కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇష్టవస్తువులను కనుగొనేందుకు మేము చేసిన కృషి చిరకాల ఆశీర్వాదాలను తెచ్చింది

ఇష్టవస్తువులను కనుగొనేందుకు మేము చేసిన కృషి చిరకాల ఆశీర్వాదాలను తెచ్చింది

జీవిత కథ

ఇష్టవస్తువులను కనుగొనేందుకు మేము చేసిన కృషి చిరకాల ఆశీర్వాదాలను తెచ్చింది

డొరాథియా స్మిత్‌, డోరా వార్డ్‌ చెప్పినది

మేమెలాంటి ఇష్టవస్తువులను వెదుకుతున్నాం? యువతులమైన మా ఇద్దరికీ, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడంలో భాగం వహించాలనే బలమైన కోరిక ఉంది. (మత్తయి 28:​19) ఆ అన్వేషణ మాకు ఎలా చిరకాల ఆశీర్వాదాలను తెచ్చిందో మమ్మల్ని చెప్పనివ్వండి.

డొరాథియా: మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైన కొద్దికాలానికే, 1915లో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకు నేను మూడవ సంతానం. మేము అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలో ఉన్న హోవెల్‌ నగరంలో జీవించేవాళ్లం. మా నాన్నకు మతాసక్తి లేదు, కానీ మా అమ్మ మాత్రం దైవభక్తి గలది. ఆమె మాకు పది ఆజ్ఞలను పాటించడాన్ని నేర్పించేందుకు కృషి చేసేది, కానీ నేను, నా సోదరుడు విల్స్‌, అక్క వోయిలా, ఏ చర్చీలోనూ సభ్యత్వం తీసుకోలేదని బాధపడేది.

నాకు 12 ఏళ్లున్నప్పుడు, నేను ప్రెస్బిటేరియన్‌ చర్చీ సభ్యురాలిగా బాప్తిస్మం తీసుకోవాలని మా అమ్మ నిర్ణయించింది. నేను బాప్తిస్మం తీసుకున్న రోజు నాకు బాగా గుర్తుంది. నేను బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడే, ప్రక్కనే ఇద్దరు తల్లులు తలా ఒక బిడ్డను ఎత్తుకునివున్న ఆ ఇద్దరు పసిపాపలకు కూడా బాప్తిస్మం ఇవ్వబడింది. ఆ పసిపాపలతోపాటు బాప్తిస్మం తీసుకోవడం నాకు చాలా నామోషీగా అనిపించింది. ఆ ఫాదిరీ నా తలపై కొన్నిచుక్కల నీళ్లు చిలకరించి, నా చెవిలో ఏదో గుసగుసలాడాడు అది నాకు అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే, బాప్తిస్మం గురించి నాకెంత తెలుసో ఆ పసిపాపలకూ అంతే తెలుసు!

1932లో ఒకరోజు మా ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగడంతో మా అమ్మ వెళ్లి తలుపు తీసింది. మతపరమైన పుస్తకాలు ఇవ్వడానికి వచ్చిన ఇద్దరు యువకులు గుమ్మంలో నిలబడ్డారు. వారిలో ఒకాయన తన పేరు ఆల్బర్ట్‌ ష్రోడర్‌ అని పరిచయం చేసుకున్నాడు. ఆయన మా అమ్మకు యెహోవాసాక్షులు ప్రచురించిన కొన్ని సాహిత్యాలను చూపించాడు. ఆమె వాటిని తీసుకుంది. తను దేవుని వాక్యంలోని సత్యాన్ని గుర్తించడానికి ఆ ప్రచురణలు సహాయపడ్డాయి.

ఇష్టవస్తువులు కనుగొనడం మొదలుపెట్టాం

కొంతకాలం తర్వాత నేను డెట్రాయిట్‌లో మా అక్కతో ఉండడానికి వెళ్లాను. అక్కడ మా అక్కకు బైబిలు బోధించడానికి వచ్చే పెద్దావిడని కలిశాను. ఆమెతో మాట్లాడిన విషయాలు, నేను మా ఇంట్లో అమ్మతో కలిసి వినే రేడియో కార్యక్రమాన్ని గుర్తుకుతెచ్చాయి. ఆ కార్యక్రమంలో, అప్పట్లో యెహోవాసాక్షుల కార్యకలాపాలకు సారథ్యం వహించిన జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ బైబిలు సంబంధిత అంశంపై ఇచ్చే 15 నిమిషాల ప్రసంగాన్ని ప్రసారం చేసేవారు. మేము 1937లో డెట్రాయిట్‌లోని యెహోవాసాక్షుల మొదటి సంఘానికి వెళ్లడం మొదలుపెట్టాం. మరుసటి సంవత్సరమే నేను బాప్తిస్మం తీసుకున్నాను.

యెహోవాసాక్షులు మిషనరీలకు తర్ఫీదునివ్వడానికి న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో గిలియడ్‌ పాఠశాలను ప్రారంభించబోతున్నారని 1940ల తొలిభాగంలో ప్రకటించబడింది. దాని నుండి పట్టభద్రులైనవారిలో కొందరు ఇతర దేశాల్లో సేవ చేయడానికి పంపించబడవచ్చని తెలిసినప్పుడు, నేను కూడా ఆ గిలియడ్‌ పాఠశాలకు వెళ్లాలని ఆశపడ్డాను. దానితో నేను గిలియడ్‌ పాఠశాలకు హాజరు కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. వేరే దేశాల్లో ‘ఇష్టవస్తువులను’ అంటే క్రీస్తుయేసు శిష్యులు కావాలనుకునేవారిని కనుగొనడానికి కృషి చేయడం ఎంతటి ఆధిక్యతో కదా!​—⁠హగ్గయి 2:​6, 7.

అంచెలంచెలుగా నా లక్ష్యాన్ని చేరుకున్నాను

నేను 1942 ఏప్రిల్‌లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆధ్యాత్మిక సహోదరీలు ఐదుగురితోపాటు ఒహాయోలోని ఫిండ్లేలో పయినీరుగా లేక పూర్తికాల ప్రచారకురాలిగా సేవ చేయడం ప్రారంభించాను. అక్కడ క్రమంగా కూటాలు జరిగే ఏర్పాటు లేకపోయినా మేమందరం కలిసి క్రైస్తవ ప్రచురణల్లోని ఆర్టికల్‌లను చదవడం ద్వారా ఒకరినొకరం ప్రోత్సహించుకునేవాళ్లం. నేను పయినీరు సేవ ప్రారంభించిన మొదటి నెలలోనే ఆసక్తి చూపించినవారికి దాదాపు 95 పుస్తకాలను అందించాను! సంవత్సరమున్నర తర్వాత, పెన్సిల్వేనియాలోని ఛాంబర్స్‌బర్గ్‌లో ప్రత్యేక పయినీరుగా సేవ చేసే నియామకం నాకు లభించింది. అక్కడ నేను మరో ఐదుగురు పయినీర్లను కలుసుకున్నాను, వారిలో లోవా నుండి వచ్చిన డోరా వార్డ్‌ కూడా ఉంది. డోరా, నేను పయినీరు సహచరులమయ్యాం. మేమిద్దరం ఒకే సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాం, గిలియడ్‌ పాఠశాలకు హాజరై వేరే దేశాల్లో మిషనరీలుగా సేవచేయాలనే కోరిక మా ఇద్దరికీ ఉంది.

1944లో ఆ కోరిక తీరే గొప్ప రోజు రానే వచ్చింది! మా ఇద్దరికీ గిలియడ్‌ పాఠశాల నాల్గవ తరగతికి హాజరయ్యే ఆహ్వానం అందింది. అదే సంవత్సరం, ఆగస్టులో మేము దానికి హాజరయ్యాం. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పే ముందు, ఇష్టవస్తువులను కనుగొనే పనిలో నాకు చాలాకాలం సహచరిగా ఉండేందుకు నడిపించిన పరిస్థితుల గురించి డోరాను చెప్పనివ్వండి.

పూర్తికాల ప్రకటనాపనిని ప్రారంభించేందుకు ఆతురతతో ఎదురుచూడడం

డోరా: మా అమ్మ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించేది. ఒక ఆదివారం, నేను మా అమ్మతో కలిసి రేడియోలో జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన ప్రసంగాన్ని విన్నాను. ఆ ప్రసంగం ముగిసిన వెంటనే మా అమ్మ “ఇదే సత్యం!” అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికే మేము యెహోవాసాక్షుల ప్రచురణలను చదవడం ప్రారంభించాం. నాకు 12 ఏళ్లున్నప్పుడు అంటే 1935లో, యెహోవాసాక్షుల్లో ఒకరిచ్చిన బాప్తిస్మపు ప్రసంగానికి హాజరైనప్పుడు నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక కలిగింది. మూడు సంవత్సరాల తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను. నేను సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడం, నేను పాఠశాలలో గడిపిన మిగతా సంవత్సరాలన్నింటిలో నా లక్ష్యాలను మర్చిపోకుండా స్థిరంగా ఉండడానికి సహాయం చేసింది. పయినీరుగా సేవ ప్రారంభించేలా నేను నా చదువు ఎప్పుడు ముగిస్తానా అని ఆత్రుతతో ఎదురుచూశాను.

ఆ సమయంలో మేము సహవసించే సాక్షుల గుంపు లోవాలోని ఫోర్ట్‌ డాడ్జ్‌లో సంఘంగా కూడుకునేవారు. క్రైస్తవ కూటాలకు హాజరవడం సవాలుగా ఉండేది. అప్పట్లో సంఘంలో చర్చించడానికి కావలికోట అధ్యయన శీర్షికల్లో ప్రశ్నలు ఉండేవి కావు. కావలికోట అధ్యయనాన్ని నిర్వహించే సహోదరునికి ప్రచారకులందరూ ప్రశ్నలు తయారుచేసి ఇవ్వాలని కోరబడేది. సహోదరుడు ఉపయోగించాలనుకునే ప్రశ్నల్ని ఎన్నుకోవడానికి వీలుగా నేను, మా అమ్మ కలిసి సోమవారం రాత్రుల్లో ప్రతీ పేరాకు ఒక ప్రశ్నను సిద్ధం చేసి ఇచ్చేవాళ్లం.

ప్రయాణ పైవిచారణకర్త అప్పుడప్పుడూ మా సంఘాన్ని సందర్శించేవాడు. నాకు పన్నెండేళ్లున్నప్పుడు, ప్రయాణ పైవిచారణకర్తల్లో ఒకరైన జాన్‌ బూత్‌, ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం నాకు నేర్పించాడు. నాకు 17 ఏళ్లున్నప్పుడు, నేను ఆయనను పయినీరు దరఖాస్తు నింపడానికి సహాయం అడినప్పుడు, ఆయన నాకు సహాయం చేశాడు. నా తర్వాతి జీవితంలో ఆయన నాకు మళ్లీ తారసపడతాడని, నాకు చిరకాల స్నేహితునిగా మారతాడని నేను ఊహించలేదు!

పయినీరుగా నేను నాకంటే పదిహేనేళ్లు పెద్దదైన పూర్తికాల ప్రచారకురాలైన సహోదరి డొరాథి ఆరాన్‌సన్‌తో తరచూ పనిచేసేదాన్ని. ఆమె 1943లో గిలియడ్‌ మొదటి తరగతికి ఆహ్వానించబడేంత వరకు మేము పయినీరు సహచరులుగా ఉన్నాం. ఆ తర్వాత నేను ఒంటరిగానే పయినీరు సేవ కొనసాగించాను.

వ్యతిరేకత మాకు అడ్డుకాలేదు

రెండవ ప్రపంచ యుద్ధంతో ప్రజల్లో రగిలిన దేశభక్తి కారణంగా 1940వ పడి మాకెన్నో కష్టాలు తెచ్చింది. మేము ఇంటింటికి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు తరచూ కుళ్లిన గుడ్లతో, పండిన టమాటాలతో, కొన్నిసార్లు రాళ్లతో కూడా కొట్టేవారు! మేము వీధి చివర్లో కావలికోట, కన్సోలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికలను అందించినప్పుడు అంతకన్నా కష్టమైన సవాలు మాకెదురైంది. మతవ్యతిరేకుల ప్రోద్బలంతో పోలీసులు మా దగ్గరికి వచ్చి, మేము ఇంకోసారి బహిరంగంగా ప్రకటిస్తూ కనిపిస్తే మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు.

వారు బెదిరించినా మేము ప్రకటించడం ఆపేందుకు నిరాకరించడంతో మమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసు స్టేషన్‌కి తీసుకువెళ్లారు. మమ్మల్ని విడుదల చేసిన తర్వాత, మేము మళ్ళీ అదే వీధి చివరికి వెళ్లి, అవే పత్రికలను అందించాం. మా వైఖరిని సమర్థించుకోవడానికి బాధ్యతాయుతమైన సహోదరుల సలహామేరకు మేము యెషయా 61:​1-2 వచనాల్ని ఉపయోగించాం. ఒకసారి నా దగ్గరికి యువకుడైన పోలీసు వచ్చినప్పుడు, నేనెంతో భయంగా అతనికి ఆ లేఖనాన్ని వినిపించాను. ఆశ్చర్యకరంగా, అతను హఠాత్తుగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు! మమ్మల్ని దేవదూతలు సంరక్షిస్తున్నారని నాకనిపించింది.

చిరస్మరణీయమైన రోజు

మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌లో 1941వ సంవత్సరంలో జరిగిన ఐదు రోజుల యెహోవాసాక్షుల సమావేశానికి హాజరవ్వగలిగినందుకు నేనెంతో సంతోషించాను. ఆ సమావేశంలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ 5 నుండి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలను స్టేడియమ్‌లోని ముందు భాగానికి రమ్మని పిలిచారు. వేలాదిమంది పిల్లలు అక్కడికి వెళ్లారు. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ తన చేతిరుమాలును ఊపుతూ మమ్మల్ని ఆహ్వానించారు. మేమందరమూ చేతులు ఊపాము. ఒక గంటసేపు సాగిన ప్రసంగం తర్వాత ఆయనిలా అన్నాడు: “దేవుని చిత్తాన్ని చేయడానికి అంగీకరించి, తాము యేసుక్రీస్తు పరిపాలించే దైవపరిపాలనా ప్రభుత్వం పక్షాన ఉన్నామని చూపించడం ద్వారా దేవునికి, ఆయన రాజుకి లోబడతామని అంగీకరించే పిల్లలందరూ దయచేసి నిలబడండి!” అక్కడున్న 15,000 మంది పిల్లలు మూకుమ్మడిగా నిలబడ్డారు​—⁠వారిలో నేను కూడా ఉన్నాను! ఆ తర్వాత ప్రసంగీకుడు ఇలా చెప్పారు: “దేవుని రాజ్యం గురించి, దానితోపాటు వచ్చే ఆశీర్వాదాల గురించి ఇతరులకు చెప్పేందుకు సాధ్యమైనంత కృషి చేయాలనుకునే వారందరూ దయచేసి ‘నేను’ అని చెప్పండి.” మేమలా చెప్పగానే స్టేడియమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

ఆ తర్వాత చిల్డ్రెన్‌ * అనే పుస్తకం విడుదల చేయబడింది, పిల్లలందరం పెద్ద వరుసలో స్టేజీ దగ్గరకు వెళ్లాము, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ మాలో ప్రతీ ఒక్కరికీ కొత్త పుస్తకపు ప్రతిని ఇచ్చారు. దాన్ని అందుకోవడం మమ్మల్ని పులకరింపజేసింది! అప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకున్నవారిలో చాలామంది నేడు కూడా లోకమంతటా వివిధ ప్రాంతాల్లో ఉత్సాహంగా యెహోవాను సేవిస్తూ, దేవుని రాజ్యం గురించి, ఆయన నీతి గురించి ప్రకటిస్తున్నారు.​—⁠కీర్తన 148:​12, 13.

నేను మూడు సంవత్సరాలు ఒంటరిగా పయినీరు సేవచేసిన తర్వాత, ఛాంబర్స్‌బర్గ్‌లో ప్రత్యేక పయినీరుగా సేవచేసే నియామకం లభించినప్పుడు నేనెంతో సంతోషించాను. అక్కడ నేను డొరాథియాను కలిశాను, మా ఇద్దరిమధ్యా గొప్ప అనుబంధం ఏర్పడింది. మాలో యౌవనపు ఉత్సాహం, శక్తి ఉన్నాయి. ప్రకటనాపనిలో మేము మరింత చేయాలనే ఆరాటంతో ఉన్నాం. మేమిద్దరం కలిసి ఇష్టవస్తువులను కనుగొనే పనిని ప్రారంభించాం, అది మా జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది.​—⁠కీర్తన 110:⁠3.

మేము ప్రత్యేక పయినీర్లుగా సేవ ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత, గిలియడ్‌ మొదటి తరగతి నుండి పట్టభద్రుడైన ఆల్బర్ట్‌ మాన్‌ను కలిశాం. ఆయన వేరే దేశానికి మిషనరీగా వెళ్లబోతున్నాడు. మాకు ఏదైనా దేశంలో నియామకం లభిస్తే దాన్ని అంగీకరించమని ఆయన మమ్మల్ని ప్రోత్సహించాడు.

ఇద్దరం ఒకేసారి పాఠశాలకు వెళ్లాం

డోరా, డొరాథియా: మేమిద్దరం ఒకేసారి మిషనరీ శిక్షణకు హాజరైనప్పుడు మేమెంత ఆనందించామో ఒక్కసారి ఊహించండి! పాఠశాలలో మొదటి రోజున ఆల్బర్ట్‌ ష్రోడర్‌ మా పేర్లను పాఠశాలలో రిజిస్టర్‌ చేశాడు. ఆయన 12 సంవత్సరాల క్రితం డొరాథియా వాళ్లమ్మకు లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) పుస్తకాన్ని ఇచ్చాడు. అక్కడ సహోదరుడు జాన్‌ బూత్‌ కూడా ఉన్నారు. మేమాయనను కలిసినప్పుడు ఆయన పాఠశాలకు దగ్గరగా ఉన్న కింగ్‌డమ్‌ ఫామ్‌లో వ్యవసాయ సేవకునిగా పనిచేసేవారు. ఆ తర్వాత ఇద్దరూ యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యులుగా సేవచేశారు.

గిలియడ్‌ పాఠశాలలో మేము బైబిల్లోని లోతైన సత్యాలను అధ్యయనం చేశాం. అది ఎంతో అద్భుతమైన శిక్షణ. మొత్తం 104 మంది విద్యార్థులున్న మా తరగతిలో మెక్సికోకు చెందిన మొదటి విదేశీ విద్యార్థుడు కూడా ఉన్నాడు. ఆయన ఇంగ్లీషును మెరుగుపరుచుకోవడానికి, మేము స్పానిష్‌ను నేర్చుకోవడానికి ప్రయాసపడ్డాం. సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ విద్యార్థులకు వారివారి నియామకాలను అందజేసినప్పుడు మేమెంత సంతోషించామో! విద్యార్థుల్లో చాలామంది మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలకు పంపించబడ్డారు, మేము చిలీలో నియమించబడ్డాము.

చిలీలో ఇష్టవస్తువులను కనుగొనే ప్రయత్నం

మేము చిలీలోకి ప్రవేశించేందుకుగాను వీసా దొరకడానికి చాలా సమయం పట్టింది. అందుకే, 1945 జనవరిలో మేము పట్టభద్రులమైన తర్వాత సంవత్సరమున్నరదాకా వాషింగ్టన్‌ డి.సి.లో పయినీర్లుగా సేవచేశాం. మాకు వీసాలు దొరికిన తర్వాత మొత్తం తొమ్మిదిమంది మిషనరీలం కలిసి చిలీకి వెళ్ళాం. మాతో వచ్చిన మిగతా ఏడుగురు గిలియడ్‌లోని ముందటి తరగతులనుండి పట్టభద్రులైనవారు.

చిలీ రాజధాని అయిన సాంటియాగోకు చేరుకున్నప్పుడు చాలామంది క్రైస్తవ సహోదరులు మమ్మల్ని కలిశారు. వారిలో, మమ్మల్ని కొన్ని సంవత్సరాల ముందు ప్రోత్సహించిన ఆల్బర్ట్‌ మాన్‌ కూడా ఉన్నాడు. ఆయన ఆ ముందటి సంవత్సరమే, గిలియడ్‌ రెండవ తరగతి నుండి పట్టభద్రుడైన జోసెఫ్‌ ఫెర్రారీతోపాటు చిలీకి వచ్చాడు. మేము చిలీకి వెళ్లినప్పుడు, అక్కడ ప్రచారకులు 100కన్నా తక్కువమంది ఉన్నారు. మేము ఆ కొత్త ప్రదేశంలో మరిన్ని ఇష్టవస్తువులను అంటే యథార్థహృదయులను కనుగొనడానికి ఆత్రుతతో ఉన్నాం.

మమ్మల్ని సాంటియాగోలోని మిషనరీ గృహంలో సేవ చేయడానికి నియమించారు. అనేకమంది మిషనరీలతో కలిసి జీవించడం మాకు నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రకటనాపనిలో నిర్దిష్ట గంటల్ని వెచ్చించడమేకాక, మిషనరీ కుటుంబానికి మిషనరీలందరూ వారానికొకసారి వంటచేయాల్సి వచ్చేది. మేము మొదట్లో కొన్నిసార్లు తప్పులు చేసేవాళ్లం. ఒకరోజు ఉదయం ఆకలితో ఎదురుచూస్తున్న మా మిషనరీ కుటుంబం కోసం ఫలహారంగా వేడివేడి బిస్కట్లు చేశాం. కానీ వాటిని అవెన్‌లో నుండి తీయగానే వాటినుండి ఏదో చెడు వాసన వస్తున్నట్లనిపించింది. మేము అందులో పొరపాటున బేకింగ్‌ పౌడర్‌కు బదులు బేకింగ్‌ సోడా వేశాం. ఖాళీగా ఉన్న బేకింగ్‌ పౌడర్‌ డబ్బాలో ఎవరో బేకింగ్‌ సోడా నింపారు.

మేము స్పానిష్‌ నేర్చుకుంటున్నప్పుడు అంతకన్నా ఘోరమైన తప్పులు చేశాం. మేము బైబిలు అధ్యయనం చేసిన పెద్ద కుటుంబం ఒకటి, మేము చెప్పేది అర్థంకాక దాదాపు అధ్యయనం మానేసినంత పనిచేశారు. కానీ తమ బైబిళ్లలో లేఖనాలను చూడడం ద్వారా వారు సత్యం నేర్చుకోగలిగారు, వారిలో ఐదుగురు ఇప్పుడు యెహోవాసాక్షులు. అప్పట్లో కొత్త మిషనరీలు కొత్త భాష నేర్చుకోవడానికి భాషా కోర్సులు ఉండేవి కావు. మేము చిలీకి వెళ్ళడంతోనే ప్రకటనాపనిని ప్రారంభించి, సాక్ష్యమిచ్చే ప్రజల నుండి భాష నేర్చుకోవడానికి ప్రయత్నించాం.

మేము అనేక బైబిలు అధ్యయనాలను నిర్వహించేవాళ్లం, మా విద్యార్థుల్లో కొందరు చాలా త్వరగా ప్రగతిసాధించారు. ఇతరులపట్ల మరికాస్త ఓర్పు వహించాల్సివచ్చింది. టరాసా టెలో అనే యౌవనస్థురాలు సత్యం గురించిన సందేశాన్ని విని, “మీరు మళ్లీ వచ్చి నాకు మరిన్ని విషయాలు చెప్పండి” అని కోరింది. మేము ఆమె దగ్గరకు 12 సార్లు వెళ్లినా ఆమెను కలవలేకపోయాం. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత మేము సాంటియాగోలోని ఒక థియేటర్‌లో నిర్వహించబడిన సమావేశానికి హాజరయ్యాం. ఆదివారం మేము బయటకు వస్తుండగా వెనుక నుండి ఎవరో “డోరా గారు, డోరా గారు” అని పిలవడం వినిపించింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు మాకు టరాసా కనిపించింది. ఆమె సమావేశం జరిగిన థియేటర్‌ ఎదురుగా ఉంటున్న తన అక్కను చూడడానికి వచ్చి ఆ థియేటర్‌లో ఏమి జరుగుతుందో చూద్దామని వచ్చింది. ఆమెను తిరిగి కలవడం మాకెంత ఆనందాన్నిచ్చిందో! ఆమెతో బైబిలు అధ్యయనం చేయడం కోసం మేము ఏర్పాట్లు చేశాం. కొంతకాలానికే ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఆ తర్వాత ప్రత్యేక పయినీరు సేవ కూడా చేసింది. అది జరిగి ఇప్పటికి 45 సంవత్సరాలు గడిచినా, టరాసా ఇంకా ప్రత్యేక పూర్తికాల సేవలోనే కొనసాగుతోంది.​—⁠ప్రసంగి 11:⁠1.

“ఇసుకతిన్నెల”లో ఇష్టవస్తువులను కనుగొనడం

మమ్మల్ని 1959లో, చిలీలోని పుంటా అరినాస్‌కు నియమించారు, అది చిలీ దేశపు కోస్తా ప్రాంతం చివర్లో దక్షిణాన ఉంది, ఆ కోస్తా తీరం పొడవు 4,300 కిలోమీటర్లు. ఆ నగరం పేరుకి “ఇసుకతిన్నెల నగరం” అని అర్థం. పుంటా అరినాస్‌ అసాధారణమైన క్షేత్రం. వేసవికాలంలో రాత్రి 11:⁠30 వరకు వెలుగు ఉండేది అంటే రోజులో పగటి సమయం ఎక్కువగా ఉండేది. మేము చాలా రోజులు ఆ క్షేత్రంలో పరిచర్య చేస్తూ గడిపాం, కానీ అక్కడ కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. వేసవికాలంలో తీవ్రమైన దక్షిణధ్రువ గాలులు వీచేవి. చలికాలంలో వణికించే చలి, రోజులో తక్కువ గంటలు వెలుతురు ఉంటుంది.

ఆ సవాళ్లున్నా పుంటా అరినాస్‌ దానికదే సాటి. ఎండాకాలంలో పడమటి ఆకాశంలో, వర్షాధార మేఘాలు నిత్యం కమ్ముకుంటూ ఉండేవి. అప్పుడప్పుడూ అవి మాపై కుండపోతగా నీరు కురిపించినా, వీచే గాలులవల్ల మా బట్టలు త్వరగా ఆరిపోయేవి. మబ్బుల చాటునుండి తొంగిచూసే సూర్యకిరణాలతో కనువిందుచేసే ఇంద్రధనస్సు ఏర్పడేది. ఆ ఇంద్రధనస్సులు కొన్నిసార్లు గంటలపాటు ఉండి, ఎండ ఎక్కువయ్యేకొద్దీ కనుమరుగైపోయేవి.​—⁠యోబు 37:​14.

అప్పట్లో పుంటా అరినాస్‌లో చాలా తక్కువమంది ప్రచారకులు ఉండేవారు. చిన్నదైన ఆ స్థానిక సంఘంలో సహోదరీలే కూటాలను నిర్వహించాల్సి వచ్చేది. యెహోవా మా కృషిని ఆశీర్వదించాడు. ముప్పైఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత మేము ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి తిరిగి వెళ్లాం. మేమక్కడ ఏమి చూశాం? ప్రగతి సాధిస్తున్న ఆరు సంఘాలు, మూడు చక్కని రాజ్యమందిరాలు. దక్షిణాది ఇసుకతిన్నెల్లో ఆధ్యాత్మిక ఇష్టవస్తువులను కనుగొనడానికి యెహోవా మమ్మల్ని అనుమతించినందుకు మేమెంత సంతోషించామో!​—⁠జెకర్యా 4:​10.

“విస్తారమైన తీరం”లో మరిన్ని ఇష్టవస్తువులు

పుంటా అరినాస్‌లో మూడున్నర సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మమ్మల్ని నౌకాశ్రయ నగరమైన వాల్పరైజోకు నియమించారు. ఆ నగరంలో పసిఫిక్‌ మహాసముద్ర తీరం చుట్టూ 41 కొండలు ఉంటాయి. ఆ కొండల్లోని ప్లాయా అంచా అంటే “విస్తారమైన తీరం” అనే అర్థమొచ్చే ఒక కొండ ప్రాంతంపై మేము ప్రకటనాపని చేశాం. మేము అక్కడున్న 16 సంవత్సరాల్లో, మా ముందు తిరిగిన యౌవనులైన క్రైస్తవ సహోదరులు ఆధ్యాత్మికంగా ఎంత ప్రగతి సాధించారంటే వారిప్పుడు ప్రయాణ పైవిచారణకర్తలుగా, చిలీలోని వివిధ సంఘాల్లో క్రైస్తవ పెద్దలుగా సేవచేస్తున్నారు.

ఆ తర్వాత మాకు వినాడెల్‌మార్‌లో మిషనరీ నియామకం లభించింది. మేమక్కడ మూడున్నర సంవత్సరాలు అంటే అక్కడొక భూకంపం సంభవించి మిషనరీ గృహం ధ్వంసమయ్యేవరకు సేవచేశాం. ఆ తర్వాత మేము 40 ఏళ్ల క్రిందట మా మిషనరీ సేవ ప్రారంభించిన సాంటియాగోకు తిరిగి వచ్చాం. అక్కడి పరిస్థితులు మారిపోయాయి. కొత్త బ్రాంచి కార్యాలయం నిర్మించబడింది, పాత కార్యాలయం స్థానిక మిషనరీల కోసం మిషనరీ గృహంగా మార్చబడింది. ఆ తర్వాత ఆ గృహాన్ని పరిచర్య శిక్షణా పాఠశాలగా చేశారు. ఆ సమయంలోనే యెహోవా మళ్లీ మా పట్ల కృప చూపించాడు. మాలో వయసు పైబడిన ఐదుగురు మిషనరీలు బెతెల్‌లో ఉండడానికి ఆహ్వానించబడ్డారు. మేము చిలీలో సేవ చేసిన సమయంలో 15 వివిధ నియామకాల్లో పనిచేశాం. అక్కడి ప్రచారకుల సంఖ్య 100 నుండి 70,000 వరకు పెరగడాన్ని చూశాం! చిలీలో 57 సంవత్సరాలుగా ఇష్టవస్తువులను కనుగొనడంలో కృషి చేసినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందో!

యెహోవా ద్వారా ఆయన సంస్థలో ఉపయోగించబడేందుకు అన్ని ఇష్టవుస్తువుల్ని అంటే ప్రజల్ని కనుగొనడానికి యెహోవా మమ్మల్ని అనుమతించడం మాకు నిజంగా గొప్ప ఆశీర్వాదమనే చెప్పాలి. మేమిద్దరం కలిసి యెహోవా సేవలో గడిపిన 60 కన్నా ఎక్కువ సంవత్సరాలన్నింటిలో రాజైన దావీదు వ్యక్తం చేసిన ఈ మనోభావాలతో మేము హృదయపూర్వకంగా అంగీకరిస్తాం. ఆయనిలా వ్రాశాడు: “నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది.”​—⁠కీర్తన 31:​19.

[అధస్సూచి]

^ పేరా 24 యెహోవాసాక్షులు ప్రచురించినది, ఇప్పుడది ముద్రించబడడం లేదు.

[9వ పేజీలోని చిత్రాలు]

1943లో, ప్రకటనాపనిలో పాల్గొంటున్నప్పుడు, 2002లో డొరాథియా

[10వ పేజీలోని చిత్రం]

1942లో, లోవాలోని ఫోర్ట్‌ డాడ్జ్‌లో వీధిసాక్ష్యమిస్తూ

[10వ పేజీలోని చిత్రం]

2002లో డోరా,

[12వ పేజీలోని చిత్రం]

1946లో చిలీలోని తమ మొదటి మిషనరీ గృహం వెలుపల డొరాథియా, డోరా