కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి

సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి

సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి

“సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను.”​—⁠అపొస్తలుల కార్యములు 9:​31.

యెహోవా క్రీస్తు శిష్యుల గుంపును సా.శ. 33 పెంతెకొస్తునాడు ఒక క్రొత్త జనాంగముగా, “దేవుని ఇశ్రాయేలుగా” ఆమోదించాడు. (గలతీయులు 6:​16) ఈ ఆత్మాభిషిక్త క్రైస్తవులు “దేవుని సంఘము” అని బైబిలు పిలిచే సంఘంగా రూపొందారు. (1 కొరింథీయులు 11:​22) అలా దేవుని సంఘంగా రూపొందడంలో ఏమి ఇమిడివుంది? “దేవుని సంఘము” ఎలా వ్యవస్థీకరించబడుతుంది? దాని సభ్యులు ఎక్కడ నివసించినా అది భూమ్మీద ఎలా పనిచేస్తుంది? మన జీవితాలు, మన సంతోషం ఎలా ఇమిడివున్నాయి?

2 ముందరి ఆర్టికల్‌లో గమనించినట్లుగా, అభిషిక్త అనుచరుల ఈ సంఘం ఉనికిలోకి వస్తుందని ముందే చెబుతూ అపొస్తలుడైన పేతురుతో యేసు ఇలా అన్నాడు: “ఈ బండమీద [యేసుక్రీస్తు] నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” (మత్తయి 16:​18) అంతేకాక, యేసు ఇంకనూ అపొస్తలులతో ఉన్నప్పుడు, త్వరలో స్థాపించబడే సంఘం పనితీరు గురించి, వ్యవస్థీకరణ గురించి సూచనలిచ్చాడు.

3 సంఘంలో కొందరు సారథ్యం వహిస్తారని యేసు మాటల ద్వారా, చేతల ద్వారా బోధించాడు. వారు తమ గుంపులోని ఇతరులకు పరిచర్య లేదా సేవ చేయడం ద్వారా సారథ్యం వహిస్తారు. క్రీస్తు ఇలాచెప్పాడు: “అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.” (మార్కు 10:​42-44) కాబట్టి, “దేవుని సంఘము,” చెదిరిపోయిన, దూరదూరంగావున్న వ్యక్తుల అవ్యవస్థిత సంఘంగా ఉండదు. బదులుగా, అది ఒకరితో ఒకరు కలిసి పనిచేసే వ్యక్తులున్న వ్యవస్థీకృత సంఘమై ఉంటుంది.

4 ఆ ‘దేవుని సంఘానికి’ శిరస్సైన యేసు, తనవద్ద నేర్చుకున్న తన అపొస్తలులకు, ఇతరులకు సంఘస్థుల విషయంలో ప్రత్యేక బాధ్యతలుంటాయని సూచించాడు. వారేమి చేస్తారు? కీలకమైన ఒక నియామకం ఏమిటంటే, వారు సంఘంలోనివారికి ఆధ్యాత్మిక ఉపదేశాన్నివ్వాలి. పునరుత్థానం చేయబడిన యేసు కొంతమంది ఇతర అపొస్తలుల సమక్షంలో పేతురును, ‘యోహాను కుమారుడవైన సీమోనూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?’ అని అడిగాడని గుర్తుచేసుకోండి. దానికి పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు, “నా గొఱ్ఱెపిల్లలను మేపుము . . . నా గొఱ్ఱెలను కాయుము . . . నా గొఱ్ఱెలను మేపుము” అని చెప్పాడు. (యోహాను 21:​15-18) అదెంత ప్రాముఖ్యమైన నియామకమో కదా!

5 సంఘాల్లోకి సమకూర్చబడేవారు దొడ్డిలోని గొర్రెలతో పోల్చబడ్డారని యేసు మాటలనుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గొర్రెలను అంటే క్రైస్తవ స్త్రీపురుషులను, పిల్లలను ఆధ్యాత్మికంగా మేపుతూ, సరిగా కాయడం అవసరం. అంతేకాక, తన అనుచరులందరూ ఇతరులకు బోధిస్తూ, వారిని శిష్యులను చేయాలని యేసు ఆజ్ఞాపించాడు కాబట్టి, ఆయన గొర్రెగా మారే ప్రతీ క్రొత్త వ్యక్తికి ఆ దైవికాజ్ఞను నెరవేర్చేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాల్సివుంటుంది.​—⁠మత్తయి 28:​19, 20.

6 “దేవుని సంఘము” రూపుదిద్దుకున్నప్పుడు, దాని సభ్యులు ఉపదేశం కోసం, పరస్పర ప్రోత్సాహం కోసం క్రమంగా కూడుకున్నారు: “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.” (అపొస్తలుల కార్యములు 2:​42, 46, 47) చారిత్రక వృత్తాంతంలో గమనార్హమైన మరో వివరమేమిటంటే, ఆచరణలో చూపించాల్సిన విషయాలపట్ల శ్రద్ధ చూపించడంలో సహాయం చేసేందుకు అర్హులైన కొందరు పురుషులు నియమించబడ్డారు. వారు, అనేక సంవత్సరాల విద్యనుబట్టి లేదా సాంకేతిక నైపుణ్యతలనుబట్టి ఎంపిక చేసుకోబడలేదు. వారు “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన” పురుషులు. వారిలో ఒకరు స్తెఫను, ఆయన “విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన” వ్యక్తి అని వృత్తాంతం నొక్కిచెబుతోంది. సంఘ ఏర్పాటు యొక్క ఒక ఫలితమేమంటే, “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను.”​—⁠అపొస్తలుల కార్యములు 6:​1-7.

దేవుడు ఉపయోగించుకున్న మనుష్యులు

7 తొలి సంఘ ఏర్పాటులో అపొస్తలులు సారథ్యం వహించినా, అలా సారథ్యం వహించినవారిలో వారు మాత్రమే లేరనేది స్పష్టం. ఒక సందర్భంలో పౌలు ఆయన సహవాసులు సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చారు. అపొస్తలుల కార్యములు 14:⁠27 ఇలా వివరిస్తోంది: “వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు . . . వివరించిరి.” వారు ఇంకా ఆ స్థానిక సంఘంతోనే ఉన్నప్పుడు, అన్యమత విశ్వాసులు సున్నతి పొందాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. ఆ విషయాన్ని పరిష్కరించేందుకు పౌలు, బర్నబాలు పరిపాలక సభగా పనిచేస్తున్న “యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును” పంపించబడ్డారు.​—⁠అపొస్తలుల కార్యములు 15:​1-3.

8 యేసు తోబుట్టువే గానీ అపొస్తలుడు కాని క్రైస్తవ పెద్దయైన యాకోబు అధ్యక్షతన “అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 15:⁠6) విషయాన్ని పరిశీలించి చర్చించిన తర్వాత, పరిశుద్ధాత్మ సహాయంతో, వారు లేఖనాలకు అనుగుణమైన నిర్ధారణకు వచ్చారు. వారు ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా స్థానిక సంఘాలకు పంపించారు. (అపొస్తలుల కార్యములు 15:​22-32) ఆ సమాచారాన్ని అందుకున్న సంఘాలు దానిని అంగీకరించి, అన్వయించుకున్నాయి. దాని ఫలితమేమిటి? సహోదర సహోదరీలు బలపర్చబడి, ప్రోత్సహించబడ్డారు. బైబిలు ఇలా నివేదిస్తోంది: “గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.”​—⁠అపొస్తలుల కార్యములు 16:⁠5.

9 అయితే స్థానిక సంఘాలు క్రమంగా ఎలా నిర్వహించబడ్డాయి? ఉదాహరణకు, క్రేతు ద్వీపంలోని సంఘాలనే తీసుకోండి. అక్కడి నివాసుల్లో చాలామందికి చెడ్డ పేరున్నప్పటికీ, వారిలో కొందరు తమ జీవితాల్లో మార్పులు చేసుకుని నిజ క్రైస్తవులయ్యారు. (తీతు 1:​10-12; 2:​2, 3) వారు క్రేతులోని వివిధ పట్టణాల్లో నివసించేవారు, వారందరూ యెరూషలేములోని పరిపాలక సభకు చాలాదూరంగా ఉండేవారు. అయితే అదంత పెద్ద సమస్యకాదు ఎందుకంటే, ఇతర ప్రాంతాల్లోలాగే క్రేతులోని స్థానిక సంఘాల్లోని ప్రతీదానిలో ఆధ్యాత్మిక “పెద్దలు” నియమించబడ్డారు. అలాంటి పురుషులు బైబిల్లో నమోదు చేయబడివున్న అర్హతలు పొందినవారే. “హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగల”వారు పెద్దలుగా లేదా పైవిచారణకర్తలుగా నియమించబడ్డారు. (తీతు 1:​5-9; 1 తిమోతి 3:1-7) ఇతర ఆధ్యాత్మిక పురుషులు, పరిచారకులుగా లేక పరిచర్య సేవకులుగా సంఘాల్లో సహాయం చేసేందుకు అర్హులయ్యారు.​—⁠1 తిమోతి 3:​8-10, 12, 13.

10 అలాంటి ఏర్పాటు ఉంటుందని యేసు సూచించాడు. మత్తయి 18:​15-17లోని వృత్తాంతాన్ని గుర్తుచేసుకోండి, అక్కడాయన దేవుని ప్రజల్లో ఇద్దరిమధ్య కొన్నిసార్లు సమస్యలు ఉత్పన్నం కాగలవని అంటే ఏదోక రీతిలో ఒకరిపట్ల మరొకరు పాపం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. నష్టపోయిన లేదా హాని జరిగిన వ్యక్తి రెండవ వ్యక్తి దగ్గరకు వెళ్లి తామిద్దరి సమక్షంలోనే, ఏకాంతంగా ‘అతనిని గద్దించాలి.’ ఆ చర్య ఒకవేళ వివాదాన్ని పరిష్కరించకపోతే, వాస్తవాలు తెలిసివున్న ఒకరిద్దరిని, సహాయం చేసేందుకు వెంట తీసుకొనివెళ్లాలి. అయినా ఆ వివాదం పరిష్కరించబడకపోతే అప్పుడేమిటి? యేసు ఇలా చెప్పాడు: “అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” యేసు ఆ మాటలు చెప్పినప్పుడు, యూదులు ఇంకా “దేవుని సంఘముగానే” ఉన్నారు, అందువల్ల ఆయన మాటలు మొదట వారికే అన్వయించాయి. * అయితే క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత, యేసు నిర్దేశం క్రైస్తవ సంఘానికి కూడా వర్తిస్తుంది. ప్రతీ క్రైస్తవుని క్షేమాభివృద్ధి కోసం, నిర్దేశం కోసం దేవుని ప్రజలకు సంఘ ఏర్పాటు ఉంటుందని చెప్పేందుకు ఇది కూడా ఒక రుజువు.

11 తగినవిధంగానే, పెద్దలు లేదా పైవిచారణకర్తలు సమస్యలతో వ్యవహరించడంలో లేదా పరిష్కరించడంలో లేదా పాపానికి సంబంధించిన అంశాలతో వ్యవహరించడంలో స్థానిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అది తీతు 1:⁠9లో పేర్కొనబడిన పెద్దల అర్హతలకు పొందికగా ఉంది. నిజమే, ‘లోపముగా ఉన్నవాటిని దిద్దేందుకు’ పౌలు సంఘాలకు పంపిన తీతులాగే పెద్దలు కూడా అపరిపూర్ణ పురుషులే. (తీతు 1:​1, 5) నేడు పెద్దలుగా నియమించబడేందుకు పరిగణించబడేవారు కొంతకాలంగా తమ విశ్వాసాన్ని, భక్తిని నిరూపించుకున్నవారై ఉండాలి. అందువల్ల సంఘంలోని ఇతరులు మంచి కారణంతోనే, ఈ ఏర్పాటు ద్వారా అందజేయబడే నిర్దేశాన్ని, సారథ్యాన్ని నమ్మవచ్చు.

12 ఎఫెసులోని పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు తన స్వరక్తమిచ్చి [‘కుమారుని రక్తమిచ్చి,’ NW] సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొస్తలుల కార్యములు 20:​28) నేడు సంఘ పైవిచారణకర్తలు ‘దేవుని సంఘమును కాయుటకు’ నియమించబడ్డారన్నది కూడా అంతే నిజం. వారు మందపై ప్రభువులైనట్లు కాదుగానీ, ప్రేమపూర్వకంగా దానిని కాయాలి. (1 పేతురు 5:​2, 3) పైవిచారణకర్తలు “యావత్తు మంద”కు క్షేమాభివృద్ధి కలుగజేసేందుకు, సహాయం చేసేందుకు పైవిచారణకర్తలు పాటుపడాలి.

సంఘానికి హత్తుకొని ఉండడం

13 పెద్దలు, సంఘంలోని ఇతరులు అపరిపూర్ణులు కాబట్టి, అప్పుడప్పుడూ అపార్థాలు లేదా సమస్యలు రావచ్చు, అపొస్తలుల్లో కొంతమంది ఇంకా సజీవంగానే ఉన్న మొదటి శతాబ్దంలో అలాగే జరిగింది. (ఫిలిప్పీయులు 4:​2, 3) ఎవరైనా ఒక పైవిచారణకర్త లేదా ఒక వ్యక్తి కఠినంగా, నిర్దయగా, కొంతమేర అసత్యంగా మాట్లాడవచ్చు. లేదా లేఖన విరుద్ధమైనదేదో జరుగుతున్నట్లు మనం తలంచవచ్చు, స్థానిక పెద్దలకు ఆ విషయం తెలిసినా వారు దానిని సరిదిద్దడం లేదన్నట్లు అనిపించవచ్చు. బహుశా, ఆ విషయంతో లేఖనాధారంగా, మనకు తెలియని వాస్తవిక విషయాల వెలుగులో వ్యవహరించి ఉండవచ్చు లేదా వ్యవహరిస్తుండవచ్చు. అయితే లేఖన విరుద్ధమైనదేదో నిజంగా జరుగుతున్నా దీని గురించి ఆలోచించండి: యెహోవా శ్రద్ధ చూపిస్తున్న సంఘమైన కొరింథులో కొద్దికాలం వరకు గంభీరమైన పాపం జరిగింది. తగిన సమయంలో ఆ తప్పు విచారించబడి, స్థిరంగా సరిదిద్దబడేలా ఆయన చూశాడు. (1 కొరింథీయులు 5:​1, 5, 9-11) మనల్నిమనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను ఆ ప్రాచీన కొరింథులో నివసించివుంటే, ఆ మధ్యకాలంలో నేనెలా స్పందించి ఉండేవాడిని?’

14 సంఘంలోని మరో పరిస్థితి గురించి ఆలోచించండి. ఒక వ్యక్తికి ఒకానొక లేఖనాధార బోధను అర్థం చేసుకోవడం, అంగీకరించడం కష్టంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఆయన బైబిల్లో, సంఘం ద్వారా లభించే ప్రచురణల్లో పరిశోధించి ఉండవచ్చు, పరిపక్వతగల తోటి విశ్వాసుల నుండి, చివరకు పెద్దల నుండి కూడా సహాయాన్ని పొంది ఉండవచ్చు. అయినా ఆ విషయాన్ని గ్రహించేందుకు లేదా అంగీకరించేందుకు ఆయనకు కష్టంగా ఉండవచ్చు. ఆయనేమి చేయవచ్చు? యేసు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు ఇలాంటి పరిస్థితే తలెత్తింది. తాను ‘జీవాహారము’ అని, ఒక వ్యక్తి నిత్యం జీవించేందుకు ‘మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగాలని’ ఆయన అన్నాడు. అది విని ఆయన శిష్యులలో కొందరు దిగ్భ్రాంతి చెందారు. వివరణ కోరడానికి లేదా విశ్వాసంతో వేచివుండడానికి బదులు చాలామంది శిష్యులు “మరి ఎన్నడును ఆయనను [యేసును] వెంబడింపలేదు.” (యోహాను 6:​35, 41-66) ఒకవేళ మనం అక్కడ ఉండివుంటే ఏమి చేసివుండేవాళ్లం?

15 ఆధునిక కాలాల్లో, కొందరు సొంతగా దేవుణ్ణి సేవించవచ్చని భావిస్తూ స్థానిక సంఘంతో సహవసించడం మానేశారు. వారు తమకు బాధ కలిగిందని, తప్పు సరిదిద్దబడలేదని లేదా ఫలానా బోధను తాము అంగీకరించలేమని చెప్పవచ్చు. వారి వైఖరి ఎంతవరకు సమంజసం? ప్రతీ క్రైస్తవుడు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగివుండాలనే విషయం నిజమైనప్పటికీ, ఆయన అపొస్తలుల కాలంలోలాగే ప్రపంచవ్యాప్త సంఘాన్ని ఉపయోగిస్తున్నాడనే విషయాన్ని మనం నిరాకరించలేం. అంతేకాక, యెహోవా మొదటి శతాబ్దంలో సంఘాలకు ప్రయోజనం చేకూర్చడానికి అర్హులైన పెద్దలను, పరిచర్య సేవకులను నియమించి, స్థానిక సంఘాలను ఉపయోగించుకున్నాడు, వాటిని ఆశీర్వదించాడు. నేడు కూడా అలాగే జరుగుతోంది.

16 ఒక క్రైస్తవుడు కేవలం దేవునితో తనకున్న సంబంధం మీదే పూర్తిగా ఆధారపడగలనని భావిస్తే, ఆయన దేవుని ప్రజల ప్రపంచవ్యాప్త సంఘానికి, స్థానికంగావున్న సంఘాలకు సంబంధించి దేవుడు చేసిన ఏర్పాటును తిరస్కరించినట్లే అవుతుంది. ఒక వ్యక్తి సొంతగా దేవుణ్ణి ఆరాధిస్తే లేదా కొద్దిమంది ఇతరులతో సహవసిస్తే సంఘ పెద్దల, పరిచర్య సేవకుల ఏర్పాటు ఎక్కడుంటుంది? విశేషంగా, పౌలు కొలస్సయి సంఘానికి లేఖ వ్రాసి, అది లవొదికయ సంఘంలో కూడా చదవాలని నిర్దేశించినప్పుడు, ‘క్రీస్తునందు వేరుపారినవారై, ఇంటివలే కట్టబడడం’ గురించి ఆయన మాట్లాడాడు. సంఘంలో ఉన్నవారు తప్ప ఆ సంఘాల నుండి వేరుపడిన వ్యక్తులు ఈ ప్రయోజనం పొందలేరు.​—⁠కొలొస్సయులు 2:​6-7; 4:​16.

సత్యానికి స్తంభం మరియు ఆధారం

17 క్రైస్తవ పెద్దగావున్న తిమోతికి వ్రాసిన తన మొదటి లేఖలో అపొస్తలుడైన పౌలు స్థానిక సంఘాల్లోని పెద్దల, పరిచర్య సేవకుల అర్హతలను వివరించాడు. ఆ వెంటనే, పౌలు ‘జీవముగల దేవుని సంఘాన్ని’ ప్రస్తావిస్తూ అది “సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది” అని చెప్పాడు. (1 తిమోతి 3:​15) మొదటి శతాబ్దంలో, అభిషిక్త క్రైస్తవుల యావత్‌ సంఘం నిశ్చయంగా అలాంటి స్తంభంగా నిరూపించుకుంది. ఆయా క్రైస్తవులు అలాంటి సత్యమును పొందేందుకు స్థానిక సంఘమే ముఖ్య ఏర్పాటనేది నిర్వివాదాంశం. అక్కడ వారు బైబిలు సత్యం బోధించబడి, సమర్థించబడడాన్ని వినడమేకాక, బలపర్చబడగలరు కూడా.

18 అదే విధంగా ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘం ‘సత్యానికి స్తంభమును, ఆధారమును’ అయిన దేవుని మందిరమైయుంది. మనం స్థానిక సంఘానికి క్రమంగా హాజరౌతూ కూటాల్లో భాగం వహించడం, క్షేమాభివృద్ధి పొందడానికి, దేవునితో మనకున్న సంబంధంలో కట్టబడడానికి, అలాగే ఆయన చిత్తం చేసేందుకు సిద్ధంగా ఉండడానికి కీలక మార్గం. కొరింథులోని సంఘానికి వ్రాస్తూ అలాంటి కూటాల్లో చెప్పబడిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాడు. కూటాలకు హాజరైనవారు “క్షేమాభివృద్ధి” పొందేలా అక్కడ చెప్పబడే విషయాలు స్పష్టంగా, అర్థవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన వ్రాశాడు. (1 కొరింథీయులు 14:​12, 17-19) యెహోవా దేవుడు స్థానిక సంఘాల ఏర్పాటును ఆమోదించడమేకాక, వాటిని బలపరుస్తున్నాడని గుర్తించినప్పుడు నేడు మనం కూడా క్షేమాభివృద్ధి పొందవచ్చు.

19 క్రైస్తవులుగా మనం కట్టబడాలని నిజంగా ఆశిస్తే మనం సంఘంతో సహవసించాలి. అబద్ధబోధలకు వ్యతిరేకంగా రక్షణనిచ్చే స్థలంగా అది దీర్ఘకాలంగా నిరూపించబడడమేకాక, భూవ్యాప్తంగా మెస్సీయ రాజ్య సువార్త ప్రకటించబడేందుకు దేవుడు దానిని ఉపయోగించుకుంటున్నాడు. నిస్సందేహంగా దేవుడు క్రైస్తవ సంఘం ద్వారా ఎంతో నెరవేర్చాడు.​—⁠ఎఫెసీయులు 3:​8-10.

[అధస్సూచి]

^ పేరా 13 “సంఘమునకు తెలియజెప్పుము” అని యేసు ఇచ్చిన నిర్దేశ భావం, “అలాంటి వివాదాలను పరిశోధించేందుకు అధికారం ఇవ్వబడినవారిని అంటే చర్చీ ప్రతినిధులను లేదా వారి తరఫున పనిచేసేవారిని సూచిస్తుంది. యూదుల సమాజమందిరంలో న్యాయాధిపతులుగా వ్యవహరించే పెద్దలు ఉండేవారు, వీరి ఎదుట అలాంటి వివాదాలు విచారించబడేవి” అని బైబిలు విద్వాంసుడైన ఆల్బర్ట్‌ బార్నెస్‌ గుర్తించాడు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• భూమ్మీదున్న సంఘాలను దేవుడు ఉపయోగించుకుంటున్నాడని మనమెందుకు భావించాలి?

• అపరిపూర్ణులైనప్పటికీ పెద్దలు సంఘం కోసం ఏమిచేస్తారు?

• స్థానిక సంఘంలో మీరెలా క్షేమాభివృద్ధి పొందుతున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. “దేవుని సంఘము” గురించి ఏ ప్రశ్నలు అడగవచ్చు?

2, 3. సంఘం వ్యవస్థీకృతమై ఉంటుందని యేసు ఎలా సూచించాడు?

4, 5. సంఘానికి ఆధ్యాత్మిక ఉపదేశం అవసరమని మనకెలా తెలుసు?

6. క్రొత్తగా రూపుదిద్దుకున్న “దేవుని సంఘములో” ఎలాంటి ఏర్పాట్లు చేయబడ్డాయి?

7, 8. (ఎ) యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు తొలి క్రైస్తవుల మధ్య ఎవరిగా పనిచేశారు? (బి) సంఘాల ద్వారా ఉపదేశం ఇవ్వబడినప్పుడు ఎలాంటి ఫలితం లభించింది?

9. అర్హులైన క్రైస్తవ పురుషుల కోసం బైబిలు ఏ బాధ్యతలను వివరిస్తోంది?

10. మత్తయి 18:​15-17 ప్రకారం, గంభీరమైన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి?

11. సమస్యలను పరిష్కరించడంలో పెద్దలు ఏ పాత్ర పోషిస్తారు?

12. సంఘంపట్ల పెద్దలకు ఎలాంటి బాధ్యత ఉంది?

13. కొన్నిసార్లు సంఘంలో ఏమి జరగవచ్చు, ఎందుకు?

14, 15. కొందరెందుకు యేసును అనుకరించడం మానేశారు, అది మనకే పాఠం బోధిస్తోంది?

16. సంఘం వదిలివెళ్ళాలని శోధించబడితే ఒక వ్యక్తి దేని గురించి ఆలోచించాలి?

17. సంఘం గురించి 1 తిమోతి 3:⁠15 మనకేమి చెబుతోంది?

18. సంఘ కూటాలు ఎందుకు అత్యంత ప్రాముఖ్యం?

19. మీ సంఘానికి రుణపడివున్నట్లు మీరెందుకు భావిస్తున్నారు?

[26వ పేజీలోని చిత్రం]

యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు పరిపాలక సభగా పనిచేశారు

[28వ పేజీలోని చిత్రం]

సంఘంలో తమ బాధ్యతల్ని నెరవేర్చగలిగేలా పెద్దలు, పరిచర్య సేవకులు ఉపదేశం పొందుతారు