నిజాయితీకి నిదర్శనం
నిజాయితీకి నిదర్శనం
బ్రెజిల్‌లోని క్రూజేరు డు సుల్ అనే నగరంలో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్న నెల్మాకు ఇటీవల క్రైస్తవ యథార్థతకు సంబంధించిన పరీక్ష ఎదురైంది. నెల్మా నివసిస్తున్న ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆమె కస్టమర్లలో ఒకామె నెల్మాకు కొన్ని బట్టలు ఇచ్చింది. ఆ బట్టలను వేరుచేస్తుండగా ఒక ప్యాంటు జేబుల్లో ఆమెకు ఇంచుమించు 50,000 దొరికాయి.
నెల్మాకు దొరికిన డబ్బు ఆమె ఏడు నెలల ఆదాయంతో సమానం, పైగా ఇప్పుడు అది ఆమెకెంతో అవసరం కూడా. వరదవల్ల ఆమె ఇల్లు పాడైపోయింది. ఆమె తండ్రి, తోబుట్టువులు కూడా చాలావరకు నష్టపోయారు. ఆ డబ్బు ఆమె తన ఇంటిని బాగుచేయించుకోవడానికే కాక తనవారికి సహాయం చేసేందుకు కూడా సరిపోతుంది. అయితే, ఆ డబ్బు ఉంచుకునేందుకు నెల్మా బైబిలు శిక్షిత మనస్సాక్షి అనుమతించలేదు.—హెబ్రీయులు 13:18.
మరుసటి రోజు ఉదయమే ఆమె రోజూ పని మొదలుపెట్టే సమయానికన్నా ముందే వెళ్లి ఆ బట్టలిచ్చిన వ్యాపారస్థురాలిని సంప్రదించింది. బట్టలకోసం ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసిన తర్వాత వాటిలో తనకు దొరికిన డబ్బును ఉంచుకోలేనని నెల్మా చెప్పింది. ఆ డబ్బు తిరిగి తీసుకోవడానికి ఆ వ్యాపారస్థురాలు చాలా సంతోషించింది. ఆమె తన దగ్గర పనిచేసే ఉద్యోగస్థులకు జీతంగా ఇవ్వాలని ఆ డబ్బును దాచింది. ఆమె ఇలా అంది: “నిజాయితీ అనేది చాలా అరుదుగా కనిపించే లక్షణం.”
నిజాయితీగా ఉండడంవల్ల ప్రయోజనమేమీ లేదని కొందరు అనుకోవచ్చు. అయితే, సత్యదేవుడైన యెహోవాను సంతోషపెట్టడానికి కృషిచేసేవారికి మాత్రం నిజాయితీ చాలా ప్రాముఖ్యమైన గుణం. (ఎఫెసీయులు 4:25, 28) “నేను ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోయుంటే ప్రశాంతంగా నిద్రపోగలిగేదాన్ని కాదు” అని నెల్మా అంటోంది.