాని ప్రజలేకాక ఆ దేశపు భాష అయిన హయిటీయన్‌ క్రియోల్‌ కూడా రంగులురంగులుగా, ఆకర్షణీయంగా ఉంటుంది, ఆ భాషలో ఫ్రెంచ్‌ పదాలతోపాటు పశ్చిమాఫ్రికా వ్యాకరణం మిళితమౌతుంది. అది హయిటీవాసుల మాతృభాష, వారి హృదయాలను స్పృశించే భాష. యెహోవాసాక్షులు ఎక్కువగా ఆ భాషలోనే తమ పరిచర్యను కొనసాగిస్తున్నారు, హయిటీయన్‌ క్రియోల్‌ భాషలో మరిన్ని బైబిలు సాహిత్యాలు ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

1987లో భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషుర్‌ హయిటీయన్‌ క్రియోల్‌లో అనువదించబడింది, దాని తర్వాత నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్‌ అనువదించబడ్డాయి. దేవుని వాక్యంలోని ప్రాథమిక విషయాలను అవగాహన చేసుకోవాలనుకుంటున్న క్రొత్త బైబిలు విద్యార్థులకు ఆ ప్రచురణలు ఎంతో సహాయకరంగా ఉన్నాయి. కావలికోట, సెప్టెంబరు 1, 2002 సంచిక మొదలుకొని హయిటీయన్‌ క్రియోల్‌లో ప్రచురించబడుతోంది. ఫ్రెంచ్‌ భాషలో సాహిత్యం ఇప్పటికీ ఉపయోగించబడుతోంది గానీ చాలామంది తమ సొంత భాషలో ప్రచురణలను చదవడానికే ఇష్టపడుతున్నారు.

కారాగారంలో ఉన్నవారికి సువార్త ప్రకటించడం

ఇటీవల యెహోవాసాక్షులు రాష్ట్ర కారాగారాల్లో ఉన్న స్త్రీపురుషులకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అలాంటి ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నవారికి ఓదార్పునిచ్చే సందేశాన్ని ప్రకటించడానికి ఆ పనిచేస్తున్న సాక్షులు సంతోషిస్తున్నారు. ఒక క్రైస్తవ పరిచారకుడు ఇలా నివేదిస్తున్నాడు:

“మేము మొదటిసారి కారాగారానికి వెళ్లినప్పుడు, మమ్మల్ని కలవడానికి వీలుగా ఖైదీలను ఒక పెద్ద గదిలోకి తీసుకువచ్చారు. వారెలా ప్రతిస్పందిస్తారో అని మేమనుకున్నాం. బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు వచ్చామని మేము వివరించినప్పుడు అక్కడున్న 50 మంది చక్కగా స్పందించారు. మేము వారికి క్రియోల్‌ భాషలో ఉన్న చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండి, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషుర్‌లను ఇచ్చి, వారిలో 26 మందితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించాం. వారిలో పదిమంది నిరక్షరాస్యులు, అయితే పదాలను అర్థం చేసుకునేందుకు బ్రోషుర్‌లోని చిత్రాలను ఎలా ఉపయోగించవచ్చో మేము చూపించినప్పుడు వారు ఆసక్తి చూపించారు.”

సాక్షులు ఆ కారాగారానికి మళ్ళీ వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “నేను బ్రోషుర్‌ను ఎన్నోసార్లు చదివాను. అది చెబుతున్న విషయాల గురించి పదేపదే ఆలోచిస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను.” సాయుధ దోపిడి ఆరోపణమీద అరెస్టు చేయబడిన ఒక వ్యక్తి తాను మారాలనుకుంటున్నానని, తన భార్యతో బైబిలు అధ్యయనం చేయడానికి ఎవరినైనా పంపించమని కోరాడు. కారాగారంలో ఉన్న, ఇద్దరు పిల్లల తండ్రి కూడా తన భార్య సత్యమతానికీ, అబద్ధమతానికీ మధ్య ఉన్న తేడాను గుర్తించేందుకు సహాయం చేయమని కోరాడు. పెద్ద మొత్తంలో డబ్బు కాజేసి చర్చి సభ్యులను మోసం చేసిన ప్రొటస్టెంటు మతగురువు, తాను ఇప్పుడు సత్యాన్ని కనుగొన్నానని, తన శిక్ష పూర్తైన తర్వాత తన చర్చి సభ్యులు యెహోవాసాక్షులుగా మారేందుకు సహాయం చేస్తానని అన్నాడు.

మరో ఖైదీ, తన దగ్గర క్రియోల్‌ భాషలో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ లేకపోతే తన తోటి ఖైదీ దగ్గరున్న కాపీ తీసుకొని మొత్తం బ్రోషుర్‌ నకలు చేసుకొని దాన్ని కంఠస్థం చేశాడు. ఒక మహిళా ఖైదీ తాను నేర్చుకుంటున్న విషయాలను తొమ్మిదిమంది ఖైదీలతో పంచుకోవడం మొదలుపెట్టి, వారితో అధ్యయనం చేయడం కూడా ప్రారంభించింది. ఒక ఖైదీ ఆ బ్రోషుర్‌ను అధ్యయనం చేయడం ముగించి, జ్ఞానము పుస్తకాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇతర ఖైదీలకు ప్రకటించడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన వారిలో నలుగురితో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించాడు.

మెర్కోనీ * ఒకప్పుడు బైబిలు అధ్యయనం చేసేవాడు, ఆయన బంధువులు యెహోవాసాక్షులు. బంధువులు తన కోసం తీసుకువచ్చిన బైబిలు సాహిత్యాలను చదవమని ఆయన ఇతర ఖైదీలను ప్రోత్సహించాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను ఖైదీలకు సాహిత్యం ఇస్తే వారు నన్ను యెహోవాసాక్షి అని పిలుస్తున్నారు. సాక్షిగా ఉండడంలో ఏమి ఇమిడివుందో తనకు తెలుసు కాబట్టి తాను యెహోవాసాక్షిని కానని నేను వారికి చెబుతాను. నేనిప్పుడు బైబిలు అధ్యయనాన్ని గంభీరంగా తీసుకొని అధ్యయనం చేసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను నా అన్నలు అనుసరించిన మార్గాన్ని అనుసరించివుంటే నేను ఈ కారాగారంలో ఉండేవాణ్ణి కాదు.”

మెర్కోనీ దగ్గర సాహిత్యం తీసుకున్న ఒక ఖైదీ తనను చూడడానికి వచ్చిన సాక్షులతో ఇలా అన్నాడు: “గత సోమవారం మీరు రావడానికి ముందు నేనెంతో మానసిక కృంగుదలకు గురై, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అయితే నేను పత్రికలను చదివిన తర్వాత, నేను చేసిన చెడు పనులను క్షమించమని, సరైన మార్గాన్ని నాకు చూపించేందుకు ఎవరినైనా పంపించమని దేవునికి ప్రార్థించాను. ఆ తర్వాతి రోజు ఖైదీలతో బైబిలు అధ్యయనాన్ని చేస్తామనే ప్రతిపాదనతో మీరు వచ్చినప్పుడు నేనెంత ఆనందించానో! యెహోవాను ఎలా ఆరాధించాలో నాకు బోధించడానికి మీరు దయచేసి రండి.”

తేజరిల్లు! అనేకమందికి సువార్తను ప్రకటిస్తుంది

తేజరిల్లు! జనవరి-మార్చి 8, 2001 సంచిక నర్సింగ్‌ వృత్తి గురించి వివరించింది. ఒక స్త్రీ 2,000 కాపీలను తీసుకొని పోర్ట్‌ అవో ప్రిన్స్‌లో జరిగిన సెమినార్‌కు హాజరైన నర్సులకు పంచిపెట్టింది. పోలీసుల గురించిన, వారు చేసే పని గురించిన ఆర్టికల్స్‌ ఉన్న తేజరిల్లు! అక్టోబరు-డిసెంబరు 8, 2002 సంచిక ఆ నగరంలోని పోలీసులకు విస్తృతంగా పంచిపెట్టబడింది. వారికా పత్రిక నచ్చింది, ఇప్పటికీ కొంతమంది పోలీసులు వీధిలో సాక్షులను ఆపి ఆ పత్రిక కాపీల కోసం అడుగుతారు.

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిణి, ఎయిడ్స్‌ గురించి ప్రజలను చైతన్యపరిచేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆమె యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఆహ్వానించబడింది, ఆ అంశం మీద ఆమెకు తేజరిల్లు!లో ప్రచురించబడిన సమాచారం చూపించబడింది. ఎయిడ్స్‌ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన శ్రేష్ఠమైన మార్గం గురించి, ఆ వ్యాధి సోకినవారు ఆ పరిస్థితిని ఎదుర్కొనేలా ఎలా సహాయం చేయవచ్చనే విషయం గురించి బైబిలు నుండి చర్చించే ఆ ఆర్టికల్స్‌ చూసి ఆమె ముగ్ధురాలైంది. అలాంటి సమాచారం అందించడంలో తేజరిల్లు! ముందున్నట్లు ఆమె వ్యాఖ్యానించింది.

అవును, యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా ఉన్న 234 ఇతర దేశాల్లో అనేక విధాలుగా రాజ్య సువార్త ప్రకటిస్తున్నట్లే రంగురంగుల హయిటీలో కూడా ప్రకటిస్తున్నారు. ఆ నిరీక్షణా సందేశానికి అనేకమంది ప్రతిస్పందిస్తున్నారు, వారు తమ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు ప్రాధాన్యతనివ్వకుండా సత్యదేవుడైన యెహోవాను ఆరాధించే వారందరూ పరిపూర్ణ జీవితాన్ని అధికంగా ఆనందించే నూతనలోకం కోసం ఎదురుచూడడానికి సహాయం పొందుతున్నారు.​—⁠ప్రకటన 21:⁠4.

[అధస్సూచీలు]

^ పేరా 20 ఈ ఆర్టికల్‌లో పేర్కొనబడిన సాహిత్యాలను యెహోవాసాక్షులు ప్రచురించారు.

^ పేరా 29 పేరు మార్చబడింది.

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

నేపథ్యం: ©Adalberto Rios Szalay/photodisc/age fotostock